Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 6


    "ఈ వూళ్ళో వుండటం నాకు ఇష్టంలేదు" అంది అరుంధతి దూరంగా జరుగుతూ.

 

    సీతాపతి భార్య ముఖంలోకి విస్మయంగా చూశాడు.

 

    "ఇది మన వూరు. మరి మనం ఇక్కడ వుండక ఎక్కడ వుంటాము? అన్నాడు సీతాపతి.

 

    భర్త అమాయకత్వానికి అరుంధతికి నవ్వొచ్చింది. ఇన్ని ఊళ్ళూ, పట్నాలు వుండగా ఎక్కడికీ వెళ్ళటానికే చోటు లేనట్లు మాట్లాడతాడేం? అసలు ఈ వూరు వదలటం అనేది వూహకందనంత చిత్రమైన విషయంలా మాట్లాడతాడేం?

 

    "మనం ఏలూరు వెళదాం. అక్కడే వుండిపోదాం. మీకు నెలకు పదిరోజులు అక్కడే పనిగా?" అంది భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.

 

    సీతాపతి మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.

 

    "నాకు ఇక్కడ ఏమీ తోచడం లేదు."

 

    తోచకపోవడం ఏమిటి? ఈ వూళ్లో ఎంతమంది ఆడవాళ్ళు లేరు? వాళ్ళందరికీ లేని తోచకపోవటం దేనికేమిటి?

 

    "ఏం మాట్లాడరేం?" రెట్టించింది.

 

    "ఊరు వదిలి ఏలూరు వెళ్ళటమా! అదెలా సాధ్యం?"

 

    "ఏం! ఎందుకు కాదు? ఎంతమంది పల్లెలనుంచి వెళ్ళి పట్నాల్లో వుండిపోవటం లేదు?"

 

    "ఇక్కడ ఇల్లూ వాకిలీ? పొలం పుట్రా?"

 

    "అవన్నీ వెంకన్నతాత చూసుకుంటాడు" అంది అరుంధతి.

 

    "మరి అక్కడకొచ్చి నేను చేసే పని? నీకు ఎదురుగా కూచుని వామనగుంటలు ఆడమంటావా?" నిశితంగా చూస్తూ ప్రశ్నించాడు.

 

    "చాల్లెండి! ఇది తమాషాగా మాట్లాడే సమయం కాదు. మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చును" అంది అరుంధతి.

 

    "వ్యాపారమా? వ్యాపారం చెయ్యటం నాకు చేతకాదు. చిన్నతనం నుంచీ వ్యవసాయం చేసినవాణ్ణి, ఆ భూమి, ఆ పశువులు, ఈ ఇల్లూ ఇవన్నీ నా జీవితంలో పెనవేసుకుని వున్నాయి. వాటిని వదిలించుకొని బయట పడలేను, పైగా నేను పెద్దగా చదువుకోలేదు. వ్యాపారం చెయ్యాలంటే చదువు వుండాలి" అన్నాడు సీతాపతి నిదానంగా.  

 

    "వ్యాపారానికి కావల్సింది చదువుకాదు- డబ్బు!" అరుంధతి స్వరంలో తీవ్రతకు తలెత్తి చూశాడు సీతాపతి.

 

    "అమ్మ ఒప్పుకోదు." అన్నాడు తనకు తానే చెప్పుకుంటున్నట్లు.

 

    అరుంధతికి వళ్ళు మండిపోయింది. "అలా చెప్పండి! అసలు విషయం దాచి ఆ డొంక తిరుగుడు జవాబు లెందుకు?" అంది కోపంగా.

 

    "కాదు అరూ! నన్ను అర్ధం చేసుకో. అమ్మ ఈ ఊరు వదిలిరాదు. అలాంటి విషయం ఆమె దగ్గర చెప్పే సాహసం నాకు లేదు" అన్నాడు సీతాపతి.

 

    "అంత అమ్మ చాటు అబ్బాయిగా వుండేవాళ్ళకు ఒక పెళ్ళాం కూడా ఎందుకో?"

 

    "అరూ!" కోపంగా అరిచాడు సీతాపతి.

 

    సీతాపతిని అంతకు ముందెప్పుడు కోపంలో చూడని అరుంధతికి భయం వేసింది.

 

    "అమ్మను నువ్వేమన్నా నేను సహించను. నేను పుట్టకముందే నాన్న పోయారు. నాన్న పోయేనాటికి అమ్మకు అయిదోనెల. అమ్మ తన జీవితాన్నే కవచంగా చేసి నా చుట్టూ రక్షణ నిచ్చి నన్నింతవాణ్ణి చేసింది. ఈ వయస్సులో నేను అమ్మకు ఇష్టం లేని పని ఏదీ చెయ్యను. నేను అమ్మను ఎంత ప్రేమిస్తున్నానో నా భూమిని కూడా అంత ప్రేమిస్తున్నాను. నేను ఈ వూరు వదలటం అసంభవం. ఇక ఆ విషయం మర్చిపోవటం మంచిది." గంభీరంగా అన్నాడు సీతాపతి.

 

    సీతాపతి గోడ పక్కకు తిరిగి పడుకున్నాడు. కిటికీలోనుండి ఈదురుగాలి రయ్యిన వీచింది. కిటికీ చెక్కలు టపటప కొట్టుకున్నాయి. గోడకు తగిలించివున్న క్యాలెండరు విసురుగా వచ్చి క్రిందపడింది. అరుంధతి లేచివెళ్ళి క్యాలెండర్ను యథాస్థానంలో వుంచబోయింది. తళుక్కున ఓ మెరుపు మెరిసింది. ఆ క్షణికమైన వెలుగులో క్యాలెండరుపైగా వున్న ఫోటోలోని రాజారావు అరుంధతిణి సూటిగా చూసినట్లనిపించింది. బయట బడ బడా ఉరిమింది. క్యాలెండరు తగిలించి కిటికీ దగ్గరకు వచ్చింది. వానజల్లు ముఖాన్ని తడిపింది. చల్లగా హాయిగా వున్నట్లనిపించింది. కొంచెంసేపు అలాగే నిల్చొని తడిసింది. కిటికీ రెక్కలువేసి వచ్చి మంచంపట్టెమీద కూచుని గోడకేసి చూసింది. ఆ చీకట్లో రాజారావు ఫోటోగానీ క్యాలెండరుగానీ కనిపించలేదు.


                                         5


    సూర్యుడు ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో వున్నాడు. చెట్లకొమ్మల్లోనూ, ఇళ్ళ చూరుల్లోనూ ఇరుక్కుపోయిన కిరణాలను పోగుచేసుకుంటున్నాడు. పొలాల నుంచి పశువులు ఇళ్ళకు తిరిగి వస్తున్నాయి. ఇళ్ళ సావిళ్ళలో కట్టివున్న లేగదూడలు "అంబా" అంటూ అరుస్తున్నాయి. పొలం వెళ్ళిన మగవాళ్ళు ముల్లుగర్రలు వూపుకుంటూ వస్తున్నారు. పనులన్నీ ముగించుకొని ఆడవాళ్ళు మగవారి కోసం ఎదురుచూస్తూ వాకిళ్ళల్లో నిల్చున్నారు. చిన్నవాళ్ళు స్నానాలు చేసి తల నిండుగా పువ్వులు పెట్టుకుని తియ్యటి తలపులను నెమరు వేసుకుంటూ కూచుని వున్నారు. మగపిల్లలు వీధుల్లో గోళీకాయలూ, బచ్చాలూ, బిళ్ళంగోడూ మొదలైన ఆటలు ఆడుకుంటున్నారు. ఆడపిల్లలు దగ్గిర దగ్గిర ఇళ్ళవాళ్ళు బాగా ఖాళీస్థలం వున్న ఇళ్ళల్లోచేరి చెమ్మచెక్కలూ, కీలుకిచ్చులూ, తొక్కుడుబిళ్ళలూ ఆడుకుంటున్నారు. వయసు మళ్ళినవాళ్ళు చిన్నగా వెళ్ళి రచ్చబండమీద చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు.  

 

    అరుంధతి పంచపాళీలో కూచుని ముగ్గుతో లాంతర్లు తుడుస్తూంది. ఆమె ముఖంమీద సంధ్యాకాంతులు పడీపడకుండా పడుతున్నాయి. తలంటి పోసుకున్న జుట్టు చివాళ్ళు నడుంమీదుగా ముడివేసుకుంది. ఆరి పొడిగా వున్న ఆ నల్లటికురులు, వంగి లాంతర్లు తుడుస్తున్న అరుంధతి తెల్లని మెడకు ఇరువైపులనుంచీ జారి, మృదువైన ఆమె చెక్కిళ్ళను పరామర్శిస్తున్నాయి. గాలికి తెల్లకమలాన్ని చుట్టివేసిన తుమ్మెద బారుల్లా ఆమె ముఖం మీద కదులుతున్నాయి ముంగురులు. తలపైకెత్తి చేతికివున్న ముగ్గు అంటకుండా ముంజేతితో రెండుసార్లు ముంగురులను పైకి తోసుకుంది. మళ్ళీ మొండిగా ముఖంమీదికే పడుతున్న ముంగురులను నెట్టుకోబోయి స్తంభించిపోయింది అరుంధతి ఎదురుగా నిల్చొనివున్న వ్యక్తిని చూసి!

 

    ఏదో అపూర్వ కళాఖండాన్ని చూస్తున్నట్టు తన్మయత్వంతో నిల్చుండిపోయిన ఆ వ్యక్తి మళ్ళీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు. ఆమె తనను చూసి భయపడుతూందని అర్ధం చేసుకున్నాడు.

 

    "భయపడకు! నేను దొంగను కాదు. సీతాపతి ఇంట్లోలేడా?" ఆగంతుకుడు మృదువుగా ప్రశ్నించాడు.

 

    భీతహరిణంలా బెదురుగా చూస్తున్న ఆమెను ఓ క్షణం చూశాడు. ఆ వెడల్పయిన కళ్ళు భయంతో చలిస్తున్నాయి. ఆమెకు అరవాలనివుంది. నోరు పెగలటంలేదు.

 

    "సీతాపతి ఇంకా పొలంనుంచి రాలేదా? అమ్మ ఎక్కడ? అమ్మా!" అని పిలుస్తూ గబగబా లోపలకు వెళ్ళిపోతున్న అతన్ని దిగ్ర్భాంతంగా చూస్తూ కూచుంది. ఏదో స్పురించిదానిలా దిగ్గునలేచి నిల్చుంది.

 

    సందేహంలేదు. దొంగే! ఆ గడ్డం! ఆ మాసిన బట్టలూ! ఆ చూపులూ కాదు. ఆ చూపులు దొంగ చూపుల్లా లేవు. ఆ చూపుల్లో ఏదో కంగారు వుంది. సందేహంలేదు దొంగే. తన అత్తగారూ, భర్తా ఇంట్లో లేరని తెలిసేవచ్చాడు. ఎవడో తెలిసినవాడే అయివుండాలి. ఇరుగుపొరుగును కేకలు పెడితే? దొంగకాకపోతే అసలు దొంగలు ఈవేళప్పుడు వస్తారా? ముఖ్యంగా పల్లెటూళ్ళలో అందరూ ఇళ్ళదగ్గర వుండే సమయాల్లో దొంగలు వస్తారా! అతనెవరో తెలిసినవాడే అయివుండాలి. లేకపోతే అంత చనువుగా "అమ్మా!" అని పిలుస్తూ లోపలకు వెళతాడా? ఇంకా బయటకురాడేం? ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్నాకయినా బయటకు రావాలిగా? లోపలకు వెళ్ళిచూస్తే! అతను తనను ఒంటరిగా.... కాదు అతను అలా కనిపించటంలేదు.

 

    ధైర్యం కూడదీసుకోడానికి ప్రయత్నిస్తూ గుమ్మంముందు నిలబడి చూస్తున్న అరుంధతికి ఆ ఆగంతకుడు తమ పడకగదిలోకి వెళ్ళటం కనిపించింది. గుండెలు కొట్టుకున్నాయి. నగలూ, బట్టలూ, ఖరీదైన వస్తువులన్నీ ఆ గదిలోనే వుంటాయి. అతను దొంగకాదు. అయితే తను బయట నిల్చుని వుండగా ధైర్యంగా ఇంట్లో తిరుగుతాడా! తను ఎవర్నయినా కేకలుపెట్టి పిలవటానికి అవకాశం ఉందని తెలిసే, లోపల అంత నిశ్చింతగా వుంటాడా? గొడ్లసావిట్లో జీతగాడిస్వరం వినిపిస్తోంది. అరుంధతికి ధైర్యం వచ్చింది. అతను ఏం చేస్తున్నాడో చూడాలనే కుతూహలం కలిగింది. చిన్నగా శబ్దం కాకుండా అడుగులో అడుగువేసుకుంటూ లోపలకు వెళ్ళింది. అతడు గోడకు తగిలించివున్న రాజారావు ఫోటోను రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. దాన్ని గోడనుంచి తీసి, ఫ్రేమ్ లాగివేయటానికి ప్రయత్నిస్తున్నాడు. అరుంధతి క్షణం అయోమయంగా చూసింది. అతనికి ఆ ఫోటోతో పనేమిటి?

 

    "ఎవరు నువ్వు? ఎందుకాఫోటో తీస్తావు?" తీవ్రంగా అంది అరుంధతి.

 

    ఆ ఆగంతకుడు వెనక్కి తిరిగి చూశాడు. అరుంధతి ముఖంలోకి సూటిగా చూశాడు. లోతుగా చొచ్చుకునిపోయే ఆ చూపుల్ని తట్టుకోలేక తడబడింది.

 

    ఆగంతకుడు తన పనిని విరమించకపోవటం చూసిన అరుంధతి ఆవేశంగా ముందుకెళ్ళి అతని చేతినుంచి ఆ ఫోటోను లాగేసింది. అతను ఆమె ముఖంలోకి చిత్రంగా చూస్తూ నిల్చుండిపోయాడు.

 

    "ఈ ఫోటోతో నీకేంపని? ఇది నాకు....కాదు మాకు ప్రాణప్రదమయింది." అరుంధతి కంఠం కొంచెం కంపించింది.

 

    ఆగంతుకుడు క్షణంలో సగంసేపు విస్మయంగా ఆమె ముఖంలోకి చూశాడు.

 

    "ఆ ఫోటో నీకు ప్రాణప్రదమయిందా?" మాటలు చాలా తక్కువ స్థాయిలో గంభీరంగా వచ్చాయి.

 

    అరుంధతి తడబడింది. "మాకు అన్నాను. మావారి స్నేహితుడు, మా అత్తగారికి పుత్రుడిలాంటివాడు."

 

    "మరి మీకు....?" తమాషాగా ఉంది అతని స్వరం.

 

    అరుంధతికి ఏదోగా అనిపించింది. తడబాటును దాచుకుంటూ "నీకనవసరం! అసలు ఎవరు నువ్వు? బయటకు వెళతావా లేక అరవమంటావా?" అంది కోపంగా.

 

    "వెళతాను, ఆ ఫోటో ఇచ్చేస్తే వెళతాను" అన్నాడు నిశితంగా ఆమె ముఖంలోకి చూస్తూ.

 

    అరుంధతికి అతను ఆ ఫోటోను లాక్కుంటాడేమోనని భయం వేసింది. ఆమె రెండు చేతులను అడ్డం పెట్టి ఫోటోను గుండెలకు ఆనించుకొని నిల్చుంది. ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ నిల్చున్నాడు అగంతకుడు.

 

    అతనికళ్ళపై రెప్పలు మూతపడలేదు. పెదవులు కదలలేదు అరుంధతి గబుక్కున ఫోటోను గుండెలమీదనించి తీసింది. తను అనుకోకుండా చేసినపనికి సిగ్గుపడిపోయింది. అతను అదోలా చూస్తేగాని ఆమెకు తను ఆ ఫోటోను గుండెలకు అదుముకున్నట్లు తెలియలేదు.

 

    "ఫోటోను గుండెల్లో దాచుకుంటున్నావు. మనిషిని ఇంట్లోనుంచి బయటకు వెళ్ళిపొమ్మంటున్నావు. చిత్రంగానే వుంది!" అన్నాడు ఆగంతుకుడు.

 

    అరుంధతి అర్ధంకానట్టు అతని ముఖంలోకి చూసింది. అవే కళ్ళు... అర్ధం అయింది. శ్రుతిచేసి పెట్టివున్న వీణమీద చెయ్యిపడట్టు ఒక్కసారిగా ఆమె హృదయం నిండా మధుర కంపనలు. అక్కడ ఓ క్షణం నిల్చోలేకపోయింది. అక్కడనుంచి వంటింట్లోకి పరుగెత్తుకెళ్ళింది. అలా వెళుతున్న ఆమెనేచూస్తూ నిలబడిపోయాడు రాజారావు ఓ క్షణం. చిన్నగా, కలలో నడిచినట్లు, బయటకు నడిచాడు. వసారాలోవున్న బల్లమీద కూచున్నాడు. తను ఇంతవరకూ చూసింది స్వప్నంకాదని నమ్మటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎదురుగా సగం తుడిచి వదిలివేయబడిన లాంతర్లూ, ముగ్గుబుట్టా, నువ్వు చూసింది వాస్తవమే" నని చెబుతున్నాయి.

 

    ఎవరామె? అద్వితీయమైన సౌందర్యరాశి! ప్రపంచాన్ని తనముందు మోకరిల్ల చేసుకొనే సౌందర్యం ఆమెది. ఆమెను చూస్తే అలసట అంతా తీరిపోయినట్లయింది. ఒక అందమైన చిత్రాన్ని చూసినట్లూ, పాలరాతి శిల్పాన్ని తాకినట్టూ, మహాకవి రచించిన అతని మొదటి భావగీతాన్ని చదివినట్టూ, తాజ్ మహల్ ముందు నిల్చున్నట్టూ వుంది ఆమెను చూస్తుంటే, ఆమె ముందు నిల్చుంటే! ఎవరామె? సీతాపతి భార్యా? అదృష్టవంతుడు!  

 

    "అమ్మా! దీపాలు వెలిగించలేదేం" అంటూ సీతాపతి వసారాలో అడుగుపెట్టాడు. రాజారావు ఎదురుగా కనిపించాడు. గుర్తించటానికి సమయం పట్టింది. రాజారావు ఒక్కసారి వెళ్ళి సీతాపతిని కౌగిలించుకున్నాడు. సీతాపతికి ఆ స్పర్శ ఎవరిదో తెలిసింది. గాఢంగా చేతులు బిగించాడు. ఇద్దరి కళ్ళూ చెమ్మగిల్లాయి.

 

    "ఏరా బ్రదర్! ఎలా వున్నావు?" అంటూ రాజారావు పట్టును సడలించాడు.

 

    "రాజా! ఏమిటిరా ఈ వేషం? పరాయివాడిలా బయట కూచున్నావేంరా? అమ్మా అమ్మా! చూడు ఎవరొచ్చారో!" హడావిడిగా ఉత్సాహంతో కేకలు పెట్టాడు సీతాపతి.

 

    "అమ్మ యింటిలో లేదురా. మీ ఆవిడ నన్ను దొంగ అనుకుంది. ఇంకా నయమే కేకలు పెట్టి నలుగురినీ పోగుచేయలేదు."

 

    సీతాపతి గొంతు విని మెల్లా గడపలోకి వచ్చిన అరుంధతి చెవులకు రాజా మాటలు గులాబిపువ్వులా చల్లగా ఆహ్లాదకరంగా తగిలాయి.

 

    "ఈ గడ్డమూ, ఈ వేషమూ మరి దొంగలాగే కనిపిస్తున్నావు."

 

    "ఏమిటిరోయ్! అప్పుడే భార్యను సమర్దిస్తున్నావు? అందుకే అంటారు ముందొచ్చిన చెవులకంటే వెనకవచ్చిన కొమ్ములు వాడి అని," అన్నాడు రాజారావు సీతాపతి వీపుమీద చరుస్తూ.

 

    "అబ్బ. ఊరుకోరా బాబూ? అప్పుడే మొదలు పెట్టావు!" అంటూ నవ్వుకుంటూ వీపు సవరించుకున్నాడు సీతాపతి.

 

    "అరూ! అరూ!" అంటూ కేకలు పెట్టాడు.

 

    అక్కడే తలుపుచాటుగా నిల్చుని వున్న అరుంధతి ముందుకొచ్చి తలవంచుకుని నిల్చుంది.

 

    "చూడు ఇతనే రాజారావు. నా స్నేహితుడు. ఆ ఫోటో ఇతనిదే. చూసి భయపడ్డావుటగా?" అన్నాడు సీతాపతి నవ్వుతూ. అరుంధతి సిగ్గుపడుతూ తలవంచుకొనే నిల్చుంది. "రాజాముందు సిగ్గేమిటి? మన ఇంట్లో మనిషిగా అనుకో" అన్నాడు సీతాపతి.

 

    అరుంధతి మౌనంగా సగం తుడిచి వదిలేసినా లాంతర్లను లోపలకు తీసుకెళ్ళి లాంతర్లు తుడిచి వెలిగించి అన్ని గదుల్లోనూ వుంచింది. మరో లాంతరు తీసుకొని వసారా చూరుకు కట్టబోయింది. రాజారావు లేచి వెళ్ళి ఆమె చేతిలో లాంతరు తీసుకొని చూరుకు కట్టాడు.

 

    "అరూ! నీళ్ళు కాగితే తోడు. ముందు రాజా స్నానం చేస్తాడు" అన్నాడు సీతాపతి. అరుంధతి తలవూపి లోపలకు వెళ్ళిపోయింది.

 

    "మొత్తంమీద అమ్మ తన కోర్కెను తీర్చుకుంది. కోడలు అందమైందీ, గుణవతీ కావాలని కోరుకునేది" అన్నాడు రాజారావు. సీతాపతి చిరునవ్వు నవ్వాడు జవాబుగా. ఇద్దరూ వచ్చి మెల్లా ఇంట్లో కుర్చీలమీద కూర్చున్నారు.

 Previous Page Next Page