Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 6

    సుందరమ్మకు ఆమెను చూస్తుంటే కడుపు తరుక్కుపోయినట్టుగా అయింది.
    'అన్యాయం, దుర్మార్గం. వాళ్ళకోసం నువ్వు పపెళ్ళిమానేశావు. నీ సుఖాన్ని వదులుకున్నావు. వాళ్ళను ప్రయోజకుల్ని చేశావు.'
    'నన్ను వాళ్ళు అలా చెయ్యమని అడగలేదుగా!'
    సుందరమ్మ శ్రీలక్ష్మి కళ్ళల్లోకి చూసింది. 'వాళ్ళు ఆమాటే అంటారు గదూ? కాదు. అన్నారు. అవునా?'
    'ఉన్నమాటేగా? వాళ్ళు నన్ను అడగలేదుగా?'
    'ఏమిటమ్మా ఉన్నమాట? కన్నవాళ్ళకు పెంచి పెద్ద చేసే బాధ్యత ఉంటుంది. తోడ బుట్టినందుకు బాధ్యతగా ఎందుకనుకోవాలి?'
    'తోడబుట్టినందుకే.'
    'ఆ కృతజ్ఞత వాళ్ళకుండొద్దా? వాళ్ళకోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు. కృతజ్ఞత లేకుండా ఇలాంటి చోటుకు పంపిస్తారా?'
    'వాళ్ళు పంపించలేదు. నేనే వచ్చాను.'
    సుందరమ్మకు నవ్వు వచ్చింది.
    'ఎందుకు నవ్వుకుంటున్నావు నీలో నువ్వే! నేను అబద్ధం చెబుతాననుకుంటున్నావా?'
    సుందరమ్మ గాబరాగా 'అబ్బే! అది కాదమ్మా. చదువుకున్నదానివి. తెలివైన దానివి. ప్రపంచం పోకడ తెలిసిన దానివి'. అని ఓ క్షణం ఆగింది.
    'ఊ! చెప్పు అయితే ఏమిటి?'
    'అందుకే వాళ్ళు పంపించేదాకా వుండకుండానే వచ్చేశావు. నీ గౌరవం నిలుపుకున్నావు.'
    శ్రీలక్ష్మి సుందరమ్మ ముఖంలోకి నిశితంగా చూసింది. ఆమె చూపుల్లో వున్న ప్రశ్నలకు తట్టుకోలేనట్టుగా చూపులు తిప్పుకుంది సుందరమ్మ.
    ఆ మాటకొస్తే తననూ ఎవరూ వెళ్ళమనలేదు. వెళ్ళమనలేదా? తన ముఖం మీద అనక పోవచ్చును. తన కోడళ్ళూ కొడుకులూ తను వినేలా మాట్లాడుకున్న మాటలకు అర్ధం ఏమిటి? వెళ్ళిపొమ్మని కాదూ? బిడ్డల నుంచి జన్మజన్మలకు సరిపోయినంత అవమానాన్ని పొందలేదూ!
    'అవునమ్మా! నేనే వచ్చేశాను. వాళ్ళెవరూ వెళ్ళమనలేదు. వాళ్ళ ఇబ్బందుకు వాళ్ళకుంటాయిగా?'
    'ఏమిటమ్మా ఆ ఇబ్బందులు? నువ్వూ అలాగే అనుకుంటే? వాళ్ళేమయ్యేవాళ్ళు? వాళ్ళ ఇబ్బందులు పెళ్ళాలకు చెప్పలేకపోవడమేగా? దద్దమ్మలు!' సుందరమ్మ కొడుకుల్ని తలచుకుంటూ కసిగా అంది.
    శ్రీలక్ష్మి ఆమె ముఖంలోకి జాలిగా చూసింది.
    'నీ కొడుకులు అలాంటి వాళ్ళేనా?'
    'ఆ...ఆ... నా కొడుకులు... లేరు... లేరు... నాకెవరూ లేరు. నీ సంగతి చెప్పు. నువ్వింత చేస్తే నీ చెల్లెలు తమ్ముళ్ళు ఏం చేశారు?'
    'ఇంతవరకు వాళ్ళు ప్రేమగానే వుంటారు.'
    'నువ్వు వాళ్ళకు బరువు కాదు కాబట్టి.'
    'కావచ్చు.' సాలోచనగా అంది శ్రీలక్ష్మి. ఓ క్షణం ఆలోచించి మళ్ళీ అన్నది. 'చిన్నప్పటి నుంచి నాకాళ్ళమీద నేను నిలబడ్డాను. నలుగురి బరువుని నా భుజాల మీద వేసుకుని మోసినదాన్ని. ఆఖరు రోజుల్లో మరొకరికి బరువు కాకూడదనే ఇక్కడకు వచ్చాను.'
    'అదేమిటమ్మా పసితనం నుంచే నువ్వు బరువు బాధ్యతలు నెత్తికెత్తుకున్నావు. వాళ్ళ బరువును మోసావు.'
    'భగవద్ గీతలో శ్రీకృష్ణుడు నిష్కామ కర్మ చెయ్యమన్నాడు.' వేదాంతధోరణిలో విరక్తిగా అన్నది శ్రీలక్ష్మి.
    'నేను భగవద్గీత చదవలేదు. మావారు కూడా అదే మాట అంటూ వుండేవారు. మావారూ నీలాగే టీచరు చేసి రిటైరు అయ్యారు. రెండేళ్ళయింది పోయి.' గద్గద కంఠంతో అన్నది సుందరమ్మ. 'మీవారికి పెన్ షన్ లేదా? ఆయన పోయాక మీకు రాలేదా?'
    'ఆయన ప్రయివేటు స్కూల్లో చేశారు. పెన్ షన్ లేదు. నీకు వస్తుందా?'
     'ఆ వస్తుంది పదిహేను వందలు. ఐదువందలు హోమ్ కు ఇస్తున్నాను. వెయ్యి నేను ఖర్చు పెట్టుకుంటాను. నేను ఈ హోం మీద దేనికి ఆధారపడక్కర్లేదు'.
    'ఇక్కడ ఉండడానికి డబ్బులు ఇవ్వాలా?' ఆశ్చర్యంగా అడిగింది సుందరమ్మ.
    'అక్కర్లేదు. నేను మాత్రం ఏం చేసుకుంటాను? నా అవసరాలు ఎన్ని? ఇంకా చేర్చి ఎవరికి పెట్టాలి? సాధారణంగా పెన్ షన్ వచ్చేవాళ్ళు ఎంతో కొంత తాము వుంటున్న వృద్దాశ్రమాలకు ఇస్తూనే వుంటారు. నా బట్టలకూ, మిగతా అవసరాలకు నేనే ఖర్చు పెట్టుకుంటాను.'     
    'మీ తమ్ముళ్ళకు మీరు ఇక్కడ వున్నట్టు తెలుసా?'
    'ఎందుకు తెలియదు? వాళ్ళకు చెప్పే వచ్చాను. వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి పలకరించిపోతూ వుంటారు. వాళ్ళకు నేనంటే ప్రేమే! సరే! నీ సంగతి చెప్పు. నీకు ఎవరూ లేరా?'
    సుందరమ్మ అదోలా నవ్వింది.
    'ఎందుకమ్మా నవ్వుతున్నావ్?'
    'మరి నవ్వక ఏం చెయ్యమంటావమ్మా?
    ఇక్కడకు వచ్చేవాళ్ళంతా ఎవరూ లేని వాళ్ళు కారు. ఆ సంగతి నీకూ తెలుసు. నాకూ అందరూ వున్నారు. కాని ఏం ప్రయోజనం?' సుందరమ్మకు దుఃఖం పొర్లు కొచ్చింది.
    'బాధపడకు సుందరమ్మా! తర్వాత మాట్లాడుకుందాంలే. ఇవ్వాళే వచ్చావ్. తొందరేముంది?'
    సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది.
    'నా వయసెంతో చెప్పు చూద్దాం!'. మాట మార్చే ఉద్దేశంతో అడిగింది శ్రీలక్ష్మి.
    సుందరమ్మ శ్రీలక్ష్మిని తేరిపార చూసింది. అరవై కంటే ఎక్కువ ఉన్నట్టు లేదు. ముఖం చూస్తుంటే ఆరోగ్యంగానే కన్పిస్తున్నది. మరి మంచం ఎందుకు దిగదు?
    'అరవై ఉండొచ్చు.'
    'అరవై ఆరు'.
    'అంత ఉందా? ఆరోగ్యంగానే కన్పిస్తున్నావు. కాని...'
    'అవును ఆరోగ్యం గానే వున్నాను. కాని మోకాళ్ళల్లో ఎముకలు అరిగిపోయాయి. నడవలేను. ఇదుగో ఈ స్టూలు చూడు. దీనికి చక్రాలు బిగించారు. దీనిమీద కూర్చునే బాత్ రూంకి వెళ్తాను.'
    'అయ్యో! ఎందుకలా అయింది?'
    'ఇంట్లో-బయటా చిన్నప్పట్నుంచి పరుగులు తీసి తీసి అలసిపోయాను. ఒంటరిగా పరుగులు తీసాను. నాకాళ్ళ ఎముకలు అరిగిపోయేలా పరుగులు తీసాను. ముగ్గురికి పెద్ద పెద్ద చదువులు చెప్పించాను. స్కూలు పని అయిపోయాక - ట్యూషన్లకని పరుగులు తీసాను. జీవితమంతా పరుగులు తీసిన నాకు ఆ పరుగులు ఆగిపోయే సమయం వచ్చిందని సంతృప్తి కలిగింది. ఇక పరుగులు తియ్యాల్సిన అవసరం లేదు. నా బాధ్యతలు తీరాయి అనుకున్నాను. కాని పరుగులే కాదు నడవడం కూడా అనవసరం అని జీవితం నన్ను శాశ్వతంగా కూర్చోబెట్టింది.' చిన్నగా తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అన్నది.
    'డాక్టరుకు చూపించలేదా?'
    'చూపించాను. ఎప్పుడు? అన్ని బాధ్యతలూ తీరాక. తీరిక చిక్కాక వెళ్ళాను. అప్పటికే ఎముకలు బాగా అరిగి పోయాయనీ, చెయ్యగలిగిందేమీ లేదని చెప్పేశారు.'
    'కాళ్ళు లేక చతికిల బడ్డ నిన్ను నీమానానికి వదిలేశారు నీ వాళ్ళు'.
    'వాళ్ళు నేను కన్న బిడ్డలు కారు'.
    'హూ! కన్నబిడ్డలు! అడ్డాలనాడే బిడ్డలు. గడ్డాలు వచ్చాక వాళ్ళు వట్టి మొగుళ్ళు మాత్రమే. ఇంకెవరికీ ఏమీ కారు. అడ్డాలనాడు బిడ్డ తల్లి గుండెలమీద తన పసిపాదాలతో తంతాడు పాలు తాగుతూ. ప్రతి తన్నుకూ ఆతల్లి గుండె క్షీర భాండమే అవుతుంది. వాడే గడ్డాలు వచ్చాక ఆ తల్లి గుండెల్ని కనిపించని తన్నులతో ముక్కలు చేస్తాడు.' సుందరమ్మ గొంతు దుఃఖంతో పూడిపోయింది.

 Previous Page Next Page