Previous Page Next Page 
బంధితుడు పేజి 6


    ఆలోచిస్తూ రెండోవైపుకు వత్తిగిలి పడుకుంది పద్మ.

    సత్యానారాయణ మనసు చిరాకుగా వుంది. మరో వైపు ఆకలి వేస్తుంది.

    పడకకుర్చీలో కూర్చుని సిగరెట్టుమీద సిగరెట్టు తాగేస్తున్నాడు.

    ఎంత గర్వం ? ఏ మాట నోటికి వస్తే అదే అనేస్తుంది.

    తన సంపాదన తినే హక్కు తన చెల్లెలికి లేదా?

    సిగ్గులేకుండా తింటున్నావంటుందా!

    పద్మ చదువుకున్నది. తొందరపడి ఒకర్ని అనే మనిషి కాదు. పద్మకు సరోజ మీద కోపం అనుకోవడానికి కూడా లేదు. ఎప్పుడూ  తనంతట తను సరోజమీద చాడీలు చెప్పలేదు. తను అడిగినా చెప్పదు. అమ్మ చనిపోయిన కొత్తలో సరోజను ఎంత ప్రేమగా చూసేది.

    ఆ మాటకొస్తే సరోజకు వదినంటే అసూయ.

    ఆ విషయం తనకూ తెలుసు. కాని సరోజ చిన్న పిల్ల తల్లీ-దండ్రీ లేరు. పెద్దవాళ్ళం సర్దుకు పోవాలనే జ్ఞానం పద్మకు ఉండక్కర్లా? అసలు ఈ చిలిపి తగాదాలకుకారణాలు తెలియడంలేదు సరోజ ఏదో చెప్తుంది. పద్మ అసలు చెప్పదు.

    తను ప్రశ్నిస్తే మొండిసమాధానాలు ఇస్తుంది. తనకు కోపం వస్తుంది. పద్మను తిడతాడు. కొట్టబోతాడు. అభిమానంగల పద్మ మరీ రెచ్చిపోతుంది. రోజు రోజుకూ ఇద్దరూ దూరం అవటమే జరుగుతున్నది.

    సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికి రావాలంటేనే భయం వేస్తున్నది. ఇలా ఎంతకాలం?

    తను సరోజను అవసరమైన దానికంటే ఎక్కువగా సమర్థిస్తున్నాడేమో? ఇకనుంచి  సరోజనుకూడా కొంత అదుపులో పెట్టాలి.

    సిగరెట్ యాష్ ట్రేలోవేసి, కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు సత్యనారాయణ.


                                            4


    ఆరోజు సత్యనారాయణ ఆఫీసునుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు.

    పిల్లలిద్దరూ ఎదురు పరిగెత్తుకొచ్చారు.

    బిస్కట్ల పొట్లం కొడుకు చేతికిచ్చి కూతుర్ని ఎత్తుకున్నాడు.

    "అమ్మ ఏం చేస్తుంది?" సత్యనారాయణ కొడుకును అడిగాడు.

    "వంట చేస్తూంది" అన్నాడు కొడుకు రవి.

    అత్తయ్య ఏదీ?" మెల్లగా ఇంట్లోకి వచ్చి అడిగాడు సత్యనారాయణ.

    రవి బిస్కట్ల పొట్లం విప్పుతూ సమాధానం ఇవ్వలేదు.

    "నాన్నా, మలేమో? అమ్మ అత్తయ్యను కొత్తంది చంకలో వున్న మూడేళ్ళ పిల్ల చెప్పింది.

    సత్యనారాయణ ఓ క్షణం స్థాణువులా నిలబడిపోయాడు.

    "ఏరా రవీ! కవిత చెప్పేది నిజమేనా?"

    "ఏంటీ?"

    "అమ్మ అత్తయ్యను కొట్టిందా?"

    "అవును!"

    సత్యనారాయణ కూతుర్ని దింపి గబగబా సరోజ గదిలోకి వెళ్ళాడు. సరోజ మంచంమీద మునగదీసుకొనివుంది. గదిలో లైటుకూడా వేసిలేదు. సత్యనారాయణ స్విచ్ ఆన్ చేశాడు.

    లైట్లు వెలగ్గానే సరోజ రెండోవైపుకు తిరిగిపడుకుంది.

    "ఏమిటి సరూ? ఎందుకు పడుకున్నావ్?"

    సరోజ వెక్కి వెక్కి ఏడ్వసాగింది.

    "ఏమిటమ్మా ఏమయింది? లేచికూర్చో!"

    సరోజ దుఃఖం  కట్టలు తెంచుకుంది. అన్న  చేతులకు చుట్టుకు పోతూ బావురుమంది.

    సత్యనారాయణ కదిలిపోయాడు.

    పాప చెప్పింది నిజమేనా?పద్మ  సరోజను కొట్టిందా. సరోజ వంటిమీద చెయ్యి చేసుకోనేంతవరకూ పోయిందా పద్మ అహంకారం?"

    సత్యనారాయణ కోపంతో నిలువెల్లా వణికిపోయాడు.

    "లే! ఎందు కేడుస్తావ్? జరిగిందేమిటో చెప్పు" సరోజను కసురుకున్నాడు సత్యనారాయణ.

    సరోజలేచి కూర్చుంది. సరోజ బుగ్గ ఎర్రగా కంది వుంది.

    "వదిన కొట్టిందా?"

    సరోజ ముఖం చేతుల్లో దాచుకొని ఏడ్వసాగింది.

     "పద్మా! పద్మా!" గావు కేకలు పెట్టాడు సత్యానారాయణ.

    "ఏమిటా అరుపులు? చుట్టూ ఇళ్ళవాళ్ళుకూడా వినాలా మన భాగోతం?" రుసరుస లాడుతూ వచ్చింది పద్మ.

    "ఎందుకు సరోజ ఏడుస్తుంది!"

    "మీ ముద్దుల చెల్లెల్నే అడగండి."

    "నేను అడిగినదానికి సూటిగా సమాధానంచెప్పు సరోజను తిట్టావా?"

    "తిట్టాను కొట్టానుకూడా." తీవ్రంగా సమాధానం ఇచ్చింది పద్మ.

    సత్యనారాయణ చివ్వునలేచి నిల్చున్నాడు.

    "కొట్టావా? ఎవరిచ్చారే నీకా అధికారం?"

    "ఒకరిచ్చే దేమిటి? వున్నదనే కొట్టాను."

    "పద్మా!"

    పిచ్చికోపంతో సత్యనాయణ పద్మను ఆ చెంపా ఈ చెంపా వాయించాడు.

    కాపరానికి వచ్చిన ఏడేళ్ళ తర్వాత మొదటి సారిగా మొగుడిచేత దెబ్బలుతిన్న పద్మ నిర్ఘాంతపోయి నిల్చుంది.

    ఓ క్షణం భర్త ముఖంలోకి వెర్రిగా చూసింది.

    సత్యనారాయణ తను చేసిందేమిటో అర్థం  చేసుకొనే లోపలే పద్మ అక్కడినుంచి వెళ్ళిపోయింది.

    సరోజకూడా అన్నకేసి ఆశ్చర్యంగా  చూస్తూకూర్చుంది.

    సత్యనారాయణ పిచ్చివాడిలా బయటికి పోయాడు.

    ఊరంతా ఎక్కడెక్కడో తిరిగి అర్థరాత్రికి ఇంటికి చేరుకున్నాడు!

    పద్మ తలుపుతీసి గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది!

    సత్యనారాయణ బట్టలుకూడా మార్చుకోకుండా పడుకున్నాడు! నిద్ర రావడంలేదు.

    పద్మను కొట్టి తప్పు చేశానని బాధపడుతున్నాడు. అసలువిషయం కనుక్కోకుండా తను తొందర పడ్డాడేమో? బలమైన కారణం లేకుండా పద్మ సరోజ మీద చెయ్యి చేసుకుంటుందా? పైగా కొట్టానని అంత ధైర్యంగా చెబుతుందా?

    "పద్మా!" మృదువుగా పిల్చాడు సత్యనారాయణ.

    పద్మ పలకలేదు.

    "పిచ్చికోపంలో చెయ్యి చేసుకున్నాను. బాధపడుతున్నాను. నన్ను క్షమించు" అన్నాడు సత్యనారాయణ.

    పద్మ సమాధానం ఇవ్వలేదు.

    పద్మ అభిమానవతి అని సత్యనారాయణకు తెలుసు.

    "సరోజ మరీ చిన్నపిల్ల కాదు. పెళ్ళీడుకొచ్చిన పిల్ల. దాన్ని కొట్టటం మాత్రం మంచిదా చెప్పు!"

    పద్మ ఉలకలేదు, పలకలేదు.

    "అయినా దానికి నువ్వూ నేనూ తప్ప ఎవరున్నారు చెప్పు! ఆనాడు అమ్మకు నువ్వుకూడా మాటిచ్చావ్ గుర్తుందా?"   

 Previous Page Next Page