"అంటే....యూ వీ న్ టుసే.....?" మిగతా మాటలు కృష్ణ గొంతు లోనే ఆగిపోయాయి.
"యస్. నువ్వూహించింది కరక్టే. అందులో నా ఒక్కడి తప్పే కాదు- ఆమెదికూడా వుంది. నిజం చెప్పాలంటే పరిస్థితులు అలావచ్చాయి. ఆ పరిస్థితుల్లో మానవమాత్రులెవరైనా అలాగే ప్రవర్తించి వుండేవారు."
మామిడిఆకుల సందుల్నించి, మబ్బుల్లో మాయమైపోతూ వున్న చంద్రుడిని చూస్తూ ఓ క్షణం ఆగిపోయాది జగన్మోహనరావు.
మురళీకృష్ణ కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు.
జగన్ మాటలు వింటుంటే పాచిపట్టిన దిగుడు బావి మెట్లమీద జారికిందకు దొర్లిపోతున్నట్టుగా వుంది కృష్ణకు.
శరీరాలు దగ్గరయ్యాక జరగవలసిందే జరిగిందన్నమాట!
దాని పర్యవసానమే__
అతని ఆలోచన ముందుకు సాగలేదు.
ఈ లోపల జగన్ మళ్ళీ ప్రారంభించాడు.
"ఫైనలియర్ లో క్రిష్టమస్- సంక్రాంతి శెలవులకు మా లిటరేచర్ క్లాస్ వాళ్ళం, దక్షిణదేశ యాత్రకు బయలుదేరాము. మద్రాసు, మహాబలిపురం చూసి కోయంబత్తూర్ చేరుకున్నాం. అక్కడనుంచి ఊటీకి బయలుదేరాం. ఊటీకి బయలుదేరేముందు మాలో మాకు కొంత చర్చ జరిగింది."
ఓ క్షణం ఆగి మళ్ళీ అందుకున్నాడు. "బాగా చలిగా వుంటుందని కొందరు మానేద్దామన్నారు. రియల్ థ్రిల్ అంతా ఆ చలిలోనే వుంటుందని కొందరు వాదించారు. నేనూ ఆమెకూడా ఊటీ వెళ్ళితీరాల్సిందేనని పట్టుపట్టాము. నలుగురు మిత్రులు ససేమిరా రామన్నారు. మిగతావాళ్ళం అందరం వెళ్ళడానికే నిశ్చయించుకొన్నాము. ఆ నలుగురూ మేము నీలగిరి వెళ్ళి వచ్చేలోపల, మధురైవెళ్ళి తిరిగి కోయంబత్తూరు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. వాళ్ళు మదురైకు బయలుదేరారు. మేము నీలగిరి ఎక్స్ ప్రెస్ ఎక్కాము. నీలగిరి కొండలమీద కొండచిలవలా మెలికలు తిరుగుతూ వెళుతున్న రైల్లో కూర్చున్న మాకు అధో దివ్యానుభూతిగా అన్పించింది. అనిత, సరితల మధ్యన ప్రియ కూర్చుంది. ఎదురు బర్త్ మీద నేను, రాఘవరావు, సత్యానందం కూర్చున్నాము."
"అంటే మీ బెర్తుమీద కూర్చుండిన ముగ్గురూ ఎదురు బెర్తుమీద కూర్చుండిన ముగ్గురినీ వరసగా ప్రేమించారా?"
జగన్ కు వీపుమీద కొరడాదెబ్బ తగిలినట్టు అయింది. త్రుళ్ళిపడి వీడూ__వీడి ప్రశ్న ఏమిటి?" అన్నట్టు కృష్ణ ముఖంలోకి చూశాడు.
అది గ్రహించి కృష్ణ తగ్గాడు.
తను అసలు అలా అడగాల్సింది కాదు. కాని ఎందుకో తనకు అతని మాటలు వింటుంటే వళ్ళు మండిపోయింది.
"అబ్బే నా ఉద్దేశ్యం - మరేమీ కాదు. వాళ్ళుకూడా పరస్పరం ప్రేమించుకున్నారని?" ఏదో సర్ది చెప్పబోయి అదే ప్రశ్న వేశాడు. కాని అతడనిన ధోరణిలో కొంత మార్పు వుంది."
"లేదు, కాని తర్వాత అనితా, సత్యానందం పెళ్ళిచేసుకున్నారు."
"ప్రేమించుకోనివాళ్ళు పెళ్ళి చేసుకున్నారా? బాగానే వుంది. మరి ప్రేమించుకొన్నవాళ్ళో?" అంటూ బిగ్గరగా ఆవలించాడతడు.
"ఐరనీ ఆఫ్ ఫేట్ అదే!"
"ఓ! ఐసీ!" అంటూ మళ్ళీ ఆవలించాడతడు.
"నీకు నిద్ర వస్తూన్నట్టుంది, పడుకొందామా?" లేవడానికి ప్రయత్నిస్తూ అనినాడు జగన్.
"నో!నో! చెప్పు! ఊటీలో ఏమైంది?" కుతూహలంగా ముందుకు వంగి అడిగాడు కృష్ణ.
"ముందు కూనూర్ వెళ్ళాం. అక్కడ ఓరోజు వుండి, తెల్లవారి ఊటీకి వెళ్ళాం. మనోహరమైన దృశ్యాలను చూస్తూ సాయంకాలంవరకూ తిరిగాం. సంధ్యాసమయంలో లేక్ డేల్ ప్రాంతంలో వుండిన గార్డెన్ లో గడిపాము. అప్పటికే చలి ఎక్కువయింది. గవదలు వణికే చలి. ఎముకలు కొరికే చలి. ఆరుగంటలకల్లా హోటల్ చేరుకున్నాం" అంటూ ఆగి జగన్ అతడి ముఖంలోకి చూశాడు.
కృష్ణ వస్తున్న ఆవలింతను బలవంతంగా ఆపుకొని "ఏ హోటల్ కు చేరారు? తర్వాత?" అన్నాడు.
సాగదీసి సాగతీసి జగన్ చెపుతుంటే అతడికి మహాబోర్ గా వుంది. కాని మోనాలిసాతల్లి ఏమైందో తెలుసుకోవడానికి లోలోన ఆరాటంగానూ వుంది.
"ఆ రాత్రి జరిగిన సంఘటన జీవితాంతం మరువలేనిది. ఆ మధుర క్షణాలను తల్చుకొంటూ మోనోకోసం బ్రతుకుతున్నాను" హఠాత్తుగామారిన అతని కంఠం స్వరం విని అతను కలవరపడ్డాడు.
అతని కంఠం గంభీరంగా వుంది.
అతని చూపులు, ఎక్కడో దేన్నో అనిర్వరచనీయమైనదాన్ని, అద్వితీయమైనదాన్ని వెతుకుతున్నట్టున్నాయి.
కృష్ణకు నిద్రమత్తు వదలిపోయింది.
గాలి బిగబట్టి మౌనంగా తదేక దృష్టితో జగన్ మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు.
"రాత్రి ఎనిమిదఎసరికి భోజనాలు ముగించుకొని రజాయిమీద రజాయి, రగ్గుమీద రగ్గు కప్పుకొని హోటల్ గదుల్లో పడుకున్నాము. సత్యానందమూ నేనూ ఒక గదిలో వున్నాం. ప్రియా, అనితా ఒక గదిలో వున్నారు."
"మీ శ్రీమతి పేరు...." కృష్ణ మాట పూర్తి కాకుండానే "అవును, ప్రియ" అన్నాడు.
"ప్రియా?"
"అవును! ప్రియే!"
"ఊఁ ఆ రాత్రి?"
"పది గంటలు దాటిందనుకొంటాను. మా గది తలుపులు బయట నుంచి తట్టుతూన్నట్టు వినిపించింది. రగ్గులు తొలగించుకొని మెల్లగాలేచాను నేలకు కాలు తగులుతూనే జివ్వుమంది. పక్క బెడ్ మీద నిండా ముసుగు తన్ని నిద్రపోతున్నాడు సత్యానందం, వెళ్ళి తలుపు తెరిచాను."
"ఎదురుగా ప్రియ నిల్చుని వుంది."
"కాదు- అనిత నిలుచుని వుంది" ముక్తసరిగా అన్నాడు జగన్.
కృష్ణ తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు. సర్దుకొని అన్నాడు.
"ఓ, సత్యానందంకోసం వచ్చిందన్నమాట!"
"కాదు. నాకోసమే."
మొహంమీద ఫెడేల్న గుద్దినట్టు అయింది కృష్ణకు.
ప్రేమించింది ప్రియను!
వచ్చిందేమో అనిత!
కథ మలుపు తిరిగింది.
దిమ్మెరపోయాడు.
అయోమయంగా జగన్ మొహంలోకి చూశాడు.
"జగన్ గారూ మీరు త్వరగా రావాలి. ప్రియ మీకోసం చూస్తూంది" అంది అనిత ఆదుర్దాగా.
"ప్రియకు ఏమైంది అనితా? అని అడిగాను. గాభరాపడ్డాను."
"టెంపరేచర్ ఉంది. కలవరిస్తోంది. మిమ్మల్నే కలవరిస్తోంది."
"అనిత వెనకే వెళ్ళాను. గదిలోకి వెళుతూనే రగ్గు తొలగించి ప్రియ నుదురుమీద చెయ్యిపెట్టి చూశాను. వళ్ళు కాలిపోతోంది. హోటల్ అసిస్టెంట్ మేనేజర్ని లేపి డాక్టర్ కు ఫోను చెయ్యమన్నాను. డాక్టర్ ఫోనునుంచి రెస్పాన్సు రాలేదు ఎంక్వయిరీకి ఫోనుచేస్తే డాక్టర్ ఫోను ఫాల్టీ అని చెప్పింది. అసిస్టెంటు మేనేజర్ ను అడిగి ఒక బాయ్ ని తీసుకొని డాక్టర్ ఇంటికి బయలుదేరాను. మా హోటల్ కు డాక్టర్ ఇల్లు దాదాపు రెండు కిలోమీటర్ల లో ఉంది. బయట చలి ఎముకల్ని కొరికేస్తోంది. వేసుకొన్న స్వెట్టరూ, కోటూ, మఫ్లరూ ఆ చలిని ఏమాత్రం ఆపలేకపోతున్నాయి. అయినా అదేమీ నాకు బాధగా అన్పించలేదు. ప్రియమీద నాకున్న అనురాగమలాంటిది. ఆమెను గురించిన ఆలోచనతోనే నా బుర్రపైన మంచుపడ్తున్నా వేడెక్కిపోయింది. ఓ అరగంటలో డాక్టర్ ఇంటికి చేరాను మరో పావుగంటలో డాక్టర్ని తీసుకొని ఆయన కార్లోనే హోటల్ కు వచ్చాను. ప్రియను పరీక్షచేసి మందు ఇచ్చాడు. ఫీజ్ తీసుకొని తెల్లవారి వచ్చిచూస్తానని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు.
జగన్ నిట్టూర్చాడు, ఓ క్షణం ఆగి మళ్ళీ అందుకున్నాడు.
"ఒంటిగంట దాటేదాకా ప్రియ మంచంపక్కనే కూర్చుని, ఆమె నిద్రపోగానే నా గదికి వచ్చేశాను. ప్రియను గురించిన వర్రీతో నాకు నిద్రపట్టలేదు. మూడుగంటలకు ప్రియ గదికెళ్ళాను. మందిచ్చి వచ్చాను. మళ్ళీ ఆరుగంటలకి వెళ్ళి, ప్రియను నిద్రలేపి, కాప్సిల్, టాబ్ లెట్ ఇచ్చి, ప్లాస్కులో తెచ్చిన కాఫీ తాగించాను. టెంపరేచర్ అంత ఉధృతంగాలేదు. చాలావరకు తగ్గింది. ప్రియ కొంతవరకు తేరుకొంది. ఆమె తాగిన కాఫీ కప్పు అందుకొని పక్కన పెడ్తూండగా ప్రియ నా చెయ్యి పట్టుకుంది" అంటూ ఓ క్షణమాగాడు.
"నాకోసం మీరు? అంటూ నా కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళు ఆర్ద్రం ఐనాయి, పెదవులు వణికాయి."
"ప్రియా! ఆ తర్వాత నా గొంతు మూగబోయింది. ఆమెకళ్ళల్లోకి చూస్తూండిపోయాను. నా చేతిని దగ్గరకు తీసుకొని__పెదవులకు ఆనించుకొంది. నా ముంజేతిని పెదవులపైనుంచి మెల్లగా తీస్తున్నప్పుడు ఆమె పెదవులపై విరిసిన మెరుపురేఖ ఆనాటి మొనాలిసాను గుర్తుకు తెచ్చింది. ప్రియ చేతివేళ్ళను, నా చేతివేళ్ళతో మృదువుగా నిమురుతూ, ఆమె పెదవులపై కదిలిన 'మొనోలిసా' హాసరేఖ వెలుగునుచూస్తూ__అలా ఎంతసేపు గడిపానో నాకె తెలియదు. అనంతకాలం విలువ ఆ మధుర క్షణాల్లోనే ఇమిడివుందేమోననిపించింది. జీవితపు సారమంతా ఆ అనుభూతిలోనే ఇమిడిపోయిందేననిపిస్తుందిరా కృష్ణా!"
జగన్మోహన్ వినీలాకాశంలో తెల్లటి మబ్బులతో ఆడుకుంటున్న చందమామకేసి చూస్తూండిపోయాడు.
కృష్ణకు ఊపిరాడడంలేదు.
చెట్టుకింద వీస్తున్న అంత గాలిలోకూడా ఉక్కపోస్తున్నట్లుగా ఉంది.
"ఊఁ ఆ తర్వాత?" అన్నాడు.