Previous Page Next Page 
అనుహ్య పేజి 5

    "వదలండి....ఎవరైనా చూస్తారు" అన్నాను.
    అతను నన్ను వదులుతూ "ఇలాంటి దృశ్యాలు నీ కళ్ళపడితే  నువ్వైతే ఏంచేస్తావు? అక్కడే నిలబడి చూస్తావా? వెళ్ళిపోతావా?" అని  అడిగాడు.
    "తల తిప్పుకుని వెళ్ళిపోతాను" అన్నాను.
    "మరి అందరూ  అంతే  అనుకోవచ్చుగా!" నన్ను మళ్ళీ తనవైపు లాక్కున్నాడు.
    "ప్రతీదీ లాజికల్ గా ఆలోచించాలి" అని మళ్ళీ  నా పెదవులు  అందుకున్నాడు. "ఇప్పటికి చాలా?" అని చెవిలో విష్పరింగ్ గా అడిగాడు  అక్కడికేదో నేను ఇంకా కావాలని మారాం చేస్తున్నట్లు మాట్లాడ్తాడేమిటి? నేను సిగ్గుగా తల వంచుకున్నాను.
    "నువ్వు  నాలికని ఎక్కువగా వాడవా?" అన్నాడు.
    నేను తలెత్తిచూసి "మాట్లాడ్తున్నానుగా!" అన్నాను.
    కిటికీలోంచి మావైపు వింతగా చూస్తూ అవసరం లేకపోయినా అక్కడే తచ్చాడుతున్న మా వైపు ఆడవాళ్ళూ కొందరు కనిపించారు.
    నేను ఇబ్బందిగా కదిలాను.
    "నేను నిన్ను ఎందుకు పిలిపించానంటే...."అని సిగరెట్ వెలిగించాడు.
    "వివేక్...." అంటూ వాళ్ళమ్మ వచ్చింది.
    "ఎస్ మమ్....అన్నాడు తల సరిచేసుకుంటూ.
    ఆవిడ్ని చూసి నేను లేచి నిలబడ్డాను.
    ఆవిడ నన్ను చూసి నవ్వి "ఓ...సారీ....మళ్ళీ వస్తా" అని అక్కడ్నుండి వెళ్ళిపోయింది.
    "ఆవిడ మీహెడ్ మాస్టర్ లా కనిపించిందా? లేచి నిలబడ్డావు?" అతను నవ్వుతూ అడిగాడు.
    అతన్ని చూడగానే నా కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అతనిచేతిలో అగ్ని హోత్రం వెలుగుతూనే వుంది! వాళ్ల అమ్మ వచ్చినా  పారెయ్యలేదు!
    "ఆ....కూర్చో....ఎందుకు పిలిచానంటే, రేపు  మన ఫస్ట్ నైట్ రాత్రంతా 'నీకేం ఇష్టం? నాకేం ఇష్టం? అని మాట్లడ్తూ కూర్చుని టైమ్ వేస్టు  చేసుకోవడం నాకు ఇష్టంలేదు! అందుకే అవన్నీ  ఇప్పుడు మాట్లడేసుకుంటే రేపు 'నీకు ఎలా ఇష్టం? నాకు ఎలా ఇష్టం?' అని తెలిసి, హాయిగా ఎంజాయ్ చెయ్యచ్చు ఏవంటావ్?" అన్నాడు.
    నేను అతనివైపు పరీక్షగా చూశాను.
    అతని ముఖం మామూలుగా 'నాకు ఇడ్లికన్నా దోసెంటేనే ఇష్టం!' అని చెప్తున్నట్లుగా వుంది. మొహమాటం, బెరుకూ , కొత్తా ఇసుమంతైనా లేవు! ప్రతిదీ ఇలా రొటిన్ గా తీసుకునేవాడితో నేను కాపురం చెయ్యగలనా? అనే సందేహం మొదలైంది.
    "నీకు కాఫీ ఇష్టం, నాకు టీ ఇష్టం. నీకు వంకాయ ఇష్టం. నాకు బెండకాయ ఇష్టం....ఇప్పుడెలా? లాంటి అనుమానాలూ, సమస్యలూ  మనమధ్య ఎప్పడూ రాకూడదు ఎందుకంటే  అవన్నీ  ఎవరికి వాళ్లు చేసుకునే పనులు నీకేం ఇష్టమో అవే తిను. అవే కట్టుకో, అవే చూడు! నన్ను చెయ్యమనకు అంతే చాలు! కానీ....సెక్స్  అలా కాదు! ఇద్దరికీ సంబంధించినది. ఇద్దరికీ ఇష్టమవ్వాలి. చదువుకున్నదానివి. ఈ రోజుల్లో ఇవన్నీ  ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదనుకో అని సిగరెట్ పొగ పీల్చాడు.
    ఆ పొగ నా ముఖం మీదకి వదుల్తాడేమో! అని  ఊపిరి బిగబట్టి చూస్తూ కూర్చున్నాను. నాకు తెలిసి పోయింది. ఇంక జన్మలో  నాకు సిగరెట్ ఇష్టంలేదు' అని నేను అనే ఛాన్స్ లేదు. 'నీకు ఇష్టంలేకపోతే  నువ్వు తాగకు' అనే మొండిరకం ఇతగాడు.
    అతని ముఖం చూస్తే ఎవరూ అతను ఇలా మాట్లడ్తాడని ఊహించరు అతి నిర్మలమైన కళ్ళూ , కోటేరు ముక్కూ, ఎప్పడూ నవ్వుతూ  వుండే పెదవులూ.... వివేకానందుడిలా వుంటాడు. ఆనందం ఆయనకి చివరిదైతే ఇతనికి ముందుదై వుంటుంది అనిపించింది.
    "అన్నీ నేనే మాట్లాడ్తున్నాను....నీకు  మాట్లాడాల్సినదేం లేదా?" అడిగాడు.
    "విని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అన్నాను.
    సన్నగా చిరుగాలి వీస్తోంది. అయినా  నాకు ఒళ్ళంతా  స్వేదం అలుముకుంది. తలలోని మల్లెలు బరువుగా  గుబాళిస్తున్నాయి. కాలి బొటనవేలితో నేలమీద రాస్తూ కూర్చున్నాను.
    "నన్ను నేలరాచాలని చూస్తూన్నావా?" అని అడిగాడు.
    అతని మాట విని నేను చాలా సంభ్రమానికి లోనయ్యాను. ఎందుకంటే నేను  'వివేక్ అనే వ్రాస్తున్నాను. అతను చాలా  సూక్ష్మదృష్టి కలవాడు.
    "ఈ రాత్రికి  రెస్ట్ తీసుకో రేపు నిద్ర వుండదుకదా!" అన్నాడు.
    నాకు ఇంకా కాసేపు అక్కడ కూర్చుని అతనినుంచి వచ్చే మత్తయిన ఇంటిమేట్  స్ప్రేపరిమళాలు అనుభవించాలనీ, అతను చిలిపి సంభాషణలు చేస్తే వినాలని, ఇంకోసారి దగ్గరికి తీసుకుంటే  బాగుండుననీ వుంది! అయినా లేచి నిలబడ్డాను.
    "జస్ట్ వన్ మినిట్...." అతను కూడా లేస్తూ అన్నాడు.
    ఎందుకోగాని నా గుండెలు దడదడా కొట్టుకున్నాయి!
    అతను నా నడుము దగ్గర చెయ్యివేసి "నీ బాడీలో బ్యూటిపుల్  కర్వ్ ఇక్కడ  వుంది  నీ కళ్లు చాలా  రొమేంటిక్ గా  వుంటాయి. అమాయకంగా చూసే కళ్ళల్లో  రొమేంటిక్ టచ్  ఎక్కువగా  వుంటుంది. నీ పెదవులు వంపుతిరిగి ప్రవోకింగ్ గా వుంటాయి " అన్నాడు.
    నాకు చాలా గర్వంగా అనిపించింది.
    "ఆఁ.....ఇంకో ముఖ్యమైన  విషయం....నీ టచ్ హాయిగా వుంది ఐ ఎంజాయిడ్ ఇట్" అన్నాడు.
    నా ఒళ్ళు తేలికగా గవ్వలా అనిపించింది. బహుశా అది పారవశ్యం కావచ్చు. నేను కదిలివచ్చేస్తుంటే-
    "నేను నీకు నచ్చలేదనుకుంటాను. నా గురించి నువ్వు  ఒక్కమాట కూడా అనలేదు!" అన్నాడు.
    నేను గిరుక్కున తిరిగి" మీరు....మీరూ..."అన్నాను.
    అతను చటుక్కున  ముందుకి కదిలి నన్ను దగ్గరగా లాక్కుని బలంగా ముద్దు పెట్టుకున్నాడు.
    నెమ్మదిగా  వదులుతూ "నేను నీకు నచ్చాను.... నీ నాలుక శబ్దం చెయ్యకుండా చెప్పింది!" అన్నాడు.
    నేను సిగ్గుగా అక్కడినుండి వచ్చేశాను.
                                                            *        *        *

 Previous Page Next Page