గుడ్డసంచి విప్పి తెల్లపొడిని మూడు చిన్న పొట్లాలు కట్టి ఎల్లమందకు అందించాడు.
"బిడ్డ పరిస్థితి గడ్డుగానే వుంది!"
ఆచారి మాటలకు ఎల్లమంద నిలువెల్లా వణికి పోయాడు.
"భయపడకు, ప్రతి మూడు గంటలకూ అర ఔన్సు ఆవుపాలలో రంగరించి పోయండి. రాత్రికి గడిస్తే ప్రాణ భయంలేదు. పొద్దున్నే వచ్చి ఎలా వుందో చెప్పు!" అంటూ ఆచార్యులవారు వేగంగా నడిచి వెళ్ళిపోయారు.
ఎల్లమంద రెండు క్షణాలు కొయ్యబారిపోయి నిల్చుండిపోయాడు. తన బిడ్డకు ఈరాత్రి గడవాలా? గడవకపోతే? నిలువునా నీరయిపోయాడు ఎల్లమంద.
ఎల్లమంద బుడ్డిచెంబు తీసుకొని ఊరిమీద పడ్డాడు ఆవుపాలకోసం. ఆవులున్న ఆసాముల ఇళ్ళన్నీ తిరిగాడు పరుగులాంటి నడకతో. కాని ఏం లాభం? ఆవుపాడి గల సిరిగల యిళ్ళల్లో పాలల్లో తోడేసి నిద్రలు పోతున్నారు. అక్కడకూ ఓ దయగల ఆసామి మళ్ళీ దూడను విడిచి చూశాడు. చేతిలోని చెంబు కుడితి తొట్లో పడేట్టు తన్నింది ఆవు.
ఎల్లమంద నిరాశతో ఇంటిముఖం పట్టాడు. మగతలో ఎగిరెగిరి పడుతోన్న పసివాడు కళ్ళల్లో కదిలాడు.
ఒక్కగా నొక్కబిడ్డ! ఎంతోకాలానికి కలిగిన బిడ్డ! తనకు కాకుండా పోతాడా! భార్యపోయిన దుఃఖాన్ని ఆ బిడ్డను చూసుకొనే కదా మర్చిపోగలుగుతున్నాడు!
ఓ గుక్కెడు ఆవుపాలకోసం తన బిడ్డ తనకు కాకుండా పోతాడా! బిడ్డ ప్రాణాలను కాపాట్టానికి గుక్కెడు ఆవుపాలను సంపాదించలేని తను బ్రతికెందుకు?
తండ్రి హృదయం తల్లడిల్లిపోసాగింది.
ఈ రాత్రి ఎలా గడపటం? ఎవరైనా తనకు ఓ ఔన్సు ఆవుపాలిస్తే? వాళ్లకు తన సర్వస్వం ఇస్తాడు! జీవితం అంతా ఊడిగం చెయ్యమన్నా చేస్తాడు! తన ప్రాణాలు కావాలన్నా ఇస్తాడు!
హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యే శబ్దాలూ, సముద్ర ఘోషలూ, రైళ్ళు ఢీ కొనడంలాంటివి అయాక, ఎల్లమంద మెదడులో, ఓ చిన్న ఊహ తళుక్కున మెరిసింది.
అంతే! రేచులా, గాలిలా, సుడిగాలిలా, తారాజువ్వలా, ఆ చీకట్లో చేల కడ్డంపడి, కంచెలుదాటి కంపలుదాటి పరుగులు తీస్తున్నాడు ఎల్లమంద.
గోపాలపురం బందెలదొడ్డి దగ్గరకొచ్చి ఆగాడు రొప్పుతూ. గేటుకు వేసివున్న పెద్ద తాళంకేసి జాలిగా చూశాడు.
నాలుగు గోడలమధ్యా అలజడిగా తిరుగుతోన్న ఎల్లావు కళ్ళబడింది.
ఎల్లమంధకు పోతున్న ప్రాణాలు తిరిగివచ్చినై. ఎల్లావు ఎల్లమంద కళ్ళకు ప్రాణదాతలా కన్పించింది.
చివాలున గోడదూకి దొడ్లోకి వచ్చాడు. బుసలు కొడుతున్న ఎల్లావు గిర్రున తిరిగి ఎల్లమంద రొమ్ములో కొమ్ములు పెట్టింది.
ఎల్లమంద తన రెండు చేతుల్నీ ఎత్తి ఎల్లావు గంగడోలును నిమురుతూ "గోమాతా! నా బిడ్డను కాపాడు!" అని మనసులో ప్రార్ధించాడు.
చల్లగా, మెల్లగా, లాలనగా, పొదుగులోకి చెయ్యి పోనిచ్చాడు.
బిడ్డకోసం తహతహలాడిపోతున్న గోమాత వళ్ళు పులకరించింది. పొదుగులోనుంచి పాల జల్లులు అమృత జల్లులై చిమ్మినై.
పాలభారంతో అలిసి, కదలిపోతున్న ఎల్లావు క్షీరవర్షాన్నే కురిపించింది.
ఎల్లావు తన తలనూ, చెంపల్నూ, చేతుల్నూ, నాకుతోండగా, చెంబు నిండుగా పాలు పిండుకొన్నాడు ఎల్లమంద.
కృతజ్ఞతాభారంతో ఎల్లావును గోముగా నిమిరి పాలచెంబును తీసుకొని ఇంటివైపుకు పరుగుతీశాడు ఎల్లమంద.
ఆవుపాల అనుపానంతో బిడ్డకు రెండుసార్లు మందు పోశాడు. పసివాడి ముఖంలోకి చూస్తూ కూర్చున్న ఎల్లమందకు కళ్ళుతెరిచి బోసినవ్వుల్ని చిలకరించే బిడ్డ కన్పించాడు. ఎల్లమంద హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కింది.
కాని....
ఎల్లమంద చెవులకు, తన గుండెలు నల్లరాతిమీద పడి పగిలిన కుండపెంకుల్లా విన్పించాయ్!
"అంభా! అంభా!" అల్లంతదూరాన లేగదూడ ఆర్తనాదం! అమ్మకోసం __పాలకోసం__ఆకలితో అలమటిస్తున్న లేగదూడ పిలుపులు__బాణాల్లా__శూలాల్లా ఎల్లమంద చెవులకు నాటాయ్!
ఉన్న పాటున లేచి ఎల్లమంద రంగయ్యగారి దొడ్లోకి వచ్చి వాలాడు చావిట్లో కట్టుగొయ్యకు పలుపుచుట్టుకొని- అమ్మకోసం....పాలకోసం అలమటిస్తోన్న లేగదూడను అమాంతంగా భుజాలమీద వేసుకొన్నాడు ఎల్లమంద. భుజాలమీద దూడతో ప్రహరీగోడ దూకి బయటపడ్డాడు.
అర్దరాత్రి! భుజాలమీద బుల్లి బసవడు "అంభా! అమ్మా!" అని అరుస్తోంటే ఎల్లమంద కాళ్ళల్లోకి వెయ్యి లేపాక్షి బసవదేవుళ్ళ బలం తెచ్చుకొని వేగంగా మాగాటిచేల కడ్డంపడి, పంటకాలవ దాటి, గనెం దూకి, శ్రీరామచంద్రుడు విడిచిన బాణంలా వచ్చి గోపాలపురం బందెలదొడ్డిముందు వాలాడు.
గోడ దూకి లేగదూడను తల్లిముందు వదిలాడు. లేగదూడ ఆత్రంగా తల్లి పొదుగులో తలదూర్చింది. ఎల్లమంద సంతృప్తిగా చూశాడు.
ఎల్లావు ఆప్యాయంగా బిడ్డను గోముగా నాకుతూ పాలు కుడుపుతుంటుంటే ఎల్లమంద కళ్ళు చెమ్మగిల్లాయి. మనస్సు చిత్తడినేల అయింది.
తెల్లవారిందాకా, గ్రామాధికారి ఇంటిముందు పడిగాపులు కాచి, ఎల్లమంద ఆవుకూ, దూడకూ చెల్లించవలసిన శుల్కం చెల్లించి తల్లినీ, బిడ్డనూ విడిపించాడు.
దారిలో తన చేను దగ్గర ఆగి, ఓ మోపెడు పిల్లి పెసర మేత కట్టుకుని తలమీద పెట్టుకున్నాడు.
ఎల్లావునూ, లేగదూడనూ రంగయ్యగారి దొడ్లోకి తోలుకొచ్చి గాట్లో పిల్లిపెసరమోపు వేస్తోంటే ఎల్లావు ఎల్లమంద ముంజేతుల్ని నాకింది.
వెళ్ళిపోతున్న ఎల్లమందకేసి మోరచాచి చూసింది.
ఆ గోమాత చూపుల్లో ఎల్లమందకు తన పాలబుగ్గల పసిపాపడు బోసినవ్వుల్ని వెదజల్లుతూ కన్పించాడు.
అప్పటికింకా ఆసామి రంగయ్య నిద్ర లేవలేదు.
(3-4-1970 పొలికేక సచిత్ర వారపత్రిక నుంచి)