శేఖరానికి ఇదంతా మహా చిరాకుగా వుంది. లోపలకు వెళ్ళిపోయాడు.
"అంతకంటే మాకు కావాల్సిందేముంది? శేఖరంలాంటి కుర్రాళ్ళు ముందుకొచ్చి నిలబడితే చాలు. మా సహకారం ఎప్పుడూ వుంటుంది. శేఖరం సర్పంచ్ కావడం మా అదృష్టం!" అన్నాడు రామయ్య ఉత్సాహంగా.
చలమయ్య, వెంకట్రామయ్య, రామలింగం సమర్ధించారు.
మిగిలినవాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
"అబ్బాయి లోపలకు వెళ్ళిపోయాడు. అతనికి ఇష్టం లేనట్టుంది" అన్నాడు రఘురామయ్య.
"ముందే చెప్పాగా వాడికి ఇష్టం లేదని. నేనే గ్రామం మంచికోసం వాడిని బలవంతం చేస్తున్నాను" అన్నాడు పరమేశం జానకిరామయ్య ముఖంలోకి చూస్తూ.
"నువ్వేమంటావ్ జానకిరామయ్యా?" అడిగాడు పరమయ్య.
"ఈ విషయంలో ధర్మయ్యను సంప్రదిస్తే బాగుంటుంది" అన్నాడు జానకిరామయ్య. అతని ధోరణి చూస్తే పరమేశానికి శేఖరాన్ని సర్పంచ్ గా పెట్టడం అతనికి ఇష్టంలేదనిపించింది.
"మీరందరూ అంగీకరిస్తే ధర్మయ్య మాత్రం కాదంటాడా?" అన్నాడు పరమేశం ముందరి కాళ్ళకు బంధం వేస్తూ.
"లేదంటాడని కాదు. ఊరికి పెద్దతల. అందరికీ తల్లో నాలికలాంటి వాడు. తను నమ్మిన ఆదర్శాల కోసం.... దేశసేవ అంటూ జీవితాన్నంతా ప్రజల క్షేమంకోసం గడిపినవాడు. అందుకే ధర్మయ్యను సంప్రతించడం మంచిది" అన్నాడు జానకిరామయ్య.
దాదాపు అందరూ జానకిరామయ్య అభిప్రాయాన్ని బలపరిచారు.
"దానికేం? ధర్మయ్యను కూడా అడిగి చూద్దాం. నేనైనా, మీరైనా, ధర్మయ్య అయినా కోరేది గ్రామ క్షేమమేగా? ధర్మయ్య కాదనడనే నమ్మకం నాకుంది. అలాగే కానిద్దాం. ఈ విషయం ధర్మయ్య చెవులో కూడా వేద్దాం" అన్నాడు పరమేశం.
"ఉరేయ్ రాముడూ! జానకిరామయ్యగారికి మరికొంచెం ఉప్మా వడ్డించు" అన్నాడు పరమేశం.
"వద్దండీ! ఆఁ ఆఁ చాలు! చాలు!" ఉప్మా పెడుతున్న రాముడ్ని వారించాడు జానకిరామయ్య.
"చూస్తావేంరా మొద్దూ! వడ్డించు. కొంచెం తీసుకోండి" పరమేశం బలవంతంగా జానకిరామయ్య చేత మరికొంచెం ఉప్మా తినిపించాడు.
కాఫీలు పూర్తిచేసి అందరూ పరమేశం దగ్గర శెలవు తీసుకొని వెళ్ళిపోయారు.
పరమేశం సంతృప్తిగా నవ్వుకున్నాడు_ తన పాచిక అతి తేలిగ్గా పారినందుకు.
"ఏమిటి మామయ్యా ఇదంతా?" విసురుగా లోపలినుంచి వచ్చిన శేఖరం ప్రశ్నించాడు.
పరమేశం సమాధానంగా ఓ చిరునవ్వు విసిరాడు.
"పొలాలు చూద్దాం రమ్మని తీసుకొచ్చావ్? ఇప్పుడేమో సర్పంచ్ గా నిల్చోబెట్టే ప్రయత్నాలు చేస్తున్నావ్! నాకు ఈ గొడవల్లో తలదూర్చడం ఇష్టంలేదు. పైగా నేను యీ గ్రామంలో స్థిరపడిపోతానని వాళ్ళకు చెప్పావ్?"
"ఎలక్షన్స్ ముందుచేసే వాగ్దానాలకు అంత పట్టింపులేదోయ్! ఆ విషయం వోటు అడిగేవాళ్ళకంటే, వోటు వేసే వాళ్ళకే బాగా తెలుసు. సర్పంచ్ గా ఎన్నికయ్యాక ఇక్కడే వుండాలని లేదు. అప్పుడప్పుడు కన్పిస్తూ వుంటే చాలు."
"అన్యాయం! దారుణం!"
"అన్యాయం లేదు గాడిదగుడ్డూ లేదు. నువ్వూరుకో, యీ రోజుల్లో డబ్బు వుంటేనే చాలదు. దానికి తోడు కాస్తో కూస్తో పవర్....అధికారం కూడా వుండాలి. అది లేకపోతే మన ముఖం చూసే వాళ్ళుండరు."
"ఈ మురికి రాజకీయాలు నాకు అక్కర్లేదు" కోపంగా అన్నాడు శేఖరం.
పరమేశం గంభీరంగా నవ్వాడు "అదేరా బాబూ? అందుకే నీలాంటివాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటున్నాను. ఆ మురికిని వదిలించాలంటున్నాను. అసలు యీ ఊరు విషయమే తీసుకో. వెనకబడిన జాతుల వాళ్ళంటూ అ ధర్మయ్య పదేళ్ళుగా రంగణ్ని సర్పంచ్ గా నిలబెడుతున్నాడు. ప్రయోజనం? సమితి మీటింగులకు వస్తాడు. నోరు తెరవడం రాదు. అంత తెరిచినా అగ్రవర్ణాల వాళ్లు మూయిస్తారు. అటువంటివాళ్లు గ్రామ అభివృద్ధికోసం ఏం చెయ్యగలరు? కనీసం మెయిన్ రోడ్డు నుండి ఊళ్ళోకి మట్టిరోడ్డు కూడా వేయించలేక పోయాడు. మన సంగతే చూడు. కరు రోడ్డుమీద ఆపి, రెండుమైళ్ళు చేలకు అడ్డంపడి నడిచొచ్చాం? నీలాంటి కుర్రాళ్ళు ముందుకు రావాలి. అప్పుడే గ్రామాలు బాగుపడతాయి. ఎంత డబ్బు వుండి ఏం ప్రయోజనం? మీ అమ్మ ప్రసవించి చచ్చిపోయింది. సమయానికి వైద్యసహాయం అందలేదు. అది వర్షాకాలం. బండికూడా పోయే మార్గంలేదు. అర్దరాత్రి పూట ఆమెను పట్నం తీసుకెళ్ళటానికిగానీ, వెంటనే డాక్టర్ని తీసుకురావడానికి కానీ వీలులేక పోయింది. నువ్వు ఎలక్షన్ కు నిలబడి తీరాలి. ఈ గ్రామాన్ని చుట్టుపట్ల గ్రామాలకు ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలి. ఆ బాధ్యత నీమీద వుంది" అన్నాడు పరమేశం.
"సరే! నీ ఇష్టం? నాకు మాత్రం యీ రాజకీయాల్లో తలదూర్చడం బొత్తిగా ఇష్టంలేదు" అంటూ శేఖర్ లేచి లోపలకు వెళ్ళిపోయాడు.
శేఖర్ వెళ్ళినవైపే చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు పరమేశం.
5
ధర్మయ్య వసారాలో చిరుచాపమీద వ్యాసపీఠం ముందు కూర్చుని వున్నాడు.
వ్యాసపీఠంలో భాగవతం తెరిచిపెట్టి వుంది. భుజాలు నిండుగా ఖద్దరు అత్తా కోడలంచు ఉత్తరీయం కప్పుకొని కూర్చున్నాడు.
కొంచెం దూరంలో, ఒకపక్కగా, సరస్వతమ్మ రాట్నం వడుకుతూ కూర్చుని వుంది.
ధర్మయ్య భాగవత పద్యాలు రాగయుక్తంగా చదువుతూ భార్యకు అర్ధం చెబుతున్నాడు.
సరస్వతమ్మ శ్రద్ధగా వింటూనే, యాంత్రికంగా రాట్నం వడుకుతోంది.
"సిరికిన్ చెప్పడు శంఖు చక్ర యుగమున్
చేదోయి సంధింపడు...."
ధర్మయ్య కంఠం అకస్మాత్తుగా ఆగిపోయింది. రాట్నం చక్రం తిప్పుతున్న సరస్వతమ్మ ఆగిపోయింది.
ఆమె భర్త కేసి చూసింది.
ధర్మయ్య వీధివాకిలికేసి చూస్తున్నాడు సంభ్రమాశ్చర్యాలతో.
శేఖరం, పరమేశం, జానకిరామయ్యా, మరో ముగ్గురు ఊళ్ళో పెద్దలు వీధి గుమ్మందాటి లోపలికి వస్తూ కన్పించారు.
ధర్మయ్య భాగవతం మడిచి లేచి "రండి! రండి!" అంటూ రెండు అడుగులు ముందుకువేసి ఆహ్వానించాడు అందర్నీ.
సరస్వతమ్మ వడుకుతున్న ఏకు కుదురుకు చుట్టి రాట్నం ముందు నుంచి లేచి లోపలికి వెళ్ళింది.
"రా! పరమేశం! ఏమిటి విశేషం ఇలా వచ్చావ్? ఆ కుర్రవాడు రావుసాహెబ్ కొడుకు కదూ?" అన్నాడు ధర్మయ్య, ముఖంలోకి చూస్తూ.
"అవును. పట్నంలో చదువుతున్నాడు" అన్నాడు జానకిరామయ్య.
"కూర్చోండి!" వసారాలో గోడకు నిలబెట్టివున్న నులకమంచం వాల్చి అన్నాడు ధర్మయ్య.
వినయంగా నమస్కరించిన శేఖరాన్ని "నూరేళ్ళు వర్ధిల్లు బాబూ" అని దీవించాడు.
ధర్మయ్య కంఠంలోని ఆర్ద్రతకు ముగ్ధుడై పోయాడు శేఖరం.
"ఎప్పుడో ఇంతప్పుడు చూశాను. తల్లిదండ్రులు పోయాక ఈ ఊరు రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను" అన్నాడు ధర్మయ్య శేఖరం ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ.
"అవునండీ!" గౌరవం ఉట్టిపడే స్వరంతో సమాధానం ఇచ్చాడు శేఖరం.
"ఏం చదువుతున్నావు బాబూ?"
"చదువు అయిపోయింది. ఎం.ఏ. పాసయ్యాడు. ఫస్టు క్లాసులో పాసయ్యాడు" అన్నాడు పరమేశం గర్వంగా మేనల్లుడికేసి చూసుకుంటూ.
"చాలా సంతోషంగా వుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావా బాబూ?" ధర్మయ్య శేఖరాన్ని ప్రశ్నించాడు.
"లేదండీ!" అని మామగారి వైపు చూశాడు శేఖరం.
"మా వాడికి ఉద్యోగం చెయ్యాలని లేదు. ఈ ఊళ్ళోనే వ్యవసాయం చూసుకుంటూ వుండిపోతా నంటున్నాడు. అందుకే వాణ్ణి వెంట బెట్టుకొని ఇక్కడకు వచ్చాను. మీలాంటి పెద్దలందరికీ పరిచయం చేద్దామని తీసుకొచ్చాను" పరమేశం తను చెప్పదల్చుకున్నదానికి ఉపోద్ఘాతంగా అని ధర్మయ్య ముఖంలోకి చూశాడు.
ధర్మయ్య అలిసిపోయినట్టు కన్పించే కళ్ళలో కాంతిరేఖ కదిలింది.
"ఎంత మంచి వార్త విన్నాను యీరోజు! చదువుకున్న కుర్రవాళ్ళ చూపు ఎప్పుడూ పట్నాలకేసే వుంటుంది. శేఖరం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా వుంది. శేఖరం లాంటి కుర్రాళ్ళే, యీనాటి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలబడాలి" ధర్మయ్య ప్రశంసాపూర్వకంగా అన్నాడు.