Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 5


    ఆ మాటలు కేవలం పరమేశాన్ని ఉబ్బేయటానికి అన్నవేనని అక్కడ కూర్చున్నవారిలో చాలామందికి అనిపించకపోలేదు.

 

    "అవునవును! నాకు అట్లాగే అనిపిస్తోంది. శేఖర్ బాబును చూస్తుంటే రావుసాహెబ్ గార్ని చూస్తున్నట్లే వుంది. ముమ్మూర్తులా శేఖర్ తండ్రి పోలికే" అన్నాడు, ఆడపిల్లలు గల షావుకారు రామయ్య శేఖరం వైపు, అద్దాలలోనుంచి కన్పిస్తున్న బెల్లపులడ్ల పళ్లెంకేసి చూస్తున్న పిల్లవాడిలా చూస్తూ.

 

    "ఆ మాట నేను ముందే అనుకున్నాను. కాకపోతే రావుసాహెబ్ గారికి మీసాలు వున్నాయి.... ....శేఖరానికి లేవు. ఆ హుందాతనం.... ....ఆ గాంభీర్యం...."

 

    "ఇంతకాలానికి శేఖరం ఈ గడ్డమీద కాలుపెట్టాడు. మాకెంతో సంతోషంగా వుంది. కుర్రవాడు బుద్ధిమంతుడని కూడా విన్నాను" అన్నాడు చలమయ్య.

 

    "మా మేనల్లుడని చెప్పటంకాదు, కాని మా శేఖరం చాలా తెలివైనవాడూ, బుద్ధిమంతుడూను. పెద్దచదువులు చదివాడు. బోలెడంత ఆస్తికి వారసుడు. అయినా గర్వం అంటే ఏమిటో వాడికి తెలియదు. అహంకారం లేదు. బీడా బిక్కీ అంటే తగని జాలి" అన్నాడు పరమేశం శేఖరంవైపు ఆప్యాయంగా చూస్తూ.

 

    ఆ సంభాషణ వింటూ శేఖరం ఇబ్బందిగా కదిలాడు.

 

    మనిషిని ఎదురుగా కూర్చోబెట్టి అలా అందరూ ప్రశంసించడం శేఖరానికి అదోలా అన్పించింది. ఆ పొగడ్తల్లో నిజాయితీ చాలా తక్కువగా తోచింది.

 

    "నాన్నగారి గుణాలే వచ్చాయన్నమాట. రావుసాహెబ్ గారిది మహా దొడ్డ గుణం. బీదసాదలంటే ఎంతో ఆదరణ చూసేవారు. సంక్రాంతికి ఏటా పుట్టిధాన్యం దానం చేసేవాడు" అన్నాడు వెంకట్రామయ్య, రావు సాహెబ్ గారి తైలవర్ణ చిత్రంకేసి చూస్తూ.

 

    శేఖరం అక్కడినుంచి లేచాడు. తల్లి ఫోటో దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.

 

    "మా అక్కయ్య సాక్షాత్తు అన్నపూర్ణ. ఆ చేతికి ఎముక ఉండేది కాదు. మా శేఖరం చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యాడు" అన్నాడు పరమేశం కంఠంలోనికి బాధను తెచ్చిపెట్టుకొని.

 

    "తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయినా చెట్టంత మేనమామ మీరు వుండబట్టి, శేఖరానికి ఎటువంటి లోటులేకుండా పెంచారు" అన్నాడు రామయ్య పరమేశాన్ని ఉబకేస్తూ.

 

    "శేఖరాన్ని ఏనాడూ మేనల్లుడుగా భావించలేదు. కొడుకులాగే పెంచాను. నాకు మాత్రం ఏ పదిమంది వున్నారు కనుక? ఒక్క కూతురేగా? ఇద్దర్నీ సమానంగా రెండు కళ్ళలా చూసుకుంటున్నాను" అన్నాడు పరమేశం.

 

    ఒరేయ్ రాముడూ! ఫలహారాలు తీసుకురారా!" లోపలకు కేక పెట్టాడు పరమేశం.

 

    రాముడు ఉప్మాప్లేట్లూ, స్వీట్సూ, పండ్లూ తెచ్చి అందరి ముందూ పెట్టాడు.

 

    "రా శేఖరం! వీళ్ళందరూ నిన్ను చూట్టానికే వచ్చారు. అందరితో పరిచయం చేసుకో" అన్నాడు పరమేశం.

 

    శేఖరం యాంత్రికంగా వచ్చి పరమేశం పక్కగా కూర్చున్నాడు.

 

    మామగారి ధోరణి శేఖరానికి అర్ధంకావడం లేదు. కేవలం ఇల్లూ వాకిలి, పొలం పుట్రా చూసుకోడానికే తనను ఆ ఊరు తీసుకువచ్చాడనుకోవడానికి బుద్ధిపుట్టటంలేదు. పరమేశం కాలాంతకుడనీ, ఏ పనీ ప్రయోజన రహితంగా చెయ్యడనీ శేఖరానికి తెలుసు. ఇంతమందిని పిలిపించి, ఆతిధ్యం ఇచ్చి, తియ్యగా మాట్లాడుతున్నాడంటే ఏదో పెద్ద స్వార్ధమే వుండివుండాలనుకున్నాడు శేఖరం. మౌనంగా ఫలహారం చేస్తూ కూర్చున్నాడు.

 

    "తీసుకోండి!" అన్నాడు పరమేశం అందర్నీ ఉద్దేశించి, తన ప్లేటు చేతిలోకి తీసుకుంటూ.

 

    "అబ్బాయి చదువు పూర్తయినట్టేనా? ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా?" స్పూన్ తో ఉప్మా తీసి నోట్లో పెట్టుకోబోతూ ప్రశ్నించాడు జానకిరామయ్య.

 

    "ఎం. ఏ. పూర్తి చేశాడు. యూనివర్శిటీ ఫస్ట్ వచ్చాడు. వాడికి ఉద్యోగం చెయ్యడం ఇష్టంలేదు. అయినా వాడికి ఒకరి మోచేతి నీళ్ళు తాగాల్సిన గతి ఎందుకు? వాడికిందే వందలమంది బతుకుతుంటేను? అందుకే అటు పట్నంలోవున్న మిల్లు వ్యవహారం, ఇటు ఈ ఊళ్ళోవున్న పొలం పుట్రా చూసుకుంటూ, గ్రామంలో వుండమంటున్నాను. ఇంతకాలం ఈ బాధ్యతలన్నీ నేనే మోశాను. వాడు పెద్దవాడయ్యాడు. ప్రయోజకుడైనాడు. వాడి ఆస్తిపాస్తులు వాడికి అప్పగించేసి నేను బరువు దించుకుంటాను" అన్నాడు పరమేశం.

 

    "అయితే ఇకనుంచి అబ్బాయి ఈ ఊళ్ళోనే వుండిపోతాడా?" పిల్లని ఇస్తే బాగుణ్ణు అని ఇంతసేపూ ఆలోచిస్తున్న రామయ్య సంతోషంగా అడిగాడు.

 

    "అవునయ్యా! మా శేఖరానికి పల్లెటూళ్ళన్నా, పల్లె ప్రజలన్నా ఎక్కడలేని అభిమానం. మన దేశం బాగుపడాలంటే, పల్లెటూళ్ళు ముందు బాగుపడాలని అంటూ వుంటాడు. ఈ ఊళ్ళో స్థిరపడి పట్నం వస్తూ పోతూ వుంటాడు. అక్కడ మిల్లు వ్యవహారం కూడా చూసుకోవాలిగా? ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలని మా శేఖరం అభిలాష."

 

    శేఖరం చివ్వున తలెత్తి, ఆశ్చర్యంగా మామగారి ముఖంలోకి చూశాడు.

 

    "ఎంత చల్లని కబురు చెప్పావయ్యా శేఖరం! ఈ ఊళ్ళో వుంటే మా అందరికీ పెద్ద అండ. ఈరోజుల్లో చదువుకున్న కుర్రాళ్ళంతా పట్నాలకు ఎగబాకుతున్నారు. అందుకే పల్లెటూళ్ళన్నీ కళాకాంతులు లేకుండా, పాడుపడిపోయిన గుళ్ళలాగ తయారౌతున్నాయ్. శేఖరం లాంటి కుర్రాళ్ళు యువకుల దృష్టిని పట్నాలనుంచి పల్లెలవైపు మరలించాలి" అన్నాడు జానకిరామయ్య.

 

    నలుగురూ వంతపాడారు.

 

    శేఖరం తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు మౌనంగా ఫలహారం చేస్తున్నాడు. మామగారు రచించబోయే పద్మవ్యూహం గురించి ఆలోచిస్తున్నాడు.

 

    అభిమన్యుడు ఎవరు? తననే చివరకు ఆ పద్మవ్యూహంలో ఇరికించడు గదా?

 

    "అవును! మీరంతా సంతోషిస్తారని నాకు తెలుసు. మా శేఖరాన్ని రెండు చేతులూ చాచి మీరంతా ఆప్యాయంగా ఆహ్వానిస్తారని తెలుసు. వాణ్ణి మీ అందరికీ పరిచయం చెయ్యాలనే ఈరోజు తీసుకొచ్చాను. వాడు 'మామయ్యా! నాకు ఉద్యోగం చెయ్యాలని లేదు. ప్రజాసేవ చెయ్యాలని వుంది. గ్రామ రాజకీయాలు నానాటికి కలుషితం అయిపోతున్నాయి. ముఠా రాజకీయాలతో గ్రామాలు నాశనం అవుతున్నాయి. నాకు మా ఊరు వెళ్ళి, ఆ ఊరి అభివృద్ధికి తోడ్పడాలనీ, దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనీ వుంది' అని అన్నాడు. నేను వెంటనే ఒప్పుకున్నాను."

 

    శేఖరం కళ్ళు పెద్దవి చేసుకొని మామగారి వైపుచూస్తూ వుండిపోయాడు. ఏదో అనబోయి, మామగారు చూపులతో వారించడంతో ఆగిపోయాడు.

 

    "నిజమే! శేఖరం లాంటి కుర్రాళ్ళు గ్రామాలలో వుండిపోవాలి. అప్పుడే గ్రామాలు బాగుపడతాయి" అన్నాడు చలమయ్య.

 

    "అవును చలమయ్యా! గ్రామాలు రోజురోజుకూ చెడిపోతున్నాయి. పంచాయితీలు, సమితులు, జిల్లా పరిషత్తులు పేరుచెప్పి ప్రతి గ్రామం ముఠా రాజకీయాలతో కలుషితం అయిపోయింది. ప్రతివాడికీ అధికారం కావాలి. అర్ధబలం, కండబలం కలిగిన కొందరు అధికారాన్ని చేజిక్కించుకొని స్థానిక అధికారులతో లాలూచీపడి తిరుగులేని నియంతలగా తయారౌతున్నారు. అక్కడ వీరిమాటకు తిరుగులేదు. మొత్తం గ్రామాన్ని, వీలైతే 'చుట్టు పట్ల గ్రామాలను కూడా తమ గుప్పెట్లో బిగించి, ఆడింది ఆటగా పాడింది పాటగా చలామణి అవుతున్నారు. వేరిని ఎదిరించి ఎవరూ బతకలేరు. తిరగబడినవాళ్ళ ఉద్యోగాలు పీకిస్తారు, ట్రాన్సఫర్లు చేయిస్తారు. చెట్లకు కట్టి కాల్చి చంపుతారు. గ్రామ రాజకీయాలు బాగుపడాలంటే శేఖరంలాంటి చదువుకున్న యువకులు, అన్యాయానికి ఎదురు నిలబడగలవాళ్ళు గ్రామాల్లో నివసించాలి. అప్పుడే గ్రామ రాజకీయాలు బాగుపడతాయి" అన్నాడు జానకిరామయ్య ఆవేశంగా.

 

    "అవును! మీరు చెప్పేది అక్షరాలా నిజం. ఏ పేపర్లో చూచినా ఫలానా గ్రామంలో హరిజనుణ్ని చెట్టుకుకట్టి చంపారనో....ఫలానా పల్లెలో రెండు పార్టీలుగా చీలి శ్రామికులు ఒకరిళ్ళను ఒకరు తగల బెట్టుకున్నారనో.... ఫలానా గూడెంలో రాజకీయ కక్షలతో హత్యలు జరిగాయనో.... వార్తలు కన్పిస్తూ వుంటాయి. ఈ పంచాయితీలు వచ్చాక గ్రామ వాతావరణం బొత్తిగా పాడయిపోయింది. మనిషికీ మనిషికీ మధ్య కక్షలు పెరిగిపోతున్నాయి. చదువుకున్న కుర్రవాళ్ళు ముందుకురావాలి. యువ రక్తం అధికారాన్ని చేపట్టాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది" రెండుసార్లు సర్పంచ్ కావడానికి ప్రయత్నించి వోడిపోయిన రామలింగం అన్నాడు ఉద్రేకంగా.

 

    శేఖర్ రామలింగం ముఖంలోకి చూచాడు. ఆ ముఖంలో.... ....ఆ కళ్ళలో....నిజాయితీ కన్పించింది.

 

    "అందుకే కదయ్యా శేఖరం ఈ ఊళ్ళో స్థిరపడి పోతానంటే వెంటనే అంగీకరించాను. నాకు అల్లుడైనా, కొడుకైనా వాడే. శేఖరం లాంటి కుర్రాళ్ళు పల్లెటూళ్ళలో స్థిరపడతామంటే అంతకంటే మనకు కావాల్సిందేముంది? అందుకే వచ్చే ఎలక్షన్స్ లో శేఖరాన్ని ఈ గ్రామానికి సర్పంచ్ గా నిలబెట్టాలని నా కోరిక" అని ఏదో అనబోతున్న శేఖరాన్ని కళ్ళతోనే ఆపి మళ్ళీ అన్నాడు పరంమేశం.

 

    "ఈ ఊరంటే నాకు ఎంతో అభిమానం. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది మా అక్కయ్య ఆత్మకు సంతృప్తి కలిగించాలని నా చిరకాల వాంఛ! శేఖరానికి ఇలాంటి పదవులన్నా, అధికారం అన్నా అసహ్యం. కాని నేనే వాణ్ణి బలవంతంచేసి ఒప్పించాను. చివరికి ఊరు బాగుకోసం అంగీకరించాడు. మీ అందరి సహకారం, అంగీకారం వుంటేనే వాడు సర్పంచ్ గా నిలుస్తాడు" అంటూ అందరి ముఖాలలోకి మార్చిమార్చి చూశాడు పరమేశం.

 Previous Page Next Page