Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 7


    శేఖరానికి అక్కడ కూర్చోవాలంటే ఇబ్బందిగా వుంది. ధర్మయ్యగారు తనను గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు. తన మామ అసలు విషయం బయట పెట్టగానే ఏమనుకుంటారు? కేవలం తను గ్రామంలో వుండటానికి కారణం సర్పంచ్ గా స్థానం సంపాదించుకోవటానికే అనుకోరూ? ధర్మయ్యలాంటి వ్యక్తిముందు కూడా లౌక్యం ఉపయోగించి మాట్లాడ్డానికి మామయ్యకు ఎలా బిడియంగా లేదో? తన కసలు యీ గొడవలు వద్దూ అన్నా మామయ్య వినిపించుకోవడం లేదు.  

 

    "ఇదిగో! నిన్నే! ఏమిటి ఆలస్యం?" ధర్మయ్య లోపలకు చూస్తూ భార్యను కేకవేశాడు.

 

    శేఖరం ఆలోచనల నుంచి బయటపడ్డాడు.

 

    "ధర్మయ్యగారూ! మీరా ఏర్పాటేమీ చెయ్యొద్దు. ఇప్పుడే అందరం కాఫీ టిఫెన్లు తీసుకొని వస్తున్నాం" అన్నాడు పరమేశం.

 

    "ఫర్వాలేదు. రాకరాక వచ్చారు" అన్నాడు ధర్మయ్య. పరమేశం గొంతు సవరించుకొని అన్నాడు.

 

    "ధర్మయ్యగారూ! మీకు రాజకీయ బాధితుడిగా ఎంత పొలం వచ్చింది? మంచిదే వచ్చిందా? గొడవలు ఏమీ లేవుగదా?' "ఏమయినా గొడవలుంటే చెప్పండి నేను సరిచేస్తాను" అన్నట్టుంది పరమేశం కంఠం.

 

    ఆ మాటలకు శేఖరం ముఖం చిట్లించుకున్నాడు.

 

    ధర్మయ్య సమాధానంగా చిన్నగా, సన్నగా నవ్వాడు. పల్చబడి తెల్లబడిపోతున్న ధర్మయ్య మీసాలు, కొంచెంసేపు అలాఅలా కదిలి ఆగిపోయాయి.

 

    ధర్మయ్య నవ్వు శేఖరానికి ఎందరో మహా పురుషుల్ని జ్ఞాపకం చేసింది.

 

    "అయ్యో మా ధర్మయ్యకు ఆ మాత్రం బ్రతుకుతెరుచు తెలిస్తే ఇంక లేంది ఏముంది? అసలు అప్లికేషన్ పెడితేగదా పొలం రావటానికి?" అన్నాడు జానకిరామయ్య బాధగా.

 

    "అరే! అదేమిటి? ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదు. మీరు ఇవ్వాళే అప్లికేషన్ రాసి నాకివ్వండి. వారం తిరక్కుండా, మీ గ్రామ కంఠం బంజర్లో, మీకు రావాల్సిన చోటు ఇప్పిస్తాను. ఆ మంత్రిగారు మన చేతికింద వాడేలెండి. మనల్ని కాదనలేడు" అన్నాడు పరమేశం.

 

    శేఖరం అక్కడనుంచి లేచి వెళ్ళిపోతే బాగుణ్ణు అనుకున్నాడు. మామగారి మీద కోపం వస్తున్నది.

 

    పరమేశం మాటలకు ధర్మయ్య సమాధానం ఇవ్వలేదు. కాని ప్రశాంతంగా కన్పించే ఆయన కళ్ళల్లో ఏదో బాధ కదలటం చూశాడు శేఖరం.

 

    "అయ్యో రామ! మా ధర్మయ్య చేత అప్లికేషన్ పెట్టించటం మీ రనుకున్నంత తేలికకాదు. సాక్షాత్తు ఆ గాంధీ మహాత్ముడే వచ్చి చెప్పినా ఒప్పుకోడు. దేశం దేశం అంటూ ఉన్నదంతా తగలేశాడు. ఒక్కగానొక్క బిడ్డ. అదీ ఆడపిల్ల. ఆ పిల్లను బస్తీకి పంపి చదివించటానికి డబ్బు లేదు. నిన్నగాక మొన్న ఉన్న రెండెకరాలూ అమ్మేశాడు."

 

    "జానకిరామయ్యా!" ధర్మయ్య కంఠం కంచులా మోగింది.

 

    జానకిరామయ్య ఇంకా ఏదో అనబోతూ ఆగిపోయాడు. "ఇదీ ధర్మయ్య వరస!" అన్నట్టు పరమేశం ముఖంలోకి చూశాడు.

 

    "క్షమించండి! మా జానకిరామయ్యకు నా మీద అంతులేని అభిమానం. అందుకే అప్పుడప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ వుంటాడు. నేను నేలమీద మనిషినే, చెప్పుకోతగ్గ గొప్ప పనులేమీ చెయ్యలేదు. నేను దేశం కోసం చేసింది ఎంత? మహాత్ముని పిలుపు నందుకొని కోట్ల కొద్ది యువకులు స్వాతంత్ర్య సమరంలోకి ఉరికారు. ఎందరో తమ ప్రాణాల్ని కోల్పోయారు" ధర్మయ్య కంఠం రుద్ధమైంది.

 

    మళ్ళీ గొంతుక పెగుల్చుకు అన్నాడు. "నేను ఉడతా భక్తిగా ఏదో చేతనయింది చేశాను. ఆనాడు మేమెవరం, స్వాతంత్ర్యం వచ్చాక, ప్రభుత్వం చేత సత్కరింపబడతామని గానీ, భవిష్యత్తులో రాజకీయ బాధితులుగా గుర్తించబడి, పొలాలు సంపాదించుకుంటామని గానీ భావించి ఇంగ్లీషు ప్రభువులచేత లాఠీదెబ్బలు తినలేదు! జైళ్ళకు వెళ్ళలేదు. అది మా బాధ్యతగా భావించి చేశాం. ఈనాడు రాజకీయ బాధితులుగా గుర్తించబడ్డ మాలాంటి కొద్దిమంది ప్రయత్నంవల్ల ఈ స్వాతంత్ర్యం లభించలేదు. కోట్లాది ప్రజలు తిరుగుబాటు చేశారు. రక్తపుటేరులు ప్రవహించాయి. ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఆ మహా యజ్ఞంలో నా పాత్ర ఏపాటిది? ఈనాడు రాజకీయ బాధితుడిగా ఆస్థి సంపాదించుకోటానికి?"

 

    ధర్మయ్య మాటల్ని శేఖరం మంత్రముగ్ధుడిలా వింటూ కూర్చున్నాడు.

 

    శేఖరం దృష్టిలో ధర్మయ్య వ్యక్తిత్వం ఎంతో ఎత్తున పెరిగింది.

 

    సరస్వతమ్మ ఇత్తడి క్లాసుల్లో కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చింది.

 

    "ఇదయ్యా మా ధర్మయ్య వరస!" అన్నాడు కాఫీ గ్లాసు అందుకుంటూ జానకిరామయ్య.

 

    "అవునవును. ధర్మయ్య త్యాగమూర్తి. అందుకే గదయ్యా! ప్రప్రధమంగా వారి ఆశీర్వాదాన్ని పొందాలని శేఖరాన్ని ఇక్కడకు తీసుకొచ్చాను" అన్నాడు పరమేశం.

 

    ధర్మయ్య ముందు అబద్ధాలాడటానికి కూడా మామయ్యకు జంకులేదు. ప్రప్రధమంగా తనను మామయ్య తీసుకొచ్చాడా? జానకిరామయ్య ధర్మయ్యను సంప్రదించాలంటే గదూ తీసుకొచ్చాడు? శేఖరానికి మామ మీద ఏవగింపు కలిగింది.

 

    "పరమేశం మేనల్లుడ్ని సర్పంచ్ గా నిలబెట్టాలనే ప్రయత్నంలో వున్నాడు" ధర్మయ్యకేసి కళ్ళుతిప్పి అన్నాడు జానకిరామయ్య.

 

    శేఖరానికి తలకొట్టేసి నట్టనిపించింది. చిన్నగా అక్కడినుంచి వెళ్ళాడు. గోడలకు తగిలించివున్న ఫోటోలను చూస్తూ నిలబడ్డాడు.

 

    అవి సత్యాగ్రహం రోజులనాటి ఫోటోలు. ధర్మయ్య యువకుడు. ధర్మయ్య పోలీసులమధ్య నిల్చున్న ఫోటో....జైలునుంచి బయటకు వస్తున్న ధర్మయ్యకు జనం పూలమాలలతో స్వాగతం చెబుతున్న ఫొటో. ధర్మయ్యనూ, అతని భార్యను మధ్యలో పెట్టుకొని జనం తీయించుకున్న ఫొటో....ఇలా ఎన్నో ఫొటోలు వున్నాయి.

 

    ఎంత నిరాడంబరజీవి? ధర్మయ్య లాంటి వారు ఎందరో త్యాగం చెయ్యగా లభించిన ఈ స్వాతంత్ర్యాన్ని ఈనాడు కొందరు స్వార్ధపరులు మాత్రమే అనుభవిస్తున్నారు. ధర్మయ్యలాంటి వ్యక్తి, ఇంకా మిగిలివున్న ఈ గ్రామంలో తను సర్పంచ్ గా నిలబడటమా? దేశం కోసం త్యాగంచేసి వున్నదంతా పోగొట్టుకొని ధర్మయ్యలాంటి వాళ్లు ఎంతమంది తిండికి కూడా లేకుండా ఇంకా మారుమూలల గ్రామాల్లో వున్నారో ఎవరికి తెలుసు? వారిని తల్చేవాళ్లెవరు? తన మామలాంటి వాళ్లు పదవులకోసం పాకులాడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలయిందో సరిగ్గా తెలియనివాళ్లూ, స్వాతంత్ర్యం వచ్చాక పుట్టిన తనలాంటి వాళ్లూ, అధికారం కోసం తినివిసిరేసిన విస్తరికోసం చుట్టూ మూగే కుక్కల్లా కాట్లాడు కుంటున్నారు.  

 

    అలా ఆలోచనల్లో మునిగివున్న శేఖరం కేసి ఓ క్షణం దీక్షగా చూసి

 

    "బాబూ! శేఖరం ఇలారా!" ఆదరంగా పిల్చాడు ధర్మయ్య.

 

    ధర్మయ్య దగ్గరకు వచ్చి వినయంగా నిల్చున్న శేఖరం చేతులు పట్టుకున్నాడు.

 

    "నాయనా శేఖరం! గ్రామ సౌభాగ్యం కోసం పాటుపడేవాళ్లకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది బాబూ!" అన్నాడు ధర్మయ్య.

 

    ధర్మయ్య పలికిన ప్రతి అక్షరంలో నిజాయితీ స్పురించింది శేఖరానికి.

 

    పరమేశం ఉబ్బిపోయాడు ఆనందంతో.

 

    "నువ్వు ఇలాగే అంటావని నాకు తెలుసు ధర్మయ్యా! శేఖరం లాంటి కుర్రాళ్ళకు మీలాంటి వాళ్ళ అండ దొరికితే గ్రామ సౌభాగ్యంకోసం ఎన్ని పనులైనా సాధిస్తాడు" అన్నాడు పరమేశం ఉత్సాహంగా.

 

    పరమేశం మాటల్లో నిజాయితీ కన్పించలేదు శేఖరానికి.

 

    "కాని....మీరు ఎవర్నో నిలబెట్టారని తెలిసింది. అతనికి పోటీగా నేను నిలబడదల్చుకోలేదు" ఖచ్చితంగా అన్నాడు శేఖరం.

 

    పరమేశం మాటల్లో నిజాయితీ కన్పించలేదు శేఖరానికి.

 

    "కాని....మీరు ఎవర్నో నిలబెట్టారని తెలిసింది. అతనికి పోటీగా నేను నిలబడదల్చుకోలేదు" ఖచ్చితంగా అన్నాడు శేఖరం.

 

    పరమేశం శేఖరం ముఖంలోకి కోపంగా చూశాడు.

 

    "ఇంత తెలివితక్కువ దద్దమ్మ వేమిటిరా?" అన్నట్టుంది పరమేశం చూపు.

 

    "నువ్వు నిలబడితే, నీకు పోటీగా మరొకర్ని బలపరుస్తానా బాబూ? అది ఒక్కనాటికీ జరగదు" అన్నాడు ధర్మయ్య.

 

    "మీరు ఎవర్నో బలహీనవర్గంలోని వ్యక్తిని ఇంతకాలం బలపరుస్తూ వచ్చారని విన్నాను. మీరు బలపర్చారంటే అతను చాలా యోగ్యుడై వుండాలి. ఈ రాజకీయాలు నాకు బొత్తిగా తెలియవు. కాలేజీనుంచి నిన్న మొన్న బయటికి వచ్చినవాణ్ణి. నాకు ఆ అర్హత లేదు" అన్నాడు శేఖరం వినయంగా.

 

    "అదేం మాట బాబూ! నీకు ఆ అర్హత వున్నదనుకుంటున్నాను కనుకే నిన్ను బలపరుస్తా నంటున్నాను. గత పదేళ్ళుగా నేను యోగ్యుడనుకున్న వ్యక్తిని....సమాజంలో అట్టడుగున వున్న వర్గంలోని వాడిని, బలపరుస్తూ వచ్చినమాట నిజమే. కానీ ఏం లాభం? మెంబర్లందరూ అతన్ని బెదిరించే వాళ్ళే? నేను లేకపోతే అతన్ని ఏనాడో దింపేసేవాళ్ళు. సమితి స్థాయిలో పాపం అతను నోరుతెరిచే స్థితిలో కూడా లేడు. ఈ పదేళ్ళుగా అతను ఈ గ్రామానికి చేసింది ఏమీలేడు. సమితి నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. నువ్వు చదువుకున్నవాడివి. అగ్రవర్ణానికి చెందిన వాడివి. పైగా రావుసాహెబ్ బిడ్డవు. మెంబర్లముందు నిలబడి గట్టిగా మాట్లాడ గలిగిన అంతస్థులో వున్నవాడివి, నీవల్ల ఈ గ్రామానికి కొంతయినా మంచి జరుగుతుందని నా నమ్మకం. అందుకే నిన్ను బలపరుస్తానంటున్నాను" అన్నాడు ధర్మయ్య శేఖరం ముఖంలోకి వాత్సల్యంగా చూస్తూ.

 

    "అవును ధర్మయ్యా! శేఖరం నీ నీడలో, నీ అండదండల్లో రాణిస్తాడు. ఈ గ్రామాన్ని అభివృద్ధిలోకి తెస్తాడు. ఆదర్శ గ్రామంగా దీన్ని తీర్చి దిద్దుతాడు. నీ కలల్ని పండిస్తాడు" అన్నాడు పరమేశం ధర్మయ్యను ఉబకేస్తూ.

 

    "అంతకంటే నాకు కావాల్సిందేముంది?" అన్నాడు ధర్మయ్య నిర్లిప్తంగా.

 

    "మరి శెలవిప్పిస్తారా? వెళ్ళివస్తాం?" అంటూ లేచాడు పరమేశం.

 

    "వెళ్ళొస్తానండీ!" అంటూ శేఖరం ధర్మయ్యకు నమస్కరించాడు.

 Previous Page Next Page