Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 5

ఓడలో వున్న ప్రయాణీకులందరూ నిద్రలో ఉండగా ఇతనొక్కడే మోల్కొని వున్నాడో? ఇతని వల్ల తన ప్రయత్నం విఫలం అయింది.
"నువ్వు ఇండియన్ వని నాకు నామ్మకంగా లేదు" గతంలోంచి వర్తమానంలోకి వచ్చి అన్నది.
అతను నవ్వాడు. కళ్ళలో మెరుపు కన్పించింది.
"నువ్వు నాగురించి తెలుసుకోవాలనే ప్రయత్నం నాకిష్టంలేదు."
"ఎందుకని?"
"దానికి కారణాలున్నాయి. నా గురించి అడగనని నువ్వు వాగ్దానం చెయ్యాలి."
"నువ్వు అలా చేస్తావనే నా నమ్మకం" అతని కంఠంలో ఆజ్ఞ.
"అలా చెయ్యకపోతే?" అంతకుముందు లేని ధైర్యం ఆమె మాటలో కన్పించింది.
అలా అయితే - మీ బాబాయికి నీగురించి చెప్పాల్సి వస్తుంది.
అందుకు సీత ఖంగారు పడింది.
"ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? నన్ను ఉడికించడానికి అంటున్నావో, బ్లాక్ మెయిల్ చెయ్యడానికి అంటున్నావో నాకు అర్థం కావడం లేదు."
నువ్వేమన్నా అనుకో. నా విషయం మాత్రం నువ్వెవరికీ చెప్పకూడదని, బయటికి పొక్కకూడదని. "నా గురించి తెలుసుకొనే ప్రయత్నం నువ్వు మానుకోవాలి" అతని కంఠం ఖచ్చితంగా పలికింది.    
కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆశ్చర్యంగా.
"నువ్వు మారువేషంలో వున్నావ్! అవునా?"
ఏమన్నా అనుకో! నానుంచి నీ ప్రశ్నకు సమాధానం దొరకదు.
"మరి నువ్వు నా గురించి చాలా అడిగావు?"
"అదివేరు. నా విద్యుక్త థర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను. నువ్వు నీ కర్తవ్యాన్ని గురించి పారిపోతున్నావు."
ఆమె సన్నగా, అమాయకంగా నవ్వింది.
ఆమె ఆ సమయంలో ఇంకా చిన్నదానిలా కన్పించింది.
"సరే నువ్వు గెల్చావు- ఒకవేళ....."
"ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్ళీ ఆత్మహత్య చేసుకోనని ప్రమాణం చెయ్."
ఆమె నిటారుగా కూర్చుంది! అతనికేసి చిరాగ్గా చూసింది.
తను ఈ బాధల్ని భరిస్తూ ఎలా బ్రతకగలదు? అయినా ఇతనకెందుకు?
అతను కొంచెం ముందుకు వంగి, ఆమె చెయ్యి పట్టుకొని అన్నాడు...
"జీవితం ఎంతో విలువైనది. ఎన్నో మధురానుభూతులు చవిచూడవలసినదానివి, ఇంకా చిన్న వయసు. ఎంతో జీవితం నీముందు వున్నది."
"ఏమో" నిస్పృహగా అన్నది సీత.
"నువ్వు చిన్నదానివి. మంచిరోజు రాకపోవు నా మాట నమ్ము. ఆలోచించు"
ఆమె వేళ్ళు అతని చేతిమీద గట్టిగా బిగుసుకున్నాయి.
"నేను...నిన్ను...నిన్ను నమ్ముతున్నాను" అన్నది సీత.
"ఆత్మవిశ్వాసం వుంటే దేన్నయినా సాధించవచ్చు.
"నీకా నమ్మకం వుందా?"
"వుంది. నా అనుభవం అదే!"
"కర్మను గురించీ, పునర్జన్మ గురించి మాట్లాడావు, నువ్వు బుద్ధిస్టువా?" అడిగింది సీత.
"నేను అన్ని మతాల్నీ గౌరవిస్తాను. నమ్మకం మన మనసుల్లోనే వుంటుంది. అది వుంటే మనం దేని గురించీ భయపడనక్కరలేదు"
"ఇటువంటి నమ్మకాన్ని నేను భారతదేశంలో పొందగలనా?"
"తప్పకుండా పొందగలవు" ఆమె ముఖంలో జాలిగా చూస్తూ అన్నాడు.
అతను మాట్లాడిన ధోరణి ఆమెలో ధైర్యాన్ని రేకెత్తించింది.
జీవితం మీద ఆశ పెంపొందించింది.
ఇక నువ్వు నీ క్యాబిన్ కి వెళ్ళిపో. నా మాట నమ్ము. నీ కష్టాలు త్వరలోనే తొలగిపోతాయి. ధైర్యంగా ఉండు.
"ప్రయత్నిస్తాను" అన్నది చిన్నగా.
ఒక్కక్షణం ఆగి నన్ను మళ్ళీ ఎక్కడ ఎప్పుడు కలుసుకోగలను? ఒకవేళ..." అన్నది.
"నువ్వు తప్పకుండా కలుసుకోగలవు!" ఎక్కడో చూస్తూ యథాలాపంగా అన్నాడు.
"అతను లేచి నిల్చున్నాడు. తన చేతిలో ఉన్న ఆమె చేతిని పెదవులకు హత్తుకొని వదిలేశాడు.
ఆమె మధురానుభూతి నుంచి బయటపడి ఏదో చెప్పాలనుకొన్నది. అతను అక్కడ లేడు. చుట్టూ కలియచూసింది. అతను కన్పించలేదు.
ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అసలు నిజంగా అతన్ని చూసిందా? యింతవరకు జరిగినదంతా నిజమా? లేక తన భ్రమా? అతను మనిషా లేక డెవిలా?
ఆమె తన క్యానైన్ లో ప్రవేశించింది. ఆ క్యాబిన్ నుంచి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలైనట్టు అన్పించింది. తన శరీరంలోని సత్తువనంతా ఎవరో లాగేసినట్టు నీరసంగా అన్పించింది ఆమెకు.
పక్కమీద వాలిపోయింది.
తనకు ఇప్పుడు విశ్రాంతి కావాలి. రేపటి గురించి మర్చిపోవాలి. హాయిగా నిద్రపోవాలి.
కాని...తెల్లవారుతుంది. తను తన బాబాయిని ఎదుర్కోవాల్సి వుంది. ఈ రాత్రి తను ఇక పనిచెయ్యలేదు.
అయినా ఆమెకు మునుపటి భయం లేదు. ఆమె ఆలోచనలన్నీ ఆ కొత్త వ్యక్తి చుట్టూనే తిరగసాగాయి.
చిత్రమైన వ్యక్తి!
ఎవరతను ఎలా క్షణంలో కళ్ళముందు నుంచి మాయం అయ్యాడు?

 Previous Page Next Page