"అందుకే ప్రేమకు కళ్ళు లేవంటారు" అన్నది వాణి.
"కళ్ళేకాదు బుర్రకూడా లేదు" అన్నది సుధ.
"ఇక ఆపండేతల్లీ! మీకో నమస్కారం?" విసుగ్గా అన్నది రేణుక.
సుధ మాటలు రేణుకకు ములుకుల్లా గుచ్చుకుంటున్నాయ్.
"రేణూ నేను చెప్పినట్టు చెయ్యవే" అన్నది వాణి.
"ఓహో అయితే నీకు ప్రేమ పాఠాలు చెప్పడం వచ్చన్నమాట!" అన్నది మీనాక్షి.
"ఆ సుగంధికంటే కూడా బాగా చెప్పగలను"
"అయితే చెప్పు!" అన్నది సుగంధి.
"అందరూ వినండి జాగ్రత్తగా వినండి. ఇది అందరికీ ఒకనాడు ఉపయోగపడుతుంది. వింటున్నారా!"
"చంపక చెప్పవే త్వరగా!"
"ఊ ఊ! మరేమో..." ఓ క్షణం తలగోక్కుని మళ్ళీ ప్రారంభించింది. "మరేమో గౌతమ్ ముందువెళ్తూ ఉంటాడు. ఆ వెనకే రేణుక నడుస్తూ ఉంటుంది. చిన్నగా దగ్గుతుంది. అతను వెనక్కి తిరిగి..."
"చూస్తాడు"
"చూడడు"
"అందువల్ల వరిగేది...."
"వినండే బాబూ! కొంతదూరం నడిచాక రేణుక గబగబా అతన్ని దాటుకుంటూ వెళ్తుంది. అలా అలా వయ్యారంగా నడుస్తూ చేతిలోని చిన్న పర్సును జార విడుస్తుంది. అతను ఆ పర్సును చూస్తాడు పొరపాటుగా పడిపోయింది అనుకుంటాడు. వంగి తీస్తాడు. గబగబా ముందుకు వెళ్ళి "మీ పర్సు పడిపోయిందండీ" అంటూ పర్సు అందిస్తాడు. వయ్యారంగా అందుకొని ఓరగా చూస్తూ, తియ్యగా థాంక్సు చెబుతుంది. కృతజ్ఞతా పూర్వకంగా అతని కళ్ళలోకి చూస్తుంది..."
ఆ తర్వాత అతను "అంఖియ మిలాకే జియ భరమాకేచెలె నహీం జానా!" అంటూ హైపిచ్ లో పాట ఎత్తుకుంటాడు" అన్నది సుధ మధ్యలో అందుకుని వ్యంగ్యంగా.
"అవును! అచ్చం అలాగే జరుగుతుంది" అన్నది వాణి నవ్వుతూ.
"రేణూ వాళ్ళంతా నీకు తాటాకులు కడ్తున్నారే?" అన్నది సుధ.
రేణుక మాట్లాడలేదు.
"అయినా నువ్వు గౌతమ్ ను ప్రేమించడం ఏమిటి?" మళ్ళీ అన్నది సుధ.
"ఏం? అతనికి ఏం తక్కువైంది?"
"అతనిలో నీకు కన్పించిన ప్రత్యేకత ఏమిటో?"
"అతనిలో చాలామందిలో లేని సంస్కారం ఉన్నది. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఆవురుమంటూ చూడడు" రేణుక కంఠం బరువుగా గంభీరంగా ఉన్నది.
"అలా చూడాలంటే ఎంత ధైర్యం కావాలి? అంత బీదవాడికి ఆడపిల్లలకేసి చూసే ధైర్యం ఎలా ఉంటుంది. ఆత్మహీనతా భావంతో అలాంటి వాళ్ళు కుంగిపోతూ ఉంటారు. ఎవరి ముందూ ధైర్యంగా తలెత్తి నిల్చోలేదు" అన్నది సుధ.
"నువ్వు శ్రీమంతుల బిడ్డవు. అంతమాత్రం చేత బీదవాళ్ళను చులకనగా మాట్లాడకు" వాణి అందుకుంది.
"మధ్యలో నీ సలహా ఏమిటి? ఇదుగో రేణూ! మంచికేసి చెబుతున్నాను. హనుమంతరావు లక్షాధికారి కొడుకు. అతనికి నువ్వంటే తగని ఇష్టం అతన్ని...."
"సుధా!" రేణుక దాదాపు అరిచినట్టే అన్నది.
"ఇంకెప్పుడూ అలా మాట్లాడకు. హనుమంతరావుకూ నీకూ సరిపోతుంది. నేనూ బీదదాన్నే..." అంటూ చివ్వున లేచి కసిగా బయటికి నడిచింది.
"ఏం? హనుమంతరావుకు ఏం తక్కువైంది?" సుధ మాటలకు రేణుక గడపలో ఆగి వెనక్కు చూసింది.
"అందుకేగా నీకైతే మంచి జోడీ అన్నాను" అని బయటికి వెళ్ళిపోయింది.
సుధ ప్రవర్తన సుగంధకీ, మీనాక్షికీ కూడా కోపాన్ని తెప్పించింది.
రేణుక వెనకే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
వాణి సుధ ముఖంలోకి అదోలా చూసింది. చిరునవ్వు నవ్వింది.
"ఎందుకే అలా నవ్వుతావ్?"
"ఒకటి అడగనా?"
"అడుగు!"
"నువ్వు గౌతమ్ ను ప్రేమిస్తున్నావు గదూ?"
సుధ తృళ్ళిపడింది.
"అవును ప్రేమిస్తున్నావ్? నాకు తెలుసు"
"ఎవరు చెప్పారు?"
"నేను ఆమాట అనగానే నువ్వు తృళ్ళిపడ్డావ్! దాచాలనుకున్న విషయం ఎదుటి మనిషికి తెలిసిపోయిందని అకస్మాత్తుగా వింటే తృళ్ళిపడటం సహజం!"
"గొప్ప సైకాలజీ!"
"అవును! అదే మానవ సైకాలజీ! నీ ధోరణిలో, ప్రతిమాటలో రేణుక అంటే ఈర్ష్యపడుతున్నట్టు కనిపెట్టాను."
"ఛ! నాకు రేణుక అంటే ఈర్ష్య ఏమిటి? గౌతమ్ ను- ఆ అష్టదరిద్రుణ్ణి నేను ప్రేమించడం ఏమిటి?"
"బుకాయించకు నువ్వు రేణుకనుచూసి ఈర్ష్య పడుతున్నావ్. రేణుక నీకంటే అందమైంది. గౌతమ్ కు రేణుక అంటే ఇష్టం అని నువ్వే నాతో ఒకసారి అన్నావ్. ఆడపిల్లల్ని కన్నెత్తికూడా చూడనివాడు రేణుకను చూసీ చూడనట్టే కన్పిస్తూ, ఆమె ప్రతికదలికనూ గమనిస్తాడని చెప్పావ్. ఆ విషయం రేణుకకంటే నీకే ఎక్కువ తెలుసు. అంటే నువ్వు గౌతమ్ ను గమనిస్తున్నావన్న మాటేగా?"
"పిచ్చిమాటలు మాట్లాడకు. నేను కావాలనుకోవాలేగాని ఆ గౌతమ్ లాంటి వాళ్ళను వందమందిని చుట్టూ తిప్పుకోగలను"
"గౌతమ్ లాంటి వాళ్ళను తిప్పుకోగలవేమో కాని గౌతమ్ నుమాత్రం తిప్పుకోలేవు"
సుధ ముఖం రోషంతో ఎర్రబడింది.
"అలాగా? అయితే చూడు! గౌతమ్ ను నా చుట్టూ తిప్పుకుంటాను. పిచ్చివాడిలా నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు."
"అసంభవం!"
"సంభవం అయితే?"
"అలా ఎన్నటికీ జరగదు"