"బొమ్మను గీసే, దొరగారు నాబొమ్మ గియ్యి ఊమారు" అంటూ పాడేదానివి"
"అవును... అవును... అంతా ఏదో లీలగా జ్ఞాపకం వుంది, పాటపాడేదాన్ని అవును."
"ఫోజులు కావలిసొస్తే బలేగా ఫోజులు పెడతా, పిల్లీ కుక్కా గీస్తే వెంటనే తుడిపేస్తా..... అంటూ జ్ఞాపకం వొస్తోంది. నువ్వు..... నువ్వు...... వొస్తున్నారు"..... అంటూ సంతోషాన్ని పట్టలేక, అతని భుజాలమీద ఆనుకుని పిచ్చిదానిలా వెక్కి వెక్కి ఏడ్చింది.
"రాధీ..... నేనెప్పుడో అనుకున్నాను. నువ్వు తప్పకుండా రాధికవేనని. అందుకే ఎలాగైనా నిన్ను చూసి నీతో మాట్లాడాలనుకున్నాను.
"క్షమించండి మధన్. మిమ్మల్ని కూడా, అందరిలాగే అనుకుని భయపడ్డాను. పొమ్మన్నాను. కానీ, నా అదృష్టం మీరు పోలేదు. ఈ కసాయి వాడిచేతుల్లో కీలుబొమ్మలా! దినమోయుగంగా, గడుపుతున్నాను. దినగండం, నూరేళ్ళాయుష్షులా ఏ క్షణం ఎవరివల్ల, ఏం జరుగుతుందోనని పవిత్రతని కాపాడుకోవడంకోసం, భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రాణాలు బిగపట్టుకున్నాను. మధన్ నన్నిక్కడి నుంచి తీసికెళ్ళిపో. అమ్మా, నాన్నా, తమ్ముణ్ణి చెల్లెళ్లనీ చూడాలి. అమ్మ వొళ్లో తల పెట్టుకుని పడుకోవాలి. నాన్న చల్లని నీడలో హాయిగా, నిశ్చింతగా నిద్రపోవాలి. చెల్లెళ్ళతోటి, తమ్ముడితోటీ, తనివితీరా, కబుర్లు చెప్పాలి. ఇదంతా ఒక పీడకలగా మర్చిపోవాలి. మధన్! నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు..." ఆవేశంతో మాట్లాడుతూ ఏడవటం మొదలెట్టింది రాధిక.
"రాధిక..... ఏడవకు. తప్పకుండా తీసికెళతాను నేను. తీసికెళ్ళే వరకూ రహస్యాన్ని బయటపెట్టకు. మీరు ఎల్లుండి హైద్రాబాదు చేరుకోగానే, నేనక్కడికి వస్తాను. తప్పకుండా నిన్ను తీసుకెళ్తాను."
"నిజంగానా?' జాలిగా అంది రాధిక.
"తప్పకుండా రేపిక్కడ ప్రోగ్రాం వుందిగా. ఇప్పుడేమైనా జరిగితే గోలవుతుంది. రేపు మళ్ళీ నిన్ను కలుస్తాలే. ఎల్లుండి హైద్రాబాదొస్తాను ధైర్యంగా వుండు."
"మధన్ నిజంగా వొస్తావు కదూ! రేపు తప్పకుండా కలుస్తావా? ఒట్టు" అంది రాధిక.
"ఇంక ఈ ఒట్లు వెయ్యడం మరిచిపోలేదన్నమాట ఒట్టు. మరినే వెళ్ళిరానా? అన్నాడు నవ్వుతూ.
"అప్పుడేనా?"
"రాధీ..... నా స్నేహితుడొకడు బయట నాకోసం, నుంచున్నాడు. రేపొస్తాగా అన్నాడు.
"అలాగే అంది ఆమె, ఆనందంతో అతనికేసి చూస్తూ సంతోషంతో ఇవతలి కొచ్చాడు మధన్.
* * * *
సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ, పచార్లు చేస్తూ నుంచున్నాడు సత్యం.
"ఏరా.... చంపేశావుపో? ఛస్తున్నానిక్కడ నీకోసం పడిగాపులు కాయలేక. ఏదో అరగంటలో వస్తావు కదా అనుకున్నా" అన్నాడు ఆఖరు దమ్ములాగి, సిగరెట్టు పీకని అవతల పారేస్తూ.
"సత్యం ఇవాళ ఎంతో సుదినం రా. నువ్వు బలవంతంచేసి నన్నిక్కడికి తీసుకురాకపోతే, పాపం రాధిక అట్లాగే వుండిపోయేది" జాలిగా అన్నాడు మధన్.
"ఏమిట్రా నువ్వంటున్నది. రాధికేమిటి? ఇందాకటినుంచినువ్వా మాట అంటూంటే, కలలు కంటున్నావేమో ననుకున్నా. ఎవరా రాధిక? ఏమా కథ? విన్న వించు...." అన్నాడు.
జరిగినదంతా, పూసగుచ్చినట్టు చెప్పాడు మధన్, ఆశ్చర్యపోయాడు సత్యం ఆ రాధికే ఈ రత్నావళీ అంటే.
ఇద్దరు రకరకాల ఆలోచనలతో బరువుగా అడుగులు వేస్తున్నారు.
"సత్యం, ఎల్లుండి మనం హైదరాబాద్ కి బయలుదేరాలి అన్నాడు ఆలోచిస్తూనే మధన్.
"ఎందుకు?"
"ఎల్లుండి కల్లా రాధిక హైదరాబాదుకి వెళ్లిపోతుంది. మనం వెళ్ళి, ఆమెని వాడిబారినుంచి తప్పించి తీసుకు రావాలి."
"మధన్ నీకు మతిపోయిందా ఏమిటి? అదెలా సాధ్యం. ఏమిటి ఆధారాలు ఆమె రాధికే అని చెప్పటానికి? ఇంతకీ వాడెలా పంపుతాడు. వాడి బతుకంతా వీళ్ళమీదే ఆధారపడుందే! ఇంతకీ నువ్వెళ్లి ఆ అమ్మాయిని, తీసుకురావడం కంటే వాళ్ళ తల్లిదండ్రులకీ మాట చెప్పేస్తే, అదేదో వాళ్ళే చూసుకుంటారుగా?"
సత్యం! వాళ్ళు మాకెంత సన్నిహితులో నీకు తెలీదు. ఆయన పెద్దవాడయిపోయాడు. కొడుకు చిన్నవాడు ఈ విషయంలో ఏమీ చెయ్యలేడు. కాబట్టి ఆమెని అక్కణ్ణుంచి పట్టుకొచ్చేసే బాధ్యత నాదే, మనం ఎల్లుండి వెళదాం. అయిదొందలో వెయ్యో వాడి మొహాన పారేసి, రాధికని పట్టుకొచ్చేద్దాం. పంపించనంటే పోలీసులకి చెప్పి వాడి బండారం బయట పెడతామని బెదిరిద్దాం." అన్నాడు ముందే అంతా ప్లాను వేసేసినట్టు మధన్.
"సరే నీ యిష్టం" అన్నాడు సత్యం.
అటు నుంచి అటు యింటి కెళ్లిపోయాడు సత్యం రకరకాలుగా ముసిరిన ఆలోచనలతో.
ఇల్లు చేరుకున్నాడు మధన్. "రాధిక గురించి అమ్మతో చెప్పడమా? మానడమా? అని ఆలోచించి ఇప్పుడప్పుడే వొద్దులే అనుకున్నాడు.
మర్నాడు ఆఫీసు పని కాగానే సత్యాన్ని పిలిచి డాన్సుకి వెళదామన్నాడు మధన్. సరేనంటూ ఇద్దరూ బయలుదేరారు. ముందు సీట్లో కూర్చున్న వీళ్ళని గుర్తుపట్టింది రత్నావళి. చిరునవ్వు నవ్వింది. పురివిప్పిన నెమలిలా, ఒళ్ళు మరచి నాట్యం చేసింది. "మొక్కజొన్న తోటలో, ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరవకు మామయ్యా" అంటూ బంగారు తీగెలా మెరిసే ఆమె శరీరాన్ని, మీనాల్లా కదులుతూన్న ఆమె కళ్ళనీ, మైమరచి చూస్తున్నాడు మధన్. దాని తరువాత మరో జావళి."