అరుంధతి త్రుళ్ళిపడింది. వెంకటరత్నం చేతిలో ముద్ద పళ్ళెంలో పడిపోయింది. చివ్వున తల ఎత్తి భార్య ముఖంలోకి చూశాడు.
"ముఖ్యంగా ఆ రఘుగాడంటే పడిచస్తుందట. ఇందాక వాడు ఇక్కడికొచ్చాడు. దాంతో ఒకటే గుసగుసలు. పెద్దదాన్ని ఉన్నాననే భయం కూడా లేదు వాళ్ళకు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళికి పెరిగి ఉన్నారు. ఇది ఏ అప్రతిష్ట పనో చేస్తే ఇక నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినట్టే."
వెంకటరత్నం అన్నంపళ్ళెంలో చెయ్యి కడిగేసుకొని లేచాడు. రాజేశ్వరి తెల్లనోయి చూసింది. తండ్రిని అంత రౌద్రమూర్తిగా ఏనాడూ చూడని అరుంధతి ఒణికిపోయింది. సవతితల్లి చెప్పిందంతా అబద్ధం అని చెప్పాలనుకుంది. రఘు కేవలం తనకు నోట్సు ఇవ్వటానికే వచ్చాడనీ, అతనితో తను గుసగుసలాడలేదనీ చెప్పాలనుకుంది. ఆ అవకాశం కూడా దొరకలేదు. తండ్రి అరుంధతిని సంజాయిషీ అడగలేదు. జుట్టుపట్టుకొని వంగదీసి వీపుమీద దభీదభీమని బాదసాగాడు. అరుంధతి వళ్ళప్పగించి వూరుకుంది. కిక్కురుమనలేదు.
"ఏమిటి? మరీ అంత పిచ్చికోపం! చంపేస్తారా ఏమిటి? అయినా పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లను కొట్టడం ఏమిటి?" మందలించింది భార్య వెంకటరత్నాన్ని.
'నిజమే! తను చేస్తూందేమిటి? ఆడపిల్లమీద చెయ్యి చేసుకున్నాడా? ఛ! తనకూ పశువుకూ భేదం ఏమిటి?' వెంకటరత్నం కోసం నీరు కారిపోయింది. గబగబా బయటకు వెళ్ళిపోయి రాత్రి బాగా పొద్దుపోయాకగాని తిరిగి రాలేదు.
ఆ తెల్లవారినుంచి అరుంధతికి వాకిలిబయట కాలు పెట్టకూడదనే ఆంక్ష విధించబడింది. అరుంధతి చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది.పరీక్షలు ఇంకా రెండు పేపర్లు రాయాలి. అవయినా రాయనివ్వమని అడగాలనుకుంది. కాని అడగలేదు. ఆమెకు ఆ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. అందరిమీద కసిగానే వుంది. తన ముఖాన్ని పదేపదే అద్దంలో చూచుకుంది. తనకు అంత అందం వుండటం తన అపరాధమా? అందం తనకు శాపంగా పరిణమించిందా? తెలియని ఆలోచనలతో గంటలకొద్ది కూర్చుండిపోయేది.
"పెద్దదానికి త్వరగా పెళ్ళి చెయ్యకపోతే మన పరువు దక్కదు" అంది భార్య అప్పుడే స్కూలునుంచి వచ్చిన భర్తకు మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ ఒకరోజు.
వెంకటరత్నం తన అలసిపోయిన కళ్ళను బలవంతంగా పైకి ఎత్తుతూ భార్యముఖంలోకి చూశాడు.
"పక్కవాళ్ళ సుధాకర్, ఎదురింటి రామం, వాడి తమ్ముడు గోపాలం పోతులల్లే పోటీలుపడుతూ మన యింటి చుట్టూ తిరుగుతూ వుంటారండి!"
వెంకటరత్నం మాట్లాడలేదు. గటగటా గ్లాసుడు మంచినీళ్ళు త్రాగి భార్యచేతికి ఖాళీగ్లాసు అందించాడు.
"దీని కళ్ళు ఎప్పుడూ వీధిలోకే వుంటాయి. తలుపుచాటునుంచో కిటికీ సందులోనుంచో ఎప్పుడూ బయటకు చూస్తూ, ఆ కోటి వెధవల్ని చూసి నవ్వుతూ వుంటుంది."
"ఆడదానివి, తల్లి తరువాత తల్లిలాంటిదానివి. నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నాకు చెబితే నేనేంచేస్తాను?" కస్సునలేచాడు వెంకటరత్నం.
"నేను చెబితే వినేలాగుందా అది? మాటకు మాట ఎదురు అంటున్నది." సాత్వికంగానే అంది రాజేశ్వరి.
"ఎదురుచెబితే తాటవలిచెయ్!" అన్నాడు వెంకటరత్నం అంతకంటే ఏమనాలో అర్ధంకాక.
"తాట వలుస్తున్నా అది శరీరం అప్పగించే నిల్చుంటుంది. దెబ్బల భయం దానికి ఏనాడూ లేదు."
"అయితే నన్నేం చెయ్యమంటావు?" విసుగ్గా అడిగాడు భర్త.
"ఎవర్నయినా చూసి ముడేస్తే మన బాధ్యత తీరిపోతుంది."
"దమ్మిడీ కట్నం ఇవ్వలేనివాణ్ణి సంబంధాలు ఎక్కడనుంచి తేను?"
"అలాగని చూస్తూ కూచుంటారా? దాని అందం చూసి ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు" అంది రాజేశ్వరి.
"చూస్తాను." ఆనాటినుంచి కనిపించిన వాళ్ళందరికీ పిల్ల పెళ్ళి విషయం చెబుతూనే వున్నాడు. ఒకసారి బజార్లో తన మొదటిభార్య బంధువు వెంకటసుబ్బయ్య కనిపిస్తే చెప్పాడు. ఇంటికి తీసుకొచ్చి పిల్లను కూడా చూపించాడు.
శాంతమ్మవచ్చి పిల్లనుచూసి మెచ్చుకున్నప్పుడూ, దమ్మిడి కట్నం లేకుండా పిల్లను చేసుకుంటానన్నప్పుడూ ముందు వెంకటరత్నం దంపతులు నమ్మలేదు. నమ్మినతరువాత కొంచెం బెట్టు చూపించి కన్యాశుల్కం క్రింద కొంత పుచ్చుకున్నారు. వాళ్ళదారిద్ర్యాన్ని కళ్ళారాచూసిన శాంతమ్మ ఈవిధంగా ఓ బీదకుటుంబానికి సాయపడవచ్చుననుకుని వెంటనే వప్పుకుంది. రెండు వేల రూపాయలు రహస్యంగా వెంకటరత్నానికి ఇచ్చింది శాంతమ్మ. ఆ విషయం సీతాపతికిగానీ, అరుంధతికిగానీ తెలియదు. సీతాపతి అరుంధతిని చూసి తన్మయత్వాన్నే పొందాడు. అరుంధతికి మాత్రం ఆ కట్టుకున్న పంచెలూ, కాళ్ళకు మందపాటి కిర్రుచెప్పులూ, ఆ పల్లెటూరి తరహా ఏదీ నచ్చలేదు. వాళ్ళలా వెళ్ళగానే తండ్రితో అంది అరుంధతి మొండిగా.
"నేను పెళ్ళి చేసుకోను."
"ఏం? ఎందుకు చేసుకోవూ?" అన్నాడు అర్ధంకాక వెంకటరత్నం.
"పల్లెటూరి బైతులా వున్నాడు. నేను చదువుకున్నవాడినే చేసుకుంటాను!"
"నోరు మూసుకుని పడివుండు. మన బ్రతుకులకు చదువుకున్న వాళ్ళెక్కడ నుంచి వస్తారు?" అంటూ అక్కడనుంచి లేచి వెళ్ళిపోయాడు వెంకటరత్నం. ఆ రాత్రంతా, తను కలల్లో చూసిన యువకుడితో సీతాపతిని పోల్చుకుంటూనే వుంది; ఏడుస్తూనే వుంది.
* * *
అరుంధతికి భర్త అంటే ఇష్టమో అయిష్టమో ఆమెకే తెలియదు. అత్తగారింట్లో జీవితం మాత్రం సుఖంగానే వుంది- ఇంతకాలం తను గాలీ, వెలుతురు లేని ప్రదేశంలో ఊపిరాడక కొట్టుకుంటూ వున్నట్టూ, ఒక్కసారిగా తనని ఎవరో ఆ నరకం నుంచి వెలికితీసి, మంచి గాలీ, వెలుతురువున్న ప్రవేశంలో నిల్చోబెట్టినట్టు అనుభూతిని పొందింది. పుట్టింటినుంచి అత్తవారింటికి వచ్చిన అరుంధతికి శాంతమ్మ ఆదరణా, భర్త ప్రేమా ఉక్కిరిబిక్కిరి చెయ్యసాగాయి.
పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వచ్చిన రాత్రి అరుంధతినీ, సీతాపతినీ బయట నిల్చోబెట్టారు. ఒక పెద్ద ముత్తయిదువు వచ్చి "అరుంధతిని చూడుబాబూ" అంది. సీతాపతి అరుంధతిని చూస్తూ వుండిపోయాడు.
"నీ పక్కన వున్న అరుంధతిని కాదయ్యా! అక్కడ ఆకాసంలో వసిష్ఠుడి పక్కగా మినుక్కు మినుక్కుమంటున్న నక్షత్రాన్ని చూడు" అంది.
అందరూ ఫక్కున నవ్వారు. అరుంధతికి హృదయంలో గిలిగింతలు పెట్టినట్లయింది. సిగ్గుతో ముఖం కందిపోయింది.
"ప్రక్కన ఇంత అందమైన అరుంధతిని నిలబెట్టుకుని ఆకాశంలో కనిపించనిదాన్ని చూట్టానికి అవస్థపడే వెర్రివాణ్ణి కాదు" అన్నాడు సీతాపతి అరుంధతి వేపు చూస్తూ.
అరుంధతి పులకించిపోయింది. అందరూ ఘొల్లున నవ్వారు.
అరుంధతి ఒంటరిగా కూచున్నప్పుడల్లా భర్త ఆ నాడన్న మాటలను తల్చుకుంటూ తనలో తనే నవ్వుకొనేది.
చిన్నతనంనుంచీ పట్నంలో పెరిగిన అరుంధతికి ఆ పల్లె వాతావరణంలో ఏమీ తోచేదికాదు. చెయ్యటానికి పనిలేదు. చదువుకోవటానికి పుస్తకాలుండవు. మాట్లాడటానికి మనుషులుండరు. ఆమెలో ఉరకలు తీస్తున్న శక్తి ఖర్చుకావాలి. ఏదో చెయ్యాలి. ఏదో చెయ్యాలి...అనే అశాంతి ఆమెలో పెరిగిపోసాగింది. అత్తగారెప్పుడూ పనుల్లో మునిగివుంటారు. భర్త ఎప్పుడూ ఇంట్లో వుండడు. ఆయన పొలం వెళ్ళకుండా ఒకనాడు కూడా యింట్లో వుండడు. ఇరుగుపొరుగు చిన్నపిల్లల్ని పోగుచేసి- వచ్చిన కొత్తలో చింతపిక్కలూ, వామనగుంటలూ ఆడేది. చివరి చివరికి ఆ ఆటలంటేనే విసుగ్గా వుండేది. ఇరుగుపొరుగువాళ్ళు ఎవరైనా వచ్చినా ఆ కబుర్లు అరుంధతికి నచ్చేవికావు. ఎంతసేపూ వడియాల గురించీ, అప్పడాల గురించీ, ఆరోజు వండిన కూరల గురించీ చెప్పుకొనేవారు. అప్పుడప్పుడూ ఇరుగుపొరుగువాళ్ళ గురించీ, ఊళ్ళోవాళ్ళగురించీ కూడా చెప్పుకొనేవారు.
అరుంధతికి మరీ తోచకపోతే పరంధామయ్యగారింటికి గానీ, సాంబయ్యగారింటికి గానీ వెళ్ళేది. ఆ ఇళ్ళల్లోనే కొత్త కోడళ్ళూ కూతుళ్ళూ తన ఈడువాళ్ళున్నారు. వాళ్ళూ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. కాని, వాళ్ళు అచ్చం పల్లెటూరి పిల్లలే. పెద్దవాళ్ళలాగే మాట్లాడేవాళ్ళు. తను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు పసుపు కొట్టుకుంటూనో, బియ్యం బాగుచేసుకుంటూనో, అప్పడాలు వత్తుకుంటూనో, పనిలో మునిగిపోయి వుండేవాళ్ళు. కాసేపు కూచుని వచ్చేసేది. వాళ్ళు తమ ఇంటికి ఎప్పుడు వచ్చినా తాను ఏ పాతపత్రికో ముందేసుకొని కనిపించేది. వాళ్ళకు ఆశ్చర్యంగా వుండేది.
శాంతమ్మకూ, సీతాపతికీ ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళడం అంత ఇష్టం వుండేది కాదు. ఆ సంగతి అర్ధం చేసుకోకపోలేదు అరుంధతి.
ఆరోజు మధ్యాహ్నం శాంతమ్మ బియ్యం చెరుగుకుంటూ కూర్చుంది. జీతగాడు భార్య రామి సహాయం చేస్తూంది. అరుంధతికీ ఏమీ తోచక వెళ్ళికూచుని బియ్యంలో రాళ్ళు ఏరసాగింది.
"నీకెందుకమ్మా కష్టం! నేనున్నాగా? నా ఓపిక పోయాక ఎటూ నీకీ చాకిరీ తప్పదు. వెళ్ళు. వెళ్ళి పడుకో" అంది శాంతమ్మ.
అరుంధతికి చిరాకు వేసింది. లేచివెళ్ళి మంచానికి అడ్డంపడి కళ్ళుమూసుకుంది. అశాంతిగా బాధపడింది. లేచి ఇల్లంతా కలయ తిరిగింది. పెరటి వాకిట్లోకి వెళ్ళి నిలబడింది. కనీసం పట్నాల్లో తోచకపోతే ఇలా నిల్చుంటే రకరకాల మనుష్యులన్నా కనిపిస్తారు. ఇక్కడ అదీ వుండదు అనుకుంటూ నిల్చుంది.
"అరూ! ఎందుకమ్మా ఆ వీధిలో నిలబడ్డారు? వాడు వచ్చే వేళయింది. అలా నిల్చోవటం వాడికిష్టం వుండదు" అంది శాంతమ్మ.
ఆయనకు ఇష్టంలేనిది తను ఏమీ చెయ్యకూడదు. తనని గుడిలోని విగ్రహంలా ఒకచోట పెట్టి ఆదరిస్తున్నారు. అత్తగారికి తను పనిచెయ్యటం ఇష్టంలేదు. భర్తకు తను బయట కాలుపెట్టడం ఇష్టంలేదు. తనకూ ఏదో చెయ్యాలని వుంటుందని వాళ్ళెందుకనుకోరు? తనకూ మనసుంది. బుర్రుంది. ఆలోచించగలదని ఎందుకనుకోరూ?
అరుంధతి గబగబా పరంధామయ్యగారింటికి వెళ్ళింది. మెల్లా ఇంట్లో పరంధామయ్య కోడలు, పిచ్చివాడి పెళ్ళాం వడియాలు పెడుతూంది. సాంబయ్య మనుమరాలు రఘురామయ్య కూతురూ కూడా అక్కడే వున్నారు. ఇద్దరు ముగ్గురు వయస్సుమళ్ళిన స్త్రీలు కూడా వున్నారు. అందరూ వడియాలు పెడుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అరుంధతి తనపేరు చెవినపడి అక్కడే ఓరగా నిల్చొని వినసాగింది.
"ఎప్పుడన్నా చూడు- ఏవో పుస్తకాలు ముందేసుకొని కూచుంటుంది. సంసారం చేసుకొనే లక్షణం ఎక్కడా కనిపించదు" అంది రఘురామయ్య కూతురు.
"ఆ అత్తగారిది మరీ విడ్డూరం! ఆ అందాలభరిణె ఎక్కడ కందిపోతుందోనని పని చెయ్యనివ్వదట." అంది పరంధామయ్య కోడలు.
"నేను నమ్మను, బస్తీగుంటలు పనులు చేస్తారా? కోడలు చెయ్యదని చెప్పుకోలేక ఆ శాంతమ్మతల్లి అలా చెప్పుకుంటూ ఉంటుంది" అంది ఓ వయసు మళ్ళిన స్త్రీ.
"ఆ చూపులూ...ఆ కళ్ళూ.... ఆ వయ్యారం....ఏమో నా కనుమానమే.... మిగతా మాటలు వినిపించలేదు అరుంధతికి.
"అసలు వాళ్ళ వంశం మంచిది కాదట! ఆ పిల్ల మేనత్త మా పెద్దనాన్న అల్లుడికి చాలా దగ్గర బంధువట! ఆవిడ గుణం మంచిది కాదని భర్త వదిలేశాడట!"
అరుంధతి గిర్రున తిరిగింది. మాటల్లో మునిగిపోయివున్న వాళ్ళెవరూ ఆమె రావటం, పోవటం గమనించలేదు. అరుంధతి ముఖం ఎర్రగా చేసుకుని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోవటం చూసిన శాంతమ్మకు విషయం అర్ధం కాలేదు. ఆమె వెనకే లోపలకు వెళ్ళింది. అరుంధతి అరచేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
శాంతమ్మ గాబరాగా వచ్చి "ఏమిటమ్మా! ఏం జరిగింది?" అంటూ ఆప్యాయంగా తల నిమురుతూ అడిగింది.
అరుంధతి జవాబివ్వలేదు. కళ్ళు తుడుచుకుంది.
"ఏమిటమ్మా! ఏం జరిగింది?" మళ్ళీ ప్రశ్నించింది.
"ఏం లేదు అత్తయ్యా! నాన్న గుర్తొచ్చారు." అబద్ధం ఆడింది.
"పోనియ్. ఒకసారి వెళ్ళి రాకూడదు?" అంది శాంతమ్మ. "ఎంతకాదనుకున్నా కన్నతండ్రి కదా? పాపం గుర్తొచ్చినట్టున్నాడు" అనుకుంది మనస్సులోనే.
"వెళతావా?"
"వెళ్ళను."
"సరే నీ ఇష్టం! లేచి ముఖం కడుక్కుని తల దువ్వుకో-పువ్వులు కోసి వున్నాయి. కట్టి పెట్టుకో." గదిలోంచి బయటకు వెళుతున్న అత్తగారికేసి ఓ క్షణం చూసి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది.
ఇక తను ఇక్కడ ఉండలేదు. ఈ వాతావరణంలో తనకు పిచ్చెక్కేలాగుంది. బస్తీలో అయితే తోచకపోవడమంటూ వుండదు. ఎన్నో వ్యాపకాలు వుంటాయి. మరీ అంత తోచకపోతే సినిమాకైనా వెళ్ళొచ్చు. మరీ పల్లెటూరు బాబూ ఇది.
ఏమయినాసరే ఇవ్వాళ ఆయన్ను అడిగి తీరుతుంది తను- బస్తీ కాపరం పెట్టమని.
ఆ నాడంతా చిరాకుగానే వుంది అరుంధతికి. అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి కాలేదు.
"ఏం రాణీగారు అలిగినట్టున్నారు?" అన్నాడు సీతాపతి నవ్వుతూ, బుంగమూతి పెట్టుకొని మంచం మీద కూచునివున్న భార్యను చూస్తూ.
"అదొక్కటే తక్కువగా వుంది. ఈ బతుక్కుతోడు అలక కూడానా? అలక తీర్చేవాళ్ళున్నప్పుడే ఆ అలకకు అర్ధం, అందం." అంది అరుంధతి తీవ్రంగా.
"నీ అలక తీర్చడానికేగా నేను వుంది. ఏంచేయమంటావో చెప్పు!" అన్నాడు మృదువుగా గడ్డం పట్టుకొని వంచి వున్న అరుంధతి తలను పైకెత్తుతూ. ఆ పెద్దకళ్ళ నిండుగా నీరు తిరిగివుంది సీతాపతి కలవరపడ్డాడు.
"ఏమిటి అరూ! అంత బాధపడుతున్నావేమిటి?" అన్నాడు దగ్గరగా కూచుంటూ ఆదుర్దాగా.
అరుంధతి మాట్లాడలేదు. "చెప్పవూ? నీకు కష్టం కలిగించిందేమిటో చెప్పు." బతిమాలుతూ అడిగాడు.
అరుంధతి ఆనాడు జరిగిందంతా చెప్పింది. సీతాపతి ఇంతేనా అన్నట్టు తేలిగ్గా నవ్వేశాడు.
"ఎవరో ఏదో వాగారని అంత బాధ పడతావేం? ఇలాంటి మాటలు ఈ ఊళ్ళల్లో సహజంగా వింటూ ఉండేవే! ఎవరూ ఎవరి మాటల్నీ అంతగా పట్టించుకోరు. అందరూ అందరిమీదా మాట్లాడుకుంటూనే వుంటారు" అన్నాడు సీతాపతి అరుంధతిని గోముగా దగ్గిరకు తీసుకుంటూ.