Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 5

    'ఊ కలుపుకో!' పప్పుచారు గిన్నె తెచ్చిన అన్నమ్మ దబాయిస్తున్నట్టే అన్నది.
    అన్నం వాయిమీద పప్పుచారు పోసింది. మరొకావిడ వంకాయకూర కొంచెం మర్యాదగానే వడ్డించింది. సాంబారుతో అన్నం కలుపుకుంది. ఎత్తిన ముద్ద నోటి దగ్గరే ఆగిపోయింది. నోట్లో పెట్టుకోవాలని అనిపించలేదు. వాంతి వచ్చేలా ఉంది. పళ్ళెం తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. అందరూ ఆమెకేసి చూశారు. కొందరు కనుబొమ్మలు ముడేశారు. కొందరు ఏదేదో అన్నారు. కొందరు మాత్రం జాలిపడ్డారు.
    సుందరమ్మ పళ్ళెంలోని అన్నం అక్కడ పడుకుని ఉన్న కుక్కకు వేసింది. పంపు దగ్గిర వంగి ప్లేటు కడుక్కుంటున్నది.
    'సుందరమ్మా! ఏమిటా పని?'
    సుందరమ్మ నిటారుగా అయి పక్కకు చూసింది. వార్డెను - ఆమె పక్కనే అన్నమ్మ.
    'చూశారామ్మా! అన్నం అంతా కుక్కకు వేసింది. అంత పొగరుంటే ఇక్కడకెందుకు వచ్చిందో?' అన్నది అన్నమ్మ.
    "అన్నమ్మా నువ్వు లోపలకు వెళ్ళు'. గద్దించింది వార్డెన్.
    అన్నమ్మ మూతి తిప్పుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది.
    'క్షమించడమ్మా! ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. తినాలనిపించలేదు.' అపరాధిలా నిలబడ్డ సుందరమ్మను చూస్తుంటే వార్డెన్ కు కోపం రాలేదు.
    'ఆకలిగా లేకపోతే తినొద్దు. అంతేకాని అంతమంది మధ్యలో కూర్చొని ఎలా వచ్చేయ్యడం వాళ్ళందర్నీ అవమానించినట్టు కాదా?'
    'క్షమించండమ్మా! నేను అలా అనుకోలేదు. ఇంకెప్పుడూ ఇలా జరగదు'.
    'సరే నీగదిలోకి వెళ్ళు నీకు బ్రెడ్ పంపిస్తాను'.
    "వద్దమ్మా!'
    'అసలు ఏమీ తినకుండా ఎలా వుంటావు? నీ బాధ నేను అర్ధం చేసుకోగలను. బాధపడకు. పరిస్థితులతో రాజీ పడక తప్పదు.'
    'అమ్మా!'
    'ఏమిటి?'
    'మీరు ఏమీ అనుకోనంటే...'
    'పర్వాలేదు చెప్పు సుందరమ్మా."
    'నా దగ్గిర డబ్బుంది. ఒక స్టీలు ప్లేటూ, గ్లాసూ తెప్పించి పెట్టగలరా?'
    ఓ క్షణం సుందరమ్మ ముఖంలోకి చూసి 'అలాగే. రాముడ్ని పంపించి ఇప్పుడే తెప్పిస్తా'.
    'డబ్బు తెస్తాను.'
    'ఆఫీసు గదిలోకి తీసుకురా.'
    'అలాగేనమ్మా.'
                                                                               *   *   *
    సుందరమ్మ తన మంచం మీద మార్చుకుంది. దుఃఖం పొర్లుకొస్తున్నది. బలవంతం మీద ఆపుకుంటున్నది. మంచం మీద గోడ వైపుకి తిరిగి కూర్చుంది. చివరకు తన బతుకు ఇలా అయిందేమిటి? ఒక్కొక్క బిడ్డను పొత్తిళ్ళలో పెట్టుకుని ఎన్నెన్ని కలలు కన్నది? చివరకు తనేం చెప్పింది. తనకు పిల్లలు లేరని చెప్పింది. తను గొడ్రాలినని చెప్పింది.
    'ఏ ఊరు?'
    సుందరమ్మ తృళ్ళిపడి వెనక్కు తిరిగి చూసింది.
    మూడోమంచం మీద వున్న వృద్ధురాలిని అంతవరకు సరిగా గమనించనే లేదు సుందరమ్మ. ఆమెను తేరిపార చూసింది. ముఖంలో ఏదో తేటతనం. కళ్ళల్లో కాంతి. ఆ హోమ్ లో వున్న అన్ని ముఖాల్లోకి ఆ ముఖం ప్రత్యేకంగా వున్నట్లు అన్పించింది. వయసు కూడా పెద్దగా వున్నట్టు లేదు. కట్టూ బొట్టూ కూడా ప్రత్యేకంగానే వున్నాయి. సన్న జరీ వున్న వెంకటగిరి కోరా చీరలో వుంది. బాగా చదువుకున్న ముఖంలా వుంది.
    'మీది ఏ వూరమ్మా?'
    'నాపేరు సుందరమ్మ. గుంటూరునుంచి వచ్చాను'.
    'నాపేరు శ్రీలక్ష్మి. మాది ఖమ్మం'.
    'మీకు పిల్లలు లేరా?' సుందరమ్మ ముందే అడిగేసింది. ఆ ప్రశ్న తను అడగకపోతే తనకే ఎదురౌతుందని ఆమెకు తెలుసు.
    'లేరు.'
    'నిజంగా లేరా.' సుందరమ్మ నమ్మలేనట్టుగా చూసింది.
    'నాకు లేరు. కాని మీకు వున్నారు. అవునా?'
    సుందరమ్మ తృళ్ళిపడింది.
    'నీకు.... ఎవరు....?"
    'ఎవరూ చెప్పలేదు. నాకు పిల్లలు లేరు అంటే నీకు నమ్మకం కలుగలేదు. అందుకే అర్ధం చేసుకున్నాను. నీ సంగతి వదిలేయ్. నాకు నిజంగానే లేరు. నేను పెళ్ళిచేసుకోలేదు'. అంది శ్రీలక్ష్మి.
    సుందరమ్మ ఆశ్చర్యంగా శ్రీలక్ష్మి ముఖంలోకి చూసింది.
    'చదువుకున్నారా?'
    'ఎం.ఏ. పాసయ్యాను. టీచరు ఉద్యోగం చేసాను.'
    'మరి ఇక్కడకెందుకొచ్చావ్?'
    'అందరూ ఎందుకొస్తారు?'
    'చూసే వాళ్ళు లేక'.
    'అవును. ఇక్కడికి అందరూ అందుకే వస్తారు.' శ్రీలక్ష్మి అదోలా నవ్వింది.
    'పెళ్ళెందుకు చేసుకోలేదు? అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు ఎవరూ లేరా?' సుందరమ్మకు తన ప్రశ్న ఎంత పిచ్చి ప్రశ్నో అడిగాకగాని అర్ధం కాలేదు. ఆరుగురు కనిపించిన వాళ్ళున్న తనే ఇక్కడకు వచ్చింది. అన్నదమ్ములు - అక్క చెల్లెళ్ళు చూస్తారా? ఎంత పిచ్చి ప్రశ్న వేసింది తను!
    'తనను కన్నవాళ్ళయినా వుండాలి, తను కన్నవాళ్ళయినా వుండాలి' అన్న సామెత వినలేదా? నాకు ఆరెండు రకాలవాళ్ళూ లేరు'. శ్రీలక్ష్మి తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అంది.
    'అంత చదువుకున్నావు. పెద్ద ఉద్యోగం చేశావు. పెళ్ళెందుకు చేసుకోలేదు'.
    సుందరమ్మ ప్రశ్నకు నవ్వు వచ్చింది.
    'ఏమ్మా! నవ్వుతున్నావు. నేను తెలివి తక్కువగా అడిగానా?'
    'అదేం కాదు'.
    'పెళ్ళి చేసుకుంటే బాగుండేది'. బాధగా చూస్తూ అంది సుందరమ్మ.
    శ్రీలక్ష్మి అదోలా నవ్వింది.
    'అన్నదమ్ములు ఉన్నారా?'
    'ఉన్నారు. వాళ్ళను నేనే పెంచి పెద్దవాళ్ళను చేశాను. ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. నేను పది పాసయ్యాను. కాలేజీలో చేరాలనుకుంటూ వుండగా మా నాన్న యాక్సిడెంటులో చచ్చిపోయాడు. ఇంటి బాధ్యత నేనే తీసుకోవాల్సి వచ్చింది. టీచరు ట్రైనింగ్ అయ్యాను. మిడిల్ స్కూల్లో టీచరుగా పనిచేస్తూ ప్రయివేటుగా బి.ఏ., ఎం.ఏ. చేశాను. తమ్ముళ్ళనూ చెల్లెల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేశాను'.
    'ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు?'
    'చెల్లెలు డాక్టర్. పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఒక తమ్ముడు డిప్యూటి కలెక్టర్. ఇంకో తమ్ముడు లెక్చరర్. ఈ ఊళ్ళోనే వుంటారు. మా అమ్మపోయి కూడా పదేళ్ళు అయ్యింది.'
    'ఊళ్ళోనే అంతంత ఉద్యోగాలు చేస్తున్న తమ్ముళ్ళు చూడరా?'
    శ్రీలక్ష్మి సమాధానం ఇవ్వలేదు. అదోలా నవ్వింది. విరిగిన పాలలాంటి నవ్వు.

 Previous Page Next Page