Previous Page Next Page 
బంధితుడు పేజి 5


    "నాకు వచ్చింది నయమయే జబ్బా బాబూ!"
    సత్యనారాయణ మనసు కలుక్కుమంది. అవును! కాన్సర్ నయం కాదు. ఆ విషయం అందరికీ తెలిసిందే.
    "కోడలు ఏం చేస్తుంది?"
    "వంట చేస్తుంది. ఎందుకమ్మా? ఏం కావాలి?"
    "ఒకసారి పద్మను పిలువు బాబూ!"
    సత్యనారాయణ పద్మను పిల్చాడు.
    పద్మ గబగబా వచ్చి అత్తగారి పక్కన నిల్చుంది.
    "అమ్మా పద్మా! సరోజ చిన్నపిల్ల. అమాయకురాలు. దుడుకుస్వభావం. దానికి తల్లిదండ్రులు మీరిద్దరే! దాన్ని మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను." ఆగి ఆగి ఆయాసపడుతూ అన్నది.
    పద్మ మనసు ద్రవించింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
    "మీరేం బాధపడకండి అత్తయ్యా! సరోజకు ఏ కొరతా లేకుండా చూసుకుంటాం!" అన్నది పద్మకళ్ళ నీళ్ళతో.
    "బాబూ! దానికి తల్లిదండ్రులు లేనికొరత లేకుండా చూసుకో!"
    "అలాగే అమ్మా!" సత్యనారాయణ కంఠంలో మాటాలు గర గర లాడాయి.
    సత్యనారాయణ కళ్ళు తుడుచుకున్నాడు.
    "బాధపడకు బాబూ! పెద్దవాళ్ళం, శాశ్వతంగా వుంటామా? కాకపోతే  సరోజకు కూడా ఆ మూడుముళ్ళూ పడిపోతే, ఆత్మకు ప్రశాంతంగా వుండేది."
    "నేను బ్రతికి వున్నంతవరకు సరోజకు ఏ లోపం లేకుండా చూసుకుంటాను. నువ్వు బాధపడకమ్మా."
    అప్పుడే స్కూలునుంచి వచ్చిన సరోజ తల్లి మంచం దగ్గర కొచ్చి దిగాలుపడి నిల్చుంది.
    సత్యనారాయణా, పద్మా కళ్ళు తుడుచుకున్నారు.
    "రా! సరోజా! టిఫెన్ చేద్దువుగానీ" పద్మ సరోజను పిల్చింది ఆప్యాయంగా.
    "అమ్మకు ఎలా వుందన్నయ్యా?" సరోజ దిగాలుగా ప్రశ్నించింది.
    "అమ్మకేం, బాగానే వుంది. త్వరలో తగ్గిపోతుందని డాక్టరు కూడా చెప్పాడు. నువ్వెళ్ళి టిఫెన్ తిను" అన్నాడు సత్యనారాయణ.
    "పద్మ సరోజ చెయ్యిపట్టుకొని లోపలకు తీసు కెళ్ళింది.
    కాంతమ్మ రెండు రోజుల తర్వాత భవబంధాలనుంచి విముక్తురాలై  వెళ్ళిపోయింది.
    పద్మా, సత్యానారాయణా సరోజను రెక్కల్లో దాచుకొని ఊరడించసాగారు.
    బాధలో యివ్వాళవుండే తీవ్రత రేపు వుండదు.
    గాయాన్ని మాన్పుతుంది కాలం!
    అతి సన్నిహితుడయిన వ్యక్తి చచ్చిపోతాడేమోనని ఊహించు కున్నప్పుడున్నంత భయం, బాధా, తీరా చచ్చిపోయాకవుండదు.
    భార్య భర్తపోయాక బ్రతకగలను అనుకోలేదు. తీరా పోయాక బ్రతక్క తప్పదు. బ్రతుకుతుంది. బిడ్డ పోయిన తల్లి బ్రతుకుతుంది. కాని పెద్దవాళ్ళు పోయిన దుఃఖం త్వరగా సమసిపోతుంది.
    కాంతమ్మ పోయినాలుగేళ్ళు అయింది.
    సరోజ స్కూల్ పైనల్ చదువుతూన్నది.
    పద్మ ఎంత ప్రయత్నించినా సరోజ మానసికంగా వదినకు దగ్గర కాలేకపోతూంది.
    పద్మ మనసును మాటిమాటికి నొప్పిస్తూ వుంటుంది సరోజ.
    సత్యనారాయణకు యిప్పుడు ఇద్దరు పిల్లలు. పెద్దవాడికి ఐదేళ్ళు. రెండోది ఆడపిల్ల. మూడేళ్ళు.
    ఇద్దరు పిల్లలతో ఇంటెడు చాకిరితో పద్మసతమతమైపోతున్నా సరోజ తనకేమీ పట్టనట్టు  నవలలు చదువుతూ కూర్చుంటుంది.
    ఆ రోజు పద్మకు వంట్లో బాగాలేదు. వంటింట్లోపని చేస్తూ వుంది.
    బయటనుంచి పిల్ల 'కెవ్వు'మని వినిపించిచేస్తున్న పని వదలిపెట్టి బయటికి పరిగెత్తుకొచ్చింది పద్మ.
    పిల్ల మండిగం తగిలి బొక్కబోర్లా పడింది. పద్మ వచ్చేప్పటికి అలాగే పడి యేడుస్తూ వుంది. కొంచెం దూరంలో కూర్చుని సరోజ నవల చదవడంలో మునిగిపోయి వుంది.
    పద్మ గబుక్కున పిల్లను ఎత్తుకుంది. నుదురు బొప్పి కట్టింది పిల్లకు. సరోజ అదేమీ పట్టనట్టే పుస్తక పఠనంలో లీనం అయి ఉంది.
    పద్మ సరోజను ఏవగింపుగా చూసింది.
    "పిల్ల బిళ్ళ బీటుగా పడిపోయింది. ఎదురుగా కూర్చొని పుస్తకం చదువుకుంటున్నావా? నువ్వు మనిషివేనా?" అన్నది పద్మ కోపంగా. పిల్ల యింకా గుక్కబట్టి ఏడుస్తూనే వుంది.
    "నేను చూళ్ళేదు." విసురుగా అన్నది సరోజ.
    "ఏడుపు వినిపిమచలేదా?"
    "లేదు" అన్నది సరోజ తలఎత్తకుండానే.
    "ఎందుకు వినిపిస్తుందీ? వెధవ పుస్తకంమీద వున్న శ్రద్ధ పిల్లలమీద వుంటేగా? ఏమిటా పుస్తకం?"
    "నీకు అనవసరం!" బిరుసుగా సమాధానం చెప్పింది.
    "సిగ్గులేకపోతేసరి!" కోపంగా అన్నది పద్మ.  
    "అనవసరంగా నన్ను తిట్టకు." పెళుసుగా అన్నది సరోజ.
    "లేకపోతే ఏమిటి? ఆడదానివి కాదూ? లేచింది మొదలు పుస్తకం పెట్టుకు కూర్చుంటాన్? చేసిపెట్టె వాళ్ళున్నారుగా? తింటూ కూర్చుంటున్నావ్."
    "నీ సొమ్మేం తినడంలేదు. ణా అన్న సంపాదిస్తున్నాడు. తింటున్నాను" రోషంగా అన్నది సరోజ.
    "నా మొగుడు సంపాదన తింటున్నావ్" అనాలనుకుంది పద్మ.
    పిల్లను ఎత్తుకుని వంటింటిలోకి వెళ్ళిపోయింది.
    ఆ రాత్రి సరోజ అన్నం తినలేదు.
    సత్యనారాయణ భార్యను "సరోజ ఎందుకు అలా వుంది? అన్నానికి రాలేదేం?" అని అడిగాడు.
    పద్మ సమాధానం ఇవ్వలేదు.
    సత్యనారాయణ సరోజ గదిలోకి వెళ్ళాడు.
    దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నది సరోజ.
    "ఏమ్మా? ఎందుకు ఏడుస్తున్నావ్?" మంచంమీద కూర్చుని సరోజ తల నిమురుతూ ఆప్యాయంగా అడిగాడు.
    సరోజ ఒక్కసారి బోరున ఏడ్వసాగింది.
    "ఏమిటి? ఏం జరిగింది? వదిన ఏమైనా అన్నదా?"
    "సరోజ చాలాసేపటి వరకు ఏడుస్తూనే వుంది. సత్యనారాయణ ఓదార్చుతూ కూర్చున్నాడు.
    "లే అన్నం తిందాం!" అన్నాడు.
    "నేను తినను" మొండిగా అన్నది చెల్లెలు.
    "అసలు ఏం జరిగిందో చెప్పు" లాలనగా అడిగాడు అన్న"
    "నేను తన మొగుడి సంపాదన తింటూ సిగ్గు లేకుండా కూర్చుంటున్నానట!" ముక్కు ఎగ  బీలుస్తూ అన్నది సరోజ.
    సత్యనారాయణ ఓ క్షణం సరోజను చూస్తూ వుండిపోయాడు.
    "అలా అన్నదా?" నమ్మలేనట్టుగా అడిగాడు.
    "సిగ్గులేకుండా తింటూ కూర్చున్నావంటే అర్థం ఏమిటి?" వెక్కిళ్ళు  మధ్య అన్నది సరోజ.
    "పద్మా ! పద్మా !" సత్యనారాయణ భార్యను కేకలు పెట్టారు.
    "ఏం?" విసురుగా వచ్చింది పద్మ.
    "సరోజకు ఏమన్నావ్?" కోపంగా దాదాపు అరిచినట్టే అన్నారు.
    "ఆవిణ్నే అడగండి."
    "నేను నిన్ను అడుగుతున్నాను!" కోపంతో రెచ్చిపోతూ అన్నాడు!
    "ఏమిటా కేకలు? నేనేమీ అనలేదు" అంతకంటే రెచ్చిపోతూ సమాధానం ఇచ్చింది పద్మ.
    "సిగ్గులేకపోతే సరి!"
    "నాకెందుకు సిగ్గు? మీ చెల్లెళ్ళే సిగ్గుపడాలి"
    "పద్మా ! ఏమిటా వాగుడు? తిని కూర్చుంటున్నావన్నావటగా? నీ పుట్టింటిది తెచ్చి పెడ్తున్నావా?"
    "మొగుడున్న ఆడది పుట్టింటి నుంచి తెచ్చుకోవలసిన అవసరంలేదు. ఆ మొగుడు ఎందుకూ  పనికిరాని...." భర్త రౌద్రరూపం చూసి ఆగిపోయింది.
    "పద్మా!" సత్యనారాయణ చివ్వునలేచి భార్య మీదకు వెళ్ళాడు.
    "ఏం కొడ్తారా? కొట్టండి చూద్దాం ? జంకూగొంకూ లేకుండా నిటారుగా నిలబడింది పద్మ.
    సత్యనారాయణ చెయ్యి ఎత్తాడు.
    "అన్నయ్యా! ఊరుకో! సరోజ అడ్డం వెళ్ళింది.
    "ఛీ వెధవకొంప!" సత్యనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
    పద్మ ముఖంతో రోషం, కోపం ముడిపడ్డాయి.
    ఆ రోజు ఎవరూ భోజనం చెయ్యలేదు.
    అన్నయ్యకు తనంటే ఎంత ప్రేమో? తను అడ్డం వెళ్ళకపోతే వదినకు బాగా తగిలేయే! లేకపోతే అంత గర్వమా? సిగ్గులేకుండా కూర్చుని తింటున్నానా? అన్నయ్య అన్నట్టు ఆవిడ సొమ్ము తింటున్నానా? అన్నయ్య మంచివాడు కనక సరిపోయింది. లేకపోతే తనను బ్రతకనిచ్చేదా ఈ మహాతల్లి!
    ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది సరోజ.
    అసలు సంగతేమిటో తెలుసుకోకుండా చెల్లెలిముందు తనను అవమానిస్తాడా ?
    ఎత్తిన చెయ్యి చెల్లెలు "ఊర్కో అన్నయ్యా" అనగానే దించాడు.
    చెల్లెలిమాటంటే అంత ఇదా! తనను కొట్టినా ఇంత  బాధపడేది కాదు. ఒక్క  రోజయినా ఆస్తనగా దగ్గర కూర్చుని తనను పలకరిస్తున్నాడా? ముద్దుల చెల్లెలు మూతి ముడుచుకుర్చుంటే చాలు. ఈ మనిషి దెయ్యంలా మారిపోతాడు.
    ఒక్కసారైనా శాంతంగా తనను జరిగిందేమిటని అడిగాడా? బెదిరిస్తునట్లుగా అడుగుతాడు. దాంతో వళ్ళు మండిపోతుంది. తనకు చెప్పబుద్దికాదు.  పెడసరంగా జవాబు చెప్తుంది. అదేమో బులిబులి ఏడ్పులుఏడుస్తూ వున్నవీలేనివీ కల్పించి చెబుతుంది. దాంతో మనిషికీ ఒళ్ళూపై తెలియకుండా పోతుంది.
    తను ఇంటెడు చాకిటితో సతమతమై పోవడం చూడటం లేదూ? చెల్లెల్ని ఒక్కసారైనా ఏమిటా కూర్చోవడం అని మందలించాడా? వదినకు కాస్త పనిలో సహాయపడమని చెప్పాడా?

 Previous Page Next Page