Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 5

    చిత్రంగానే వుంది.
   
    ఇంతఃవరకూ ఎవరూ ఆ పేరు పెట్టినట్టు తను వినలేదు. తెలుగు వాళ్ళు. అందులో హిందువులు "మోనోలిసా!" అని పేరు పెట్టుకోవడం చిత్రంగానే వుంది.
   
    బహుశా మోనా తల్లి క్రిస్టియనేమో?
   
    "మోనో తల్లికి__అదే మీ ఆవిడకు ఏం జబ్బూ?" ఉండబట్టలేక అడిగేశాడు కృష్ణ.
   
    "జబ్బా?" ఆశ్చర్యంగా అన్నాడు జగన్.
   
    "ఆమెకు ఏ జబ్బూ లేకపోతే మోనోను తల్లికి దూరంగా ఉంచడం ఎందుకూ?"
   
    "ఎవరుంచారూ? బిడ్డకు తనే దూరమైపోయింది" జగన్ కంఠంలో ఎలాంటి ఉద్రిక్తత కన్పించకపోవడం కృష్ణకు ఆశ్చర్యం కలిగించింది.
   
    మోనాలిసా నవ్వులా అంతా అర్ధమైనట్టే ఉండి ఏమీ అర్ధంకాకుండా ఉంది.
   
    తల్లి బిడ్డకు__కాదు బిడ్డకు తల్లి దూరం అయింది. ఆవిడ బ్రతికే ఉంది. ఏ జబ్బూలేదు మరి?
   
    డామిట్ అర్ధమైంది. కథ అడ్డం తిరిగింది.
   
    "ఓ మైగాడ్!
   
    ఘోరం!
   
    జగన్ పెళ్ళాం లేచిపోయింది.
   
    మోనో తల్లి లేచిపోయింది.
   
    గుర్రంలా పరుగులు తీస్తున్న ఆలోచనల్ని అదుపులో పెట్టుకుంటూ పెదవులు నొక్కిపట్టి జగన్ వేపు చూశాడు కృష్ణ.
   
    "మోనోను ఏ వయసులో తల్లి వదిలేసి వెళ్ళింది? సూటిగా అడగాలంటే నీ పెళ్ళయిన ఎన్నాళ్ళకు నీ పెళ్ళాం నిన్ను వదిలేసింది?" గొంతులో నుంచి బయటకు దూకడానికి ప్రయత్నిస్తున్న ప్రశ్నల పరంపరను అణచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ.
   
    "మోనోను తీసుకెళతాను లేదా?" అడక్కుండా ఉండలేకపోయాడు. జగన్ ముఖం చూసిన కృష్ణ గతుక్కుమన్నాడు. ఏదో తప్పుచేసినవాడిలా టాక్సీ అద్దంలోనుంచి బయటకు చూడసాగాడు.
   
    జగన్ చెయ్యి కృష్ణ భుజాన్ని చల్లగా తాకింది. కృష్ణకు ఒళ్ళు చెమటలు పట్టాయి.
   
    "సారీ జగన్, నా ఉద్దేశ్యం నీ భార్య లేచిపోయిందనికాదు. మీ ఇద్దరూ ఎప్పుడు విడిపోయారా అని?" అన్న తర్వాత కృష్ణకు అర్ధమైంది పెనంమీదనుంచి పొయ్యిలోకి పడిపోయినట్టు.
   
    ఛ! ఛ! తన బలహీనత అదే. మనసులో ఏ విషయం దాచుకోలేడు ఏది పడితే అదే అనేస్తాడు. జగన్ ఏంచెప్తాడో వింటే పోయేదానికి, ఈ పిచ్చి పిచ్చి ఊహలన్నీ తనకెందుకు రావాలి?
   
    "ఆమె లేచిపోనూలేదు__మేమిద్దరం విడిపోనూలేదు."
   
    జగన్ కంఠంలోని నిర్లిప్తతకు కృష్ణ కలవరపడ్డాడు.
   
    ఆలోచనలు మానేసి రోడ్డు చూస్తూ కూర్చున్నాడు.
   
    "అందుకే ఇది కథకాని కథ అన్నాను తెలిసిందా!" జగన్ పెదవులు క్షణంలో సగంసేపు వణికాయి.
   
    కృష్ణకు తను దిగినకొద్దీ ఊబిలోకి దిగిపోతునట్టుగా ఉంది.
   
    అడయార్ పెట్రోల్ బంక్ దాటగానే జగన్ టాక్సీ డ్రైవరిని లెఫ్ట్ కు తిరగమన్నాడు. మరో రెండు నిముషాల్లో, చిన గేతూ, కాంపౌండులో మామిడిచెట్టు ఉన్న ఇల్లు చూపించి టాక్సీ ఆపమన్నాడు.
   
    గేటుముందు వరండా మెట్లమీద ఎండుటాకులు చిందర వందరగా పడివున్నాయి. కాళ్ళకింద పడి నలిగిపోతున్న ఎండుటాకుల్ని చూస్తూ, "ఈ కొంపలో ఆడవాళ్ళున్న సూచన లేనట్టు ఉంది" అనుకున్నాడు కృష్ణ.
   
    వరండా తలుపులు తెరిచేవున్నాయి.
   
    వరండాలో లైటు వెలుగుతోంది.
   
    టాక్సీ డ్రైవర్ సామాన్లు తెచ్చి వరండాలో పెట్టాడు.
   
    టాక్సీకి డబ్బు చెల్లించి, ఐదుగంటలకల్లా రమ్మని హెచ్చరించి పంపివేశాడు జగన్మోహన్.
   
    "సింహాచలం! సింహాచలం!" వరండా తలుపులు బార్లాగా తెరిచి పిలిచాడు జగన్.
   
    లోపలనుంచి సమాధానం రాలేదు. కృష్ణ గుండెలు దడదడ లాడాయి.
   
    ఏమైవుంటుంది? ఎవరయినా ఇంట్లో జొరబడి__అన్న ఆలోచన కృష్ణ బుర్రలో జొరబడగా జగన్ మొహంలోకి చూశాడు. జగన్ తాపీగా నిబబ్రంగా ఉన్నాడు.
   
    మరి! ఈ కథేమిటో? అనుకున్నాడు కృష్ణ వరండాలోనే నిలబడి,
   
    అంతలో మామిడి చెట్టు నీడలో ఓ ఆకారం కదిలి రావడం కన్పించింది కృష్ణకు.
   
    బాగా రేగిన జుట్టు, లుంగీ, బనీనుతో చక్కగా పొడుగ్గా ఉన్న సింహాచలం వరండాలోకి వచ్చాడు.
   
    వేళ్ళమధ్య సగం కాలిఉన్న బీడీముక్క పారేసి "ఇంత ఆలశం అయిపోయినాదేటి బాబూ?" అన్నాడు.
   
    "ఎక్కడున్నావ్ ఇంతవరకూ?" జగన్ మోహన్ గొంతు కొంత కరకుగా ఉంది.
   
    "ఇల్లీడే ఆ మామిడి గున్నకాడుండాను బాబూ! సల్లగా వుంటే కూకున్నా. గట్నే కునుకు పట్టిపోనాది బాబయ్యా!"
   
    "ఊఁ సరేలే! ఈ సూటుకేస్ తీసుకెళ్ళి గదిలో పెట్టు" అంటూ తాళాలగుత్తి చేతికిచ్చాడు జగన్.
   
    సూటుకేస్ అందుకుంటూ "ఈ బాబుగారెవరూ?" అన్నాడు సింహాచలం కృష్ణ ముఖంలోకి ముఖం చూస్తూ.
   
    అతన్ని చూస్తుంటే కృష్ణకు చిరాగ్గా ఉంది.
   
    "నా స్నేహితుడ్లే! నువ్వు పద!"
   
    సింహాచలం సూటుకేస్ తీసుకొని తిరిగి తిరిగి చూస్తూ లోపలకు నడిచాడు.
   
    జగన్ కృష్ణను గదిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు.
   
    "ఈ మనిషెక్కడ దొరికాడూ? భలే తమాషాగా ఉన్నాడే?" అన్నాడు జగన్ తో కృష్ణ సోఫాలో వెనక్కి వాలికూర్చుంటూ.
   
    "చాలా పెక్యూలియర్ మనిషి. అప్పుడప్పుడు స్క్రూలూజ్ అవుతుంది. ఏవేవో పిచ్చి పనులు చేస్తూంటాడు. కాని చాలా నమ్మకస్తుడు. నన్ను నమ్ముకొనే ఉంటాడు. వెళ్ళమన్నా వెళ్ళడు. నేను వైజాగ్ నుంచి ఇక్కడకొచ్చినప్పుడు తీసుకొచ్చాను. అప్పటినుంచీ నాతోనే ఉంటున్నాడు. వంట బాగా చేస్తాడు."
   
    "ఇలాంటి మనిషిని ఇంట్లో వదిలి బతయికి వెళితే సేఫ్టీ ఏముంటుంది?"
   
    హాలూ, వంటగదీ తప్ప, మిగతా గదులన్నీ బయటికి వెళ్ళేటపుడు నేను తాళం వేస్తాను."
   
    "మీరు ఇద్దరూ తప్ప ఇంత పెద్ద ఇంట్లో ఇంకెవరూ లేరా?"
   
    "లేరు."
   
    "మీ ఫాదరూ, మదరూ?"
   
    "లేరు. వాళ్ళెప్పుసో చనిపోయారు. మా తండ్రిగారు పోయి ఐదారేళ్ళయింది. మా తల్లిగారు పోయి  మూడేళ్ళు దాటిపోయింది."
   
    "అంటే నీ పెళ్ళయ్యేనాటికే నీ తల్లిదండ్రులు పోయారన్నమాట."
   
    "పెళ్ళా?"
   
    కనుబొమలు ముడిచి చూశాడు జగన్మోహనరావు.
   
    కృష్ణకు తనను కొండమీదనుంచి కిందకి లోయలోకి దొర్లించినట్టు ఐంది.
   
    "బాబయ్యా! బాబుగారి గది శుభ్రంచేశాను. ఆరు తానం ఆడతారా?" సింహాచలం జగన్ ముందు నిలబడ్డాడు.
   
    "అది మేము చూసుకుంటాం గాని నువ్వు వంటపని చూసుకో."
   
    "మీకయితే చేసే ఉంచా. ఇంకా ఆరికే సెయ్యాల!" అంటూ సింహాచలం వెళ్ళిపోయాడు.
   
                                           4
   
    భోజనాలయాక సింహాచలం రెండు కుర్చీలు తెచ్చి మామిడి చెట్టు కింద వేశాడు.
   
    సింహాచలాన్ని, తెల్లవారు ఝామున నాలుగింటికే లేవాల్సి వుంటుందనీ వెళ్ళి పడుకోమనీ చెప్పాడు జగన్.
   
    "కృష్ణా! అలా వెళ్ళి బయట కూర్చుందాం రారా!" అంటూ అతడితో మామిడిచెట్టుకిందకు వచ్చాడు జగన్.
   
    ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.
   
    పున్నమివెన్నెల పిండారబోసినట్టుంది.
   
    మామిడిచెట్టు ఆకులసందునుంచి, కిందున్న ఎండుటాకులమీద పడి వెలుగునీడలను అద్దుకొని తెల్లపూలరంగుచీర కట్టుకున్నట్టుగా వుంది నేల.
   
    చల్లటి సముద్రపుగాలికి కదులుతున్న మామిడాకులనుంచి జారిపడుతూన్న వెన్నెల్లో జగన్ ముఖం అదోలా మెరుస్తోంది.
   
    "మనం కలుసుకొని పదేళ్ళయిందనుకొంటాను" అన్నాడు జగన్.
   
    "ఆఁ! దాదాపు అయింది" కృష్ణ సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు.
   
    "ఇంటర్, బి.ఏ. గుంటూరు ఏ.సి. కాలేజీలోనే పూర్తిచేసి ఎం.ఏ. చదవడానికి వైజాగ్ వెళ్ళాను" అంటూ ప్రారంభించాడు జగన్.
   
    "ఎం.ఏ. లిటరేచర్ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి. క్లాసు మొత్తం ఇరవైయొక్కమందిమి వున్నాం. అందులో ఐదుగురు అమ్మాయిలు. యూనివర్సిటీ మొత్తానికి అందగత్తె మా క్లాసులోనే వుంది. యూనివర్శిటీలో ఆమెను బ్యూటీక్వీన్ అని పిలిచేవాళ్ళం. యూనివర్శిటీ కల్చెరర్ ప్రోగ్రాంలో మా ఫస్టియర్ లిటరేచర్ వాళ్ళం ఇచ్చిన "టాబ్లో" మొత్తం ప్రోగ్రామ్స్ లో హైలైట్ అయింది. మొదటి బహుమతి మాకేవచ్చింది. ఆ టాబ్లాయిడ్ ఐడియా నాదే. ఆమె మోనోలిసాగానూ, చిత్రాన్ని చిత్రిస్తున్న ఆర్టిస్టు లియొనార్డోగా నేనూ వేశాము. ఆ చిత్రరూపకల్పనా చిత్రణ రంగంమీద కొద్ది క్షణాలు మాత్రమే అయినా, దాని ప్రభావం మళ్ళీ మేము యూనివర్శిటీ వదిలేదాకా విద్యార్ధుల హృదయాలమీద పని చేసింది. రంగంమీద మేమిద్దరం గడిపిన ఆమధుర క్షణమే, మాహృదయ వీణాతంత్రులను మీటి మా ప్రణయగీతానికి శృతి కలిపింది. ఆ రోజు ఆ మధురక్షణం- ఆమె నా కళ్ళల్లోకి చూస్తూ పెదవులపై తొణికించిన ఆ చిరునవ్వు- ఓహ్! ఏం చెప్పను? తల్చుకుంటే ఇప్పటికీ నావళ్ళు పులకరించి పోతుంది. డావిన్సీ రూపకల్పన సజీవమై కళ్ళముందు కదిలింది. ఫస్టియర్ చివర్లో అలా మొదలైంది మా పరిచయం. ఫైనలియర్ పూర్తిఅయేసరికి మా హృదయాలతోపాటు శరీరాలుకూడా దగ్గరయినాయి.

 Previous Page Next Page