Previous Page Next Page 
తృప్తి పేజి 49


    మధ్యాహ్నం ఒంటిగంట అవుతుండగా అరుణ్, పిల్లలూ వచ్చారు. పిల్లలు వస్తూనే "అమ్మమ్మా! నీకోసం పండ్లు తెచ్చాం" అంటూ గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ తులశమ్మ లేదు. "అమ్మమ్మేదీ?" అంటూ చిందులేస్తూ వచ్చారు. సింధు ఎదురొచ్చి "ఆలశ్యమైపోయింది. డాడీని త్వరగా భోజనానికి రమ్మనండి" అంది. "ముందు అమ్మమ్మెక్కడో చెప్పు" అంది రమ్య. సింధు వేలుపెట్టి వంటింటివైపు చూపించింది. రయ్యిమని లోపలికెళ్ళిన రమ్య ఆశ్చర్యపోయింది. అక్కడ చిట్టెమ్మ బదులు నానమ్మ అప్పడాలు వేయిస్తూ కనిపించింది.
    "నా బంగారు తల్లే! మా బంగారు తండ్రే" అంటూ ఆవిడ వచ్చి ఇద్దర్నీ కౌగలించుకుని ముద్దుపెట్టుకుంది.
    "బామ్మా! ఎప్పుడొచ్చావు?" ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోతూ అడిగింది రమ్య.
    "మళ్ళీ ఎప్పుడెళ్ళిపోతావు?" దిగులుగా అడిగాడు తేజా.
    ఆవిడ నవ్వి "ఇంకెక్కడికీ వెళ్ళను! ఇక్కడే మీ దగ్గరే వుండిపోతాను" అంది.
    బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు అరుణ్. పప్పు వడ్డించి, నెయ్యి వేస్తుండగా వద్దు అంటూ చెయ్యి అడ్డుపెట్టాడు. "రెండు గరిట్లకేనా! ముందా చెయ్యి అడ్డు తీసి శుభ్రంగా కడుపునిండా తిను" అన్న మందలింపు వినిపించింది.
    ఆశ్చర్యంగా తల ఎత్తేసరికి తల్లి కనిపించింది. "అమ్మా! నువ్వా?"
    "ఔనురా" అంటూ చేత్తో తలమీద నిమిరి "నాచేత్తో కడుపునిండా తినిపించాలని బుద్ధిపుట్టి వచ్చేశాను" అంది.
    "అత్తయ్యా! గోంగూర పచ్చడి ఇక్కడే మరిచిపోయారు." అంటూ వంటింట్లో నుంచి వచ్చింది సింధు.
    "దాంట్లోకి రెండు ఉల్లిపాయలు తరుక్కురామ్మా వాడికిష్టం" అందావిడ.
    సింధు నవ్వుతూ అరుణ్ వైపు చూసి "అలాగే అత్తయ్యా" అంటూ లోపలికెళ్ళింది. అరుణ్ కి ఒక్కనిముషం అది కలో నిజమో తెలియలేదు. "అసలు... నువ్వెప్పుడు..." అని అరుణ్ అడుగుతుంటే "నీకు నేను రావాలని లేకపోయినా మా కోడలొచ్చి తీసుకొచ్చింది ఏమంటావు?" అందావిడ.
    "ఎప్పుడూ ఆయన పనే ఆయనది కానీ, వెళ్ళి తల్లిని తీసుకొద్దామన్న ధ్యాసే లేదు. ఎన్నాళ్ళని ఓపిక పట్టనూ! అందుకని ఇక్కడెన్నాళ్ళుంటారూ, మనింటికెళ్ళిపోదాం రండి అని తీసుకొచ్చేశాను" అంది సింధు అరుణ్ వైపు క్రీగంట చూస్తూ.
    "ఏమిటీ మాయ!" అంటుంటే అత్తాకోడళ్ళిద్దరూ నవ్వసాగారు. పిల్లలు చప్పట్లు చరచసాగారు.
    సింధు తులశమ్మ వెళ్ళిపోవడం, తనెళ్ళి అత్తగార్ని తీసుకురావడం అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. రమ్య వెంటనే "ముల్లూపోయీ కత్తీ వచ్చే ఢాంఢాం ఢాం అన్నట్లు అమ్మమ్మా వెళ్ళి నానమ్మా వొచ్చే ఢాంఢాం ఢాం" అనగానే అందరికీ నవ్వొచ్చేసింది.


                                        *    *    *    *


    శిరీషకారోజు జ్వరం నార్మల్ కొచ్చింది.
    "హమ్మయ్యా!" అనుకున్నాడు శేఖర్. జ్వరంలో ఫిట్సు రావడంతో అందరూ తెగ కంగారుపడిపోయారు. మేనమామ వచ్చి "నాకేదో భయంగా ఉందిరా! నువ్విక్కడే ఉండు" అంటూ శేఖర్ ని అస్సలు కదలనివ్వలేదు. శేఖర్ కి కూడా అసలు శిరీష మామూలు మనిషి అయ్యేదాకా మనసు నిలువలేదు. మధ్యలో ఓసారి యమునకి ఆఫీసుకి ఫోన్ చేస్తే రాలేదన్నారు. యమునా వాళ్ళింటికి వెళ్ళి సంగతేమిటో తేల్చేయాలి అనుకున్నాడు. బయల్దేరే రోజున "ఏమ్మా! బావంటే నీకిష్టమేకదూ!" అనడిగాడు తండ్రి శిరీషని.
    "చాలా ఇష్టం నాన్నా!" అంది శిరీష.
    అదిరిపడి తలెత్తాడు శేఖర్.
    శిరీష నవ్వుతూ "కానీ పెళ్ళి చేసుకునే ఇష్టం కాదు నాన్నా. బావ నాకో మంచి స్నేహితుడు అంతే!" అంది.
    "అదేమిటే?" అంది శకుంతలమ్మ తెల్లబోయి.
    "అవునత్తయ్యా! మేనరికాలవి మంచివి కావు తెలుసా? చదువుకున్నవాళ్ళం తెలిసి, తెలిసీ తప్పెందుకు చెయ్యాలీ? కావాలంటే బావనడుగు" అని శేఖర్ వైపు చూసింది.
    "ఇలా అవుతుందనుకోలేదు. ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాను? త్వరలో కోడలొచ్చి నట్టింట్లో తిరుగుతుందని ఎంత సంబరపడ్డాను?" అంది శకుంతలమ్మ కళ్ళనీళ్ళతో.
    "కోడళ్ళకేం తక్కువే, మరోటి చూద్దాం! పిల్లల అభిప్రాయాలకి విలువ నియ్యాలి. వాళ్ళంటున్నదాంట్లోనూ పాయింటుంది" అన్నారు సూర్యారావుగారు.
    శేఖర్ తలమీదనుంచేదో బరువు దిగిపోయిన ఫీలింగు కలిగింది. శిరీషకి మరోసారి కళ్ళతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సాయంత్రానికి శిరీషని తీసుకుని తండ్రి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు "నీ తులసికోటని చూడ్డం పళ్ళేదుకానీ త్వరలో ముహూర్తాలు పెట్టించు కలుద్దాం" అంది నవ్వుతూ.
    శేఖర్ ఏం చెప్పలేక ఆమె చెయ్యి పట్టుకుని నొక్కి వదిలేశాడు.


                                        *    *    *    *


    కావేరికి క్షణం తీరుబడి లేకుండా ఉంది. అప్పటికీ నాలుగురోజులు సెలవు పెట్టింది. అత్తగారు అరిశలు పిండివంటలు పెట్టుకుని కూర్చున్నారు. సుధాకరప్పటికి నాలుగుసార్లు పిలిచాడు. "అబ్బబ్బా వస్తున్నానండి!" అంటూ వంటింట్లోంచొచ్చింది.
    "రేపే పండుగ బట్టలు తేవాలి. ఇప్పటిదాకా నీకు తీరుబడే దొరకలేదు" హడావుడిగా చెప్పాడు.
    "అత్తయ్యగారొక్కరూ చేసుకుంటుంటే ఎలా రాను? నేనొస్తే జయ పన్లోకి దిగుతుంది. నా భయానికలా కూర్చుందిగానీ. పోనీ జయని తీసుకెళ్ళండి బజారుకి" అంది.

 Previous Page Next Page