రమణమూర్తి ఆటోలో కూర్చున్నాడు.
ఆటో సాగిపోయింది.
అనసూయ వీధి తలుపు గడియపెట్టి లోపలకు వచ్చింది.
సావిత్రికి ఇంకా ఎందుకు పెళ్ళెందుకు కాలేదో?
సావిత్రి మితభాషి. తను మహా వాగేది. భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఎన్నో కలలు కనేవారు.
బొద్దుగా తెల్లగా ఉండే సావిత్రి ప్రక్కన తను పీలగా ఉండేది. చామనఛాయ రంగు. సావిత్రి ప్రక్కన ఉన్నప్పుడు ఇంకా నలుపుగా కన్పించేది.
సావిత్రి అతి సాధారణమైన ఆడపిల్లలాగే ఆలోచించేది. ప్రత్యేకమైన అభిప్రాయాలంటూ వుండేవి కావు.
"అమ్మా నాన్న కుదిర్చిన సంబంధం బుద్ధిగా చేసుకుంటాను."
పెళ్ళి విషయం వచ్చినప్పుడు సావిత్రి అనేది.
"నేను చస్తే అలా చేసుకోను, నేను చేసుకోబోయే వ్యక్తి నాకు తెలిసినవాడై ఉండాలి. కొంతకాలం కేవలం స్నేహంగా వుండి ఒకర్నొకరు అర్ధం చేసుకున్న తర్వాతే పెళ్ళి ప్రస్తావన అనేది తను."
ఈ పాటికి ఆయన ట్రైన్ లో కూర్చుని ఉంటారు.
ఆయన ఉత్సాహం అంతా నీరు కారిపోయింది.
ఈ సావిత్రి ఇప్పుడే రావాలా?
తను ప్రక్కన ఉండదు. రాత్రిళ్ళు పడుకొని మొదటి భార్యను తల్చుకుంటాడు.
ఆ ఆలోచన రాగానే అనసూయ మనసులో ఏదో కదిలినట్టు అయింది.
ఛ! తను ఇలా ఆలోచించడం ఏమిటి?
చనిపోయిన వ్యక్తి మీద తను అసూయ పడటంఏమిటి?
ఉన్నట్టు ఉండి ఆయన మానసిక స్థితిని తను అర్ధం చేసుకోవడానికి ఏనాడు ప్రయత్నించలేదు.
సావిత్రి తన సంసారం గురించి ప్రశ్నలు వేస్తుంది.
"అన్ని కోతలు కోశావ్! మరి పెద్దవాళ్ళు కుదిర్చిన వ్యక్తినే చేసుకున్నావుగా?" అని ఎక్కి పొడుస్తుందేమో!
4
అనసూయ ప్లాట్ ఫారం గంట టికెట్ కొనుక్కొని స్టేషనులోకి నడిచింది. ట్రైన్ అర్ధగంట లేటు. బెంచీమీద కూర్చుని కాలేజీ రోజుల్లోని స్మృతులను నెమరువేసుకోసాగింది.
ఎంతో కాలానికి తన స్నేహితురాల్ని చూడబోతోంది. చెప్పుకోవడానికి ఎన్నో కబుర్లున్నాయ్.
పాపం! ఆయన తను రావడం లేదని తెలిసి దిగాలు పడిపోయారు. ఊటీ వెళ్ళకుండా మద్రాసు నుంచే తిరిగి వస్తారు. ఇంత కాలం రాని సావిత్రి ఇవ్వాళ్ళె రావాలా?
సావిత్రి పెళ్ళెందుకు చేసుకోలేదో! తగిన వాడుదొరకలేదేమో! కాని చదువుకునే రోజుల్లో పెళ్ళిని గురించి సావిత్రికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండేవి కాదు. అమ్మా నాన్న కుదిర్చిన వాణ్ణి చేసుకుంటాననేది.
అతి మామూలు మనిషి అనుకునేది సావిత్రిని గురించి.
బండి వచ్చింది.
అనసూయ లేచి నిల్చుంది.
ఒక్కొక్క కంపార్టుమెంటే కళ్ళముందు నుంచి సాగిపోతుంటే సావిత్రి కోసం ఆత్రంగా చూడసాగింది.
ఫస్టుక్లాసు కంపార్టుమెంటు కటికీ నుంచి ఎవరో చెయ్యి ఊపారు. ముఖం సరిగ్గా కన్పించలేదు. పరుగులాంటి నడకతో ఆ కంపార్టుమెంటు దగ్గరకు వెళ్ళింది.
*హాయ్ అనూ! కిటికీ లోనుంచి చూస్తూ అన్నది సావిత్రి.
"రా? రా! దిగు!"
సావిత్రి సూట్ కేసు పట్టుకొని తలుపు దగ్గిరకు వచ్చింది. అనసూయ సావిత్రి చేతిలోని సూట్ కేసు అందుకుంది.
స్నేహితురాళ్ళిద్దరూ చేతులు కలుపుకున్నారు. ఒకరి ముఖంలోకి ఒకరు ఆప్యాయంగా చూసుకున్నారు. కూలీవచ్చి పెట్టే, బ్యాగు అందుకున్నాడు.
ఇద్దరూ కూలీ వెనకాలే నడుస్తున్నారు.
తెల్లగా మొద్దుగా ఉండే సావిత్రి సన్నగా పాలిపోయి ఉంది. అనసూయ సావిత్రిని ఆశ్చర్యంగా చూసింది.
"అనూ నువ్వు లావెక్కావోయ్."
"నువ్వు చిక్కిపోయావ్!"
సమాధానంగా సావిత్రి చిరునవ్వు నవ్వింది.
"స్టేషనుకు మీవారు రాలేదేం?"
"తర్వాత మాట్లాడుకుందాం పద!" మనుషుల్ని తప్పుకుంటూ నడక సాగించింది అనసూయ.
ఇద్దరూ టాక్సీలో కూర్చున్నారు.
అనసూయ కూలీకి డబ్బు ఇచ్చింది.
"అరే! నువ్వు ఇచ్చావా? నేను ఇచ్చేదాన్నిగా?"
"ఎవరిస్తే నేం?"
టాక్సీ కదిలింది.
"నా సూట్ కేసు డిక్కీలో పెట్టారా?"
"ఆఁ"
"అందులో ఉన్న డబ్బు నగలూ ఉన్నాయ్!"