Previous Page Next Page 
మానిని మనసు పేజి 6


    ''పర్వాలేదులే''
    "ఇప్పుడు చెప్పు మీ వారిని తీసుకురాలేదేం? దిష్టి తగులుతుందని భయమా?"
    "నీ ముఖం ఆయన ఊళ్ళోలేరు. మద్రాసు క్యాంపు వెళ్ళారు."
    "నువ్వూ ఆయన క్యాంపులకు వెళ్తుంటావా?"
    "వెళ్ళను కాని ఈసారి వెళ్దామనుకున్నాం. అక్కడ్నుంచి ఊటీకూడా వెళ్లాలని ప్లాను వేసుకున్నాం. టిక్కెట్లు కూడా కొన్నాం. అంతలో నీ టెలిగ్రాం వచ్చింది. నేను ఆగిపోయాను."
    "అయ్యయ్యో! నేను మీ హనీమూన్ కు అడ్డం వచ్చానా? సారీ!"
    "నీ మొహం ఆరునెలల తర్వాత హనీమూన్ ఏమిటి? మరోసారి వెళ్తాం."
    "నాకు చాలా బాధగా ఉంది అనూ ఇలా ప్రయాణం నా వల్ల ఆగిపోయినందుకు."
    "అవేం మాటలే! మరోసారి వెళతాం. నువ్వు వస్తున్నానంటే నాకెంత సంతోషం కలిగిందో తెలుసా?"
    "నిజంగా?"
    అనసూయ సావిత్రి ముఖంలోకి చూసింది. ముఖంపాలిపోయి ఉన్నది. కళ్ళల్లో జీవం లేనట్టు తోచింది.
    ఏమైంది దీనికి?
    మూడేళ్ళకే ఒక మనిషిలో ఇంత మార్పు వస్తుందా?
    "ఏమిటే నన్ను అలా చూస్తున్నావ్? కొత్తగా కన్పిస్తున్నావా?" సావిత్రి నవ్వింది. ఆ నవ్వు బోలుగా ఉన్నది.
    "ఏమిటే మరీ అలా అయిపోయావ్?"
    "ఎలా అయిపోయానూ! బాగానే ఉన్నానే!"
    "ఏం బాగు చాలా చిక్కిపోయావ్?"
    "చాలా కాలానికి చూశావుగా అందుకే నీకు అలా అన్పిస్తుంది. మీ ఆయన ఎలా వుంటారు? నిన్ను ప్రేమగా చూస్తారా?" అంటూ ప్రారంభించి తమ క్లాసుమేట్సు ఎవరికి పెళ్ళిళ్ళు అయిందీ, వాళ్ళ సంసారాలు ఎలా ఉందీ చెప్పసాగింది.
    అనసూయకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సావిత్రి గలగల మాట్లాడేస్తుంది.
    సావిత్రి ఒకప్పుడు చాలా తక్కువ మాట్లాడేది. కొత్త వాళ్ళతో అసలు మాట్లాడేది కాదు. చాలామంది ఆమెకు గర్వం అనుకునేవాళ్ళు. అప్పుడు రూపంతోపాటు స్వభావంలో కూడా మార్పు వచ్చింది.
    "ఏమిటే అనూ! నేను చెబుతున్నది వింటున్నావా?"
    "ఆఁ వింటున్నాను."
    "ఏమిటే అలా ముంగిలా కూర్చున్నావ్? ఒకప్పుడు తెగ మాట్లాడేదానివి. మీ ఆయనకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదా?"
    "ఏది నన్ను మాట్లాడనిస్తేగా? గలగల నువ్వే మాట్లాడేస్తుంటివి. ఒకప్పుడు నీకు 'ముంగి' అని నిక్ నేమ్ పెట్టి కాలేజీలో పిల్చేవాళ్ళు. పదిమాటలకు ఒక్క మాటలో సమాధానం ఇచ్చే దానివి. ఇప్పుడు నువ్వలా గలగల మాట్లాడేస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది."
    సావిత్రి సమాధానంగా నవ్వేసింది.
    టాక్సీ యింటి ముందు ఆగేంత వరకూ సావిత్రి మాట్లాడేస్తూనే వుంది.
    "కబుర్లు తర్వాత చెప్పుకుందాం. ముందు స్నానం చెయ్యి" అన్నది అనసూయ.
    సావిత్రి స్నానం చేసి వచ్చింది.
    ఇద్దరూ టిఫెన్ముందు కూర్చున్నారు.
    వైజాగ్ లో బి.ఏ. చదివే రోజులు గుర్తుచేసుకున్నారు. తండ్రి చనిపోయాక అనసూయ తల్లితో తన గ్రామం వెళ్ళిపోయింది. సావిత్రికి ఎం.ఏ. చదవాలని ఉండేది. బి.ఏ పూర్తిచేసి పెళ్లి చేసుకుంటాననేది. అనసూయ ఎం.ఏ పూర్తి చేసికాని పెళ్ళిసంగతి ఆలోచించను దేనికి? పరిస్థితులు కలిసిరాక ఎం.ఏ. చదవలేకపోయింది. అనసూయ బి.ఏ. పూర్తి అయాక స్నేహితురాళ్ళిద్దరూ ఇదే కలుసుకోవడం.
    "ఏమే బొత్తిగా ఉత్తరాలు రాయడం మానేశావ్?"
    "నువ్వు రోజూ వుత్తరాలు రాసినట్టే అడుగుతున్నావ్?" అన్నది సావిత్రి నిష్ఠూరంగా.
    "నేను రాశాను గదే!"
    "అవును! మొదటి సంవత్సరం మూడు ఉత్తరాలు రాశావ్. రెండో సంవత్సరం ఒకటి రాశావ్. అంతేగా?"
    "నా పెళ్ళయ్యాక నీకు ఉత్తరం రాశాను గదే!"
    "పెళ్ళయాక రాశావ్! అందుకే కోపం వచ్చి సమాధానం ఇవ్వలేదు. పెళ్ళికిముందు రాస్తే పెళ్ళికి వచ్చేదాన్నిగా!"
    "సారీ! ఈ సంబంధం అనుకోకుండా కుదిరింది. మా ఆయన దండల పెళ్ళి కావాలన్నారు. ఓ పదిమంది మధ్యలో దండలు మార్చుకున్నాం."
    "మీ ఆయన సంఘ సంస్కారి అన్నమాట!"
    అనసూయ నవ్వేసింది.
    "ఒకటి అడగనా అనూ!"
    "అడుగు!"
    "ఏమీ అనుకోవు గదూ?"
    "నీ మొహం నిన్ను నేను ఏమనుకుంటానే?"
    "పెద్దలు కుదిర్చిన పెళ్ళి చస్తే చేసుకోననేదానివి. ముక్కూ మొహం తెలియని వాడితో పెళ్ళేమిటి అనేదానివి మరి పెద్దలు కుదిర్చిన వాడిని ఎలా చేసుకున్నావ్?"
    "అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇన్ని కథలూ, కన్నీళ్ళు ఎందుకుంటాయ్?"
    సావిత్రి అనసూయను చూస్తూ కూర్చుంది.
    "చదువుకున్ రోజుల్లో ఎన్నో కలలు కంటాం ఎన్నో ఆదర్శాలను వల్లిస్తాం. ఎన్నో చేయాలనుకుంటాం. కాని జీవితంలో అన్నీ సాధ్యం కావు. కల్పన వేరు. వాస్తవం వేరు. మా నాన్న పోయారు చదువు ఆగిపోయింది. అమ్మకూ, అన్నయ్యకూ నా పెళ్ళి ఒక సమస్యగా తయారయింది అందుకే...
    "ఊఁ ఆగిపోయావేం? అలాంటి పెళ్ళి చేసుకున్నందుకు ఇప్పుడు విచారిస్తున్నావా?"
    "లేదు. ఆయన చాలా మంచివారు. నేను ఏరికోరి చేసుకున్నా బహుశా అంతకంటే మంచి వ్యక్తి దొరికివుండేవాడు కాదనిపిస్తుంది. ఎన్ని ప్రేమ వివాహాలు విచ్ఛిన్నం కావడం లేదు. ఆయన నన్ను గౌరవిస్తారు. ఎంతో ప్రేమగా చూస్తారు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని సావీ!"

 Previous Page Next Page