Previous Page Next Page 
అనుహ్య పేజి 4

     

                                                       రెండవవారం   సీరియల్  


    పెళ్ళివారు అట్టహంగా తరలివచ్చారు. వివేక్ వెంట రకరకాల దుస్తుల్లో వచ్చిన అతని ఫ్రెండ్స్ ని  చూసి  అమ్మమ్మ లబలబలాడుతూ గుండెలు బాదేసుకుంది.
    "ఏవిటే పగటివేషగాళ్ళలా  ఆ వేషాలూ? చెవులకి జూకాలూ, జుట్టుకి తాళ్ళూ కట్టుకున్నారు? ఆడామగా  కాని స్నేహితుల్ని ఎక్కడ్నుండి పట్టుకొచ్చాడే మీ ఆయనా?" అంది.
    'మీ ఆయనా ' అన్నమాటకి నా గుండె ఝల్లుమంది.
    గుండెలమీద మంగళసూత్రం  బరువు పడేంతవరకు అది అలా బేలగా ఝల్లుమంటూనే వుంటుందేమో మరి!
    "స్నానాలు లేవు పానాలు లేవు పేకాట వేసుకు కూర్చున్నారు. కాఫీలూ, టిఫిన్లూ అలా పాచి ముఖాల  తోటే కానిచ్చేస్తారా? ఇవేం  పట్నం సోకులమ్మా!" అని బుగ్గలు నొక్కుకుంటూ  విస్తుపోయింది నాకు వరసకు మేనత్త ఒక ఆవిడ.
    రెండు చేతులకి గోరింటాకు పెట్టుకుని కూర్చున్న నేను విజయతో- "కాస్త వీపుమీద దులపనే, చీమ పాకుతున్నట్లుంది" అన్నాను.
    చెవుల్లో బీటిల్స్ పెట్టుకుని మా హోరు నుండి  తప్పించుకుంటున్న  విజయ "ఏవిటే?అంది
    నేను మళ్ళీ చెప్పాను.
    దానికి వినపడలేదు. దాని చెవుల్లోంచి వాక్ మన్ పీకిపారేసి చెప్దామంటే  నా చేతులకి  గోరింటాకు! నా పాట్లు నేను పడ్తుండగా వివేక్  దగ్గర్నుండి రాయబారం వచ్చింది. అర్జెంటుగా కలుసుకోమని!
    అమ్మమ్మకి  చెప్పాలో వద్దో తెలియలేదు.
     విజయని మోచేత్తో సుతారంగా పొడిచి  అతను పంపిన చీటి చూపించాను.
    అది చదివి "వెళ్ళు.... ఇప్పటికే ఆలస్యంచేశాడు. నేనైతే నీలాంటి బ్యూటిని ఈపాటికే ఓ పట్టు పట్టి వుండేదాన్ని"  అంది.
    "కానీ....అమ్మమ్మ...." నసిగాను విజయ నావైపు అదోలా చూస్తూ-
    "నీ తీరు మార్చుకోకపోతే కష్టాల్లోపడ్తావే పిల్లా! అమ్మమ్మ జపం ఇంక కట్టిపెట్టు" అంది.
    "ఏవిటే అమ్మమ్మ అంటున్నారూ?" అంటూ అమ్మమ్మ రానే వచ్చింది.
    "మరేం...." అని చెప్పబోతున్న నా నోరు గట్టిగా మూసి-" వంటబ్రాహ్మడు ఇందాకట్నుండి మీకోసం  వెతుకుతున్నాడు అమ్మమ్మా..... వెళ్ళి ఆ సంగతి చూడండి!" అంది విజయ.
    "ఇప్పడేకదే ఆ మూలనుండి వచ్చానూ....మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళాలిలా వుంది. అన్నీ  ఓసారి చెప్పిఏడవకూడదూ నన్నిలా విసిగించకపోతే" అంటూ ఆవిడ వెళ్ళిపోయింది.
    "ఇంకో పావుగంటదాకా ఆవిడరాదు! ఊ....క్విక్.... వెళ్ళిరా" విజయ తొందరపెట్టింది.
    దానికేం? సరదాగానే  వుంటుంది. నా గుండెలు గుబగుబలాడి కాళ్ళల్లోంచి వణుకు పుట్టుకొచ్చింది. అడుగులో అడుగు  వేసుకుంటూ  నెమ్మదిగా విడిదివైపు నడిచాను. ఈ విషయం అమ్మమ్మకి తెలిస్తే చంపేస్తుందేమోనన్నంత భయంగా వుంది!
    మామిడితోరణాల  వనవాసనలూ, తాటాకు పందిళ్ల చల్లదనం, గొల్లున నవ్వుతూ , మాట్లాడుకునే మనుషులూ....కొత్తగా వింతగా వుంది!
    వివేక్ ఫ్రెండ్స్  తో  మంచి జోరుగా వున్నాడు.
    నేను వెళ్ళి వాళ్ళకి కాస్త దూరంలో గుంజకి ఆనుకుని నిలబడ్డాను.
   అతని ఫ్రెండ్స్ నన్ను చూసి "మీరు  మాట్లాడ్తూ వుండండి" అని  తప్పుకున్నారు.  
    వివేక్ సిగరెట్ వెలిగించి పొగవదులుతూ " కమ్... కూర్చోండి " అన్నాడు.
    నాకు సిగరెట్ పొగకి కడుపులో తిప్పింది.
    నాకు సిగరెట్ వాసన పడదు" అన్నాను.
    "ఎలా తెలుసు? వివేక్  నవ్వాడు.
    "అసలు అనుభవిస్తే  కదా ఏ సంగతై నా పడ్తుందో లేదో తెలిసేది?" అన్నాడు.
    ఏవిటీ మనిషి? ప్రతిదానికి వితండవాదం చేస్తాడు? మొదటిసారి మా సంభాషణ ఇలా ప్రారంభం అవడం నాకు నచ్చలేదు.
    "ఏవిటా చేతులకి? పేడలా?" అన్నాడు.
    నాకు ఒళ్ళుమండిపోయింది. "గోరింటాకు అందం....రంగులు పూసుకుని తిరిగే సంస్కృతిలోంచి వచ్చినవాళ్ళకేం తెలుస్తుందిలెండి" అన్నాను.
    వివేక్ తల  వెనక్కు పెట్టి  పకపకా నవ్వాడు.
    "నువ్వూ మాట్లాడగలవే.... సారీ.... నువ్వు అని  వచ్చేసింది" అన్నాడు.
    "నువ్వు అనే అనాలి"అన్నాను.
    "మరి నువ్వుకూడా నువ్వు అనాలి నన్ను" అన్నాడు అతను.
    నేనేం  మాట్లాడలేదు ఇదేదో బాగానే వున్నట్లనిపించింది.
    "ఈ గోరింటాకు ఏర్పాటు నా మంచికే వచ్చింది. నేనేంచేసినా నీ చేతులు అడ్డుకోలేవు!" అని దగ్గరగా జరిగాడు.
    "అంటే?" అని అడుగుతున్న నా పెదవులకి ఏం జరిగిందో తెలిసే లోగానే అతని పెదవులతో మూసేశాడు. నా నడుముని బలంగా పట్టుకుని తనకేసి  అదుముకున్నాడు. అరక్షణం నా శరీరం నా వశం తప్పింది. అతని పెదవులలో  అంత మాధుర్యం  దాగుందా? అనిపించింది. అతనిచేతుల్లో  నలుగుతున్న నా శరీరం ఇంకా ఏదో కావాలని ఉవ్విళ్ళూరింది అంతలోనే  నా వివేకం  వెన్నుతట్టింది.
 

 Previous Page Next Page