"నా కూతురా నీ కూతురా!" అన్నట్టు సరస్వతమ్మ భర్త ముఖంలోకి చూసింది సవాలు చేస్తున్నట్టు.
ధర్మయ్య నవ్వుకున్నాడు.
"పదమ్మా! బండికి టైమవుతోంది" అన్నాడు హడావిడిగా వాకిట్లో నిలబడివున్న సవారి బండికేసి నడుస్తూ.
"వస్తానమ్మా!" మరోసారి తల్లికి చెప్పి సునంద తండ్రిని అనుసరించింది.
తల్లి కూతురి వెనకే బండి దగ్గరకి వచ్చి నిల్చుంది.
తల్లీ కూతుళ్ళ కళ్ళలో నీళ్లు తిరిగాయి. సరస్వతమ్మ ఉబికివస్తున్న దుఃఖాన్ని అతికష్టంమీద అణచుకుంటోంది.
"ఏమిటే ఆ ఏడుపు? ఇప్పుడు అమ్మాయి ఎక్కడకు వెళుతుందని? మూడు నెలల్లో సెలవలు రానే వస్తాయి" అన్నాడు ధర్మయ్య.
"పదహారేళ్ళు దాన్ని అంటిపెట్టుకొని నీడగా వున్నాను_" ఆపైన మాటలు పెగల్లేదు.
"ఇకచాల్లే ఊరుకో. శుభమా అంటూ అది చదువుకోటానికి వెళుతుంటే దీవించి పంపాల్సిన దానివి...."
"నా దీవెనలు ఎప్పుడూ వుంటాయి" మధ్యలోనే అందుకొని అన్నది సరస్వతమ్మ.
"వస్తానమ్మా! సెలవు లివ్వగానే వచ్చేస్తాగా!" మరోసారి చెప్పి బండి ఎక్కింది సునంద.
ధర్మయ్య బండి ఎక్కి వెనక కూర్చున్నాడు. "పోనియ్ రా ఏసోబూ"! అన్నాడు బండి తొట్లో కూర్చున్న ఏసోబుతో.
బండి కదిలింది. సరస్వతమ్మ కన్నీరు కట్టలు తెంచుకుంది. బండి వీధి మలుపు తిరిగిందాకా చూస్తూ నిల్చుంది. బండి కనుమరుగు కాగానే లోపలకు వచ్చింది. ఇంట్లోని ప్రతివస్తువూ కదిలిపోయిన ఫోటోగ్రాపులా కన్పించింది_కన్నీరు నిండిన ఆమె కళ్ళకు.
రైలు స్టేషనులో సునంద పక్కన సామాను పెట్టుకొని బెంచీమీద కూర్చుండి.
ధర్మయ్య టికెట్ కొనితెచ్చి సునంద చేతికి ఇచ్చాడు.
"చూడమ్మా పట్నం జీవితం! కాలేజీ వాతావరణం. అక్కడ అనేక ప్రలోభాలు వుంటాయి జాగ్రత్త తల్లీ!"
"ఆ మాటే అమ్మ అన్నప్పుడు నువ్వన్న మాటలు మర్చిపోయావా నాన్నా!" అన్నది సునంద తండ్రి ముఖంలోకి చూస్తూ.
"అవును తల్లీ! నువ్వు నా బంగారు తల్లివి. నా కలల పంటవి. నా ఆదర్శాల, ఆకాంక్షల ప్రతిరూపానివి. వివేకవంతురాలివి. నేను నీకేమీ చెప్పనక్కర్లేదు తల్లీ" అన్నాడు ధర్మయ్య.
"నువ్వు నన్ను నీ ఆదర్శాలకు అనుకూలంగా పెంచావు నాన్నా! నువ్వు ఆశించిన దానికంటే ఆదర్శంగా నిలబడాలనేదే న జీవిత ధ్యేయం నాన్నా!" అన్నది సునంద.
"తల్లీ!" అప్యాయంగా సునంద తల నిమిరాడు ధర్మయ్య.
కంఠం బొంగురు పోయింది. కళ్ళలో నీరు తిరిగింది.
"నాన్నా! అమ్మను కోప్పడ్డావు. ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావా?" తండ్రి ముఖంలోకి బాధగా చూస్తూ ప్రశ్నించింది.
"లేదు తల్లీ, ఏడవటంలేదు. ఇవి ఆనందబాష్పాలు. నా గుండెలు ఆనందంతో పొంగిపోతున్నాయమ్మా!" అంటూ ఉత్తరీయంతో కళ్ళు వత్తుకున్నాడు ధర్మయ్య.
సునందను రైలు ఎక్కించి కాలినడకన తిరుగు ప్రయాణం పట్టాడు ధర్మయ్య, కాలువగట్టున నడుస్తున్న ధర్మయ్యకు మనస్సు ఎంతో తేలిగ్గా వున్నట్టు అనిపించింది.
అతని మనస్సు నిండా సునంద. బుర్ర నిండా ఆమెను గురించిన ఆలోచనలు. అరవయ్యోపడిలో వున్న ధర్మయ్య ఉత్సాహంగా, ఊపుగా నడుస్తున్నాడు.
"దండాలండీ దొరగోరూ!" వెనకనుంచి వచ్చిన యల్లమంద వినయంగా నమస్కరించాడు.
"ఏరా! ఎక్కడ్నుంచి?" ధర్మయ్య నడక వేగం తగ్గించి అడిగాడు.
"బుర్రిపాలెం నుంచి దొరా! పెద్దమ్మాయికి పురుడొచ్చింది."
"అట్లాగా? ఏం బుద్ధా? తల్లీ బిడ్డా కులాసాగా వున్నారా?"
"మగబిడ్డ! ఇద్దరూ బాగానే వున్నారు. తమరు ఎక్కడ్నుంచి బాబూ?"
"అమ్మాయిని రైలు ఎక్కించి వస్తున్నానురా!"
"అమ్మాయిగోరు ఎక్కడి కెళ్ళారు?"
"చదువుకు పట్నం వెళ్ళింది. కాలేజీలో చేరింది" అన్నాడు ధర్మయ్య సంతోషంగా.
"అట్టాగా బాబూ? అమ్మాయిగోరు పెద్దచదువులు హడివి ఉద్యోగం చేస్తారన్నమాట!"
ధర్మయ్య జవాబుగా నవ్వాడు.
"దొరా! నేనొక టిన్నాను. నిజమేనా?"
"ఏంటిరా అది?"
"అదే బాబూ! పొలం అమ్మేశారంటగా? మొనగాడి పొలం బాబూ అది. చాలా చవగ్గా అమ్మేశారంట! నిజమేనా?"
"అవున్రా యల్లమందా! అవసరం మనది. ఏం చేస్తాం అమ్మాయిని పట్నంలో చదివించడమంటే మాటలా? ఏమీ అమ్మకుండా పెద్దచదువులు ఎట్లాగరా చదవడం?" అన్నాడు ధర్మయ్య.
"ఈ పంట?...."
"ఈ పంట నుంచి వాళ్ళ స్వాధీనమేరా?"
"ఏంటో దొరా! నాకేం బాగాలేదు. భేషుకైన పొలం. ఎకరం ఐదువేలకే అమ్మేశారు" అన్నాడు యల్లమంద బాధపడుతూ.
రోడ్డుకు ఆ చివర వరకూ వచ్చి ఆగిపోయిన పెద్దకారును చూస్తూ నిలబడిపోయారు ఇద్దరూ.
కార్లో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. నౌకర్లు కార్లో నుంచి సామాన్లు దించి మోస్తున్నారు. ఇద్దర్లో పెద్దవాడైన వ్యక్తి డ్రైవర్ తో ఏదో చెప్పాడు ఇద్దరూ నౌకర్లతోపాటు గనెంమీద నడక సాగించారు.
"ఎవర్రా యల్లమందా ఆ కార్లోంచి దిగినవాళ్లు?" పరకాయించి చూస్తూ ధర్మయ్య యల్లమందను అడిగాడు.
"ఆరా! ఆ పెద్దాయన పరమేశం గోరు కదూ?" అన్నాడు యల్ల మంద.
"పరమేశమా? ఎంత మారిపోయాడు?"
"అవును దొరా! ఆరు ఇప్పుడు రాజకీయాల్లో వున్నారంట బాబూ?"
"ఆ కుర్రాడెవర్రా?"
"ఆరి మేనల్లుడు శేఖరం బాబుగోరు. పట్నంలో చదువుతున్నారు గదండీ! ఆరే!" అన్నాడు యల్లమంద.
"ఎట్టెట్టా? శేఖరమా? ఇంతప్పుడు వాళ్ళ నాన్న బ్రతికుండగా చూశాను. బుద్ధిమంతుడని విన్నాను."
"అవును దొరా! అబ్బగుణాలు అబ్బలేదు. బీదా బిక్కీ అంటే ఎంతో ఇదిగా చూస్తారు."
యల్ల మందతో కబుర్లు చెప్పుకుంటూ ధర్మయ్య ఊరు చేరాడు.
దిగాలుపడి నట్టింట్లో చతికిలబడియున్న భార్య పక్కనే కూర్చుంటూ "ఎందుకే అంత దిగులుగా వున్నావు? ఇప్పుడు అమ్మాయి ఏ కానిదేశం వెళ్ళిందని. హైదరాబాదేగా? ఓ పాతిక రూపాయలు మనవి కాదనుకుంటే, తల్చుకున్నప్పుడు వెళ్ళి చూసి రావచ్చు" అన్నాడు.
"అబ్బే! నాకు దిగులెందుకు? నా బంగారు తల్లి పెద్ద చదువులు చదివి, గొప్ప పేరు సంపాదించుకోబోతుంటేను?" అన్నది సరస్వతమ్మ కళ్ళు వత్తుకుంటూ.
4
ఊరికి దూరంగా వున్న రావుసాహెబ్ గారి రెండు అంతస్తుల మేడ, ఆ మేడ చుట్టూ వున్న ఎత్తైన ప్రహరీ గోడలూ, ఆ గోడలమీద పోయినవి పోగా ఇంకా మిగిలివున్న గాజుపెంకులూ, రావుసాహెబ్ గారి ఒకనాటి వైభవాన్ని చాటిచెపుతున్నాయి. గతకొన్ని సంవత్సరాలుగా ఆ భవనంలో ఎవరూ ఉండటం లేదనేది, చూడగానే అర్ధం అవుతుంది.
పరమేశం హాల్లో, రావుసాహెబ్ గారు ఒకప్పుడు కూర్చునే....పాత పడినా రాజసం తగ్గని కుర్చీలో కూర్చుని వున్నాడు. ఆ పక్కనే శేఖర్ కూర్చుని వున్నాడు. చుట్టూ కొందరు ఊళ్ళోని పెద్దమనుష్యులు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. పరమేశం అతివినయంగా, ఎంతో ఆప్యాయతను చూపిస్తూ అందర్నీ సంతోషపెట్టే ధోరణిలో మాట్లాడటం, పెద్దమనుష్యుల్లో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొందరికి సంతోషం కలిగితే, మరికొందరికి అతని ప్రవర్తనమీద సందేహం కలిగింది. ఏదో పెద్ద పని మీదే పరమేశం ఆ గ్రామం వచ్చి వుంటాడనేది దాదాపు అందరికీ అనిపించింది.
హాలు మధ్యలో పులిచర్మం పరిచివుంది. గోడల మీద నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు వేలాడుతున్నాయి. రావుసాహెబ్ గారి చిత్రానికి రెండువైపులా రెండు చిరుతపులి తలలూ, ఆయన భార్య చిత్రానికి రెండు దుప్పి తలలూ తగిలించి వున్నాయి.
హాల్లో పాతకాలపు కుషన్ కుర్చీలతోపాటు, నైలాన్ టేపుతో అల్లిన అధునాతన అల్యూమినియం రాడ్స్ గల కుర్చీలు కూడా వున్నాయి. పాత కొత్తల కలయిక అదో ఆకర్షణీయంగా వుంది.
"ఆహా! ఆ హుందాతనం.... ఆ గాంభీర్యం.... ఆ నిండుతనం....చూస్తుంటే రావుసాహెబ్ గార్ని సజీవంగా చూస్తున్నట్టే అనిపిస్తోంది నాకు" అన్నాడు పరమయ్య రావుసాహెబ్ గారి తైలవర్ణ చిత్రంకేసి కన్నార్పకుండా చూస్తూ.