Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 4


    రేణుకకు ఏంమాట్లాడాలో బోధపడలేదు.


    "ఎలా చెబుతుందే? ఆయనగారేమో సుద్ధబుద్ధావతారం!" అన్నది సుధ.


    "మనభారతదేశం కర్మభూమి! ప్రయత్నించు అతన్ని నీవైపు చూసేలా చెయ్యి" అన్నది వాణి.


    "ఏ చూపులూ లేకుండానే ఇంత పెద్దపెద్ద నిట్టూర్పులు తీస్తుందనుకుంటున్నారా?" అన్నది సుధ.


    "ఏమిటే మీగోల" అన్నది రేణుక బిక్కమొహం పెట్టి.


    "ఆ రుషి పుంగవుణ్ణి ఆకర్షించే ఉపాయం చెప్పనా?"


    "చెప్పవే! ఊ త్వరగా?" అన్నది వాణి.


    "మధ్యలో నీకెందుకు అంత తొందర?" అన్నది మీనాక్షి.


    పాపం దానికి నోట్లో నాలుక లేదే! ఇద్దరూ ఇద్దరే! మనమన్నా కలిసి సహాయం చేద్దామని"


    "అయితే చెప్పనా?"


    "నేను వెళ్ళిపోతా మీరిట్లా వాగితే!" అంటూ రేణుక లేచినిల్చుంది.


    "కూర్చోవే! నీకు సహాయం చేద్దామని మేంచూస్తుంటే....ఎందుకే అంత కోపం!" అన్నది సుగంధి.


    "కోపం కాదు. నటన!" సుధ అన్నది.


    అందరూ సుధకేసి చూశారు.


    "నేనేం నటించడం లేదు. అలాంటివి నాకు చేతకావు"


    "అంటే నాకు చేతనవుతాయనా నీ ఉద్దేశం!" సుధ కంఠం తీవ్రంగా ఉంది.


    "సుధా! మరీ అంత ఇదిగా మాట్లాడకు. ఇప్పుడు రేణుక నిన్నేమన్నదని, కూర్చో రేణూ!" అంటూ చెయ్యిపట్టుకొని లాగి కూర్చోపెట్టింది సుగంధి.


    "సుగంధికి ఇలాంటి ట్రిక్స్ బాగా తెలుసు, కూర్చోవే రేణూ! ఊ చెప్పు సుగంధీ!"


    "అదుగో అలా పిలిస్తే వీపు చిట్లగొడతానని చెప్పాను. గుర్తుందా?"


    "అబ్బబ్బ! అసలు సంగతి తేల్చండే. ఇంతకీ ఆ రాజకుమారుడ్ని తనవైపుకు ఆకర్షించుకోవాలంటే రేణుక ఏం చెయ్యాలి?" అడిగింది మీనాక్షి.


    "ఇదిగో చెబుతున్నా! రేణూ! శ్రద్ధగా విను! అతన్ని ఓరచూపులతో చూడు. పసివాడు మిఠాయి కేసిచూసినట్టు చూడు. నీ అందమైన మెడను కొంచెం పైకెత్తి, పక్కకు విరిచి నెమలిలా చూడు! అతని ముందు నుంచి చిన్నగా రాజహంసలా నడుస్తూ, మధ్య మధ్య వెనక్కు చూస్తూ నడువు."


    "తల్లీ! ఇక చాలు! ఆపు!" రెండు చేతులూ జోడిస్తూ అన్నది రేణుక. వస్తున్న నవ్వును పెదవుల మధ్య బలవంతంగా బంధించింది.


    "ఆహా! అద్భుతం. మన సుగంధికి చాలా ఎక్స్ పీరియన్సే ఉన్నట్టుందే?"


    "ఏడ్చార్లే! కాసేపు నోళ్ళుమూసుకొని కూర్చోండి"


    మీనాక్షి, వాణీ నోళ్ళు చేతులతో మూసుకున్నారు. అది చూసి సుగంధికి నవ్వాగలేదు. రేణుక కూడా పకపక నవ్వింది. సుధ మాత్రం గంభీరంగా కూర్చుంది.


    "నేపుట్టి మునిగిపోయినట్టు కూర్చోపోతే నువ్వూ నవ్వరాదే!" అన్నది వాణి సుధను చూస్తూ.


    "మీరు నవ్వుతున్నారుగా చాల్లే!" అన్నది సుధ విసురుగా.


    సుధ అంతచిరాకు పడటానికి కారణం వాణికి తప్ప మరెవరికీ అర్థం కాలేదు. వాణి సుధ కళ్ళలోకి చూసింది.


    "ఎందుకే అలా చూస్తావ్? నా ముఖంలో బొమ్మలు ఆడుతున్నాయా?" కయ్యిన లేచింది సుధ.


    "అరే బాబా! మధ్యలో పానకంలో పుడకల్లా మీరేమిటే?" మీనాక్షి అందుకుంది.


    "ఇక నీ పాఠం ప్రారంభించు!" అన్నది వాణీ సుగంధితో.


    "నీకు అందం ఉంది. ఏం లాభం? ఆ అందాన్ని ప్రదర్శించడం రాదు. అసలు మగవాళ్ళ మనసుల్ని ఎలా దోచుకోవాలో నీకు బొత్తిగా తెలిసి చావదు"


    "అదేమిటో త్వరగా తేల్చి చెప్పుబాబూ! మమ్మల్ని సస్పెన్సుతో చంపేస్తున్నావ్?" అన్నది మీనాక్షి.


    "మధ్యలో మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇక ఈ పాఠం ముందుకు సాగినట్టే. పదవే రేణూ! నీకు రహస్యంగా చెబుతాను."


    "ఛ! నాకేం అక్కర్లేదు. వాళ్ళకే తొందరగా ఉంది. వాళ్ళకే ఆ చెప్పే పాఠం ఏదో చెప్పేయ్." అన్నది రేణుక.


    "అమ్మదొంగా! నీకూ వినాలనే ఉంది. పైకిమాత్రం పెద్ద బెట్టు చేస్తున్నావ్?" అన్నది వాణి.


    "ఎంతవరకు చెప్పానూ?"


    "అదే మగవాళ్ళ మనసుల్ని దోచుకోవడం రేణుకకు తెలియదు"


    "ఆ ఆ అదే! సరదాగా అతడు కన్పించగానే చిరునవ్వులు కురిపించాలి. పత్తికాయలు పగిలినట్టూ, చిరుగజ్జెలు మ్రోగినట్టూ- అంతేగాని వానలో తడిచి బిగిసిపోయిన నులకమంచంలా ఉంటే ఏ మగవాడు దగ్గరకు వస్తాడే?"


    వానలో తడిచిరెండు కోళ్ళు పైకిలేచిన నులకమంచం రేణుక కళ్ళలో మెదిలింది. పగలబడి నవ్వసాగింది. మిగతా ఇద్దరూ ఆమెతో శృతి కలిపారు.


    "ఏ....ఏ....వానలో తడిచి....బిగు...బిగు...సుకు...పోయిన... మం...చం..." పొట్ట చేత్తో పట్టుకుని నవ్వలేక నవ్వుతోంది వాణి.


    "స్టాప్!" అన్నది సుగంధి.


    "ఛ! పోవే! నువ్వు మరీనూ?" రేణుక సుగంధిని మోచేత్తో పొడిచింది.


    "నేనెక్కడికి పోతాను. మీ ఇద్దరికీ ఆ మూడుముళ్ళూ పడేలా చూశాకే కాలేజినుంచి వెళ్తాను" అన్నది సుగంధి.


    మళ్ళీ నవ్వులు.


    సుధ అందరికేసి చురచురా చూడసాగింది.


    "నా మాట విని ఒక్కసారి పలకరించి చూడు"


    "పలకరించి ఏం లాభంలేదు. సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు" అనేసి చటుక్కున నాలుక కరచుకుంది రేణుక.


    --ఓహో అయితే గ్రంథం ప్రారంభించావన్నమాట! ఏదో వాళ్ళంతా సరదాకు అంటున్నారనుకుంటున్నాను. ఇంతసేపూ! అయినా అతని వెంట నువ్వు పడటం ఏమిటే? ఆ బట్టలూ-అతనూ... బొత్తిగా దరిద్రుడిలా ఉన్నాడు..అతన్ని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. నువ్వు పలకరించినా నీ ఎదుట నిల్చోడానికి అతనికి దమ్ములుండొద్దూ? అయినా అతనంటే నీకు వ్యామోహం ఏమిటి!" సుధ గబగబా అనేసింది.


    సుగంధీ, మీనాక్షి సుధ ముఖంలోకి తెల్లబోయి చూశారు.


    వాణి మాత్రం ముసిముసిగా నవ్వుకుంది.


    "వ్యామోహంకాదు-ప్రేమ. దాన్నే ప్రేమ అంటారు. ప్రేమకు అంతస్థులు అడ్డురావని నీకు తెలియదా?" అన్నది మీనాక్షి.

 Previous Page Next Page