"నమస్తే....." అన్నాడు ఎదురుగ్గా నుంచున్న తన్ని చూసి సత్యం.
"జి...... నమస్తే" అన్నాడు. అతను సత్యం కేసి చూసి నవ్వుతూ.
నల్లని ఎత్తయిన విగ్రహం, బుగ్గలదాకా మీసాలు. ఎఱ్ఱటి కళ్ళూ. తలపాగా చూడగానే భయం పుట్టిస్తూ సినిమాల్లో విలన్ లా వున్నాడు. నోట్లో కిల్లీ, చేతిలో చుట్ట, అతన్ని చూస్తేనే అసహ్యం వేసింది విధిలేక సత్యం పరిచయం చేస్తే నమస్కారం పెట్టాడు.
"రండి. కూర్చోండి. లోపలికి ఆహ్వానించాడు అతను. సత్యం రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాడు. అతను సత్యాన్ని లోపలికి వెళ్ళమన్నాడు. సత్యం మధన్ కేసి చూసి వెళ్ళరా, అన్నాడు మదన్ ఒళ్ళుమండింది ఇదంతా చూస్తూ వుంటే. "చ..... ఏమిటిది?
ఏమిటి నీ ఉద్దేశ్యం దబాయించాడు సత్యాన్ని. సత్యం చిరునవ్వు నవ్వి. మధన్ నేనెన్నడూ నిన్ను అపార్థం చేసుకోను. ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడాలంటే యిదొక్కటే మార్గం. వీడు ఆ అమ్మాయిలమీద యిలాగే డబ్బు సంపాదిస్తున్నాడు. మిగతా అమ్మాయిలందరూ, ఈ జీవితానికి రాజీపడ్డా, రత్నావళీ మాత్రం, ఇంతవరకూ ఈగని కూడా తనవొంటిమీద వాలనివ్వలేదు. జనం, ఆమె సౌందర్యాన్ని దూరం నుంచి చూసే ఆనందిస్తున్నారు. నామాట నమ్ము. నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడిరా అన్నాడు. సత్యం మాటలు విని ఆశ్చర్యపోయాడు మధన్. లోపలికి, సత్యం ప్రోద్బలంతో లోపలికి వెళ్ళాడు.
బట్టలు మార్చుకుని గదిలో ఒక పక్కగా నిలుచుంది రత్నావళి. మధన్ ని చూసి బెదిరిన లేడిపిల్లా బెదురు చూపులు చూసింది.
"నమస్కారం" అన్నాడు మధన్."
"నమస్కారం" అంది రత్నావళి.
"మీ నాట్యం అమోఘంగా వుంది" అన్నాడు
"థాంక్స్ అంది."
"నాట్యానికి తగ్గగానం, గానానికి తగ్గరూపం, మమ్మల్ని తన్మయుల్ని చేశారు. ఆమెకేసి రెప్పవాల్చకుండా చూస్తూ అన్నాడు మధన్.
ఆ చూపుల నుండి తప్పించుకుంటూ నేల చూపులు చూసింది రత్నావళి.
"మీతో మాట్లాడాలని వచ్చాను" అన్నాడు తడబడుతూ మధన్.
క్షమించండి. నాకు నాకు తలనొప్పిగా వుంది. దయచేసి మీరు వెళ్ళిపోండి. మీకు పుణ్యం వుంటుంది." అంది బతిమాలుతూ రత్నావళి.
"మీతో అర్జెంటుగా మాట్లాడాలి. దయచేసి నన్ను కాదనకండి."
చూడండి. చదువుకున్నవారు మీరు. అర్థం చేసుకోగల సామర్థ్యం గలవారు. దయచేసి నన్ను బాధపెట్టకండి వెళ్ళిపొండి."
క్షమించండి మాట్లాడందే వెళ్ళలేను.
"క్షమించండి. నేను మాట్లాడలేను."
"రాధికా,....... నేను చెప్పేది విను" ఆవేశంతో మాట్లాడుతున్న మధన్ కేసి ఆశ్చర్యంగా చూసి.
"నా పేరు రత్నావళి" అంది మెల్లగా.
"అవును అదే నేను నమ్మలేకపోతున్నాను. మిమ్మల్ని చూస్తూ వుంటే. మా రాధిక జ్ఞాపకం వొస్తోంది.
రత్నావళి ఆశ్చర్యంగా అతని మొహంలోకి చూసింది. మా రాధిక చిన్నతనంలో నాతో ఆడుకునేది. మేమిద్దరం కలిసి బడికెళ్ళేవాళ్ళం. నేను బొమ్మలు గీస్తూ వుంటే తను నాట్యం చేసేది, ఒకసారి శివరాత్రికి, తిరునాళ్ళకి మంగళగిరికి వెళ్ళాం. అక్కడ మా రాధిక తప్పిపోయింది. పాపం! వాళ్ళమ్మా, నాన్నా, రాధికకోసం దేశం అంతా గాలించారు. ఏమయిందో తెలీదు. ఆమె జాడలేదు. దాదాపు పన్నెండేళ్ళుకావస్తుంది." రాదికకేసి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు మధన్.
రత్నావళి, అతను చెప్పే మాటల్ని ఆశ్చర్యంగా వింటోంది ఏదో ఆలోచిస్తూ.
"వాళ్ళ నాన్నగారి పేరు శ్రీహరి. అమ్మగారి పేరు సరోజిని ఒకనాడు ఆమె డాన్సు చేస్తూ చేస్తూ పడిపోయింది. సూది మొనగలరాయి మోకాలికి గుచ్చుకుపోయి, గాయంపడింది. పొడుగ్గా నామంలా పెద్ద మచ్చపడింది. పాపం ఆరోజు రాధిక ఎంత బాధపడింది" చెప్పుకుపోతున్నాడు" మధన్.
అప్రయత్నంగా, చీరకుచ్చెళ్ళు పైకెత్తి మోకాలు చూచుకుంది రత్నావళి.
మాటలాపి మధన్ కూడా మోకాలికేసి చూశాడు. పొడుగ్గా నామంలా పెద్దమచ్చ.
"రాధికా....." అంటూ దగ్గిరికెళ్ళి ఆమె రెండు చేతులూ పట్టుకున్నాడు సంతోషం పట్టలేక మధన్.
ఆశ్చర్యంగా తెల్లబోయి అతనికేసి చూస్తూ నుంచుంది ఆమె.
"రాధికా..... జ్ఞాపకం తెచ్చుకో...... సత్తెనపల్లి..... సాంబశివరావు మాస్టారు. రామాలయం దగ్గర, మునిసిపల్ హైస్కూలు. జామచెట్టు. చెట్టెక్కి కాయలు కోసుకుని తినేవాళ్ళం మనం, నేను పిల్లిబొమ్మలూ, ఎలుక బొమ్మలూ గీస్తూ వుంటే, నువ్వు పాట పాడుతూ, నాట్యం చేసేదానివి. మీ చెల్లెలు రేణుక. దాన్ని ఆడించడంలేదని ఉడుక్కునేది..... జ్ఞాపకం రావడంలేదూ? ఒక్కొక్క మాటా జ్ఞాపకానికి తెస్తున్నట్టుగా, గుచ్చి గుచ్చి చెబుతున్నాడు మధన్.
ఏదో జ్ఞాపకానికి తెచ్చుకుంటూన్నట్టు ఆలోచించసాగింది ఆమె." "ఈ పాట కూడా పాడేదానివి. జ్ఞాపకం తెచ్చుకో.