"రేపు నా కేదయినా అయితే నన్ను చూసుకునేది మా తల్లే! ఈ యింటి దిక్కు యీమే!" గొప్పగా కూతుర్ని చూస్తూ అన్నాడతను.
"చాల్లెండి! ఆ మాటలు?" అలా అనచ్చా? మెచ్చు కోవాలంటే ఇంకోరకంగా అనండి! కానీ తమాషాకయినా అలా అనకండి!" ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి.
"పూర్ సెంటిమెంట్! మనం అనుకుంటే అలా జరుగుతుందా? అయినా మా తల్లికి బరువు బాధ్యత లెందుకు? బాగా చదివించి మంచి ఉద్యోగం వేయించి, దర్జా అయిన అబ్బాయి కిచ్చి పెళ్ళి చేస్తాను!" గొప్పగా అన్నారు నారాయణ.
"ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు?" అందామె.
"ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన పెళ్ళి వద్దా? పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఉద్యోగం వద్దా? సుందూ! నీదంతా చాందసం! ఆడవాళ్ళకి అంతోటి స్వాతంత్ర్యం వుండాలి. అదుండాలంటే ఉద్యోగాలు తప్పనిసరి. ప్రతీదానికీ భర్తపై ఆధారపడి వుండకూడదు ఆడవాళ్ళు!"
"నాకా అవసరం రాలేదు! నా పిల్లలకీ రాదు!"
"అంతా నాలాటి వాళ్ళే వుంటారా?"
"ఏమో ఎవరు చూడొచ్చారు. ఎవరి అదృష్టం ఎలా వుందో!"
ఆ మాటతో బెల్ గణగణ మ్రోగించుకుంటూ ప్రక్క వీధిలో వున్న స్కూల్ దాకా నలుగురినీ తీసికెళ్ళి వదిలేసి ఆఫీసుకి ఆటే వెళ్ళిపోయాడు నారాయణ. చూస్తూ అలాగే వుండిపోయింది సుందరి.
3
చప్పున లేచి కూర్చుంది విమల!
"అక్కా"
చెల్లాయి పిలుపుకి ఆలోచనల్లోంచి బయటపడింది నంద.
"తనకీమధ్య గత స్మృతులు ఎక్కువయ్యాయి. ఆలోచనలు అధికమయ్యాయి. ప్రతి చిన్న విషయం తనని కదిలిస్తోంది. ప్రతిదీ పూర్వం రోజులతో పోల్చుకుంటుంది" అనుకుంది.
విమల లేచి చాపను చుట్టి దిండూ, దుప్పటి తీసిపెట్టింది మెల్లిగా తమ్ముడి దగ్గరికి నడిచింది. హాల్లో గడియారం అయిదు గంటలు కొట్టింది.
"శశీ! శశీ!!" మృదువుగా పిలిచింది విమల.
బరువుగా కళ్ళు తెరిచి, మళ్ళీ మూలుగుతూ కళ్ళు మూసుకున్నాడు వాడు. వాడి బద్దకానికి నవ్వుకుంటూ "లేచి చదువుకోవద్దూ!" అంది విమల.
"నాకీ రోజు హోం వర్క్ లేదక్కా!" కళ్ళు విప్పకుండానే అన్నాడు శశి.
నవ్వింది నంద, ఆడపిల్లలు తాము ఇద్దరూ ఎవరూ లేవగొట్టకుండానే లేస్తారు! మగపిల్లలు లేవకొట్టినా లేవరు!
ఈ చురుకుదనం వీళ్ళలో, ఆ లేజీనెస్ వాళ్ళలో సహజంగా వస్తుందా?
"చదువుకోవాలి లే!" కొంచెం కరుకుదనం కంఠంతో పలికిందేమో!
చప్పున లేచాడు శశికాంత్. అక్క వైపు అదోలా చూశాడు. నిద్రాభంగం అయిందనే కోపంతో దుకుడుగా బాత్ రూం వైపు నడిచాడు. ఆ కోపానికీ, ఆ దుడుకు స్వభావానికి తనలో తనే నవ్వుకుంది. తర్వాత తనే చాప చుట్టి, దిండూ, దుప్పటి తీసి పెట్టింది నంద.
"ఇలా పనులనుంచి మగాళ్ళు చిన్నప్పటి నుంచే తప్పించు కొనటం నేర్చుకుంటారు. అది జన్మహక్కను కుంటారు. అలాగే చాకిరీచేయడం ఆడపిల్లలు నేర్చుకుంటారు. అది తమ జన్మ బాధ్యత అనుకుంటారు కాబోలు."
వంటింట్లోకి వెళ్ళి కుంపటి రాజేసి కాఫీకి నీళ్ళు పెట్టేసి వచ్చింది ఆమె.
ఈ చక్కర తీపైపోయిన యీ రోజుల్లో కాఫీ మానేస్తే బాగానే వుంటుంది. ఎంతో డబ్బు సులువుగా ఆదా అవుతుంది. కానీ ఎన్నో ఏళ్ళుగా అయిన అలవాటు మానుకో వటం కష్టం. మానుకోవాలని అనుకోవటం మాత్రం సుళువే, "హాబిట్ యీజ సెకండ్ నేచర్" అన్నారందుకే. అలా మానుకోలేనందుకేనేమో!
అక్కడికీ ఈవినింగ్ టీ మనిపించేసింది తను. ఒక పూట కాఫీ, టీలు తాగితే హెల్త్ పాడౌతుందని చెప్పింది! ఇలా ఎంతని జీతంనుంచి కట్ చేస్తుంది? ఎన్ని నిషేధిస్తుంది?
"అక్కా!" విమల పిలిచింది.
"ఏమ్మా?"
"ఈ ప్రాబ్లం చేసిపెట్టవూ?"
"చెప్పనా? చేసిపెట్టనా?" నవ్వుతూ అడిగింది నంద.
ఆ మాటలకి నవ్వింది విమల! ఆమె ముఖంలో సంతోషం కన్పించింది.
వెళ్లి చెల్లి దగ్గర కూర్చుంది.
కలం-పని, లెక్క చదివింది, నిట్టూర్చింది.
"ఎక్కడా ఈ పనీ కాలమూ వస్తూనే వుంటాయి___ఇవి జీతాలకీ, జీవితాలకీ లంకె అవుతాయి కాబోలు" అనుకుని మళ్ళీ చెల్లికి చదివి చెప్పింది! ఎలా చేయాలో వివరించింది.
"ఇప్పుడు నువ్వే చెయ్" అంది.
విమల లెక్క చేయటం ప్రారంభించే సమయానికి శశీ ముఖం తుడుచుకుని వచ్చి ఇంగ్లీషు టెక్స్ట్ తీసుకు కూర్చున్నాడు. వాడి ముఖంలో యింకా సీరియస్ నెస్ తగ్గలేదు.