"పోయట్రీనా? ప్రోజా?"
"నాన్ డి టెయిల్డ్" క్లుప్తంగా సమాధానించాడు.
"మెల్లిగా చదువు!"
చదవడం ప్రారంభించాడు శశికాంత్.
విమల ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ చూసుకుంది కరెక్ట్!
అక్కవైపు ఆరాధనగా చూసింది.
"వచ్చిందా?" నంద కళ్ళల్లో ఆనందం తారట్లాడింది.
తలవూపి మరో ప్రాబ్లమ్ చేయసాగింది విమల.
"అమ్మా! పాలు!" బయటినుంచి కేకేశాడు పాలమనిషి.
"వస్తున్నా!" అంటూ ప్రక్కన ఉంచుకున్న గిన్నె తీసుకుని వెళ్ళి తలుపుతీసింది నంద. పాల మనిషి కేం సమాధానం చెప్పాలా అని తనలో రిహార్సల్ వేసుకుంది.
ఆ సరికే ఆ కాంపౌండ్ లో వున్న వాళ్ళంతా పాలకోసం రెడీగా నుంచున్నారు. అందరిచేతుల్లో స్టీలు గిన్నెలు నాగమ్మ చకచకా పిండుతోంది. ఆమె బర్రెని తీసుకుని వస్తుంది రోజూ. అక్కడే పితుకుతుంది. గిన్నె చెల్లి చేతికిస్తే ఆ అమ్మాయి అందరికీ పోస్తుంది. అందరికీ పాలు పోస్తోంటే చూస్తూ వుంది నంద!
ఆ అమ్మాయి ఆఖర్న పోసింది నందకి.
"అమ్మాయిగారూ! పాలడబ్బులు!"
"నాగమ్మా! ఈ నెల జీతంరాగానే పూర్తిగా యిచ్చేస్తాను, మొన్న జీతంలో యివ్వటానికి అమ్మ మందులకి ఖర్చయింది. ఈ నెల పండుగ ఎడ్వాన్స్ యిస్తారు! తీర్చేస్తాను!"
"అలాగేనమ్మా! నాలాగా నువ్వు కష్టపడుతూ ఉన్నావు. ఇంత చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా నీకు సుఖం లేదు. ఏమీ చదువుకొని నాకూ సుఖం లేదు. అందామె.
"సుఖాలు చదువుతో రావు నాగమ్మా!" నిర్లిప్తంగా అంది నంద.
"అవును తల్లీ! అంటూ వెళ్ళిపోయిందామె.
నాగమ్మని చూస్తుంటే జాలివేసింది నందకి.
ఆమె భర్త వదిలేశాడు. పెళ్లై కొన్నేళ్ళు సంసారం చేశాక ఆమె గతికి ఆమెని వదిలాడు. ఇద్దరు పిల్లల తల్లి నాగమ్మ! ఇద్దరూ ఆడపిల్లలే! రత్నాల్లా వుంటారు. అంతా తల్లి పోలికే! పైగా ఆమె చెల్లెల్ని పాడుచేసి తాళీకట్టాడు అయినా నాగమ్మ తన భర్తనీ, చెల్లినీ క్షమించినా, అందర్నీ వదిలేసి ఇంకో కులం కాని దాంతో కులుకుతున్నాడు అతను. పంచాయితీ పెట్టినా లాభం లేకపోయింది! నాగమ్మ మాట చెల్లుబడి కాలేదు. అంతటితో ఆగక వాడేవేవో కూశాడు. నాగమ్మని నోరెత్తనివ్వలేదు. ఆమె చెల్లినీ మాటాడనివ్వలేను. దుర్మార్గంగా ఆఖరికి ఇంట్లో పనిచేసే మనిషికీ, అక్కా చెల్లెళ్ళకీ రంకు కట్టేడు.
నాగమ్మ నెత్తి నోరు మోదుకుంది. నాగమ్మ గుణం మొదటినించీ ఆవాడకట్టులో అందరికీ తెలుసు. అయినా ఫలితం లేకపోయింది___నాగమ్మని వాడు వదిలేశాడు.
పాలగిన్నె వంటింట్లో పెట్టి, తల్లీ తండ్రి నిదురపోతున్న గదివైపు చూసింది నంద! అప్పటికింకా వెలుగు ఛాయలు కూడా రాలేదు.
తండ్రి ఇంకా నిద్రపోతూనే వున్నాడు. అది నిద్రో అలిసిన శరీరం సేద తీరుతుందో!
"అక్కా!" పిలిచింది విమల.
"ఏమిటి?"
"ఈ పోయం చెప్పు!"
ఇంగ్లీషు టెక్స్ట్ చేతిలోకి తీసుకుంది నంద.
"హాపీడేస్" ఒక్కసారి చదవగానే కొత్త వూపిరి వచ్చి నట్లయింది. తన బాల్యం గుర్తుకు వచ్చింది. ఆ తీపి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ ఉత్తేజంతో, ఆ ఉత్సాహంతో పాఠం చెప్పింది. అరటిపండు ఒలిచి చెప్పినట్టుగా అర్ధమైంది విమలకి. కాఫీ కలపటానికి వెళ్ళింది నంద!
అయినా ఇంకా ఆ స్మృతులు వీడలేదు ఆమెని!
ఆ బంగారు రోజులు గుర్తుకువచ్చాయి.
4
వేకువనే లేవటం అనేది వో ఆలవాటు. రోజూ త్వరగా ప్రారంభమవుతుంది.
కొందరికా నిద్ర ముఖంలో వుండగానే మనం మన పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు! ఆ సమయంలో మనస్సూ శరీరం రెండూ నిర్మలంగా వుంటాయి. సూర్యోదయానికి ముందే అన్నీ ముగించేసుకుని శుభ్రంగా కడిగిన ముత్యంలా తయారయిపోవచ్చు.
అందరూ పనులు తెమల్లేదని పిల్లలకి బళ్ళకి టైం అయిందని, భర్తకి ఆఫీసు టైం అయిందని హడావుడి పడుతూ వుంటే మనం ఎంచక్కా అన్ని తీరిగ్గా అమర్చుకుని హాయిగా వుండొచ్చు.
రాత్రి పదింటికి పడుకుని వేకువనే అయిదింటికి లేస్తే ఏ అనారోగ్యమూ వుండదు. లక్షణంగా వుంటారు మనుషులు అయితే మనుషులు సూత్రాలు చెబుతారే తప్ప ఆచరించారు. అదీ దౌర్భాగ్యం.