Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 4


    అంతకంటే, "అమ్మ వద్దన్నా తీసుకెళతాను" అని వుంటే సంతోషించేది అరుంధతి.

 

    "నేను రానులే. మంచి పుస్తకాలేమైనా తెచ్చిపెట్టండి."

 

    "ఏమిటా పుస్తకాలు? పేర్లు చెప్పు తప్పక తెచ్చి పెడతాను."

 

    "పీపాలో శవం"

 

    "అదేమిటి! పుస్తకం పేరే?" అన్నాడు విస్మయంగా సీతాపతి.

 

    "అవును. డిటెక్టివ్. శృంగారవీధి."

 

    "అదీ పుస్తకమే?" నోరు తెరిచాడు సీతాపతి.

 

    పకపక నవ్వింది అరుంధతి. "మీకు మరీ ఏమీ తెలియదండీ! శృంగారవీధి అంటే పుస్తకం కాదు. మాసపత్రిక. దానికి చందా కట్టిరండి నెలనెలా వస్తుంది" అంది అరుంధతి తన ధోరణిలో.

 

    "ఆ దిక్కుమాలిన పుస్తకాలు చదవకపోతే ఇంట్లో రామాయణం, భారతం ఉన్నాయి చదువుకోరాదూ?" అన్నాడు సీతాపతి.

 

    "అవి మీ అమ్మగారు చదువుకుంటున్నారుగా! నేనూ మీ అమ్మగారి వయసు వచ్చాక అవే చదువుకుంటాను లెండి!" అంది విసురుగా అరుంధతి.

 

    "మా అమ్మగారు నీ వయస్సప్పుడుకూడా అవే చదువుకున్నారు" అన్నాడు సీతాపతి మామూలుగానే.

 

    "అవి నాకు అర్ధంకావు. అర్ధంకానివి ఎలా చదవడం?"

 

    "రామాయం, భారతం అర్ధం కావటం ఎందుకు? అవి చదువుకుంటే పుణ్యం వస్తుంది. అందుకే చదువుకుంటాం. కథలు అందరికీ తెలిసినవేగా?" అన్నాడు సీతాపతి అమాయకంగా.

 

    "ఆ పద్యాలు నోరు తిరగవు సరేగదా అర్ధంకూడా కావు. కాలక్షేపం ఎలా అవుతుంది? నాకు ఆ పుస్తకాలు తెచ్చిపెడతారా లేదా!" నిలదీసినట్లు ప్రశ్నించింది అరుంధతి.

 

    "రాణిగారు ఆజ్ఞాపించాక తేకుండా ఎలా వుండగలను!" అన్నాడు సీతాపతి అరుంధతిని గాఢంగా హృదయానికి హత్తుకుంటూ.

 

    "అదుగో ఆయన ఎలా చూస్తున్నాడో! వదలండి బాబూ!" అంది అరుంధతి గోడకు తగిలించివున్న ఫోటోకేసి రెప్ప ఆర్పకుండా చూస్తూ.

 

    సీతాపతి పకపక నవ్వాడు. "నిజంగానే ఆ కళ్ళలో జీవకళ ఉట్టిపడుతూ వుంటుంది. చూస్తున్నట్టూ, పలకరిస్తున్నట్టూ వుంటాయి ఆ కళ్ళు" అన్నాడు ఫోటోకేసి దీక్షగా చూస్తూ.

 

    "ఆ కళ్ళూ... ఆ ముఖం నాకు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది."

 

    "అలాగా?" ఫోటోమీదనుంచి కళ్ళు మరల్చకుండానే యథాలాపంగా అన్నాడు సీతాపతి.

 

    "ఇప్పుడు మీ స్నేహితుడు ఎక్కడున్నాడు?"

 

    "ఏమో! ఏ కొండల్లో, లోయల్లో, అడవుల్లో తిరుగుతున్నాడో! వాళ్ళ పార్టీని నిషేధించిన తరవాత మళ్ళీ నాకు కనిపించలేదు! అందరూ అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు." స్నేహితుని తాలూకు స్మృతులను నెమరవేసుకుంటూ అన్నాడు.

 

    "ఎంతకాలం అయింది ఆయన్నుచూసి?" కుతూహలంగా ప్రశ్నించింది అరుంధతి.

 

    "దాదాపు రెండేళ్ళు కావస్తుంది వాణ్ణిచూసి. ఒక్క రక్తం పంచుకొని పుట్టినవాళ్ళకంటే ఎక్కువగా ఉండేవాళ్ళం! వాడు నాకంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల్లో ప్రవేశించి పట్టణాల్లో నివసిస్తూ అనేకమందితో పరిచయాలు కలిగివున్నా నన్ను స్వంత సోదరుడిలాగే చూస్తాడు. ఏనాటి అనుబంధమో మాది! ఆ ఆత్మీయత తెచ్చిపెట్టుకొంటే వచ్చేదికాదు" నిట్టూర్చాడు సీతాపతి.

 

    "ఆయన్ది ఈ ఊరేనా?"

 

    "కాదు ఈ ఊరిని ఆనుకునే గొల్లపాలెం అని, ఇంతకంటే చాలా చిన్న వూరు వుంది. ఆ వూరి కుర్రాళ్ళు చదువుకోవటానికి ఇక్కడకు వచ్చేవాళ్ళు. రాజాకూ నాకు స్కూల్లో పరిచయమే. మొదటిరోజే మేమిద్దరం స్నేహితులమయాం. ఎక్కువరోజులు వాడు మనింట్లోనే వుండిపోయేవాడు. వాడు నా కంటే కొంచెం పొడవు, నా బట్టలు చాలేవి కాదు, అమ్మ వాడికోసం ప్రత్యేకంగా కొన్ని జతలు కుట్టించి పెట్టింది. నాకంటేకూడా వాడికి అమ్మ అంటే ప్రాణం. అప్పుడప్పుడు నాకు కొంచెం ఈర్ష్యగా కూడా వుండేది. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది." సీతాపతి చెప్పుకుపోతున్నాడు. సముద్ర కెరటాలమీద ఉయ్యాల లూగుతున్న నీటిపిట్టలా సీతాపతి మనస్సు, ఉవ్వెత్తున ఒకదాని వెనుక ఒకటి లేస్తున్న స్మృతులమీద తన్మయత్వంలో తేలిపోతుంది.

 

    అరుంధతి మంత్రముగ్ధలా వింటూ కూచుంది.

 

    "చిన్నప్పటినుంచే వాడిలో వుద్రేకం ఎక్కువ. న్యాయం, అన్యాయం అంటూ మాట్లాడేవాడు. మేము చదువుతున్న రోజుల్లో ఇద్దరు హరిజన బాలురు. మా స్కూల్లో చదివేవారు. వాళ్ళను దూరంగా ప్రత్యేకంగా కూచోబెట్టేవారు. అది అన్యాయం అంటూ నాతో నాతో వాదించేవాడు. ఒకసారి తను వెళ్ళి వాళ్ళిద్దరిమధ్యా వాళ్ళను అంటుకొని కూచున్నాడు. ఆ తరువాత నేను వాడిని అంటుకోకుండా అమ్మ కోప్పడుతుందని ఇంటికి వెళ్ళాను. వారం రోజులు రాజా నాతో మాట్లాడలేదు. వాడు మాత్రం హరిజన బాలుర మధ్యలోనే కూర్చునేవాడు. చివరకు నేనే ఓడిపోయాను, వాడితో మాట్లాడకుండా వుండలేకపోయాను. అమ్మకు మాత్రం చెప్పేవాణ్ణి కాదు."

 

    "మరి ఆయన పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని రమ్మనలేదూ?"

 

    "రమ్మన్నాడు. అమ్మను ఒప్పించటానికి ప్రయత్నించాడు. అమ్మకేకాదు నాక్కూడా పై చదువులమీద అంత శ్రద్ధ లేదని తెలుసుకొని వూరుకున్నాడు. హైస్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ప్రతి సెలవలకూ మన ఇంటికే వచ్చేవాడు."

 

    "ఆయనకు పెళ్ళయిందా?"

 

    "అయింది. చాలా చిన్న వయస్సులోనే వివాహం జరిగింది. బాగా కట్నం వస్తుందనే ఆశకొద్దీ వాడు స్కూల్ ఫైనల్ చదువుతూ వుండగానే తండ్రి బలవంతంగా పెళ్ళి చేశాడు. వాడు చేసుకోనని ఎదురు తిరిగాడట. దాంతో తండ్రి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడట. కాలేజీలో ఒక సంవత్సరం చదివి మానేశాడు. అత్తగారివైపు వాళ్ళూ, తండ్రీ చెప్పినా వినలేదు. రాజకీయాల్లో ప్రవేశించాడు. తండ్రి చివరకు నన్నూ, అమ్మనూ చెప్పమన్నాడు. ఆనాడు గుంటూరంతా తిరిగి వాణ్ణి ఇంటికి పట్టుకొచ్చాను. అమ్మా నేను ఎంతో చెప్పాం.

 

    "ఆయన ఒప్పుకున్నాడా?"

 

    "లేదు. ఏమన్నాడో తెలుసా? 'మీకు నా బాధ అర్ధంకాదు. దేశమాత నన్ను పిలుస్తోంది. దేశమాత పిలుపును కాదనే శక్తి నాలో లేదు. తెల్ల ప్రభుత్వం ఈ గడ్డమీదనుంచి వైదొలగిపోతేనే కాని నా హృదయంలో రగుల్కొన్న అగ్ని చల్లారదు' అన్నాడు. వాడు ఆ మాట లంటున్నప్పుడు వాడిలో కట్టలు తెంచుకున్న ఉద్రేకం చూసి తీరాల్సిందే. అమ్మా నేనూ కూడా మౌనంగా వినటం తప్ప ఇంకేమీ అనలేకపోయాము. ఆనాటివరకూ వాడంటే నాకు ప్రేమ మాత్రమే వుండేది. ఆనాటినుంచీ వాడిమీద అమితమైన గౌరవం ఏర్పడింది. వాణ్ణి గొప్పవాడిగా చూడకుండా వుండలేకపోయాను. వాడు చాలా గొప్పవాడవుతాడు. దేశనాయకుడవుతాడు. దేశం చేత పూజింపబడతాడు అనుకున్నాను. ఆ మాటలే పైకి అంటే వాడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు, 'అంత గొప్పమాటలు అనకు. నాకు అలాంటి కోరికలు లేవు. దేశమాత విముక్తికోసం నా ప్రాణాలను సమర్పించే అవకాశం లభిస్తే నాకు అంతే చాలు' అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు వాడి కళ్ళు జ్యోతుల్లా వెలిగిపోయాయి" అని ఆగాడు.

 

    "ఆ తర్వాత?" కుతూహలంగా ప్రశ్నించింది అరుంధతి.

 

    "ఆ తరువాత వాడు పూర్తిగా రాజకీయాల్లో పడిపోయాడు. బ్రిటీష్ వాళ్ళ లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకు వెళ్ళాడు. వాడు మొదటిసారి జైలుకు వెళ్ళేనాటికి వాడి భార్య నిండు చూలాలు. వాడు జైల్లో వుండగానే కొడుకు పుట్టాడు. కొడుక్కు భగత్ సింగ్ అని పేరు పెట్టాడు. బ్రిటీష్ వాడు మన దేశాన్ని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోక తప్పలేదు. రాజకీయ ఖైదీలందర్నీ వదిలేశారు."

 

    "ఇప్పుడు మన రాజ్యమేగా? ఇప్పుడు గూడా ఆయన రాజకీయాల్లో ఏం జేస్తున్నాడు?" అమాయకంగా అడిగింది అరుంధతి.

 

    "అదే నేనూ అడిగాను. దానికి వాడు 'బ్రిటీష్ వాడు వెళ్ళిపోయాడు. కాని మనదేశంలో నేను ఆశించిన మార్పు రాలేదు. సమ సమాజ నిర్మాణమే నా ధ్యేయం. దానికోసమే జీవితాన్ని అంకితం చెయ్యదలచుకున్నాను. స్వరాజ్యం వచ్చింది కాని నేను కలలుకన్న రాజ్యం ఇంకా రాలేదు.' అంటూ ఏమేమో చెప్పాడు."

 

    "ఆయనకు ఎంతమంది పిల్లలు?"

 

    "ఒక కొడుకూ, ఒక కూతురు. భార్యకు- రాజా అలా తిరగటం ఇష్టంలేదు. పుట్టింట్లోనే వుండిపోయింది. రాజా మాత్రం తన ఆస్తినంతా అమ్మి పార్టీకి ఇచ్చేశాడు."

 

    "ఆయన తల్లీ తండ్రీ?"

 

    "చెప్పటం మరిచాను. రాజా చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోలేడు. కొడుకు భవిష్యత్తుకోసం ఆయన అలాగే ఉండిపోయాడు. రాజా జైలుకు వెళ్ళేడని తెలిసి ఆయన మంచం పట్టాడు. గుండె జబ్బుతో చనిపోయాడు" కొంచెంసేపు మౌనం వహించి మళ్ళీ అన్నాడు. "రెండేళ్ళయింది వాళ్ళ పార్టీని బాన్ చేసి. అప్పటినుండీ వాణ్ణి చూడనేలేదు. వాళ్ళ పార్టీలో పనిచేసే వజ్రాల్లాంటి కొంతమంది కుర్రాళ్ళను పోలీసులు కాల్చేశారు. రాజాను కూడా కాల్చేశారంటారు కొందరు. కాని నేను నమ్మను. రాజా బ్రతికే వున్నాడు. చాలా గొప్పవాడవుతాడు. రాజాను ఏనాటికయినా మళ్ళీ నేను చూస్తాను." చివరి మాటలు సీతాపతి తనకు తనే చెప్పుకుంటున్నట్లు అన్నాడు. అరుంధతి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇద్దరూ మౌనంగా కూచుని ఆలోచిస్తున్నారు.

 

    "అరుంధతీ!"

 

    అత్తగారిపిలుపు విని గబుక్కున లేచింది. సీతాపతి భార్యకొంగు పట్టుకున్నాడు.

 

    "అత్తయ్య పిలుస్తోంది!" అంది అరుంధతి కొంగు విడిపించుకుంటూ.

 

    "అబ్బా! అత్తగారంటే ఎంత భయమూ, ఎంత భక్తీ!" ఉడికిస్తూ అన్నాడు సీతాపతి.

 

    "భయంలేదు కాని- భక్తి వున్నమాట నిజమే! నాకు అమ్మలేదు. అమ్మయినా అత్త అయినా ఆమేగా!" అంటూ గబగబా గది బయటకు వెళ్ళిపోయింది అరుంధతి. ఆమె వెళ్ళినవైపే సంతృప్తిగా చూస్తూ ఉండిపోయాడు.


                                                                    4


    వెంకటరత్నం విజయవాడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచరుగా పని చేస్తున్నాడు. వివాహం అయిన రెండో సంవత్సరమే భార్య ఆడపిల్లను కని కళ్ళుమూసింది. పిల్ల పుడుతూనే తల్లిని మింగేసింది అన్నారు. ఆ పిల్ల ఐదో ఏడు వచ్చేంతవరకూ మేనమామ ఇంట్లో పెరిగింది. పెంచబడలేదు. వాళ్ళపిల్లల మధ్య ఎలాగో పెరిగింది. వెంకటరత్నం భార్యపోయిన మూడో నెల్లోనే మళ్ళీ వివాహం చేసుకున్నాడు. అరుంధతికి ఐదో ఏడు వచ్చేటప్పటికి, వెంకటరత్నానికి ద్వితీయ కళత్రం మరో ఇద్దరు పిల్లని ప్రసాదించింది. ఒకనాటి ఉదయం చెప్పాపెట్టకుండా అరుంధతి మేనమామ పిల్లను తీసుకొచ్చి తండ్రికి అప్పగించి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.    

 

    చాలీచాలని జీతంతో బాధపడుతోన్న వెంకటరత్నం చిన్న భార్య రాజేశ్వరికి అరుంధతి రాక ఆవేశాన్ని కలిగించింది. భర్తను నానా మాటలన్నది. కొత్త ప్రవేశంలో తను ఏనాడూ చూడని నాన్నను చూచాక అరుంధతికి నిరాశే కలిగింది. మేనమామ తన పిల్లల్ని ముద్దులాడటం చూసింది. అప్పుడప్పుడు అరుంధతిణి కూడా దగ్గరకు తీసుకొనేవాడు. తండ్రి ఇంటికి బయలుదేరిన అరుంధతి చిన్న బుర్రలో ఏవేవో ఊహల్ని నింపుకొని వచ్చింది. తండ్రి ఆప్యాయంగా పిలవలేదు. పైగా తన రాక అక్కడ ఎవరికీ ఇష్టంలేదని తెలుసుకొని బిక్కమొహం వేసుకొని నిల్చుంది.

 

    క్రమంగా అరుంధతి ఆ ఇంటి వాతావరణానికి అలవాటుపడిపోయింది. ఎవరినించీ ఆప్యాయతను ఆశించటంలేదు. అయినదానికీ కానిదానికీ దెబ్బలు తినటం అలవాటయింది. దెబ్బలంటే కూడా భయం పోయింది. అరుంధతికి పదేళ్ళు వచ్చేటప్పటికి ఆ ఇంట్లోకి మరో రెండు ప్రాణులు మాకూ నోరుంది అన్నట్లు అరుస్తూ వచ్చాయి. వెంకటరత్నానికి అరుంధతితో చెరి ఐదుగురు పిల్లలు. వెంకటరత్నానికి పిల్లలంటే ఇష్టమోకాదో అతనికే తెలియదు. అతనికి జీవితంలో పిల్లల్ని గురించి ఆలోచించే తీరికా, ఓపికా కూడా లేదు. వాళ్ళ పొట్టల్ని గురించి ఆలోచించటానికే సరిపోతుంది. రాత్రింబవళ్ళు ట్యూషన్లు చెబుతూ ఎలాగో సంసార సాగరాన్ని ఈదుకొస్తున్నాడు.

 

    అరుంధతి, పినతల్లి వద్దన్నా వినకుండా స్కూలుకు వెళుతుంది. ఆ విషయంలో మాత్రం వెంకటరత్నం భార్యతో ఏకీభవించలేదు. రాజేశ్వరికి అరుంధతిని ఇంట్లోవుంచి ఇంటిచాకిరీ అప్పగించాలని వుండేది. ఇంట్లో వున్నంతసేపూ పుస్తకం పట్టుకోడానికి కూడా అరుంధతికి సమయం వుండేదికాదు. అయినా తప్పకుండా పాసవుతూ ఫోర్తుఫారంవరకూ వచ్చింది. అరుంధతి అర్ధాకలితో పెరిగినా ఏపుగా అందంగా పెరగసాగింది. అరుంధతి ఆ ఇంట్లో పిల్లంటే ఎవరూ నమ్మేవారుకాదు. తన ఆడపిల్లలిద్దరూ అరుంధతి పక్కనవుంటే చూసినప్పుడు రాజేశ్వరి మనస్సు చివుక్కుమనేది. విడిగా చూస్తే వాళ్ళు బాగానే వుండేవారు. కాని అరుంధతి పక్కగా వున్నప్పుడు దివిటీముందు దీపాల్లా కనిపించేవాళ్ళు. రాజేశ్వరికి అరుంధతి అంటే కోపానికి అది కూడా ఒక కారణమే.

 

    వెంకటరత్నం, భార్య లేనప్పుడు అరుంధతి కనిపిస్తే రెప్పవాల్చకుండా చూసేవాడు. కళ్ళు చెమ్మగిల్లేవి. "నా తల్లి అందం రాజకుటుంబాల అందం. ఈ దరిద్రుడి కడుపునపుట్టి రాణించకుండా పోయింది" అనుకొనేవాడు. అరుంధతికి పద్నాలుగోఏడు కూడా వచ్చింది. స్కూల్లో మగపిల్లల కళ్ళన్నీ అరుంధతి చుట్టూ, కమలం చుట్టూ తిరిగే భ్రమరాల్లా అశాంతిగా తిరిగేవి.

 

    "పెద్దదాన్ని చదువు మానిపించకపోతే మన పరువు బజారుపాలు కాక తప్పదు" అంది రాజేశ్వరి ఒకరోజు భర్తకు అన్నం వడ్డిస్తూ. వెంకటరత్నం భార్య ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు. భార్య అరుంధతి మీద ఏమయినా చెబితే వెంకటరత్నం పట్టించుకోవటం మానేశాడు.

 

    "అలా బెల్లంకొట్టిన రాయిలా చూస్తారేం? నిండా పదమూడేళ్ళు వున్నాయోలేవో ఎలా పెరిగిపోయిందో! మనలాంటి దరిద్రులకు అందం కూడా అపరాధమే. అది స్కూలుకుపోతే చాలు, మగపిల్లల కళ్ళన్నీ దాని మీదేనట!" అంది ఎదురుగా కూచుని రాజేశ్వరి.

 

    వెంకటరత్నం ముద్ద గుటుక్కున మింగి, మంచినీళ్ళు గటగట తాగాడు. జవాబుకోసం భార్య ఎదురుచూస్తూ కూచుంది. కాని అతను మరో ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రాజేశ్వరికి వళ్ళు మండిపోయింది. అరుంధతి తలుపుచాటుగా నిల్చొని తండ్రి నిర్ణయంకోసం చెవులు రిక్కించుకొని వినసాగింది.

 

    "ఇవాళ సుమతి చెప్పింది, ఇదీ వెకిలి వేషాలు వేస్తుందట. మగపిల్లల్ని చూసి చిలిపినవ్వులు నవ్వుతుందట. పిల్ల ఒకటే గొడవ పడుతుంది. తన అక్కయ్య అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా వుందంటుంది."

 Previous Page Next Page