Previous Page Next Page 
మరీచిక పేజి 5


    "కాఫీ!" అన్నది శబరి.

 

    "అదేమిటమ్మా టిఫిన్ తినవూ?" రంగారావు అడిగాడు.

 

    "కాఫీ తాగాక టిఫిన్ తింటాను డాడీ!"

 

    "కాఫీ తాగాక టిఫిన్ తినడం ఏమిటి?"

 

    "ఏం ఎందుకు తినకూడదు? టిఫిన్ తిన్నాకే కాఫీ తాగాలని ఎక్కడుంది?"

 

    "దీనికి పిచ్చేక్కేలాగుంది" అన్నది రుక్మిణి.

 

    "మార్వలెస్!" శబరి చప్పట్లు కొట్టింది.

 

    "ఏమిటమ్మా నీ అల్లరి. త్వరగా కానియ్. కాలేజీకి టైం అవుతోంది!" అన్నాడు రంగారావు.

 

    "కాఫీ తాగాక టిఫిన్ తింటాను. ఇవాళ కాలేజీకి ఆలస్యంగా వెళతాను. రోజూ అదే టైంకు కాలేజీకి పోవటం మహా బోర్ గా వుంది డాడీ."

 

    "నీ యిష్టం" అన్నాడు రంగారావు కూతురి ముఖంలోకి చూస్తూ.

 

    రుక్మిణి భర్తకేసి కొరకొరా చూసింది. రంగారావు తలవంచుకొని టిఫిన్ తినసాగాడు. రుక్మిణి రుసరుసలాడుతూ టిఫిన్ తినకుండా లేచి వెళ్ళిపోయింది.

 

    "మీ అమ్మీకి కోపం వచ్చింది బేరీ! టిఫిన్ తినకుండా వెళ్ళిపోయింది."

 

    "ఒకరోజు టిఫిన్ తినకపోతే ఏమౌతుంది డాడీ? నా క్లాస్ మేట్ లక్ష్మి ఒక్కోరోజు అన్నం కూడా తినదు."

 

    "ఏం?"

 

    "వాళ్ళు బీదవాళ్ళు. ఒకోరోజు ఇంట్లో తినడానికి ఏమీ వుండదట!" అన్నది బేరి.

 

    రంగారావు మౌనంగా వుండిపోయాడు. తల్లి కోపగించుకొని అలా వెళ్ళిపోయినందుకు శబరికి బాధ అనిపించలేదు. డైనింగ్ టేబుల్ ముందు రోజూ వుండే మొనాటనీకి ఏదో బ్రేక్ అయినట్లు సంతృప్తి కలిగింది. శబరి కాఫీ తాగింది. ఆ తర్వాతే టిఫిన్ తిన్నది.

 

    శబరి కాలేజీకి వస్తే విద్యార్థులు బాపూ ముఖచిత్రంతో వెలువడిన వారపత్రిక ప్రత్యేక సంచికను చూసినట్టు చూస్తారు.

 

    ఆమె నడకలోని వయ్యారం చూస్తూ రాచకొండ సిమిలీస్ చదివి పొందే అనుభూతిని పొందుతారు. ఆమె మాట్లాడుతూ వుంటే ఉర్దూ కవిత్వం వింటున్నట్లు ముగ్ధులై నిల్చుండిపోతారు. ఆమె నవ్వితే కాలేజీ ఆవరణలో ఇంద్రధనుస్సులు విరిగిపడ్తాయ్. ఆమె గ్రీవాభంగం చేసి పక్కకు చూస్తే నెమళ్ళు పురివిప్పి ఆడతాయి. ఆమెలో డ్రీమ్ గరల్ హేమామాలిని పోలికలున్నాయని కొందరంటే, వహీదా పోలికలున్నాయని మరికొందరు వాదిస్తారు. ఆమెను 'కాలేజీ బ్యూటీ' అనీ 'డ్రీమ్ గరల్' అని అంటూ వుంటారు.

 

    కాలేజీలో చేరిన కొత్తలో శబరికి గర్వంగా వుండేది. అనేక జతల కళ్ళు తనను ఆశగా, పసివాడు బర్త్ డే కేక్ కేసి చూసినట్టు చూస్తూ వుంటే శబరికి మహా  థ్రిల్లింగ్ గా వుండేది. రాను రాను అందులో కొత్తదనం కన్పించడం లేదు. వాళ్ళ మాటల్లో, చూపుల్లో, ప్రశంసల్లో వెగటు, తీపి ఎక్కువ తిన్నలాంటి వెగటు, మనసును చుట్టేస్తూ వున్నది.

 

    అంతమంది ఆరాధించటంలో థ్రిల్ ఏమీ కన్పించటం లేదు. శబరికి ఎవరినైనా ఆరాధించాలని వుంది. ప్రేమించాలని వుంది. ప్రేమించి తపించాలని వుంది. తిండి సహించక, నిద్రరాక బాధపడాలని వుంది. కాని ఆ అవకాశం దొరకడం లేదు. శబరి కోరుకోవాలేగాని వెంటనే వివాహానికి సిద్ధపడేవాళ్ళే కనిపిస్తున్నారు. శబరికి అందీ అందని ఆకాశం ఏలాలని వుంది. కోరిన ప్రతివస్తువూ వెంటనే లభించడంలో థ్రిల్ ఏముంది? ఏదో జరగాలి... విషాదంతో... మనసు నిండాలి. అందులోనే విలక్షణమైన ఆనందాన్ని పొందాలి. ఈ రొటీన్ నుండి, ఈ మిధ్యా ఆడంబరాల నుండి, ఈ నియమబద్ద జీవితం నుంచి - -- హిపోక్రసీ నుంచి బయటపడి, కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. ఆ ప్రపంచంలో తరతమ భేదాలు వుండకూడదు. ఇది ఇలాగే వుండాలనే నియమం వుండకూడదు.

 

    శబరికారు దిగింది. అనేక కళ్ళు ఆమెను వెన్నంటాయి. శబరి ఆగి నిల్చుంది. పదిగజాల దూరంలో ఉన్న జ్యోతి కొరకు నిలబడింది. శబరీ, జ్యోతీ సన్నిహితంగా వుంటారు. జ్యోతికూడా శ్రీమంతుల బిడ్డే! ఆమె కూడా కార్లోనే వస్తుంది. శబరి అంత అందమయినది కాదు. అయినా ఆమె వ్యక్తిత్వంలో ఏదో ఆకర్షణ వుంది. ఆమె పలుకులోని తీవ్రతా, కళ్ళలోని ఆర్ధ్రత, ఆమె వ్యక్తిత్వానికి ఓ విలక్షణతను చేకూర్చాయి. చామనచాయగా బొద్దుగా వుండే జ్యోతికి 'గ్లాక్సో బేబీ' అని పేరు పెట్టారు విద్యార్థులు.  

 

    "ఒరేయ్ రఘూ! నీ డ్రీమ్ గరల్ వస్తోందిరా."

 

    "నీ గ్లాక్సో బేబీ కూడా వస్తోంది చూడరా!"

 

    జ్యోతి చురచురా చూసింది. శబరి నవ్వుతూ చూసింది.

 

    "బోర్! చవటాగ్రేశర చక్రవర్తులు! కొత్త జోక్సు వెయ్యడం కూడా రాదు. అరిగిపోయి తుప్పు పట్టిన పాత రికార్డుల్నే తిప్పి తిప్పి వేస్తూ వుంటారు." శబరి విద్యార్థుల ముఖాల్లోకి చూస్తూ గట్టిగానే అనేసింది. విద్యార్థులు బిత్తరపోయి నిల్చున్నారు.

 

    "పళ్ళు రాలగొట్టాలి వెధవల్ని!" అన్నది జ్యోతి కోపంగా.

 

    "అబ్బబ్బ జ్యోతీ! నువ్వూ రోజూ ఇదే రికార్డు పెడతావ్! యమబోర్! చస్తున్నాను!" శబరి అంది.

 

    "తల్లీ ఇంక వూరుకో... నీబోర్ తో మమ్మల్ని బోర్ చేసేస్తున్నావ్!"

 

    "అదిగో మళ్లీ పాత చింత..."

 

    "నోరు మూసుకుని పదవోయ్ క్లాసుకు టైం అయింది" జ్యోతి గంభీరంగా అన్నది, శబరి మాటల్ని మధ్యలో తుంచేస్తూ.

 

    రమేష్ ఎదురుగా పిల్లర్ కు నడుం ఆనించి, వొక కాలు వొంకరగా పెట్టి, వయ్యారంగా నిల్చుని చిలిపిగా శబరి ముఖంలోకి చూస్తూ, వెకిలిగా నవ్వాడు.

 

    "డల్! రొటీన్! ఫూల్! వీడు చూడు! రోజూ ఇక్కడే నిల్చుంటాడు. ఇదే ఫోజులో నిల్చుంటాడు. ఇదే నవ్వు... ఇవే చూపులు! మరోరకంగా నవ్వటం రాదు. మరోలా చూట్టం అంతకంటే రాదు. ఇంకోలా నిల్చోడం కూడా రాదు. కనీసం స్థలం మార్చాలని కూడా తోచదు ఈ చవటకు. ప్రేమిస్తాడట. ఆ పెళ్ళాన్ని బోర్ కొట్టించేస్తాడనుకుంటా. వెరైటీ తెలియని వాజమ్మ!" శబరి గలగల అన్నది.

 

    "బేరీ ఏమిటే నీ వాగుడు? ఈరోజు నీకేమయింది! మరీ విజృంభించావ్! పద! పద!" అంటూ జ్యోతి విసురుగా నడిచింది.

 

    "రోజూ మనసులో అనుకునే మాటల్ని ఇవాళ పైకి అనేశాను. అంతే తేడా!"

 

    జ్యోతి సాలోచనగా శబరి ముఖంలోకి చూసింది. ఇద్దరూ మౌనంగా క్లాసు రూంలోకి వచ్చారు. లెక్చరర్ రాలేదు.

 

    "జ్యోతీ వకటడగనా?"

 

    "ఏమిటి?"

 

    "ఈ జీవితం బోర్ కొట్టడం లేదూ? రొటీన్ లైఫ్!"

 

    జ్యోతి ఆలోచనలోకి జారిపోయింది.

 

    "చెప్పవేం? ఏదో చెయ్యాలని లేదూ? ఏదైనా అద్భుత కార్యం చెయ్యాలనిపించటం లేదూ?"

 

    "అనిపిస్తుంది. కాని ఏం చెయ్యాలో తెలియడం లేదు" చిన్నగా తనకు తనే చెప్పుకున్నట్టు అన్నది జ్యోతి.

 

    శబరి ముఖం వికసించింది. కళ్ళు అనందంతో మిలమిలలాడాయి. "వెధవ చదువు! బోర్ కొడుతోంది. మానేద్దాం."

 

    "చదువు మానేస్తే ఎలా?" సాలోచనగా అన్నది జ్యోతి.

 

    "అసలు ఎందుకు చదువుకోవాలి?" జ్యోతి గిర్రున తలతిప్పి శబరికేసి చూసింది.

 

    "ప్రపంచం గురించి తెలుసుకోవడానికీ, మంచీ, చెడూ తెలుసుకోవడానికీ, విజ్ఞానం ఆర్జించడానికి - మనిషి మనిషిగా..."

 

    "అవన్నీ లేకపోతేనేం? మధ్యలో అందుకొని ప్రశ్నించింది శబరి. జ్యోతి ఆలోచిస్తూ వుండిపోయింది.

 

    "అవే పాఠాలు... అవే కుర్చీలు-అవే గదులు-రోజూ కన్పించే ముఖాలే - రోజూ ఆ లెక్చర్సే, చెప్పిందే చెప్పడం- యమబోర్ గా అన్పించడంలేదూ?"

 

    జ్యోతి సమాధానం చెప్పలేదు.

 

    "అంతా అర్టిఫీషియల్ - వీటన్నిటి నుంచి బయటపడాలి. ఈ మనుషుల నుంచి దూరంగా పోవాలి.

 

    "ఎక్కడికి వెళ్ళగలం?"

 

    "కొత్త ప్రపంచంలోకి... వింత ప్రపంచంలోకి... అద్భుతమయిన ప్రపంచంలోకి... రొటీన్ నుంచి బయటపడే ప్రపంచంలోకి..." ఉద్రేకంగా అన్నది శబరి.

 Previous Page Next Page