Previous Page Next Page 
మరీచిక పేజి 6


    జ్యోతి విస్మయంగా శబరి ముఖంలోకి చూసింది.

 

    "ఏమిటే అలా చూస్తావ్?"

 

    "నీ మాటలు వింటూంటే ఆశ్చర్యంగా వుంది."

 

    "ఎందుకూ?"

 

    "నాకూ ఈ మధ్య ఇలాగే అనిపిస్తూ వుంది."

 

    "నిజంగా?"

 

    "నిజం."

 

    "అయితే వెళ్ళిపోదాం!"

 

    "ఎక్కడికి?"

 

    "ఎక్కడికైనా... ఈ పాతముఖాలకు దూరంగా... ఈ హిపోక్రాట్సుకు దూరంగా... ఈ చింతకాయ పచ్చడి భావాలకు దూరంగా!"

 

    "అది సరే! ఎక్కడికెళదాం? ఏం చేద్దాం?"

 

    శబరికి సమాధానం తోచలేదు. నిజమే! ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అదేగా అసలు సమస్య? లెక్చరర్ రావడంతో వాళ్ళ సంభాషణ అంతటితో ఆగింది.


                                       4


    వారం రోజులుగా జ్యోతి కాలేజీకి రావడంలేదు. శబరికి మరీ పిచ్చెత్తినట్టుగా అన్పిస్తోంది. ఆరోజు త్వరగా బయలుదేరి జ్యోతి వాళ్ళింటికి వెళ్ళింది. గేట్లో ఎదురైన పనికుర్రాడు జ్యోతి కాలేజీకి వెళ్ళిపోయిందని చెప్పాడు.

 

    "కార్లో వెళ్ళలేదూ?"

 

    "కార్లోనే వెళ్ళారు. చిన్న కారుకొన్నారు. అమ్మాయిగారు వారం రోజులనుంచి తనే డ్రైవ్ చేసుకొని కాలేజీకి వస్తున్నారుగా? తమరు చూళ్ళేదా?"

 

    శబరి విస్మయంగా అతనికేసి చూసింది.

 

    "కాలేజీకి పద!" డ్రైవర్ తో అన్నది శబరి. కారు కదిలింది.

 

    జ్యోతి కాలేజీకి వెళుతున్నట్టు చెప్పి ఎక్కడికి వెళుతుందో! తనకు మాటమాత్రం కూడా చెప్పలేదే! ఏదైనా ప్రేమ వ్యవహారంతో పడిందేమో?

 

    జ్యోతి రొటీన్ లో పడిందన్న మాట! ఎన్నో కబుర్లు చెప్పిందిగా? ఎవర్ని ప్రేమిస్తోందో? అందుకేనేమో ఆ మధ్య ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే కన్పిస్తున్నది. ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెపుతానన్నది. ప్రకాశంతో మాట్లాడుతూ వుండటం ఆ మధ్య తను రెండు మూడుసార్లు చూసింది. బీద కుర్రాడు. సరైన బట్టలు కూడా వుండవు. బుద్ధిగా చదువుతాడు. పుస్తకం పురుగు. అల్లరి చిల్లరిగా మాట్లాడడు. అందుక్కూడా షివల్రీ. ధైర్యం వుండాలిగా? పిరికివాడిలా కన్పిస్తాడు. అటువంటివాణ్ణి ప్రేమిస్తుందా? జ్యోతిది ఆర్డినరీ టేస్టా? మరి తనతో ఏమేమో చెప్పింది? అవును! అన్నట్టు వారం రోజులుగా ప్రకాశం కూడా కన్పించలేదు. తన ఊహ కరెక్టే నన్నమాట!

 

    కారు ఆగింది! శబరి దిగింది! రఘూ, రమేశ్ ఎదురయ్యారు! ఈ మధ్య వాళ్ళు జోక్సు వెయ్యడం మానేశారు. దొంగ చూపులు చూస్తూ వుంటారు. చవటలు! బెదిరిపోయారు! తమ జోక్సు వెయ్యవద్దని అనలేదే ఆ ఏడ్చేదేదో కొంచెం వెరైటీతో ఏడవమన్నది. పిరికి పందలు. శబరి వెళ్ళేసరికి జ్యోతి క్లాసులో కూర్చుని వుంది. జ్యోతి సాదానేత చీరలో కొత్తగా కన్పించింది. వంటిమీద నగలు కూడా లేవు. సన్యాసం పుచ్చుకుందా లేక ప్రేమలో పడిందా?

 

    "ఎక్కడి కెళ్ళావోయ్ వారం రోజులనుంచీ కాలేజీకి రాలేదు?"

 

    "ఇంటి దగ్గరే వున్నాను!"

 

    శబరి ఆశ్చర్యంగా జ్యోతి ముఖంలోకి చూసింది.

 

    "అబద్ధం! నేను ఇప్పుడే మీ ఇంటినుంచి వస్తున్నాను."

 

    "చంపావ్ పో! ఇంట్లో వాళ్ళకు నేను కాలేజీకి రావడం లేదని చెప్పావా?"

 

    "లేదులే! భయపడకు! ఎక్కడికెళ్ళావ్?"

 

    "తర్వాత చెబుతాలే!"

 

    "ప్రేమ వ్యవహారమా?" కళ్ళు పెద్దవి చేసి జ్యోతిని చూస్తూ అడిగింది శబరి. జ్యోతి చిరునవ్వు నవ్వింది.

 

    "ఎవరితో? ప్రకాశంతో ఏమైనా గ్రంథం నడిపిస్తున్నావా ఏమిటి? నువ్వూ పడ్డావన్నమాట!"

 

    "పడలేదు. పడెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను."

 

    "ఎవర్నీ?"

 

    "చాలామందిని!" నవ్వుతూ అన్నది జ్యోతి.

 

    "అదేమిటి? ఎంతమందిని ప్రేమిస్తున్నావ్?"

 

    "సమయం వచ్చినప్పుడు చెబుతాగా?"

 

    "నా దగ్గిర దాస్తున్నావు గదూ?"

 

    "నువ్వు నాతో వస్తావా? ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నావుగా?'

 

    "మనిద్దరం ఒక్కణ్ణే ప్రేమిద్దామా? థ్రిల్లింగ్! బలే! నాకు అభ్యంతరం లేదు."

 

    "నీ ముఖం!"

 

    "నాకోసం మరొకడ్ని చూస్తావా? ఛ! మళ్ళీ రొటీనేగా? బోరింగు!"

 

    "అది కాదులే!"

 

    "మరేమిటో చెప్పు!"

 

    "నాతో వచ్చేస్తావా?"

 

    "ఎక్కడికి?"

 

    "దూరం... చాలా దూరం... మీ మమ్మీని - డాడీని వదిలేసి రాగలవా?"

 

    "ఈ సమాజానికి దూరంగానా? ఈ కంపుకొట్టే భావాలకూ, మనిషిని యంత్రంగా చేసే ఈ బంధాలకూ దూరంగా... స్వేచ్చగా బ్రతకడానికేనా? వస్తాను. ఎప్పుడు వెళదాం! నేను రెడీ!"

 

    జ్యోతి ఆలోచిస్తూ వుండిపోయింది.

 

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"

 

    "ఒకరకంగా అంతే! కాని.." ఆగిపోయింది క్యోతి చెప్పడానికి సందేహిస్తున్నట్టు.

 

    "ఎందుకు ఆగిపోయావ్ చెప్పు!"

 

    "ఇప్పుడే చెప్పను. నేను ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాక చెబుతాను. అయినా నువ్వు నాతో వస్తావనీ రాగలవనీ నాకు నమ్మకం లేదు. అయినా చెబుతాను. నాతో తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తాను" అంటూ జ్యోతి లేచింది.

 

    "ఎక్కడికి? ఇంకా క్లాసులు ఉన్నాయ్ గా?

 

    "నాకు పని వుంది!" అంటూ జ్యోతి వెళ్ళిపోయింది.

 

    శబరి అలా వెళ్ళిపోతున్న జ్యోతిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ప్రకాశం గూడా చిన్నగా వెళ్ళిపోవడాన్ని గమనించింది. పెద్ద కోతలు కోస్తున్నది. "ఇది ప్రకాశాన్ని ప్రేమించినట్టుంది. ఛఁ! వెరీ ఆర్డినరీ టేస్టు!" అనుకుంటూ ఆలోచనల్లోకి జారిపోయింది శబరి.


                                       5


    సుబ్బన్నా కారు ఆపు!" దాదాపు అరిచింది శబరి. కారు కొంతదూరం పోయి "సర్రున" శబ్దం చేస్తూ ఆగింది. కారు డోరు తెరుచుకుని దిగింది.

 

    "ఏంటమ్మాయిగారూ? ఇక్కడెందుకు దిగుతున్నారు?"

 

    సుబ్బన్న మాట వినిపించుకోనట్టే శబరి రోడ్డు దాటింది. అది యూనివర్శిటీ రోడ్డు. దరిదాపుల్లో ఇళ్ళు లేవు. శబరి రోడ్డు పక్కగా ఉన్న పెద్ద చెట్టుకిందకు వెళ్ళడం చూస్తూ నిల్చున్నాడు సుబ్బన్న. చెట్టుమొదలుకు చేరబడి ఉన్నది ఓ మానవాకారం దగ్గరగా వచ్చి చూసింది. అప్పుడుగాని అతను ఒక యువకుడని తెలియలేదు. దూరం నుండి చూసి ఆడపిల్ల అనుకున్నది శబరి. కళ్ళు పెద్దవి చేసుకొని యువకుడికేసి ఆశ్చర్యంగా చూసింది శబరి.

 

    ఆ రూపం వింతగా వుంది. దుస్తులు మురిగ్గా వున్నాయి. ప్యాంటు నిండా మాసికలు వేసి వున్నాయి. లాల్చీ బాగా చిరిగి వుంది. బెల్ బాటం మీద లాల్చీ వింతగా అనిపించింది శబరికి. లాల్చీకి అక్కడక్కడ చిరుగులు వున్నాయి. పొడవాటి పూసల దండ మెళ్ళో వేలాడుతున్నది. జుట్టు సంస్కారం లేక అడచలు కట్టి వుంది. చెప్పులు లేని పాదాలు మురిగ్గా వున్నాయి. మెడకింది మురికి పేరుకొని, చారలుకట్టి ఉన్నది. ఆ మురికి రూపం చూస్తుంటే శబరికి కడుపులో ఏదో కదిలినట్టు అయింది. అయినా అక్కడినుంచి వెళ్ళాలనిపించడంలేదు. అతను ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.

 Previous Page Next Page