Previous Page Next Page 
మరీచిక పేజి 4


    "హాయ్ మీనా!" అన్నదేగాని తన మాటలు తన చెవులకే ఎబ్బెట్టుగా విన్పించాయి శబరికి.

 

    ఆడపిల్లలూ, మగపిల్లలూ 'హాయ్! హాయ్! యా! యా! నో మాన్!' అంటూ అవే మాటల్ని పదే పదే ఉపయోగించడమూ, ప్రతి సిల్లీ జోక్ కూ పగలబడి నవ్వడమూ, ఈ మధ్య శబరికి చెడ్డ చిరాకు కలిగిస్తున్నది.

 

    "హాయ్ ఆదీ! హౌ డూ యూడూ?" నాలుగు ఆడకంఠాలూ, రెండు మగ కంఠాలూ ఒకేసారి పలికాయి.

 

    శబరి తిరిగి చూసింది.

 

    ఆరు అడుగుల ఎత్తు విగ్రహం.

 

    ఫుల్ సూట్ లో హుందాగా, గంభీరంగా ఉండే ఆ శ్రీమంతుడి చుట్టూ జీవితం చెమ్మచెక్క ఆడుతూ ఉన్నట్టు అన్పించింది శబరికి.

 

    ఎప్పుడూ ఒకేలాంటి వేషం! అదే పోజు! నెక్ టై కూడా మర్చిపోడు. కోటు బటన్ హోలులో గులాబీని అమర్చుకోవడం అసలే మర్చిపోడు.

 

    అదే గులాబి! ఎర్ర గులాబి!

 

    కనీసం రంగులోనైనా మార్పులేదు.

 

    ఒక్క రేకయినా నలగలేదు. వాడలేదు.

 

    ఎంత శ్రద్దో అలంకరణమీద!

 

    బోర్! యమబోర్! రొటీన్! నో వెరైటీ!

 

    అనుకున్నది శబరి.

 

    "హల్లో శబరీ! హౌడూయూడూ?" శబరి కళ్ళలోకి గుచ్చి చూస్తూ అడిగాడు ఆ యువకుడు.

 

    "ఫైన్" అన్నది శబరి.

 

    చచ్చు ప్రశ్న. ఎప్పుడూ చూడగానే అదే ప్రశ్న! అదే చూపు! సినిమాల్లోని కథల్లోని హీరోలా చూడాలని ప్రయత్నం పాపం! పూర్ ఫెలో!

 

    "ఈ చీరలో చాలా అందంగా వున్నావ్! బ్యూటిఫుల్!"

 

    ఎప్పుడు ఏ దుస్తుల్లోవున్నా అదేమాట అంటాడు. చచ్చు పొగడ్త!

 

    "హాయ్ మీనా!"

 

    "చామనచాయగా, బొద్దుగా వుండి, ప్యాంటూ షర్టూలోవున్న మీనా ఆ పలకరింపుకు పులకరించిపోయి "కెర్, కెర్, కెర్" అంటూ కోడిపుంజు దగ్గిరగా వచ్చే బలసిన కోడిపెట్టలా కన్పించింది ఆదిత్య దగ్గరకు వస్తున్న మీనా - శబరి కళ్ళకు.

 

    శబరికి నవ్వు వచ్చింది.

 

    ఆడపిల్లలంతా ఆదిత్య చుట్టూ చేరారు.

 

    ఆ కంఠాలు వింతశబ్దాలు చేస్తున్నాయి.

 

    వాళ్ళంతా బాతుల్లా, నెమళ్ళలా, కోడిపెట్టల్లా కన్పించారు శబరికి.

 

    తల్లి తననే కనిపెడుతుందని శబరికి తెలుసు. అయినా ఆదిత్య దగ్గిరకు వెళ్ళాలనే వాంఛలేదు శబరికి.

 

    అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. జోక్స్ వేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రపంచం అంతా తన చుట్టూనే తిరుగుతున్నట్లు ప్రవర్తిస్తున్నారు. నవ్వుల గలగలలలో వాతావరణం నిండిపోయి వుంది.

 

    శబరికి నవ్వు రావడంలేదు. మాట్లాడాలనిపించడంలేదు. ఆ వాతావరణం కృత్రిమంగా ఉన్నది. ఊపిరి సలపడంలేదు. ఎక్కడికైనా దూరంగా పారిపోయి గుండెల నిండుగా గాలి, స్వచ్చమైన గాలి, పీల్చుకోవాలని వుంది శబరికి.

 

    రొటీన్! బోర్! స్టుపిడ్! డిన్నర్లూ! పకరింపులూ! ఎవరి గొప్ప వాళ్లు చెప్పుకోవడాలూ - ఒకరి డ్రెస్ గురించి మరొకరు పొగడడం, వేసిన జోక్సే వేసుకోవడం, నవ్వు వచ్చినా రాకపోయినా పెద్దగా నవ్వడం ఒక థ్రిల్లూ లేదు... పాడూ లేదు- అంతా రొటీన్ - హిపోక్రెసీ...

 

    శబరి సాయంత్రం తను చూసిన కృష్ణ భక్త బృందం గురించి చెప్పడానికి ప్రయత్నించింది. కాని యెవరూ వినాలనే కుతూహలాన్ని చూపించలేదు.

 

    డిన్నర్ పూర్తయింది.

 

    "బేరీ! ఆదిత్య ఏమన్నాడే!" తిరిగి వస్తున్నప్పుడు కార్లో అడిగింది రుక్మిణి.

 

    "ఈ చీరలో నేను చాలా అందంగా వున్నానట!"

 

    "నిజంగా ఆ మాట అన్నాడా?" ఉత్సాహంగా అడిగింది రుక్మిణి"

 

    "బ్యూటిఫుల్ అని కూడా అన్నాడు!"

 

    "ఇంకా ఏమన్నాడూ?"

 

    "కొత్తగా ఏమీ అనలేదు. రోజూ అనే మాటలే! అందరితో అనే మాటలే! పాతపాటే!"

 

    "ఏమిటే నీ పిచ్చి వాగుడూ!" కస్సున లేచింది రుక్మిణి.

 

    డ్రైవర్ సుబ్బయ్య ముసిముసిగా నవ్వుకోవడం కన్పించింది ఎదురుగా వున్న అద్దంలో శబరికి.

 

    ఫర్వాలేదు. సుబ్బయ్య నవ్వగలడు! ఎప్పుడూ వానకు తడిసిన నులుక మంచంలా బిగిసిపోయి కన్పిస్తాడు. పాపం! ఏం చేస్తాడు? నవ్వితే యజమానికి కోపం వస్తుందని భయం.

 

    మమ్మీకి ఆదిత్యను అల్లుణ్ణి చేసుకోవాలని వుంది. ఎలాగయినా తనను ఆదిత్యకు కట్టబెట్టాలని చూస్తూంది. ఏముంది ఆదిత్యలో? అంత మంది ఆడపిల్లలు పడి చస్తారెందుకో? శ్రీమంతుడు! ఎప్పుడూ టిప్ టాప్ గా, షోకేసులో బొమ్మలా వుంటాడు! అదేనేమో అంత ఆకర్షణకు కారణం?

 

    ఆదిత్యకు తనంటే ఇష్టం!

 

    పెళ్లవుతుంది.

 

    ఆ తర్వాత! మళ్ళీ అంతా రొటీన్... తనూ.. ఆదిత్య... పిల్లలు మమ్మీ... డాడీ... హిపోక్రాట్స్ గా తయారవడం పెళ్లయ్యాక... పిల్లలు పుట్టాక... ప్రేమ ఏమిటి! మట్టి! పూర్ ఉమెన్... ఫూర్ మాన్ భర్త సంపాదనలోపడిపోతాడు. భార్య చుట్టూవున్న వాళ్ళకంటే తను అధికురాలిని అనిపించుకునే తాపత్రయంలో పడి, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు చేస్తుంది. డబ్బు సంపాదనలో భర్త అనేక అవినీతి పనులకు పాల్పడ్తాడు. పిల్లలు పెద్దవుతారు. వాళ్ళకు అల్లుళ్ళను వెదకాలి... తమ అంతస్థుకు తగిన వాళ్ళను చూడాలి.. అబ్బ బోర్! డల్!


                                     3


    "అమ్మాయిగారూ! అమ్మగారు టిఫిన్ చెయ్యడానికి రమ్మంటున్నారు.

 

    "బోర్! యమబోర్!"

 

    "ఏందమ్మాయిగారూ?"

 

    "టంచన్ గా ఎనిమిదికొట్టగానే రోజూ ఇదేవార్త మోసుకువస్తావ్! పోనీ ఏడున్నరకి చెప్పరాదూ? తొమ్మిదికి చెప్పరాదూ?"

 

    "టిఫిన్ టైం అదేగదమ్మా?"

 

    "ఏం అదే ఎందుకు కావాలి?"

 

    సుబ్బమ్మ తెల్లబోయి శబరి ముఖంలోకి చూసింది.

 

    "బేరీ! బేరీ!"

 

    "అమ్మగారు పిలుస్తున్నారు?" అంటూ సుబ్బమ్మ వెళ్ళిపోయింది.

 

    శబరి డైనింగ్ టేబుల్ దగ్గరకు విసుగ్గా వెళ్ళింది.

 

    "ఏమిటే రోజూ పిలవాలా? టిఫిన్ టైం తెలియదూ?"

 

    శబరి పలక్కుండా కూర్చుంది.

 

    "నాన్నగారి కుర్చీలో కూచున్నావేం? నీ కుర్చీలో కూర్చో."

 

    "బోర్!"

 

    "ఏమిటే నీబోరూ నువ్వూనూ! ఇదొకటి నేర్చుకుని చంపుతున్నావ్!"

 

    "వండర్ ఫుల్! థ్రిల్లింగ్! ఎంతకాలానికి కొత్తమాటల్లో విసుక్కున్నావు మమ్మీ!" కిలకిల నవ్వింది శబరి.

 

    "సరేలే! లే! నీ కుర్చీలో కూర్చో!"

 

    "ఇవ్వాళ ఇక్కడే కూర్చుంటా! రోజూ ఒకే కుర్చీలో కూర్చోవాలంటే మెకానికల్ గా ఉంటున్నది."

 

    "వాక్కుండా లేస్తావా లేదా?"

 

    "పోనిద్దూ. ఎక్కడ కూర్చుంటే ఏమిటి?" అన్నాడు రంగారావు.

 

    "దాన్ని మరీ నెత్తికెక్కించుకుని చెడగొడుతున్నారు."

 

    "మళ్ళీ అదే పాతపాట! బూజుపట్టిన మాటలు!"

 

    సుబ్బమ్మ టిఫిన్ తెచ్చింది.

 Previous Page Next Page