Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 4

    శాంతమ్మను జాగ్రత్తగా పడుకోబెట్టింది. దుప్పటి సర్దింది.
    'నేను నిద్రపోయిందాకా నాదగ్గర కూర్చో' అంది దుప్పటిలోనుంచి చేతిని బయటకు పెట్టి, సుందరమ్మ కోసం తడుముతూ. ఎముకలకు అంటుకుపోయిన చర్మం మీద నుంచి చేతి నరాలు నులక తాళ్ళలా ఉబికి కన్పిస్తున్నాయి. సుందరమ్మ ఆ చేతిని తన చేతితో మృదువుగా నిమిరింది.
    'అలాగే కూర్చుంటాను. పడుకో'.
    కొద్ది క్షణాల్లోనే శాంతమ్మ సగం తెరిచిన బోసినోటి నుంచి గురక విన్పించింది.
    సుందరమ్మ లేచింది.
    'సుందరమ్మా! ముందు నువ్వెళ్ళి పళ్ళు తోముకుని టీ తాగిరా' అన్నాడు రాముడు.
    సుందరమ్మ ఆ గదిలో చివరగా వున్న నాలుగో మంచం పక్కన చిన్న స్టూలు మీద పెట్టె పెట్టుకుని బయటికి వెళ్ళబోయింది.
    'ఇలారా!' శాంతమ్మ మంచం పక్కనున్న మంచం మీద కూర్చుని వున్న ముసలమ్మ సుందరమ్మను పిల్చింది.
    'ఏయ్ ఆయేషాబీ! నీకేం పనిలేదా? ఆయమ్మను వెళ్ళి టీ తాగనివ్వు'. అన్నాడు రాముడు.
    సుందరమ్మ ఆమెకేసి చూస్తూ 'ఇప్పుడే వస్తా! అని బయటికి వెళ్ళిపోయింది.
    రాముడు వెంట వచ్చి టీ ఇప్పించాడు. సుందరమ్మకి అక్కడి వాతావరణం చూస్తుంటే కడుపులో ఏదో కదిలినట్టు అవుతోంది. మనసంతా చేదు చేదుగా వుంది. ఉబికి వస్తున్న కన్నీటిని పైట కొంగుతో తుడుచు కుంటున్నది. సుందరమ్మ గదిలోకి వచ్చింది. ఆయేషాబీ మళ్ళీ పిల్చింది.
    సుందరమ్మ ఆమె మంచం దగ్గరకెళ్ళి నిల్చుంది. 'కూర్చోమ్మా' అంది. సుందరమ్మ మంచం పట్టెమీద కూర్చుంది.
    'నీకు పిల్లలు లేరా?'
    సుందరమ్మ మాట్లాడలేదు.
    'అవును! లేరు అందుకే ఇక్కడకు వచ్చావు.' ఆయేషాబీ ఆ మాటలు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా అంది.
    సుందరమ్మ సమాధానం ఇవ్వలేదు. ఓ క్షణం ఆగి 'నీకు పిల్లలు ఉన్నారా?' మాట మారుస్తూ అడిగింది సుందరమ్మ.
    'పిల్లలుంటే ఇక్కడికెందుకొస్తాను? నేను గొడ్రాలిని. అందుకే...'
    'ఎంతకాలం అయింది ఇక్కడికొచ్చి?'
    'చాలాకాలం అయ్యింది. ఎన్నేళ్ళో గుర్తులేదు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు నీలాగే ఉన్నాను. చాలా కాలం ఇక్కడ పన్లు చేశాను. నాచేతి మీదగా సేవలు చేసి ఎందర్నో పంపించేశాను.' అదోలా నవ్వింది ఆయేషాబీ. మొనాలిసా నవ్వుకి అర్ధం చెప్పే వాళ్ళుంటారేమో గాని అయేషాబీ నవ్వును అర్ధం చేసుకోగలవారుండడం అసంభవమే.
    'మీది ఏ ఊరు? మంచి తెలుగు మాట్లాడుతున్నావే!'
    'నేను తెలుగుదాన్నే'.
    'అంటే ఆంధ్రా ముస్లిములా? ఏ ఊరు?'
    'కర్నూలు. నేను హిందువునే. నా అసలు పేను పుల్లమ్మ.'
    'మరి ఈ పేరు ఎవరు పెట్టారు?' సుందరమ్మ ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగింది.
    'నా కథ చెబుతాను వింటావా?'
    సుందరమ్మకు వినాలని లేదు. మనసంతా అదోలా ఉంది. అయినా యాంత్రికంగా 'చెప్పు' అంది.
    'కొంచెం మంచినీళ్ళిస్తావా? దాహంగా ఉంది.'
    సుందరమ్మ లేచివెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. నీళ్ళు తాగి ఖాళీ గ్లాసు సుందరమ్మకు అందించింది. సుందరమ్మ గ్లాసు మంచం పక్కనే ఉన్న స్టూలు మీద పెట్టింది.
    'మాది కర్నూలు. మానాన్న తాపీమేస్త్రిగా పని చేసేవాడు. ఐదో క్లాసు వరకు చదువుకున్నాను.'
    'చదవడం వచ్చా?'
    'వచ్చు. మా తాతయ్య చిన్నప్పుడు నాకు రాజకుమారుడి కథలు చెప్పేవాడు. అమ్మమ్మ కూడా రాజకుమారుడి కథలే చెప్పేది. నాకు కలలో రాజకుమారుడి కన్పించేవాడు. నాకు వయసొచ్చింది. మా నాన్న పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు. ఒక పట్టాన కుదరడం లేదు. దానికింకా పదిహేను దాటలేదు. పెళ్ళికేం తొందరొచ్చిందిరా?' అనేది అమ్మమ్మ. అమ్మమ్మకు నేనంటే ప్రాణం. మా ఇంటి దగ్గర్లో ఉన్న రంగయ్య కలెక్టరాఫీసులో జవానుగా పనిచేస్తుండేవాడు. ఖాళీ పాంటూ-ఖాకీ షర్టూ- భుజం మీదుగా వేలాడే బిళ్ళబెల్టు - అదే ఆ రోజుల్లో అట్టాంటి వాళ్ళను బిళ్ళ బంట్రోతు అనేవాళ్ళు. నువ్వెప్పుడైనా చూశావా?'
    'చూశాను.' అన్నట్టు తల ఊపింది సుందరమ్మ.
    'అతడ్ని చూస్తుంటే నా కలల్లోకి వచ్చే రాజకుమారుడు అతడే అనిపించేది. నేను అతన్ని దొంగచూపులు చూడడం అతడు తెలుసుకున్నాడు. నాతో చిన్నగా మాటలు కలిపాడు. నన్ను ప్రేమించానన్నాడు. కులాలు వేరు కాబట్టి పెద్దవాళ్ళు ఒప్పుకోరు అన్నాడు. అందుకే పట్నం వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాం అన్నాడు. నేను నమ్మాను. రంగయ్యతో ఓ అర్దరాత్రి ఇంటినుంచి పారిపోయి హైదరాబాద్ చేరాను. నెల తిరక్కుండానే అతనికి నామీద మోజు తీరిపోయింది.' అని ఆగి నిట్టూర్చింది.
    సుందరమ్మకు ఇది మామూలు కథే అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందని అడగాలని కూడా అనిపించలేదు. తనకు పట్టిన దురదృష్టాన్ని మింగలేకుండా ఉంది. తను ఇలాంటి చోటకు వచ్చి వుండాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అసలు ఇలాంటి గృహాలు ఉన్నాయన్న సంగతే తనకు తెలియదు.
    'ఏమ్మా వినబుద్ధి కావడం లేదా?'
    సుందరమ్మ తుళ్ళిపడి, సర్దుకుని 'ఆ, వింటున్నానుగా చెప్పు' అంది.
    'వాడు నన్ను వదలి వెళ్ళిపోయాడు. నడిబజారుకు అప్పగించి వెళ్ళిపోయాడు. దిక్కు తోచక నయాపూల్ దగ్గర కూర్చుని ఏడుస్తున్నాను.ఒక ముస్లిం యువకుడు నన్ను పలుకరించాడు. నా విషయం తెలుసుకొని జాలిపడ్డాడు. అతను నన్ను ఓదార్చి తనింటికి తీసుకెళ్ళాడు. నలుపైనా అప్పుడు నేను బాగానే ఉండేదాన్ని...'
    'వయసొస్తే వంకర కాళ్ళ గాడిదైనా ఆకర్షణీయంగానే వుంటుంది' సుందరమ్మ మనసులోనే అనుకుంది.
    'ఏమిటి ఆలోచిస్తున్నావ్?'
    'ఏం లేదు చెప్పు.'
    'అతను నన్ను ముసల్మానుగా మార్చి పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికే అతనికి భార్యా పిల్లలున్నారు. ఎవరూ మా పెళ్ళిని వ్యతిరేకించలేదు. వాళ్ళకు అది మామూలే. పదిహేనేళ్ళు నన్ను అపురూపంగా చూసుకున్నాడు. ఒకరోజు యాక్సిడెంటులో అనుకోకుండా వెళ్ళిపోయాడు. నా సవతి పిల్లలు నన్ను ఇంట్లోంచి తరిమేశారు. చాలా కాలం నాలుగిళ్ళలో పాచిపని చేసుకుని బతికాను. ఓపిక సన్నగిల్లింది. ఈ హోమ్ లో చేరాను.'
    అంతలో గంట మోగింది. సుందరమ్మ ఆయేషాబీ ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది.
    'భోజనం గంట. వెళ్ళు. ఆలస్యం అయితే ఆ వంటమనిషి సాధింపు పడలేవు వెళ్ళు.' అంది ఆయేషా.
    సుందరమ్మ అలసటగా లేచి బయటికి వెళ్ళింది.
                                *  *  *


    భోజనాలకు అందరితోపాటు కూర్చుంది. అలా ఆ పంక్తిలో కూర్చోవడం సుందరమ్మకు బాగా అనిపించలేదు. ముందున్న జర్మన్ సిల్వర్ పళ్ళెం చూసింది. అది చొట్టలు పోయి ఉంది. గ్లాసు కూడా అలాగే ఉంది. ఈ పళ్ళెం, గ్లాసూ అంతకు ముందు ఎంత మంది వాడారో? ఏయే జబ్బుల వాళ్ళు వాడారో? సుందరమ్మకు కడుపులో తిప్పినట్టుగా అయింది. ఎవరో వంగకుండానే పచ్చడి లాంటిదేదో పళ్ళెంలోకి విసిరారు. మరొకరు రెండు హస్తాలు పొడిపొడిగా వున్న అన్నం నిర్లక్ష్యంగా పడేశారు. అన్నం మెతుకులు పళ్ళెం చుట్టూ కూడా పడ్డాయి.    

 Previous Page Next Page