Previous Page Next Page 
బంధితుడు పేజి 4


    చాలా వ్యంగ్యంగా, యెగతాళిగా అన్నాచెల్లెళ్ళ సంబంధాలను దుయ్యబట్టింది.
    చివరకు మొగుణ్ని  నొప్పించి  వేరు కాపరం పెట్టిస్తుంది. తల్లిదండ్రులు - వృద్దులు యిద్దర్నీ వదిలేసి ఆ హీరోగాడు వెళ్ళిపోతాడు.  ఇదీ కథ.
    పద్మ ఆ పుస్తకం చదవమని తనకు యెందుకిచ్చినట్టు?
    తననుకూడా అమ్మనూ, చేల్లెల్నీ వాళ్ళ  మానానికి వాళ్ళను వదిలెయ్యమనేగా?
    దాని  యేడుపంతా అదేగా? అవును అదే!
    తల్లి మాత్రం?
    కొడుకు పెళ్ళయిన మరుక్షణంనుంచే ఆ తల్లీ  మారిపోతుంది.
    తన రక్తమాంసాలు పంచి పెంచిన బిడ్డ  తనకు దూరం అయిపోతున్నట్టు బాధపడుతుంది. తల్లికి అటువంటి బాధ కలక్కుండా ప్రవర్తించడం బిడ్డ బాధ్యత కాదా?
    పెళ్ళి కాగానే తల్లిదండ్రులనూ, తోడబుట్టిన రక్త సంబంధాలనూ తెంచుకోవడం అంత తేలికైన పనా?  తల్లి మీద  ప్రేమ వేరు.
    చెల్లెలిమీద అప్యాయత వేరు.
    భార్యమీద అనురాగం వేరు.
    స్నేహితులమీద ఆప్యాయత వేరు. ఎవర్ని ఎంత వరకు  ప్రేమించాలో హృదయానికి తెలుసు.
    అమ్మకు  మనసులో యేముంటుందో గాని బయటపడదు.
    కానీ  సరోజలో మార్పు కస్పిస్తూంది. అది  చిన్నపిల్ల. మొన్నటివరకూ "అన్నయ్యా! అన్నయ్యా!" అటూ చుట్టూ  తిరుగేది. ఇప్పుడు పరాయివాడిగా చూస్తుంది. పెళ్ళికాకముందు తను కొట్టినా, తిట్టినా తప్పు పట్టించుకొనేదికాదు. ఇప్పుడు కసురుకున్నా ముఖం అదోలా పెడుతుంది. తనతో మాట్లాడటమే మానేస్తుంది. అన్నింటికీ  కారణం  వదినగానే భావిస్తుంది.
    సరోజకు పద్మంటే బొత్తిగా గిట్టదు.
    ఎందరెందరో రచయితలు, రచయిత్రులు భర్తలు  భార్యల్ని కాల్చుకు తింటున్నట్టు పుంఖాను పుంఖాలుగా పుస్తాకాలు రాసిపారేస్తున్నారు.
    కానీ మగవారు పడే బాధగురించి ఒక్కరూ రాయరేం?
    పెళ్ళయిన రెండో నాటినుంచే మగవాడి పని అడకత్తెరలో పోకలా అవుతుంది. ముఖ్యంగా తనదంటూ ఒక వ్యక్తిత్వం కలిగి ఎవరి స్థానం వారికి ఇచ్చి అందర్నీ సంతోష పెట్టాలని తాపత్రయపడే మగవాడి పరిస్థితి మరీ అధ్యాన్నంగా వుంటుంది. పెళ్ళికాగానే  వేరుకాపురం పెట్టె వాళ్ళ సంగతి వేరు.
    అయినా పద్మతో తను యింత కఠినంగా  మాట్లాడి వుండాల్సింది కాదు. ఎంత బాధపడుతుందో?
    అయినదానికీ, కానిదానికీ బాధపడితే తనుమాత్రం ఏం చేస్తాడు? సరోజ చేతికి ముందుగా పూలు ఇస్తే ఇంత రాద్ధాంతం చెయ్యాలా ? అంతమాత్రానికే భార్యమీద తనకు ప్రేమ లేనట్టా ?  ఆ మాత్రం ఎందుకు ఆలోచించదు పద్మ ?
    దూరంగా గడియారం తొమ్మిది గంటలు కొట్టింది.
    సత్యనారాయణ గంటలు లెక్కపెట్టి లేచి నిల్చున్నాడు.
    ఇంటికి వచ్చేటప్పటికి సత్యనారాయణ కోసం తల్లి ఎదురుచూస్తూ నిల్చుంది.
    "అన్నం తినకుండా చలిగాలిలో ఎక్కడికెళ్ళావురా? ఆలస్యం అయింది. భోజనం చెయ్యి!" అంటూ కాంతమ్మ వంటింట్లోకి నడిచింది.
    సత్యనారాయణ వంటింట్లో పీటమీద కూర్చున్నాడు. తల్లి వడ్డిస్తూ వుంది.
    "అందరూ భోజనం చేశారా ?"
    "సరోజ చేసింద"
    "నువ్వూ  పద్మా తినలేదా ?"
    "పద్మ ఆకలిగా లేదని పడుకుంది" ముభావంగా సమాధానం యిచ్చింది కాంతమ్మ.
    సత్యనారాయణ ఓ క్షణం తల్లి ముఖంలోకి చూశాడు. ఆమె తల వంచుకొని కంచంలో కూర పెడుతున్నది.
    సత్యనారాయణ తల్లి మీద కోపం వచ్చింది
    తను గానీ , సరోజగానీ ఆకలిగా లేదంటే ఎంత హడావిడి చేస్తుంది ? పద్మ అన్నం తినకుండా పడుకున్నదని తను అడిగేంతవరకూ చెప్పలేదు.
    సత్యనారాయణ పద్మమీద జాలివేసింది. లేచి గదిలోకి వెళ్ళాడు.
    కాంతమ్మ కొడుకు వెళ్ళినవైపుచూస్తూ నిట్టూర్చింది.
    పద్మ గోడవైపుకు తిరిగి పడుకొని వుంది.
    "పద్మా" గోముగా వీపుమీద చెయ్యి వేశాడు.
    పద్మ చివ్వున లేచి కూర్చుంది.
    కళ్ళు ఉబ్బి వున్నాయ్. ఏడ్చి వుంటుందని అర్థం చేసుకున్నాడు.
    "పద్మా! భోజనం చేద్దాంరా" మృదువుగా పలికింది సత్యనారాయణ కంఠం.
     పద్మ సమాధానం చెప్పలేదు. మౌనంగా కూర్చుంది.
    "నన్ను అర్థం చేసుకో, మీ మీద కోపమా చెప్పు" పద్మ  ఉలకలేదు, పలకలేదు.
    "రా ! భోజనం చేద్దాం !" చెయ్యి పట్టుకున్నాడు.
    "నాకు ఆకలిగా లేదు" అంటూ చెయ్యి విసురుగా లాక్కుంది.
    "నాకు ఆకలిగా వుంది"
    "వెళ్ళి భోజనం చెయ్యండి. నేను తింటే మీకేం తినకపోతే మీకేం ?" అంటూ మళ్ళీ పడుకుంది.
    "సరే ! పడుకో ! నాకూ  అక్కర్లేదు" అంటూ  సత్యనారాయణ కూడా పడుకున్నాడు.
    అంతమాత్రానికే పద్మ కరిగిపోయింది.
    ఆకలిగా వుందంటూకూడా తను తినకపోవడం వలన భర్త కూడా తినకుండా పడుకోవటం ఆమెకు ఏదో సంతృప్తిగా, ఆనందంగా వుంది.
    "లేవండి! భోజనం చేద్దురు గాని !" అన్నది మెత్తగా.
    "వద్దులే ! పడుకుంటాను !" కొంచెం బెట్టు చేశాడు భర్త.
    "లేవండి ! నాక్కూడా ఆకలిగానే వుంది" అంటూ భర్త చెయ్యి పట్టుకొని లేవదీసింది భార్య.
    సత్యనారాయణ బలవంతం మీద కాంతమ్మ కూడా వాళ్ళతో పాటే భోజనం చేసింది.
    అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు.
    అందరి మనసులూ తేలికపడ్డాయి.
                                                                                        3
    "బాబూ" నీరసంగా పిలిచింది కాంతమ్మ.
    తల్లి బెడ్ పక్కనే  స్టూల్ మీద దిగులుగా కూర్చుని వున్నాడు సత్యనారాయణ.
    "ఏమ్మా! ఏం కావాలి ? "
    "ఎండిన పుల్లల్లా వున్న తన చేతిని ముందుకు చాచింది కాంతమ్మ, కొడుకు చేతిని అందుకోవడానికి.
     సత్యనారాయణ తన చేతిని అందించాడు.
    "బాబూ! నేను వెళ్ళిపోతున్నాను. నీ చేతుల మీదుగా వెళ్ళిపోతున్నాను. అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు"
    "ఏమిటమ్మా ఆ మాటలు " బాధగా అన్నాడు.
    "నాకు ఒక్కటే దిగులు బాబూ ... సరోజ" ఆపైన మాటలు పెగల్లేదు.
    "లేదమ్మా! నువ్వింకా కొంతకాలం బ్రతుకుతావు" ఎలాగో అన్నాడు సత్యనారాయణ.
    కాంతమ్మ పేలవంగా నవ్వింది,
    కాంతమ్మ ఒకటి రెండు రోజులకంటే ఎక్కువరోజులు బతకదని అతనికి తెలుసు.

 Previous Page Next Page