జగన్ వాలకం చూసి కృష్ణ గాభరా పడ్డాడు.
అంతలోకె జగన్ సర్దుకున్నాడు.
"పాప పుట్టగానే తల్లికి దూరమయింది" జగన్ కంఠం ప్రశాంతంగ ఉంది.
కృష్ణ గుండెలనిండా గాలి పీల్చుకొని టాక్సీలో సర్దుకు కూర్చున్నాడు.
"పాపం! మోస్ట్ అన్ ఫార్ట్యునేట్! డెలివరీ కాగానే పోయిందా? ఏ ఆసుపత్రిలో! మెడికల్ ఫెసిలిటీ...."
"అబ్బే అదేమీకాదు. ఆమె పోలేదు. బ్రతికేవుంది!" మధ్యలోనే అందుకొని అన్నాడు జగన్.
కృష్ణ గిర్రున తలతిప్పి చూశాడు.
జగన్ కళ్ళల్లోకి చూశాడు.
ఏమిటి వీడు చెప్తున్నది.
పాప తల్లి పుట్టగానే దూరమైందన్నాడు.
మళ్ళీ ఆమె బ్రతికే ఉందంటాడు.
అయితే ఆమె ఏమైనట్టు?
రోగిష్టా?
కేన్సర్- బ్లెడ్ కేన్సర్ పేషెంటా?
ఛ! ఛ! ఏమిటీ ఆలోచనలు?
కృష్ణ బుర్రంతా కుతకుతలాడిపోతున్నది.
"కృష్ణా! దిగు" అంటూ డోర్ తెరిచి పట్టుకున్న జగన్ కేసి రెప్పలార్చకుండా చూడసాగాడతను.
"ఏమిట్రా అలా చూస్తావ్? దిగు! పాపను చూడవా?"
కృష్ణ మైకంలోనుంచి బయటపడినవాడిలా తల విదిలించుకొని టాక్సీ దిగాడు.
గేటు దాటి కాన్వెంటు ఆవరణలో జగన్ పక్కనే నడుస్తూ "పాప పేరేమిటి?" అనడిగాడు.
"మోనో."
"మోనో? అదేం పేరురా?"
"మోనో లిసా!"
"మోనోలిసా?" కృష్ణ నోరు తెరిచాడు.
"అవును! మోనోలిసాయే." ఏవో దివ్యానుభూతుల్లో తేలిపోతూ "మోనోలిసాయే." ఏవో దివ్యానుభూతుల్లో తేలిపోతూ "మోనోలిసా" పేరును ఉచ్చరిస్తున్న జగన్మోహనరావును ఎగాదిగా చూశాడతను.
"ఆ పేరు నీకంత ఇష్టమా?"
"అదేం కాదు."
"మరైతే ఆ పేరెందుకు పెట్టావ్?" ఈసారి నిజంగానే కృష్ణకు చిర్రెత్తిపోయింది.
అతడి ప్రశ్నకు సమాధానంగా జగన్ చిరునవ్వు చిందించాడు.
సమాధానం చెప్పకుండా ఇలా నవ్వుతాడేం అనుకుంటూ జగన్ ముఖంలోకి లోతుగా చూశాడతడు.
"అదంతా ఓ పెద్దకథ" తాపీగా అన్నాడు జగన్మోహనరావు.
"కథా?"
"ఆఁ అవును. కథే! కథకాని కథ."
"ఆఁ అవును. కథే! కథకాని కథ."
"ఆఁ ఏమిటీ? కథలేని కథా?"
"కథలేని కథకాదు. కథకాని కథరా బాబూ?"
డార్మెత్రీ మెట్లెక్కుతూ ఆగి కృష్ణ జగన్ ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు.
"ఏమిట్రా అంత ఆశ్చర్యం? కథకాని కథలుండవనా నీ ఉద్దేశ్యం?" అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు జగన్.
"ఎందుకుండవూ? కథలేని కథలూ ఉంటాయి" ఠపీమని పుల్ల విరిచినట్టు అన్నాడతను.
"గుడ్ ఈవెనింగ్ సర్! మోనో ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. షల్ ఐ బ్రింగ్ హర్?"
"ప్లీజ్!" జగన్ వంగి మాట్రెస్ కు విష్ చేశాడు."
మేట్రెస్ ఐదు నిమిషాల్లో పాపతో తిరిగొచ్చింది.
"డాడీ!" పాప రెండు చేతులూ ముందుకు చాచి జగన్ దగ్గిరకు పరుగెత్తుకొచ్చింది.
జగన్ ఆత్రంగా పాపను ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు.
"అంకుల్ కృష్ణకు నమస్తే చెప్పు పాపా!" అంటూ జగన్ పాపకు అతడిని చూపించాడు.
పాప ముందు సంకోచించింది. జగన్ ప్రోత్సాహంతో "గుడ్ ఈవెనింగ్ అంకుల్" అంది.
"గుడ్ ఈవెనింగ్ మోనో - గుడ్ ఈవెనింగ్" లేతగులాబిరేకుల్లా మెరిసిపోతున్న పాప చెక్కిళ్ళను నిమిరాడు మురళీకృష్ణ.
పాపకు ఇవ్వడానికి ఏమీ తీసుకురానందుకు మనసులోనే నొచ్చుకున్నాడు.
"మోనో చూడమ్మా అంకుల్ నీకు డ్రస్ తెచ్చాడు, థాంక్సు చెప్పు" పాపను కిందకు దింపి చేతిలోవున్న ప్యాకెట్ అందించాడు జగన్.
ప్యాకెట్ అందుకొని, కృష్ణను చూస్తూ "థాంక్యూ అంకుల్" అంది పాప.
అమాంతం వంగి పాపా చెక్కిళ్ళను నిమిరాడతను.
జగన్ ను తను ఏమో అనుకున్నాడు. తన మనసు చదివినట్టే చేశాడు. డ్రస్ తను తెచ్చినట్టు పాపకు చెప్పాడు. వెళ్ళేప్పుడు డబ్బు వాడి జేబులోపెట్టిపోతే బాగుంటుంది. ఆ అవకాశం తనకు కలిగించినందుకు కృష్ణ సంతోషపడ్డాడు.
డార్మెటరీలోనుంచి గంట గణగణ మోగడం విన్పించింది.
"సర్! ఇటీజ్ టైం ఫర్ హర్ డిన్నర్" మృదువుగా హెచ్చరించింది మేట్రన్.
ఆ మాట వింటూనే మోనో గిర్రున వెనక్కుతిరిగింది.
కృష్ణ ఆశ్చర్యపోయాడు.
అంత డిసిప్లిన్ తో పిల్లల్ని పెంచడం కాన్వెంటువాళ్ళకే సాధ్యమేమో అనుకున్నాడు.
"పాపా! ఛీరియో! బై బై!" జగన్ వెనకనుంచి అన్నాడు.
మోనో తిరిగి చూడకుండానే "ఛీరియో డాడీ" అంటూ చెయ్యి ఊపుతూ ముందుకు పరుగులు తీసింది.
మేట్రన్ దగ్గిర శెలవు తీసికొని ఇద్దరూ తిరిగి టాక్సీ దగ్గిరకు వచ్చారు. వాళ్ళెక్కి కూర్చోగానే టాక్సీ బయలుదేరింది.
"మున్నాలే పామ్ గ్రో హోటల్ కు పోంగో! అంగెరింది అడయార్ కు పోహణం" వెనక సీట్లోనుంచి ముందుకు వంగి అన్నాడు జగన్.
"కథగాని కథ ఏదో చెబుతానన్నావ్?" స్నేహితుడి భుజం తడుతూ అన్నాడు కృష్ణ.
జగన్ సన్నగా నవ్వి "ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెబుతాలే!" అన్నాడు.
"ఇంటికా?" నొసలెత్తి అడిగాడు కృష్ణ.
"ఏం? రాకూడదా?" కనుబొమలు చిట్లించాడు జగన్మోహనరావు.
"అబ్బే రాకూడదని కాదు. ఇప్పుడు టైం లేదుకదా అని!"
"ఇప్పుడు మనం హోటల్ కు వెళ్ళి రూం ఖాళీచేసి ఇంటికెళదాం."
"తెల్లవారుఝామునే ఎయిర్ పోర్టుకు వెళ్ళాలే మరి?" కొంచెం ఆగి "అయితే ఒక పనిచేద్దాం! ముందు మీ ఇంటికి వెళ్ళి కాసేపుండి తిరిగి హోటల్ కు వచ్చేస్తా. సరేనా?" మళ్ళీ అన్నాడు.
"అదేం కుదరదు. హోటల్ ఖాళీచేసి ఇంటికి వెళ్ళిపోదాం. తెల్లవారి ఇంటిదగ్గర్నుంచే ఎయిర్ పోర్టుకు వెళ్ళొచ్చు."
"అంత పొద్దుటే టాక్సీ దొరకదేమో?" నీళ్ళు నములుతూ అన్నాడతడు.
"ఆ ఇబ్బందేమీ ఉండదు. వెళ్ళేప్పుడే టాక్సీస్టాండ్ బంక్ లో చెప్పి వెళదాం. టైంకు వచ్చేస్తారు, గాభరాపడకు."
"ఎన్నాసార్! ఎయిర్ పోర్టుకు పూడుస్తురా?" డ్రైవర్ వెనక్కు వంగి అడిగాడు.
"ఇప్పిల్లేబ్బా! రేప్పొద్దున్న" ముభావంగా చెప్పాడు జగన్.
"ఆమసార్! ఏ ఇమాండ్రం అనిదా అడుగుతా సారూ!"
"హైదరాబాద్ వెళ్ళాలి. ఆరింటికల్లా ఎయిర్ పోర్టులో ఉండాలి. ఐదుగంటలకు ఇంటికి రాగలవా?" అన్నాడు కృష్ణ.
"ఆమాఁ సార్! కండిపావస్తా!"
"నువ్వుండేదెక్కడ?"
"అడయార్ దానా సామీ! టాక్సీస్టాండ్ పక్కతెరువుదా మన వీడు"
"సరే! అలాగే వద్దువుగాని, ముందు పామ్ గ్రోవ్ హోటల్ కు పద" అని జగన్ కృష్ణకేసి చూశాడు.
కృష్ణకు హోటల్ గది ఖాళీచేసి వెళ్ళాలనిలేదు. కాని జగన్ బలవంతం చెయ్యడంతో మెత్తపడ్డాడు.
మరో ఐదు నిమిషాల్లో టాక్సీ పామ్ గ్రోవ్ హోటల్ చేరింది.
హోటల్ గది ఖాళీచేసి కృష్ణ సామానుతో వచ్చి టాక్సీలో కూర్చున్నాడు.
తీరా టాక్సీ బయలుదేరాక కృష్ణకు తనేదో పొరపాటు చేసినట్టు అన్పించసాగింది.
ఈ టాక్సీవాడు తెల్లవారుఝామున ఐదుగంటలకు రాకపోతే తన ప్రయాణం ఆగిపోతుంది. అయినా ఇప్పుడు జగన్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందే అతని ఇంటికెళ్ళి హోటల్ కు తిరిగొస్తే బాగుండేది.
"ఈటాక్సీవాడు రాకపోతేనో?" అప్రయత్నంగానే అనేశాడు కృష్ణ.
"ఇది కాకపోతే మరో టాక్సీ. ఆ ఇబ్బందేమీ ఉండదిక్కడ. తెల్లవార్లూ స్టాండులో టాక్సీలుంటాయి, డోంట్ వర్రీ."
కృష్ణ మనసు కుదుటపడింది.
టాక్సీలో రిలాక్స్ డ్ గా కూర్చున్నాడు.
టాక్సీ జెమినీ దాటి మౌంట్ రోడ్డు ఎక్కింది.
రోడ్డు పక్కగా ఉన్న పెద్ద పెద్ద సినీమాపోస్టర్లు చూస్తూ కూర్చున్నాడు కృష్ణ.
చల్లటి సముద్రపుగాలి ముఖాన్ని తాకుతూవుంటే హాయిగా వుంది. హఠాత్తుగా మోనోలిసా చిత్రం మనసులో కదిలింది.
మోనోలిసా!
కూతురికి బలే పేరు పెట్టుకున్నాడు.