Previous Page Next Page 
మరీచిక పేజి 45


    దళంలోకి వచ్చిన మొదటిరోజుల్లో వంతులు వేసుకొని మగవాళ్ళు వంటలు చేస్తుంటే, తను తుపాకి పట్టుకొని కాపలా కాయడం ఏదో బాధగా ఉండేది. తరతరాలు వంట ఇంటి వెట్టిచాకిరీకి అంకితమైన స్త్రీకి విముక్తి కలిగేది సోషలిస్టు వ్యవస్థలోనే! విప్లవ జీవితంలో స్త్రీకి అన్ని స్వేచ్చలూ వున్నాయి. మగా ఆడా అనే భేదం లేకుండా సమాన హక్కులున్నాయి. అధికారాలున్నాయి. బాధ్యతలున్నాయి.

 

    "కామ్రేడ్ జనార్ధన్! ఈపూట వడ్డన డ్యూటీ ఎవరిది?" అడిగింది ప్రతిభ.

 

    "కామ్రేడ్స్ సుజాతా, సత్యం ఈ పూట వడ్డించాలి. గిన్నెలు కడిగి శుభ్రం చెయ్యాలి.

 

    "ఓ.కే. నేను రెడీ! ప్రతిభా! నువ్వెళ్ళి సుజాతను పిల్చుకురా! వడ్డన డ్యూటీ వుందని చెప్పు!" అన్నాడు సత్యం.

 

    ప్రతిభ ఉషారుగా పరుగెత్తింది. సుజాతకోసం వెతికింది. డెన్ లో లేదు. చెట్లమాటున చూసింది. సుజాత కన్పించలేదు. గచ్చ పొదలవెనక, తంగేడు చెట్టు కిందకు వచ్చి ప్రతిభ ఠక్కున ఆగిపోయింది. అడుగు ముందుకు పడలేదు. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. అడుగడుగే వెనక్కు వేసుకుంటూ నిశ్శబ్దంగా నడిచింది. గచ్చపొద దాటగానే పరుగు లంకించుకుంది.

 

    ప్రతిభ తిరిగి వచ్చేసరికి సత్యం వంటరిగానే వడ్డన కార్యక్రమంలో మునిగిపోయి వున్నాడు. దళ సభ్యులు తమ పళ్ళాలూ, గ్లాసులూ తెచ్చుకొని వరుసగా కూర్చున్నారు. కామ్రేడ్ భిక్షాలు కాలు పట్టి పట్టి వేస్తూ వచ్చి వరసలో కూర్చున్నాడు. మలేరియా జ్వరంతో వున్న శామ్యూల్ ముసుగుతన్ని పడుకొని వున్నాడు.

 

    తిరిగి వచ్చిన ప్రతిభను చూసి సత్యం - "సుజాత ఎక్కడ?" అని అడిగాడు.

 

    "ఏమో? కంగారుగా అన్నది ప్రతిభ.

 

    "పిలవడానికి వెళ్ళావుగా కన్పించలేదా?"

 

    "ఏమో?"

 

    ప్రతిభ మళ్లీ అదే సమాధానం ఇచ్చింది. సత్యం చివ్వున తలెత్తి చూశాడు. ప్రతిభ ముఖం వెలవెలపోతూ ఉన్నది. మనిషి గాబరా గాబరాగా ఉన్నది.

 

    "ఏం ప్రతిభా అలా వున్నావ్?"

 

    "ఏంలేదు నేను బాగానే ఉన్నాను."

 

    సత్యం దగ్గిరగా వచ్చి అనునయంగా అడిగాడు.

 

    "ఏమైంది ప్రతిభా?"

 

    "తర్వాత చెప్తాను. సుజాత డ్యూటీ ఈ పూట నేను చేస్తాను!" అంటూ ప్రతిభ కూర గిన్నె తీసుకొని కంచాల్లో వడ్డించసాగింది.

 

    "పాండురంగం! కామ్రేడ్ సుందరం ఎక్కడున్నాడో చూడండి. వడ్డన కూడా పూర్తి అయిందని చెప్పండి!" అన్నాడు సత్యం.

 

    "అరుగో వస్తున్నారు" అన్నాడు బయలదేరబోతున్న పాండురంగం.

 

    కూర వడ్డిస్తున్న ప్రతిభ తలెత్తి చూసింది. సుందరం, సుజాతా కలిసి రావడం కన్పించింది. భోజనాలు పూర్తి అయినాయి. మళ్ళీ డెన్ లో దళసభ్యులు సమావేశం అయ్యారు -

 

    "కామ్రేడ్ సత్యం! మీ దళం గ్రూపింగేమిటో తేల్చి చెప్పండి!" అన్నాడు సుందరం.

 

    "కామ్రేడ్ సత్యం! మీ దళం గ్రూపింగేమిటో తేల్చి చెప్పండి!" అన్నాడు సుందరం.

 

    "కామ్రేడ్ దుర్గయ్యా, జనార్దనం, సుజాత, ఒక దళంగానూ, నేనూ, పాండురంగం, కోటేశ్వరరావూ ఒక దళంగానూ ఉంటాం. దుర్గయ్య దళం గంగిడి పాలెం, మా దళం రావిపాడు వెళ్తాం. ఒకే టైంకు అంటే రేపు రాత్రి వంటిగంటకు మా యాక్షన్ పూర్తి చేసుకొని ఐదు గంటలకు మరిడమ్మ లోయ లోకి తిరిగివస్తాం! ఏం కామ్రేడ్స్ మీ అభిప్రాయం ఏమిటి?" దళ సభ్యులను వుద్దేశించి అడిగాడు సత్యం.

 

    ప్రతిభ సత్యం మాటలు వింటూనే నీరుకారిపోయింది. నిరుత్సాహంతో కుంగిపోయింది.

 

    "కామ్రేడ్ నన్నెందుకు వదిలేశారో తెలుసుకోవచ్చా?" కోపాన్ని అణచుకుని అడిగింది.

 

    "కామ్రేడ్ ప్రతిభా! మీరు క్యాంపుకు కాపలాగా వుండాలి. డెన్ లో సిక్ గా వున్న వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకుంటూ క్యాంపును శత్రువుల దృష్టిలో పడకుండా కాపాడాలి!"

 

    "ఆపని మరెవరయినా కామ్రేడ్ చెయ్యొచ్చుగా? నన్నే ఎందుకు వినియోగిస్తున్నారో తెలుసుకోవచ్చా?"

 

    "దళ బాధ్యుడిగా అది నా నిర్ణయం."

 

    "నాకు అనుభవంలేదనీ, యాక్షన్ లో నేను పనికిరాననేగా మీ అభిప్రాయం?" రోషంగా అన్నది ప్రతిభ.

 

    "నా కమాండ్స్ ను నా దళసభ్యులు పాటిస్తారని నేనాశిస్తున్నాను. దానికి భిన్నంగా జరగడం అంటే పార్టీ క్రమశిక్షణనూ, దళ నియమావళినీ అతిక్రమించడమే అవుతుంది."

 

    సత్యం అంత పరుషంగా మాట్లాడటం ప్రతిభ అంతవరకూ చూడలేదు. దిగాలుపడి కిక్కురుమనకుండా సత్యంకేసి కళ్ళప్పగించి చూడసాగింది.

 

    "కామ్రేడ్ సత్యం! మీ నిర్ణయంలో నేను జోక్యం కల్పించుకుంటున్నానని అనుకోకపోతే ఒకటి చెప్పాలి! ఏరియా కమిటీ బాధ్యుడిగా చెప్తున్నాను. కామ్రేడ్ సుజాత ఈ రోజు నాతో రావాల్సి వున్నది. మన కమిటీ సెక్రటరీతో కామ్రేడ్ సుజాత సమావేశం కావడానికి నిర్ణయించబడింది. రేపు మీ యాక్షన్ లో ఆమె పాల్గొనే అవకాశం లేదు. దళబాధ్యుడైన మీ పర్మిషన్ తోనే సుజాత ఈరోజు నాతో బయలుదేరబోతున్నది. ఇది కమిటీ నిర్ణయంగా మీకు తెలియజేస్తున్నాను!" సుందరం ఆగి సత్యం అభిప్రాయం కోసం ఎదురు చూశాడు.

 

    సత్యం వెంటనే "కమిటీ నిర్ణయం అయితే నాకేమీ అభ్యంతరం లేదు. కాని ఇద్దరే ఇద్దరు దళసభ్యులు దాడికి వెళ్ళటం ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని ఆలోచిస్తున్నాను" అన్నాడు.

 

    "సుజాత బదులు కామ్రేడ్ ప్రతిభను గంగిడిపాలెం వెళ్ళే దళంలో చేర్చండి!" సుందరం అన్నాడు.

 

    "అవును! కామ్రేడ్ సుందరంగారి సూచన బాగా వుంది. కామ్రేడ్ ప్రతిభ బదులు నేను డెన్ బాధ్యతను తీసుకోగలను. క్యాంపు కాపలా కాసుకునేందుకు నా కాలుకు తగిలిన దెబ్బ అడ్డుకాబోదు. దూరం అయితే నడవడం ఇబ్బందిగానీ క్యాంపు డ్యూటీ వరకూ ఇబ్బంది లేదు" అన్నాడు బిక్షాలు.

 

    "కామ్రేడ్ భిక్షాలు సూచనకు నేను ఆమోదిస్తున్నాను. కర్తవ్య నిర్వహణలో విప్లవ కారులు ఎలాంటి ఆటంకాలనయినా దృఢచిత్తంతో అధిగమిమిస్తారనే ఛైర్మన్ మావో ప్రవచనానికి మన కామ్రేడ్ బిక్షాలు నిదర్శనంగా నిలబడ్డాడు. అందుకు కామ్రేడ్ బిక్షాలుకు నా విప్లవాభినందనలు అందచేస్తున్నాను."

 

    ప్రతిభ ఉద్రేకంతో లేచి నిలబడి బిక్షాలుకు పిడికిలి బిగించి శాల్యూట్ చేసింది. ప్రతిభ ప్రతి చిన్న విషయంలో చూపుతున్న చొరవకు సత్యం లోలోన ఆనందపడ్డాడు. కానీ అనుభవానికి మించిన ఆవేశం నిష్ప్రయోజననం అన్నది ప్రతిభకు ఎప్పుడు చెప్పాలా ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడి సత్యం ప్రతిభకేసి చూశాడు.

 

    "కామ్రేడ్ ప్రతిభ దళ సభ్యురాలిగా రావడం మీదళానికి నూతనోత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగిస్తున్నదని నేను భావిస్తున్నాను. ఏరియా కమిటీకి ప్రత్యేకంగా కామ్రేడ్ ప్రతిభ సంగతి తెలియజేస్తాను." ప్రతిభను చూసి అన్నాడు సుందరం.

 

    ప్రతిభ గుండెలు ఆనందంతో పొంగాయి. ఉద్రేకాన్ని అణుచుకుంటున్న ఆమె కళ్ళలో కాంతిరేఖలు కదిలాయి.

 

    "సో! కామ్రేడ్ సత్యం! అంతా నిశ్చయమైపోయినట్టేగా? నేనూ సుజాత బయలుదేరతాం మరి!" అన్నాడు సుందరం.

 

    "గంగిడిపాలెం దళంలో సుజాతకు బదులు కామ్రేడ్ కోటేశ్వరరావు వుంటాడు. రావిపాడు దళంలో కామ్రేడ్ ప్రతిభ ఉంటుంది. మా రెండు దళాలూ కమిటీ నిర్ణయం ప్రకారమే సైమల్టేనియస్ యాక్షన్ తీసుకుంటాయి. కామ్రేడ్ సుందరం! మీరు వెళ్ళి కమిటీకి రిపోర్టు చెయ్యొచ్చు!" సత్యం తన నిర్ణయాన్ని తెలియ చేశాడు.

 

    కామ్రేడ్ సుందరం అందరి దగ్గిరా శెలవు తీసుకొని డెన్ లో ఓ మూల గొంగళి కప్పుకొని పడుకుని ఉన్న శామ్యూల్ ను పలకరించాడు. సుజాతతో బయలుదేరి వెళ్లిపోయాడు.


                                     28


    సంధ్యకాంతుల్లో, కాలన్ గుటా బీచిలోని తెల్లని ఇసుక వింతగా మెరిసిపోతూ వుంది. ఆ అరేబియా సముద్రతీరం హిప్పీలు స్వర్గధామం! వచ్చేది కాలన్ గుటాబీచీ, అక్కడ విచ్చలవిడిగా జీవించే హిప్పీలూను! అనేకదేశాల నుంచి వచ్చిన హిప్పీ యువతీ యువకులు బీచిలో బిలబిల లాడుతున్నారు. కొందరు అర్థనగ్నంగా ఉంటే మరి కొందరు పూర్తిగా నగ్నంగా ఉన్నారు. మురికి బట్టలూ, సంచులూ, గిటార్లూ, డ్రమ్ లూ వారి ఆమధ్య కన్పిస్తున్నాయి. కొందరు తమలోకి తాము వెళ్ళిపోయి బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేనట్టున్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. మరికొందరు నృత్యం చేస్తున్నారు. ఇంకా కొందరు అడ్డదిడ్డంగా పడుకొని వున్నారు.

 Previous Page Next Page