ఇక్కడికి చేరిన చాలామంది ఇక్కడే తమ జీవితాల్ని చాలిస్తారు. అయినా ఆ విషయం వాళ్లకు తెలియదు. అసలు ఆలోచించరు. అక్కడ వున్న వాళ్లంతా ఇరవై ఐదు ఏళ్ల లోపువాళ్ళే. అందులో కొందరు ఆరోగ్యంగా, బాగా పెరిగిన జుట్టుతో వున్నారు. వాళ్ల కళ్లకింద నల్లటి మచ్చలు ఇంకా ఏర్పడలేదు. కాని కళ్ళుమాత్రం భావరహితంగా గాజు గోలీలలా వున్నాయి. పసితనం పూర్తిగా వదలని చెక్కిళ్ళు సొట్టలు పడలేదు. కాని ఆ వయసులో ఉండాల్సిన నునుపూ, మెరుపూ లేవు. అన్ని పళ్ళూ ఉన్నాయి. కాని వాటిని శుభ్రపరుచుకోవాలనే ధ్యాసలేదు. వారి రక్తంలో వేడి లేదు. వాళ్ళ కాళ్ళు భూమిమీద బలంగా ఆనవు. వాళ్ళ కౌగిలింతల్లో, ముద్దుల్లో ఆ వయసులో ఉండే ఉద్రిక్తతలేదు. వాళ్ళు భయపడుతున్నట్టు కనిపిస్తారు. వాళ్ళకు జీవితం అంటే భయం, ప్రపంచం అంటే భయం. వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ వచ్చే పొడిదగ్గును వారు గుర్తించరు.
వారిలో ఎక్కువమంది అనేక రోగాలకు గురి అయి, నిలబడే ఓపిక కూడా లేకుండా ఉన్నారు. కారణం కొందరు ఇన్ ఫెక్షన్ తో, మరికొందరు డయేరియాతో బాధపడుతూ వుంటే, ఎక్కువమంది సిఫిలిస్ తో బాధపడుతున్నారు. వాళ్లు తమ జబ్బుల్ని గురించి ఆలోచించరు. మత్తులో సెక్సులో మునిగితే వాళ్ళకు ఇవేవీ పట్టవు. దూరంగా ఇద్దరు హిప్పీలు బీచికేసి నడిచి వస్తున్నారు.
మగవాడు నిక్కర్ మాత్రం వేసుకున్నాడు. వీపూ పొట్ట అతుక్కు పోయాయి. పక్కటెముకల్ని లెక్క పెట్టవచ్చు. ఊచల్లా సన్నగా వున్న కాళ్ళ మోకాలు చిప్పలు పొడుచుకొచ్చి వికృతంగా కన్పిస్తున్నాయి. గడ్డమూ, తలజుట్టూ కలిసిపోయిన తలభాగం మాత్రం పెద్దగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది. రెండో హిప్పీని చిరిగిపోయి మురికి ఓడుతున్న బట్టల్లో యువతిగా దూరంనుంచే గుర్తించవచ్చును. మగవాడి నడుంమీద చేయి వేసి నడుస్తూ వున్నది. కాదు అతన్ని నడిపిస్తూ వుంది. ఇద్దరూ బీచిలో ముఠాను సమీపించారు. కొందరు పట్టించుకోలేదు. కొందరు అసలు చూడనే లేదు. మరికొందరు చూస్తూ కూర్చున్నారు.
"హాయ్ మేరీ!" అప్పుడే వచ్చిన మగ హిప్పీ డాన్సు చేస్తున్న యువతిని పలకరించాడు. మేరీ ఆగి చూసింది. చిరునవ్వు నవ్వింది. కాని ఆనవ్వులో గుర్తింపులేదు.
"నేను జాన్ ను!"
"హాయ్ జాన్! నువ్వా? ఎక్కడినుంచి?" అన్నదేకాని ఏమిటి ఇలా అయిపోయావని అడగలేదు. వాళ్ళకు ఎలా వున్నా మామూలుగానే కన్పిస్తారు. చావు, బతుకు, రోగం అన్నీ మామూలు విషయాలే!
"బేబీని గుర్తు పట్టావా!"
"బేబీయా? ఎవరూ?"
"హైదరాబాద్!"
మేరీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది.
"గుర్తించలేదా!నేను శబరిని!"
"హాయ్! నువ్వా? నిజమైన హిప్పీగా మారిపోయావ్! కొందరు దొంగరాస్కెల్స్! విచ్చలవిడి సెక్సు కోసం వచ్చి అనుభవించినన్ని రోజులు అనుభవించి వెళ్లిపోతారు. వాళ్ళకు మన హిప్పీ ఫిలాసఫీ అంటే గౌరవం లేదు. నిజాయితీ లేదు. రాబర్ట్ అలాంటివాడే! వెళ్ళిపోయాడు. మళ్లీ ఉద్యోగంలో చేరి రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు."
"బేబీకూడా పూర్తిగా మారలేదు. మన ఫిలాసఫీ ఆమెకు వంటబట్టలేదు. మధ్య మధ్య ఇలా వచ్చినందుకు బాధపడ్తూ ఉంటుంది. పిచ్చిగా ఏడుస్తుంది. రిపెంటు అవుతూ వుంటుంది. చచ్చిపోతానంటుంది. ఆ మూడ్ లోకి రాగానే డ్రగ్ ఇచ్చేస్తాను" అన్నాడు జాన్.
"రిపెంట్ కావడమా! ఛ! ఛ! అది హిప్పీ ధర్మానికే విరుద్ధం!" అన్నది మేరీ.
శబరి కళ్ళల్లో నీరు తిరిగింది.
"ఏడుస్తున్నావా? ఇది హిప్పీలందర్నీ అవమానించడమే" అంటూ చరస్ పాట్ అందించింది. శబరి అందుకోలేదు.
"నీతో ఆ రోజు వచ్చిన బేబీ హిప్పీగా మారలేదా?"
"లేదు. జ్యోతి గొప్ప పనిచేసింది. ఈ మురికి కూపంలో పడలేదు. అగ్ని గుండంలోకి దూకింది."
"అంటే?"
"విప్లవకారుల్లో కలిసిపోయింది. మానవత్వం ఉన్న మనిషిగా బతుకుతూ ఉంది."
"పూర్ గరల్!"
"జ్యోతిని తల్చుకొని గర్వించాలి. మన బతుకులు చూసి జాలిపడాలి."
"ఇదే వరస!" అన్నాడు జాన్.
'హాయిగా స్వేచ్చగా ఆనందంగా బతకడమే మన లక్ష్యం!"
"ఇది స్వేచ్చా! ఇందులో ఆనందం ఉందా! ఈ కుళ్ళులో, ఈ కంపులో మీకు సౌందర్యం కన్పిస్తుందా! నేను భరించలేను. నా శరీరం కుళ్ళినా మీలా నామనసు ఇంకా పూర్తిగా కుళ్ళిపోలేదు. నేను చచ్చిపోతాను. సముద్రంలో పడతాను!" అంటూ అరుస్తూ నీటికేసి పరుగుతీసింది. మేరీ వెళ్ళి పట్టుకొని దూరంగా లాక్కొచ్చింది. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.
శబరి ఇసుకలో కూలబడి పిచ్చిదానిలా ఏడవసాగింది.
"ఇవ్వాళ మనకు యోగిక్ డిన్నర్ ఉంది. హాపీగా వుండాలి. ఇలా ఏడవకూడదు. హావ్ ట్రిప్! సెటిల్ యువర్ సెల్ఫ్!" అంటూ పాట్ అందించింది.
శబరి నాలుగైదుసార్లు పాట్ పీల్చింది. మనసు కొంత కుదుట పడింది. కనురెప్పలు బరువుగా వాలిపోసాగాయి. తనముఖంలోకి చూస్తున్న మేరీకేసి చిరునవ్వు విసిరింది. పున్నమి వెన్నెల్లో సముద్రతీరం పట్టుతివాచీ పరిచినట్టు కన్పిస్తూ వుంది.
"యోగిక్ డిన్నరంటే?" శబరి అడిగింది.
"నువ్వే చూస్తావుగా? పదినిముషాల్లో స్టార్ట్ కాబోతూంది!" అన్నది మేరీ.
జాన్ ఇసుకమీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు.
"పారిపోండి! పాములొస్తున్నాయ్! పారిపోండి!" ఒకడు పెద్దగా అరుస్తూ సముద్ర తీరంకేసి పరుగుతీశాడు. కాళ్ళకు బూట్లు తప్పించి శరీరంమీద మరే ఆచ్చాదనా లేదు!
సముద్రంకేసి పరుగులు తీస్తున్న అతన్ని ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు.
"అతనెవరు?" మత్తుగా అడిగింది మేరీని.
"జాన్ కి!"
"జాన్ కియా! వాళ్ళుకూడా ఇక్కడ వున్నారా!" శబరి భయంభయంగా అడిగింది.
"ఇక్కడలేరు. ఆ దూరంగా కన్పిస్తుంది చూడూ ఆ సర్వితోట! అక్కడ కొద్దిమంది ఉన్నారు!" అన్నది మేరీ.
"బేబీకి జాన్ కీస్ అంటే భయం!" పడుకునే నీరసంగా అన్నాడు జాన్.
"భయమా?" పకపక నవ్వింది మేరీ.
సగం సగం మాడిన అరచేతి మందం గోధుమ రొట్టెల్ని సంచిలోనుంచి బయటికి తీసింది మేరీ. మొత్తం పదిరొట్టెలు వున్నాయి. వాటిని మరో హిప్పీ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా తుంచింది. ముక్కలు లెక్క వేశారు. పదిరొట్టెల్ని నలభై రెండు ముక్కలు చేశారు.
"డిన్నర్ స్టార్ట్ చెయ్యండి. అందరూ లేచి కూర్చోండి." తలా ఒక రొట్టెముక్క అందించింది మేరీ.
ఆ రొట్టెముక్కను మునిపళ్ళతో చిన్న ముక్కలుగా కొరుక్కోవాలి. దాన్ని నమిలి మింగకూడదు. ముని పళ్ళతోనే నమలాలి. అది పూర్తిగా నలిగి లాలాజలంతో కలిసిపోయి గొంతుదిగాలి. ఆతర్వాత మళ్ళీ చిన్న ముక్క మునిపళ్ళతో కొరకడం మళ్ళీ దాన్ని మెత్తగా లాలాజలంతో కలిసిపోయేలా మునిపళ్ళతో నమలడం! ఈ విధంగా చేతిలో ఉన్న ఆ చిన్న రొట్టెముక్క పూర్తికావడానికి రెండు గంటలయినా పడ్తుంది.
శబరి కూడా కొంతసేపు సర్దాగానే నమిలింది. మహా విసుగనిపించింది. చేతిలో ఉన్న రొట్టెముక్కను దూరంగా ఇసుక మీదకు విసిరి వేసింది కసిగా. మిగతా వాళ్ళంతా నములుతూ కూర్చుంటే మహాబోర్ కొట్టింది శబరికి.
డిన్నర్ పూర్తయింది. అందరూ కూర్చొని "ఓం!" అంటూ ఓంకారనాదం చెయ్యసాగారు.
"ఆగండి చప్పట్లు కొట్టండి!" అన్నాడు ఒకరు.


