Previous Page Next Page 
మరీచిక పేజి 44


    "అయితే కామ్రేడ్ సత్యం చెప్పినట్టు ఒకే రోజు ఈ రెండు గ్రామాలమీద దాడి చెయ్యడం సాధ్యం కాదని మీరు ఒప్పుకుంటున్నారా కామ్రేడ్ సుందరం?" ప్రతిభ అడిగింది.

 

    అందరూ ప్రతిభకేసి తలలు తిప్పారు. సుందరం ప్రతిభను చూశాడు. ఓ నెల రోజుల క్రితం చూసిన ప్రతిభలో అప్పుడే ఎంతమార్పు?

 

    "కామ్రేడ్ సత్యం అంచనా కరెక్టయిందే. అంతంత దూరాన ఉన్న రెండు గ్రామాలమీద దాడి జరపడం ఒక రాత్రిలో సాధ్యంకాదు. నేనూ ఒప్పుకుంటున్నాను!" అన్నాడు సుందరం.

 

    "అయితే ఏరియా కమిటీ అట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నది?" దళ సభ్యుడు దుర్గయ్య ప్రశ్నించాడు.

 

    "దానిక్కారణం వున్నది కామ్రేడ్! మనం ఖతం చెయ్యాలనుకుంటున్న ఈ వర్గశత్రువులిద్దరూ పరమ కిరాతకులు. ఏ ఒక్కడ్నీ వదలడానికి వీల్లేదు. పైగా వీళ్ళు పోలీసు సహాయంకూడా పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందింది. ఒకడ్ని ఖతంచేసి ఊరుకుంటే రెండోవాడు ఎలర్టయిపోతాడు. తెల్లవారేపాటికి రెండోవాడు ఊళ్ళో పోలీసు క్యాంప్ పెట్టించేస్తాడు. అందువల్ల ఈ ఇద్దర్నీ ఒకేసారి ఖతం చెయ్యాలని కమిటీ నిర్ణయం చేసింది."

 

    "అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలంటారూ?" దళ సభ్యుడు కోటేశ్వరరావు అడిగాడు.

 

    "చాలా సింపుల్! మీ దళం రెండు గ్రూపులుగా ఏర్పడి యాక్షన్ తీసుకోండి!" సుందరం సమస్యను తేల్చివేశాడు.

 

    "మా బలం చాలదు. ఈ యాక్షన్ చాలా కష్టం అవుతుంది!" సత్యం అన్నాడు దళ సభ్యులు అందరూ ఆలోచనలో పడ్డారు.

 

    "ఏరియా కమిటీ నిర్ణయం అమలు జరపాలి. ఆ బాధ్యత మీమీద ఉన్నది!"

 

    "మేమున్నది తొమ్మిది మందిమి. అందులో అనుభవం ఉన్నవాళ్ళు చాలా తక్కువ. పైగా దళ నాయకుడు వీరయ్య ఎపెండిసైటిస్ ఆపరేషన్ కోసం టవున్ లో యు.జి. సెల్ లో వున్నాడు. ఆయన బాధ్యత నేను తీసుకున్న తర్వాత ఒక్క యాక్షన్ కూడా చెయ్యలేదు. మాలో బాగా అనుభవం వున్న శామ్యూల్, భిక్షాలు సిక్ గా వున్నారు. కామ్రేడ్ శామ్యూల్ గాయం ఇంకా మానలేదు. కామ్రేడ్ సుజాత పర్వాలేదు. కొంత అనుభవం వున్నది. పోతే కామ్రేడ్ ప్రతిభకు బొత్తిగా అనుభవం లేదు. ఇంతవరకూ ఏ యాక్షన్ లోనూ పాల్గొనలేదు. ఇంకా రైఫిల్ ట్రైనింగు కూడా పూర్తి కాలేదు!"

 

    సత్యం మాట పూర్తికాకుండానే ప్రతిభ అడ్డు తగిలింది.

 

    "కామ్రేడ్ సత్యం! చైర్మన్ మావో ఏమన్నాడో ఒకసారి గుర్తు చేసుకోండి."

 

    సత్యం నిశ్చేష్టుడయ్యాడు ఓ క్షణం. ప్రతిభకేసి చూస్తూ వుండిపోయాడు.

 

    "విప్లవకారుడు శత్రువు గుండెమీదే గురి నేర్చుకుంటాడు!" ప్రతిభ ఉద్రేకంతో అన్నది.

 

    సత్యానికి నోట మాటరాలేదు. మిగతా దళసభ్యులు ప్రతిభకేసి చూశారు. సుందరం ప్రతిభను చూసి గర్వపడ్డాడు. ఆమెకు మహత్తరమైన విప్లవ జీవితం ఉందని భావించాడు.

 

    "నిజమైన విప్లవకారుడు ఛైర్మన్ మావో సూక్తుల అధ్యయనంలో నిష్ణాతుడై ఉండాలి. ఎదురైన సమస్యలను ఛైర్మన్ మావో అందించిన విజ్ఞానంతో పరిష్కరించుకుంటూ ముందడుగు వెయ్యాలి. ఈనాడు కామ్రేడ్ ప్రతిభ మనకు మార్గనిర్దేశకుడైన ఛైర్మన్ మావోను స్మరించి మనకు మార్గదర్శకురాలైంది. ఇంకా మీరు ఆలోచించాల్సిన పనిలేదు. మీదళం రెండు గ్రూపులుగా విడిపోవాలి. ఈ రాత్రే శత్రు నిర్మూలన జరగాలి. ఏరియా కమిటీ నిర్ణయాలను తు.చ. తప్పకుండా అమలు జరిపిన గౌరవం మీదళానికి దక్కుతుంది" అని కామ్రేడ్ సుందరం సత్యంకేసి చూశాడు.

 

    సత్యం ప్రతిభకేసి చూశాడు. ప్రతిభ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ఉద్వేగంతో ఊగిపోతూ వుంది. తనకళ్ళలోకి చూస్తున్న సత్యం చూపుల్ని తప్పించుకోవడానికి ప్రయత్నించింది.

 

    "ఏం కామ్రేడ్? మీ నిర్ణయం ఏమిటి? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. ఏ విషయం నేను ఏరియా కమిటీకి రిపోర్టు చెయ్యాలి" సుందరం కంఠం కటువుగా పలికింది.

 

    సత్యం దళ సభ్యులందర్నీ ఓసారి పరికించి చూశాడు. మౌనంగా వున్న సత్యాన్ని చూసి సుందరం మళ్ళీ అడిగాడు. "కామ్రేడ్! ఏమిటి మీ నిర్ణయం?"

 

    సత్యం మరోసారి దళ సభ్యులకేసి చూశాడు. ప్రతిభకు వళ్ళు మండిపోతూ వుంది. సత్యం భయపడుతున్నాడా? సత్యం ఇంత పిరికివాడా? ఇది విప్లవకారుడి లక్షణమా? ఇంతకాలం తను సత్యాన్ని అభిమానించినందుకు తనకే సిగ్గుగా వుంది. మిగతా దళ సభ్యుల్ని తనకు వంతపాడమని ప్రాధేయపడ్తున్నాడా? ఇతను ఇలాంటివాడని దళ నాయకుడు కామ్రేడ్ వీరయ్యకు తెలియదా? దళ బాధ్యతలితనికి అప్పగించి ఎలా పోయాడు? మిగతావాళ్ళు కూడా బెల్లం కొట్టిన రాళ్ళలా అలా కూర్చుంటారేం? కామ్రేడ్ సుజాత కూడా నోరు మెదపదేం?

 

    సత్యాన్ని చూస్తున్న కొద్దీ ప్రతిభ సహనం నశించసాగింది. అతడంటే కలుగుతున్న అసహ్యాన్ని ముఖంలో దాచుకోలేకపోతున్నది. హఠాత్తుగా సత్యం కళ్ళు తన కళ్ళలోకి చూడడం గ్రహించింది. ప్రతిభ ముఖం వివర్ణమైంది. సత్యం కళ్ళ వెనక నీడలు - ఆ నీడల్లో వెలుగులు. వర్ణనాతీతమైన భావన ఏదో ఆ కళ్ళల్లో ద్యోతకం అవుతున్నది.

 

    "కామ్రేడ్! నేను వెళ్ళిపోవాలి. మీ నిర్ణయమేదో తేల్చి చెప్పండి." సుందరం స్వరం తీవ్రంగా వున్నది.

 

    "కమిటీ నిర్ణయాన్ని అమలు పరచటమే మా బాధ్యత. అందుకు నేను సిద్ధంగా వున్నాను" అన్నాడు సత్యం.

 

    "కామ్రేడ్! కమిటీ నిర్ణయాన్ని అమలు జరపటం దళనాయకుడిగా నీ బాధ్యతని నేను వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. పార్టీ నిబంధనావళిని నీకు మరోసారి గుర్తుచేస్తున్నాను."

 

    "కమిటీ నిర్ణయాన్ని అక్షరాలా అమలుజరపడానికే నిశ్చయించుకున్నాను." సత్యం ఖచ్చితంగా చెప్పాడు. అతడి కంఠం ఢంగానూ, నిర్మలంగానూ వుంది.

 

    ప్రతిభ మనసు తేలిక పడింది. సంతోషంగా సత్యంకేసి చూసింది. కాని సత్యం ఎటో చూస్తున్నాడు.

 

    "ఓ.కే. కామ్రేడ్స్! నీ నిర్ణయాన్ని కమిటీకి తెలియజేస్తాను. రేపు రాత్రే శత్రు నిర్మూలనం జరగాలి. రేపు ఉదయం గంగిడిపాలెం నుంచీ, రావిపాడునుంచీ మన కామ్రేడ్స్ వస్తారు. వాళ్ళు మీ దళ సభ్యుల్ని దిగువ కొండ దగ్గర కలుసుకుంటారు. ఆ కామ్రేడ్స్ సహాయంతో మీ కార్యక్రమాన్ని అమలు జరుపుకోవచ్చు" సుందరం లేచి నిలబడ్డాడు. అంతలో ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగాడు. "కామ్రేడ్స్! మీ దళ విభజన మాటేమిటి? మీలో ఎవరెవరు గంగిడిపాలెం వెళ్తారు? ఎవరు రావిపాడు యాక్షన్ లో ఉంటారు?"

 

    "అది దళసభ్యులం మేము నిర్ణయించుకోవచ్చుననుకుంటాను."

 

    సుందరం ఈ విషయంలో కల్పించుకోవడం తనకు ఇష్టంలేదన్న భావాన్ని సున్నితంగా తెలియజేస్తూ అన్నాడు సత్యం.


    
    "దళనాయకుని బాధ్యతల్లో కల్పించుకోవాలనే ఉద్దేశ్యం నాకే మాత్రంలేదు. కాని ఏ యాక్షన్ లో ఎవరున్నారో కమిటీకి తెలియాలి. మీరే నిర్ణయం తీసుకొని ఇప్పుడే చెప్పండి!" అన్నాడు సుందరం.

 

    "అలాగే నాకు కొంచెం వ్యవధికావాలి. భోజనాలయేలోగా మీకు చెప్తాను" అన్నాడు సత్యం.

 

    "భోజనంచేసి వెళ్ళే టైంలేదే! నేను త్వరగా వెళ్ళిపోవాలి."

 

    "వంట తయారైంది. పదినిమిషాల్లో వడ్డిస్తాం. ఈ కొండ వదిలితే పదిమైళ్ళ మీకు మంచినీళ్ళు కూడా దొరకవు. తిని వెళ్ళండి కామ్రేడ్!" అన్నాడు సత్యం.

 

    "అలాగే త్వరగా కానిస్తే మంచిది" అని సుందరం సుజాతను సమీపించాడు.

 

    "కామ్రేడ్ ఎలా వున్నావ్?" అడిగాడు సుందరం.

 

    సుజాతా, సుందరం మాట్లాడుకుంటూ డెన్ నుండి బయటకు వచ్చారు. సత్యం ప్రతిభా కలిసి డెన్ వెనక, చెట్ల వెనక, చెట్ల చాటున గుంటలో వంట చేస్తున్న చోటుకు వచ్చారు. ఆ పూట వంట డ్యూటీలో వున్న కామ్రేడ్ పాండురంగం, జనార్ధనం వంట పూర్తి చేసి సిగరెట్ దమ్ము పీలుస్తూ కూర్చొని వున్నారు.

 

    "కామ్రేడ్స్! వంట పూర్తయిందా?" సత్యం అడిగాడు.

 

    "ఆహా! ఎప్పుడో అయిపోయింది. ఈ రోజుకుదిరినట్టు ఎప్పుడూ కుదర్లేదనుకో కామ్రేడ్!" అన్నాడు పాండురంగం.

 

    "నల భీమ పాకం అయిందన్నమాట!" ప్రతిభ నవ్వుతూ అడిగింది.

 

    "ఇంతకీ తినడానికి పనికివస్తుందా? లేక నమలకుండానే మింగేయ్యాలా? గిన్నెలమీద మూతలు తీసి చూస్తూ మళ్ళీ అడిగింది ప్రతిభ.

 Previous Page Next Page