"అవును!" సత్యం ఏమీ తొణక్కుండా అన్నాడు.
ప్రతిభకు సత్యం ధోరణి వింతగా కనిపించింది. ఆమాత్రం తన వుద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్న సత్యం మీద కోపం కూడా వచ్చింది.
"అయితే ఆ విషయం గురించి నువ్వు ఇప్పటికీ ఆలోచిస్తూనే వున్నావన్న మాట!" సత్యం సాలోచనగా అన్నాడు.
"ఎందుకు అలా చేశారు?"
"అందులో తప్పేముంది?"
"తోటి కామ్రేడ్ ప్రాణాలను కాపాడే బాధ్యత మీకు లేదా?"
"ఉన్నది. లేదని ఎవరు అన్నారు?"
"అయితే కొండయ్యమీదే బాధ్యత ఎందుకు పెట్టారు?"
"మాకు ఈతరాదు కనక!"
చివాలున తలెత్తి సత్యం ముఖంలోకి చూసింది.
"మీకు ఈతరాదా?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
"రాదు."
"ఈతరాదా?" వేసిన ప్రశ్నే వేసింది.
"రాదు! పట్నాల్లో పుట్టాం! పెరిగాం. చదువుకున్నాం. మాకు ఈత నేర్చుకునే అవకాశం ఎక్కడ? నీలాగే మేమూ విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్ళం!"
"సారీ కామ్రేడ్! మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. క్షమించండి. ముందు మీ ప్రాణాలు రక్షించుకోవాలన్న ప్రలోభంతో నా రక్షణ బాధ్యతను కొండయ్యమీద వేశారనుకున్నాను. మీరూ నా పరిస్థితిలోనే ఉండి కూడా ముందుగా నా రక్షణ గురించి ఆలోచించిన మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను!" ప్రతిభ గొంతు ఆర్ద్రమైంది.
"ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీలేదు ప్రతిభా! విప్లవ జీవితంలో ఎన్నో అనుమానాలు వస్తాయి. ఎన్నో సందర్భాలు అపార్థాలకు దారితీస్తాయి. విప్లవకారులు మనసుపివ్వి మాట్లాడుకోవాలి. అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తోటి కామ్రేడ్స్ ను అర్థం చేసుకోవాలి. మనం చేసిన తప్పుల్నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే విప్లవోద్యమాలను ముందుకు తీసుకుపోగలుగుతాం!" సత్యం చెప్పుకు పోతున్నాడు. ప్రతిభ మౌనంగా వింటూ కూర్చుంది.
"కామ్రేడ్! మీ సెంట్రీడ్యూటీ అయిపోయింది. మీరు వెంటనే డెన్ కు వెళ్ళాలి!" ప్రతిభ లేచి నిలబడింది. రైఫిల్ భుజాన తగిలించుకున్నది.
ఆమెతోపాటు సత్యం లేచి తన రైఫిల్ తీసుకున్నాడు.
"సెంట్రీ విధులన్నీ బాగా గుర్తున్నాయనుకుంటాను."
ప్రతిభను చూసి అన్నాడు. ఆమె నవ్వుతూ తల ఊపింది.
"చాలా విజిలెంట్ గా వుండాలి. పోలీసులు కోంబింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారని వార్తలు వస్తున్నాయి."
"ఇదే సమయంలో మనం మైదాన ప్రాంతంలో వర్గ శత్రువులపై దాడులను విస్తృతం చేయడం అవసరం."
సత్యం నొసలు ముడిచి ప్రతిభకేసి చూశాడు.
"వచ్చే కమిటీ సమావేశంలో నీ అభిప్రాయం చెప్పు. కమిటీ నిర్ణయాలను అమలు జరపడం దళ సభ్యుల బాధ్యత!" అన్నాడు సత్యం.
ప్రతిభ తను తొందరపడి మాట్లాడానేమో అనుకుంది. తన పొరపాటును సర్దుకోవాలన్న ఉద్దేశ్యంతో మళ్ళీ అన్నది. "మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని అడిగాను అంతే!"
"నా అభిప్రాయం కూడా కమిటీ సమావేశంలోనే చెపుతాను. అంతవరకూ ఓపిక పట్టలేవా?"
పొరపాటును సమర్ధించుకోవడానికి ప్రయత్నించడం అవివేకమని ప్రతిభ గుర్తించింది.
"ఓకే! కామ్రేడ్! నేను వెళుతున్నా!" సత్యం గన్ భుజాన వేసుకొని గుట్ట దిగసాగాడు. అలా పోతున్న సత్యాన్ని కనుచూపు అందినమేరకు చూస్తూ ఆలోచించ సాగింది ప్రతిభ. ఇతనిది ఓ వింత వ్యక్తిత్వం. మొదట మొదట చాలా ఈజీ గోయింగ్ మనిషిలా కన్పించాడు. ఒకోసారి చాలా తెలివి తక్కువవాడిలా కన్పిస్తాడు. మరుక్షణంలోనే చాలా తీవ్రంగా ఆలోచించే మనిషిలా ఉంటాడు. ఒకోసారి చాలా నిర్లక్ష్యంగానూ బొత్తిగా లోతులేని మనిషిలాగానూ కన్పిస్తాడు. మరోసారి ఆర్ద్రత ఉన్న వాడిలానూ, గంభీరంగానూ కన్పిస్తాడు.
కఠినమైన విప్లవ జీవితానికి అలవాటు పడే దశలో ప్రతి వ్యక్తి మానసిక స్థితి ఇలాగే ఉంటుందేమో? లేక అతని స్వభావమే అంతా? సుందరానికీ ఇతనికీ ఎంతో తేడా వుంది. సుందరం నిండుకుండలా ఉంటాడు. పెద్ద థీరిటీషియన్. ప్రతిదీ ఆలోచించి మాట్లాడతాడు. విప్లవ జీవితాన్ని పుణికిపుచ్చుకొని జీర్ణించుకున్నవాడలా కన్పిస్తాడు. అతనిలో గాంభీర్యం, డిగ్నిటీ సత్యంలోలేవు. ఛ!ఛ! తనేమిటిలా ఆలోచిన్నది? డిగ్నిటీ ఏమిటి? బూర్జువా ఫ్యూడల్, సాంప్రదాయవాదులు వారే ఈ పదానికి విప్లవభాషలో అర్థం ఏమిటి?
హిపోక్రసీ! యస్! హిపోక్రసీ! అంటే కామ్రేడ్ సుందరం హిపోక్రాటా? కాదు! విప్లవకారుడు ఎప్పుడూ హిపోక్రాట్ కాడు. హిపోక్రాట్ అయినవాడు నిజమైన విప్లవకారుడు కాడు! కాలేడు!
నాన్న హిపోక్రాట్ కాడు. అది తనకు తెలుసు. నాన్న విప్లవకారుడు కాకపోవచ్చు. కాని హిపోక్రాట్ మాత్రం కాడు. కాని బావ పెద్ద హిపోక్రాట్! అందుకే బావకూ తనకూ ఒక్క క్షణం పడేదికాదు. అతనంటే తనకు వళ్ళు మంట. తల్లీ, తండ్రీ, మామయ్యా, అత్తయ్యా, బావ అందరూ కళ్ళముందు మెదిలారు. ఇంట్లో నుంచి అకస్మాత్తుగా, అర్దరాత్రి మాయమైన తనను గురించి వాళ్ళేమనుకుంటున్నారో!
'అమ్మా! నువ్వెక్కడున్నా వెంటనే తిరిగి రావాల్సింది. నీ గురించిన బెంగతో మీ అమ్మ మంచం పట్టింది' అంటూ నాన్న పేపర్లో ప్రకటనగాని వేయించడు గదా!
ఛ!ఛ! నాన్న ఎన్నటికీ అలాచెయ్యడు. నాన్నకు తన భావాలు తెలుసు. తన ఆశయాలను అర్థం చేసుకున్నవాడు! దూరంగా తుపాకి పేలిన ధ్వని! ప్రతిభ ఆలోచన ఆగిపోయింది. ధ్వని వచ్చినవైపుకు ఓ క్షణం నిశితంగా చూసింది. ఆకాశంలో బారులు కట్టి వెళుతున్న గువ్వలు బెదిరిపోయాయి. రాలి కిందపడ్తున్న రెండు అడవి గువ్వలు కన్పించాయి ప్రతిభకు. ప్రతిభ చెట్టు మొదలు ఎక్కి నిక్కి చూసింది. పిట్టల వేటగాళ్ళిద్దరు వేటకు వచ్చారు. ప్రమాదం లేదు. ప్రతిభ నిట్టూర్చింది. చెట్టు దిగి నలువైపులా కలయజూస్తూ సెంట్రీ డ్యూటీలో నిమగ్నమయిపోయింది.
27
"గంగిడిపాలెం భూస్వామి సుబ్బారాయుడ్నూ, రావిపాడు వడ్డీ వ్యాపారి భూషయ్యనూ వర్గశత్రువుగా నిర్ణయించడం జరిగింది. మనం వెంటనే శత్రు నిర్మూలన కార్యక్రమం అమలు జరపాలి." కామ్రేడ్ సుందరం గంభీరంగా చెప్పుకు పోతున్నాడు.
ప్రతిభా, సుజాతా పక్కపక్కనే కూర్చున్నారు. దళ సభ్యుల సమీవేశానికి అధ్యక్షత వహించిన సుందరం పక్కన సత్యం కూర్చున్నాడు. ఏరియా కమిటీ సభ్యుడైన సుందరం, కమిటీ నిర్ణయాలను దళసభ్యుల సమావేశంలో వివరించి, సభ్యుల అభిప్రాయాలను కోరాడు.
"కామ్రేడ్ సుందరం! ఏరియా కమిటీ నిర్ణయాలను అమలు పర్చడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాని ఒక్క సందేహం వున్నది" అన్నాడు సత్యం.
ప్రతిభకు సత్యం అలా మాట్లాడటం ఏమీ బాగా లేదనిపించింది. ఈ సత్యం ఎపుడూ ఇంతే! ఉండి వుండీ ఏదో అంటాడు. తను ఎంతగానో అభిమానించే కామ్రేడ్ సుందరంతో దళ సభ్యులముందు ఇలా ఓటింగ్ థామస్ లా మాట్లాడటం ఏమీ బాగాలేదు.
"ఊ! మీ సందేహం ఏమిటో చెప్పండి కామ్రేడ్!" అన్నాడు సుందరం.
"ఈ రెండు గ్రామాలకు మధ్య దూరం మైళ్ళకు పైగా ఉన్నది. ఒకేరోజు ఈ రెండు గ్రామాలమీద దాడి చెయ్యడం సాధ్యమైనా ప్రమాదం కూడా వున్నది. సుబ్బారాయుడ్ని అంతంచేసి, భూషయ్య గ్రామానికి వెళ్ళడానికి కనీసం రెండున్నార గంటలైనా పడుతుంది. దళం తిరిగి స్థావరానికి చేరుకోవడానికి నాలుగు గంటలైనా పడుతుంది. తెల్లవారేసరికి దళం డెన్ కు చేరుకోవడం సాధ్యంకాదు. అందువల్ల దళం రక్షణ దృష్ట్యా ఈ విషయం ఆలోచించమని కోరుతున్నాను" అన్నాడు సత్యం.
సత్యం తను భయపడినట్టుగా అసంగతమైనదేదీ మాట్లాడలేదు. ప్రతిభ సంతృప్తిగా తల ఊపింది. సుందరం సత్యాన్ని చూస్తూ "కామ్రేడ్! కమిటీ నిర్ణయాన్ని మాత్రమే చెప్పారు. అంతేగాని ఇది ఎలా జరపాలనేది కమిటీ నిర్ణయించలేదు. అది దళ నాయకుడూ, సభ్యులూ నిర్ణయించుకోవాలి. కమిటీ ఆ బాధ్యత, ఎత్తుగడ మనకే వదిలేసింది. పోతే కామ్రేడ్ సత్యం ఊహించినట్టు ఒక గ్రామం తర్వాత రెండో గ్రామంమీద చెయ్యాలని ఎవరూ నిర్ణయించలేదు."