"వీళ్లకేమయింది? ఈ యువతరం ఇలా తయారౌతున్నదేమిటి? పదిమందికి జరిగే అన్యాయాన్ని భరించలేకనేనా? జ్యోతికి కూడా ఉరిశిక్ష పడుతుందా? అరెస్టు చేశారా? జ్యోతి నవ్వుతూ ఉరికంబం ఎక్కుతుందా? పోలీసుగుండుకు గురి అవుతుందా? జ్యోతిని చిత్రహింసలు పెడ్తారా? సతీష్ కూడా వెళ్ళిపోయాడు."
"ధైర్యంగా వుండండి వెళ్ళివస్తాను!" అంటూ రఘురాం వెళ్ళిపోయాడు.
26
"కామ్రేడ్ ప్రతిభా అప్పుడే వచ్చేశారు. టైం ఎంతయిందేమిటి?"
ఎదురుగా వస్తున్న ప్రతిభను చూస్తూ అడిగాడు సత్యం.
"మీ సెంట్రీ డ్యూటీ మరో అర్థగంటదాకా వుందిలెండి!" అన్నది ప్రతిభ దూరంనుంచే.
"ముందుగా వచ్చారు. కారణం? మెసేజ్ ఏదైనా వున్నదా?" ఆతృతగా అడిగాడు సత్యం.
"ఏమీలేదు. మీతో ఒంటరిగా మాట్లాడడానికి నాకు ఈ కేంపుకు వచ్చిన దగ్గర్నుంచీ అవకాశం దొరకలేదు. ఎటు తిరిగీ నా సెంట్రీ డ్యూటీ మరో అర్ధగంటకు ప్రారంభం అవుతుంది కదా! మీతో మాట్లాడదామని అర్ధగంట ముందే వచ్చాను."
గుట్టఎక్కి ముందుకు వస్తోన్న ప్రతిభను, గుట్టమీద చెట్టుమొదలుకు ఆనుకుని కూర్చున్న సత్యం తదేకంగా చూడసాగాడు. మూడు వారాల్లోనే ఈ అమ్మాయిలో ఎంత మార్పు వచ్చింది. పెద్దగా గాలివీస్తే పడిపోయేట్టు సుకుమారంగా ఉండే ఈ అమ్మాయిలో ఎంత శక్తి ఉన్నది? ఎంత ఓపిక ఉన్నది? ఎంతటి పట్టుదల వున్నది? ఎంతటి ఆత్మస్థయిర్యం వున్నది? సత్యం ఆలోచన సాగింది.
కాకీ పాంటూ, షర్టూ, బరువైన బూటూ, భుజాన వేలాడే రైఫిల్ తో ముందుకు వంగి గుట్ట ఎక్కి వస్తూన్న ఈ ప్రతిభకూ, ఆర్గండీ వాయిల్ చీర కట్టుకొని రెండు జడలు వేసుకొని చేతినిండా జారిపోతున్న పుస్తకాలు పట్టుకొని కాలేజీకి వెళ్ళే జ్యోతికి ఎంత భేదం వున్నది? విప్లవ జీవితం యీమెలో ఎంత మార్పు తీసుకొచ్చింది? కన్నావాళ్ళనూ, అయినవాళ్ళనూ వదులుకొని, పరిచయం కూడా లేని మనుషుల మధ్య బతుకుతూ ప్రాణాల్ని అర్పించడానికి సిద్ధం అయిన యీ అమ్మాయి మనస్థయిర్యం ఎలాంటిది? విప్లవాదర్శాలు మనుషుల్లో ఎంతటి మహత్తరమైన మార్పులు తీసుకురాగలవు?
"కామ్రేడ్! ఏమిటి తీవ్రంగా ఆలోచిస్తున్నారూ?" ప్రతిభ రైఫిల్ తీసి చెట్టు మొదలుకు ఆనించి సత్యం పక్కనే కూర్చుంది.
"మీ గురించే కామ్రేడ్!"
"నా గురించా?" ఆశ్చర్యంగా అన్నది ప్రతిభ.
ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.
"అవును! కఠినమైన ఈ దళజీవితం మీరెట్లా తట్టుకోగలుగుతున్నారో అని ఆలోచిస్తున్నాను."
ప్రతిభ తేలిగ్గా నవ్వేసింది.
"మీ అందరిలాగే! ఇందులో నాప్రత్యేకత ఏముందీ!"
మీ సంగతి వేరు! మీరు..."
"మీరు మగవాళ్ళు! నేను ఆడదానిని! అదేనా మీ సందేహం!" ప్రతిభ సత్యం కళ్ళలోకి చూస్తూ అన్నది.
సత్యం కలవరపడ్డాడు. "ఆహా! అదేంకాదు! విప్లవకారుల భాషలో 'అబల' 'సబల' అన్న మాటలకు అర్థంలేదు.
"అయితే ఆచరణలో తేడా వుందంటారా?"
సత్యం కంగారుపడ్డాడు. "ఉన్నదని నేను అనడంలేదు."
"మరి మీ సందేహం?"
"సందేహం కాదు. మొదటిసారిగా మూడు వారాల క్రితం మిమ్మల్ని చూశాను. కృష్ణానది ఒడ్డున, గుడిముందు గాభరాగా, భయం భయంగా నిలబడ్డ మిమ్మల్ని చూశాను. ఎండలో, వెన్నెల్లో వెల వెల పోతున్న మీ ముఖాన్ని చూశాను. సూట్ కేసు మోయలేక, మాతోపాటు నడవలేక హైరానాపడ్డ మిమ్మల్ని చూశాను. చెప్పుల్లేని కాళ్ళతో రాళ్ళల్లో, కంచెల్లో నడవలేక హైరానాపడ్డ మిమ్మల్ని చూశాను. చెప్పుల్లేని కాళ్ళతో రాళ్ళల్లో, కంచెల్లో నడవలేక అలిసిపోయిన మిమ్మల్ని చూశాను."
"ఏమిటి కామ్రేడ్ మీ వర్ణన? ఇంతకీ మీరనేదేమిటి?" ప్రతిభ నవ్వుతూ అడిగింది.
"అదే! జ్యోతికి - ఈనాడు నా కళ్ళముందే రైఫిల్ భుజాన వేసుకొని కొండలెక్కి వస్తున్న ప్రతిభకూ ఉన్న తేడా ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో ఇంతటి మార్పు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు సత్యం.
ప్రతిభ రెండు కళ్ళలో రెండు జ్యోతులు వెలిగాయి. వెలుగు చిమ్మింది. ముఖంలోకి తొంగి చూస్తున్న గర్వాన్ని దాచుకోడానికి ప్రయత్నిస్తూ-
"ఏమిటి కామ్రేడ్! ప్రతి విప్లవకారుడిలోను వచ్చే మార్పు అది కదా! నాలో ప్రత్యేకత ఏముందీ?" అన్నది.
"నువ్వు నా కళ్ళకు ఎట్లా కన్పించావో చెప్పమంటావా?"
ఏదో లోకాల్లోకి చూస్తున్నవాడిలా మాట్లాడసాగాడు సత్యం.
"నువ్వు!" అని మొదటిసారిగా సత్యం సంబోధించడం ప్రతిభకు అదోలా అనిపించింది.
అందులో తప్పేమీలేదు. ఆత్మీయతను ప్రకటిస్తున్న సత్యం ధోరణిలో అపార్థాలకు తావులేదు. "మీరు" "తమరు" ఇవన్నీ బూర్జువా మర్యాద పదాలు. "నువ్వు" అని పిలవడంలోనే ఆత్మీయతా, అభిమానం ఇమిడి వుంటాయి. కళ్ళు తిప్పి సత్యంకేసి చూసింది. సత్యం ఎక్కడో దూరంగా చూస్తున్నాడు.
"కామ్రేడ్!"
ప్రతిభ గొంతు పూడిపోయింది. తనకేమైంది? తనలో ఏమిటి మార్పు? దీనికి కారణం ఏమిటి? ఏమిటి? గొంతు సవరించుకొని మామూలుగా వుండటానికి ప్రయత్నించింది.
"కామ్రేడ్ సత్యం!"
అరే ఇదేమిటి? తన కంఠం తనకే వింతగా విన్పిస్తోంది! ప్రతిభ గుండె వేగంగా కొట్టుకున్నది. కాకీచొక్కా కిందకు లాక్కొని సర్దుకున్నది.
"స్పానిష్ కొండల్లో తుపాకీ ధరించి విప్లవ సైన్యాన్ని ముందుకు నడిపిస్తోన్న ఫాంటమారాలా వున్నావు ప్రతిభా నువ్వు!" సత్యం కంఠం గంభీరంగా పలికింది.
ప్రతిభకు వళ్ళు పులకరించింది. గుండెలు వుబికిపోతున్నాయి. నరాలు విచ్చిపోతున్నాయి. ఉద్రేకం అణుచుకోలేకపోతున్నది. సత్యాన్ని అమాంతం కౌగలించుకోవాలని వుంది. కాని... కాని... తను ఆ పని చెయ్యలేదు. పక్కనే వున్న తుపాకీ అందుకొన్నది. తుపాకీ మడమను నొక్కి పట్టి ఉద్రేకాన్ని అణుచుకోడానికి ప్రయత్నించింది. సత్యం తల తిప్పి ప్రతిభ కేసి చూశాడు. ఆమె ముఖంలో వచ్చిన మార్పును గ్రహించాడు. ఆమెనుంచి చూపుల్ని పక్కకు తప్పుకున్నాడు.
ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. రెండు తెల్లటి కుందేళ్ళు వాళ్ళ ముందునుంచి పరుగులు తీశాయి. పక్కనే వున్న గుబురులోకి దూరాయి. పొదలో నుంచి గోరువంకలు గుంపుగా లేచాయి. దూరంగా కోయిలమ్మ వసంతుడికి స్వాగతం పలుకుతూంది.
"ప్రతిభా! ఏదో మాట్లాడాలన్నావుగదూ! మరి మాట్లాడవేం?" సత్యం ముందున్న గడ్డి పువ్వుల్ని తెంచుతూ అన్నాడు.
పళ్ళ సందున కొరుకుతున్న ఉత్తరేణి కాడను తీసి వేలికి చుట్టుకుంటూ ప్రతిభ తలపైకెత్తి చూసింది.
"ఏదో మాట్లాడాలని అరగంటముందే వచ్చావ్! అప్పుడే పదిహేను నిముషాలు అయిపోయింది!"
"ఏదీ మీరునన్ను మాట్లాడనిస్తేగా!" ప్రతిభ మృదువుగా అన్నది. సత్యం చిరునవ్వు నవ్వాడు.
"ఆ రోజు నది మధ్యలో, పడవ ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు అన్నది గుర్తుందా?" ప్రతిభ సత్యంకేసి గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది.
సత్యం కాసేపు ఆలోచించి - "నీకు ఈతవచ్చా అని అడిగాం! అదేనా?" అన్నాడు.
"ఊ! ఆ తర్వాత?"
"ఇంకేమన్నాం! గుర్తులేదే?"
"పడవ మునిగి ప్రమాదం జరిగితే నా రక్షణ బాధ్యత కొండయ్యకు అప్పగించారు. అవునా? గుర్తున్నదా?"