ఒకరోజు నీరసంగా పడుకున్న రాధికకి, ఆపిల్ పండుకోసి, ఒక్కొక్క ముక్కా అందిస్తున్నాడు సత్యం. మంచినీళ్ళడిగింది రాధిక. నీళ్ళకోసం సత్యం లోపలి కెళ్ళాడు. ఆ చాకుతో పీక తెగేసుకోవడానికి ప్రయత్నించింది రాధిక. సరిగ్గా ఆ సమయానికే సత్యం తిరిగి రావడంవల్ల, చేతిలోని చాకు లాక్కుని విసిరి పారేశాడు.
నిస్సహాయంగా పసిపిల్లలా ఏడుస్తూన్న రాధికని దగ్గరికి తీసుకుని, ఓదార్చాడు. "ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చెయ్యనని ప్రమాణం చెయ్యి చెల్లెమ్మా. ఈ దిక్కుమాలిన వాడికి ఈ ప్రపంచంలో నువ్వు కూడా లేకుండా పోతావామ్మా" కడుపులోని బాధ ఇక దాచుకోలేక భోరుమని ఏడ్చాడు. "అన్నయ్యా... నేనెక్కడికి పోను. నిన్ను వదలిపోలేను. "ఏడుస్తూనే చేతిలో చెయ్యివేసి వాగ్థానం చేసింది.
"అమ్మా.... మధన్ ఎక్కడున్నాసరే వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? నువ్వు నవ్వాలి మరి. నువ్వు నవ్వుతూ వుంటే, వాడు ఈ లోకంలో ఎక్కడున్నా సరే, వెళ్ళి లాక్కొచ్చి నీ ముందుంచుతాను. ఓ.కే." అన్నాడు గడ్డం పట్టుకుని ఆమె మొహంలోకి చూస్తూ, హామీ ఇస్తున్నట్టుగా. రాధిక గలగలా నవ్వేసింది. ఆ నవ్వుల సవ్వడిలో కష్టాలని కాస్సేపు మరచిపోయి హాయిగా నిట్టూర్చారు ఇరువురూ.
తల్లినీ తండ్రినీ నెల్లూరు నుంచి, తిరుపతి తీసుకువెళ్ళి స్వామి దర్శనం చేయించి, అక్కడనుంచి సాంబశివరావుగారి తమ్ముడు కాశీపతిగారు బెంగుళూరులో వుండడం వల్ల అక్కడికి తీసుకెళ్ళి దింపాడు. కొన్నాళ్ళు వుండమని వారెంతో బతిమాలారు, "ఇంటికెళ్ళినా ఏం తోస్తుందిలే పాత జ్ఞాపకాలు వేధించడం తప్ప ఇక్కడే కొన్నాళ్ళు రెస్టు తీసుకోనీయ్" అన్నారు కాశీపతిరావుగారు. తను మాత్రం పనుంది. వెళ్ళిపోవాలని చెప్పి వారిని విడిచిపెట్టి ఒక్కడే వచ్చాడు మధన్.
తలుపు గడియవేసి లేకపోవడం వల్ల తలుపు తోసుకెళ్ళి సూటుకేసు పట్టుకుని, నేరుగా తన గదిలోకి వెళ్ళాడు బహుశా రాధిక ఒక్కతే ఉండి వుంటుంది." అనుకుంటూ వచ్చిన మధన్ ఆ నవ్వులు విని అక్కడే ఆగిపోయాడు.
"ఓ.కే.... నీ మాటకాదనగలనా?" నవ్వుతూ అంది.
"అదృష్టవంతుణ్ణి అంత గౌరవముంచావు" అన్నాడు.
ఆ గొంతు విని ఆశ్చర్యపోయాడు మధన్. "సత్యం" అనుకున్నాడు. మరోకప్పుడయితే అమాంతం వెళ్ళి అతణ్ణి కౌగిలించేసుకుని వుండేవాడే. కానీ, ఎందుకో ఆ నిముషంలో అతనిలో ఒక విధమైన అనుమానపు బీజం నాటుకుపోయింది. సత్యానికీ రాధికకీ ఏదో అక్రమసంబంధం వున్నట్టనిపించింది వారి సంభాషణ వెగటుగా తోచింది. వెళ్ళకూడదనుకుంటూనే లోపలికి వెళ్ళాడు మధన్.
మధన్ ని చూసి రాధిక, సత్యం ఆశ్చర్యంతో కళ్ళప్పగించారు. ఆ ఆశ్చర్యాన్ని మరోలా వూహించుకున్నాడు మధన్." మధన్, ఇది కలకాదు కదా" అనుకుని సంతోషంతో నోటమాటరాక, దగ్గరకెళ్ళి అతని పాదాలమీద పడింది రాధిక. అనుమానంతో కుతకుతలాడిపోతూన్న మధన్ కి ప్రతిదీ కృత్రిమంగానే కనిపిస్తోంది. రాధికలో ప్రేమని, పవిత్రతని చూడలేకపోతున్నాడు. ఇదొక నటన అనుకుంటూ ఆమెను లేవనెత్తాడు.
"నన్ను క్షమించండి! మిమ్మల్నెంతో బాధపెట్టాను" అంది అనునయంగా రాధిక.
"మధన్, నీకోసం రాధిక ఎంత తపించిపోతోందో తెలుసా?"
"నువ్వున్నావుగా, ఊరడించడానికి" ఆ మాటల్లో వ్యంగ్యం ఎత్తి పొడిచినట్టు అనిపించింది సత్యానికి. ఏదో వినకూడనిది వింటూన్నట్టు తోచింది. మధన్ తనని అనుమానిస్తున్నాడేమోననిపించింది. ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలీక" అయినా నెల్లూరు వెళ్ళి యింటికి రాకుండా ఎక్కడి కెళ్ళారు! అమ్మా, నాన్నా ఏరి?" అంటూ టాపిక్ మార్చాడు సత్యం, ముక్తసరిగా జవాబు చెప్పాడు మధన్.
తను అమెరికా నుంచి వచ్చిననాటినుంచి ఏమేం జరిగిందో చెబుతున్నాడు సత్యం. మధన్ మాత్రం "ఊ" కొడుతున్నాడు సరిగా వినడం లేదు. తనతో ఎదురు తిరిగిన రాధిక అతనితో అంత సన్నిహితంగా వుండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తనతో ఎంత దెబ్బలాడినా ఆమెను కాదనలేకపోయాడు. కానీ సత్యంతో ఆమె ప్రవర్తన సహించలేకపోయాడు. అందుకే రాధిక అతనికి ఎంత దగ్గరవుదామనుకుంటోందో అతను ఆమెకి అంత దూరంగా ప్రవర్తిస్తున్నాడు. మధన్ ని చూడాలని అతని చేతుల్లో వాలిపోవాలని, అతని కౌగిలిలో నలిగిపోవాలనీ, కన్నీటితో అతని పాదాలని కడిగి క్షమాపణ వేడుకోవాలని ఎంత తపించిపోయిందో అంత నిరాశ పొందింది రాధిక!
కలిసిన మనసులకి ముచ్చట్లతో యుగమొకక్షణంలా అనిపిస్తుంది. విరిగిన మనసుకి క్షణమొకయుగంలా అనిపిస్తుంది. ప్రస్తుతం ముగ్గురూ మూడు రకాలుగా మనస్సులోనే మదనపడుతూ హాయిగా మాట్లాడుకోలేకపోతున్నారు. వెళ్ళిపోతున్నాను"
"ఏమంత తొందర? ఇన్నాళ్ళూ లేనిది" అదో మాదిరిగా అన్నాడు మధన్.
"ఇన్నాళ్ళూ నువ్వు లేవు కాబట్టి నీ బాధ్యత నేను వహించాను. ఈ క్షణం నుంచి తిరిగి నీ కప్పగిస్తున్నాను."
"నా బాధ్యత నువ్వు వహించినందుకు కృతజ్ఞుణ్ణి" శూలాల్లా గుచ్చుకున్నాయా మాటలు సత్యం గుండెల్లో. స్నానానికని వెళ్ళాడు మధన్. చెదిరిన మనస్సుతో తన సామానులు సర్దుకున్నాడు సత్యం. ఊహించని ఈ పరిణామానికి అతను తట్టుకోలేకపోతున్నాడు.
కొయ్యబొమ్మలా అర్థంకాని ఆలోచనలతో, మంచం మీదకి వొరిగింది రాధిక.
రాధిక యెంత వారించినా వినకుండా వెళ్ళిపోయాడు సత్యం. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుని. ఒకే ప్రాణంలా మెలిగిన సత్యం ఇన్నాళ్ళకు కలుసుకున్నాక, ఒక గంటసేపయినా కలిసి మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాను అంటే సరే అంటూన్న మధన్ ని చూసి, ఆశ్చర్యంతోపాటు, కోపం కూడా పొంగుకొచ్చింది రాధికకి. ఎక్కడో అన్యాయం జరుగుతోందని ఎవరో నీతి తప్పారనీ, దెబ్బలాడే ప్రతి వ్యక్తి అపార్థాలపాలవుతూ తాము బాధపడడం తప్ప ఏమీ సాధించలేరని రాధిక వంటి సున్నిత హృదయులకీ తెలీదు.
"వెళ్ళిపోతానంటే మాటవరసకైనా ఉండమనలేదేం?" బాధగా అడిగింది రాధిక.
మధన్ కి ఉక్రోషం ముంచుకొచ్చింది. "నువ్వయినా అనకపోయావా ఉండేవాడు" అన్నాడు.