"మీ వల్ల నా స్నేహం, నావల్లనా? అతను మీ స్నేహితుడని మరిచిపోయారా?"
"కానీ ఇప్పుడు నీకు సన్నిహితుడు అని తెలుసుకున్నాను."
"ఏమిటి మీరనేది?"
"ఏం? అర్థం కావడం లేదా?"
"ఛీ.. ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు."
"నీచం జరగగా లేనిది ఆలోచిస్తే తప్పా?"
"మధన్" ఉరుములా ఉంది ఆ కేక.
"ఎందుకలా గొంతు చించుకుంటావు? ఉన్నమాటంటే ఉలుకెక్కువ."
"ఉన్నమాట కాదు కనుకనే ఉక్రోషం, బాధ. ఇన్నేళ్ళ సహవాసంలో నన్నర్థం చేసుకోకపోతేపోయారు అతన్ని అర్థం చేసుకున్నది ఇంతేనా?"
"నువ్వు బాగా అర్థం చేసుకున్నావుగా! కట్టుకున్న భర్తని అర్థం చేసుకోకపోయినా ఫరవాలేదులే. వాణ్ణి అర్థం చేసుకున్నావు అంతేచాలు."
"అయితే మమ్మల్ని అనుమానిస్తున్నారా?"
"మీ ధైర్యానికి అభినందిస్తున్నాను.
"ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గువెయ్యడం లేదూ?" కంట్లో నీళ్లు గిర్రున తిరుగుతూ వుంటే కసిగా అంది రాధిక.
"చేతలకి మీకే సిగ్గువెయ్యనప్పుడు మాటలకి నాకు సిగ్గెందుకు?"
"వక్రబుద్ధితో ఆలోచిస్తే అంతా వంకరగానే కనిపిస్తుంది. తిన్నగా ఆలోచించడం ఆరోగ్యకరం" కోపంతో, అసహ్యంతో కంఠం వణికిపోతోంది.
"తిన్నగా ఆలోచించడం ఇప్పుడే నేర్చుకున్నాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడు, నిన్నూ నీ అందాన్ని సత్యం పొగడ్డం తెలిసి కూడా, అతణ్ణి నమ్మడం తెలివితక్కువతనమని ఇప్పుడే తెలుసుకున్నాను."
"ఒక కళాకారిణిగా ఆనాడు నన్ను అతడు మెచ్చుకోవడం ఈనాడు నీకు తప్పుగా కనిపిస్తోందంటే ఎంత సహజంగా వుందో ఆలోచించండి. ఎంతో ఉదారస్వభావంతో నన్ను చేరదీసి దేనినీ లెక్కజెయ్యకుండా తిరిగిన మీరు ఇవాళ సత్యాన్నే అనుమానించడం అర్థం కావడం లేదు."
"చెవులతో విన్నదాన్ని కూడా ఒక్కొక్కసారి పొరపాటు అనుకోవచ్చు, కానీ కళ్ళతో చూసినదాన్ని కూడా నమ్మకపోవడం నాకు చేతకాదు."
"మీరు చూసిందేమిటి కళ్ళతో? నల్లనివన్నీ నీళ్ళూ కావూ, తెల్లని వన్నీ పాలూ కావు. ఏది ఏమిటో తెలుసుకోవడానికి ఇంగిత జ్ఞానం కావాలి. సత్యం నాకు అన్న లాంటివాడు. మీకోసం అహోరాత్రులు పరితపించి, మీ జాడ తెలియక, ఆత్మహత్యకి పూనుకుంటే, నన్ను ఆ ఆపదలోంచి కాపాడి ఆ ప్రయత్నాన్ని విరమింపచేసి, మరెప్పుడూ అటువంటి ప్రయత్నం చెయ్యవద్దని, మీరు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని చెప్పి, వాగ్థానం చేసి నా కన్నీళ్ళు తుడిచి నన్ను నవ్వించాడు. తల్లీతండ్రీ, అన్నాచేల్లీ ఏ ప్రేమకీ నోచుకోని నేను, అతనిలోని అవ్యక్తమైన సోదర ప్రేమని చవిచూశాను. అతని మాటలకి ఊరడిల్లి అతని కోరిక ప్రకారం నవ్వుతూ వుంటానని మాటిచ్చాను. అతనే లేకపోతే మీ జాడ తెలీక ఏనాడో చచ్చిపోయి వుండేదాన్ని. చివరిమాట లేవో చాటుగుండా, అస్పష్టంగా విని లేనిపోనివి ఊహించుకున్నారు మీరు. మా పవిత్ర బంధానికి కళంకం అంటగట్టారు. మీ పాపాన్ని భగవంతుడు కూడా క్షమించడు." మరి మాట్లాడలేక, ఏడుస్తూ దిండులో మొహం దాచుకుంది రాధిక. అప్పుడే లోపలికొస్తున్న మిసెస్ రాఘవన్ సంభాషణ విని స్థంభించిపోయింది. చక్కబడుతూందనుకున్న సంసారంలో ఈ తుఫాను ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుందో ఊహించుకోలేకపోయింది. మిసెస్ రాఘవన్ ని చూసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు మధన్.
"ఊరుకోండి మేడమ్ విధి మిమ్మల్ని పరీక్షిస్తోంది" అంది.
"మీకు తెలీదు మిసెస్ రాఘవన్. నా శీలాన్నే శంకిస్తున్నారు మా ఆయన, అంతకంటే అనుమానం మరోటిలేదు" ఏడుస్తూనే చెప్పుకుపోతుంది రాధిక.
"చూడండి మేడమ్! శ్రీరామచంద్రుడంతటి వాడు, మహాపతివ్రత అయిన సీతాదేవిని, లంకనుంచి వచ్చాక, శంకించి, అగ్నిపరీక్షని కోరాడట. దానితో జానకీదేవి ప్రతిష్ట పదింతలు పెరిగింది. మచ్చలేని రామచంద్రుడికది అపఖ్యాతి కలిగించింది. ఈ మగవారెప్పుడూ అంతే! వారెలా తిరిగినా సరే? భార్య మాత్రం, సరదాగా తిరుగుతే సహించలేరు. ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువ అంటారు కానీ. అవకాశం వస్తే అంతకన్నా ఎక్కువే అనుమానిస్తారు మగవాళ్ళు."
"నిజం మిసెస్ రాఘవన్. అది అక్షరాల నిజమయింది నా జీవితంలో" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూన్న రాధికని "ఊరుకోండి. కాలమే ఋజువు చేస్తుంది" అంటూ ఓదార్చింది.
అంతలో ఎవరో రావడంతో, ఇవతలి కొచ్చేసింది మిసెస్ రాఘవన్.
చికాకుగా మధన్, అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు ఏమీ తోచక. టీపాయ్ మీద పడున్న ఎఱ్ఱ డైరీ ఒకటి కనిపించింది. తీసి చూశాడు. అది సత్యంది.
"మరిచిపోయాడేమో" అని లోపల పెడదామని వెళుతూనే, దానిలోంచి ఒక ఉత్తరం కిందపడింది. "మధన్! దయచేసి ఇది చదువు. మధ్యాహ్నంలోగా నువ్వు నా గదికి రాకపోతే, నువ్వింకా అనుమానిస్తూనే వున్నావనీ, నిజం నమ్మడం లేదనీ, గట్టి చేసుకుని, ఈ ఊరు ఒదిలి వెళ్ళిపోతాను" అని వుంది. వెంటనే కుర్చీలో చేరబడి డైరీ చదవడం మొదలెట్టాడు. తాను అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి, మిసెస్ రాఘవన్ ఏర్ పోర్ట్ కి వచ్చిన విషయం దగ్గర నుంచి, మధన్ తిరిగొచ్చే దాకా, ప్రతి విషయం రాసి వుంది. గబగబా చదవడం మొదలెట్టాడు. ప్రతీ విషయం కళ్ళకికట్టినట్టు అవుపడింది. తన అవివేకానికి చిన్నబుచ్చుకున్నాడు. సత్యానికి క్షమాపణ చెప్పుకోవడానికి బయలుదేరాడు. సత్యం పెట్టిన గడువు ప్రకారం, మరోగంటకన్నా ఎక్కువ టైము లేదు. కారు తీసుకొని వెంటనే సత్యం గదికి బయలుదేరాడు మధన్ తన సంకుచిత స్వభావానికి తానే సిగ్గుపడుతూ.


