సత్యం తన పలుకుబడినంతా ఉపయోగించుకుని, నెల్లూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ కి, ఫోన్ చేశాడు. మధన్ తాలూకు వివరాలు చెబుతూ. అతికష్టంమీద అతన్ని పట్టుకోగలిగారు. కానీ ఆ క్రితంరోజే సాంబశివరావుగారిని, డిశ్చార్జ్ చేశారని తెలిసింది. ఉస్సూరంటూ టెలిఫోన్ పెట్టేశాడు సత్యం. అయితే సాంబశివరావుగారు కులాసాగానే వున్నారనీ, మెడ్రాస్ వచ్చేస్తున్నారనీ సంతోషించాడు. కానీ ఆ ఉత్సాహం కూడా అట్టే కాసేపు వుండలేదు. ఏం జరిగిందో, యెక్కడికెళ్ళారో తెలీక, పిచ్చివాడయిపోయాడు సత్యం.
రాధికకి కొద్దికొద్దిగా స్పృహ వొచ్చింది." మధన్ మధన్" అనే కలవరింత తప్ప, మరో మాటలేదు. స్పెషలిస్టులందరూ తరచూ చూస్తూ వెళుతున్నారు. మరో ఇరవై నాలుగు గంటలు దాటాక, కళ్ళు విప్పింది రాధిక. ముందుగా మిసెస్ రాఘవన్ పలకరించింది." ఎలా వున్నారు మేడమ్ అని". "ఇప్పుడెక్కడున్నాం? ఆయనేరీ? నాకేమయింది." ఇలాంటి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తికమకపడుతూంటే," మాట్లాడించకండి. ఇప్పుడిప్పుడే స్పృహలో కొస్తున్నారు. అంటూ వారించారు డాక్టర్లు. సీరియస్ విషయాలేవీ మాట్లాడొద్దని మరీ మరీ చెప్పి. అయినవారినెవరినయినా దగ్గరుండమని, అవసరమయితే ఎంత రాత్రయినా సరే పేషెంటు కండిషన్ ఎలా వుందో ఫోన్ చెయ్యమని సత్యంతో చెప్పి వెళ్ళిపోయాడు డాక్టరు. నర్సొచ్చి ఏవో ఇంజక్షన్ ఇచ్చింది. ఇంట్లో పిల్లలకి జ్వరంగా వుందని మళ్ళా వస్తానని చెప్పి వెళ్ళిపోయింది మిసెస్ రాఘవన్. కుర్చీని మంచానికి దగ్గిరగా లాక్కుని, కూర్చున్నాడు సత్యం. సడన్ గా సత్యాన్ని చూసి, షాక్ అవుతుందేమోనన్న భయం ఒక వంకవున్నా, చేసేదిలేక, మరెవరూ లేకపోవడం వల్ల దగ్గర కూర్చోక తప్పలేదు అతనికి.
రాధిక మెల్లగా కదులుతూ "దాహం" అంటోంది. కొద్ది కొద్దిగా చెంచాతో నీళ్లు తాగించాడు. తెల్లవార్లూ ఆమె కదలికలను గమనిస్తూనే మేలుకునే వున్నాడు.
ఎవరికి ఎవరు ఋణపడి వుంటారో యెవరూ చెప్పలేరు. కన్నవాళ్ళూ కట్టుకున్నవారూ దగ్గర లేకుండా, ఎక్కడో భర్త తాలూకు స్నేహితుడూ, ఉద్యోగానికని వచ్చిన సెక్రటరీ ఆప్తులై ఆపదలో ఆదుకుంటూ, రాత్రింబవళ్ళు శశ్రూష చేస్తున్నారంటే ఋణానుబంధంకాక మరేమిటి?
తెల్లవారు ఝామున "మధన్....." అని అరిచిన రాధిక అరుపుకు ఉలిక్కిపడి లేచాడు సత్యం. అప్పుడే చిన్నకునుకు పట్టడం వల్ల. "రాధీ..... పడుకో" అన్నాడు ఎలాగో నోరు పెగల్చుకుని ఆమెను శాంతపరచాలన్న ఉద్దేశంతో. "మధన్..... మీరొచ్చేశారా? నన్ను క్షమించండి." అంది రాధిక హీనస్వరంతో సత్యాన్ని చూసి మధననుకుని. సత్యానికి ఏమనాలో తోచలేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె పడుతూన్న మానసిక క్షోభ మధన్ తో చెప్పుకోవాలన్న ఆందోళన అతన్ని దుఃఖంలో ముంచేస్తున్నాయి. "పడుకో రాధీ.... మాట్లాడకు" అని బుజ్జగించాడు ఊరడింపుగా, తలమీద చెయ్యివేసి, చిన్నగా జోకొట్టేడు. మండిపోయే గుండెకి, ఆ చల్లని చెయ్యి ఉపశమనంగా, అనిపించిందేమో హాయిగా నిద్రపోయింది రాధిక అతని చేతిని గట్టిగా పట్టుకుని. ఆ నిముషంలో రాధికలో తల్లి చెయ్యి పట్టుకుని లోకాన్నేలేటంత ధైర్యంగా నిద్దరపోయే పసిపాప కనిపించింది సత్యానికి. రాధికపడే పశ్చాత్తాపం, మధన్ చూస్తే బాగుండుననిపించింది. మళ్ళీ వీరి కాపురం, మూడుపువ్వులూ, ఆరుకాయలు అయి చిగురించాలని యెందరో దేవుళ్ళని ప్రార్థించాడు. సత్యానికి టైము తెలియకపోయినా, భానుడు మాత్రం క్రమం తప్పకుండా, ఉదయించాడు. అతని తొలికిరణాల కిటికీగుండా గదిలోకి ప్రసరించి చీకట్లను పటాపంచలు చేశాయి. అలసటతో మెల్లగా రాధిక చెయ్యి పట్టు విడిపించుకుని మొహం కడుక్కునొచ్చాడు.
కాలచక్రంలో మరో రెండురోజులు గడిచాయి. రాధికకి పూర్తిగా స్పృహొచ్చింది. పక్కనున్న సత్యాన్ని గుర్తుపట్టింది. "సత్యం అన్నయ్యా.... యెప్పుడొచ్చావ్" అంది సంతోషంగా. జ్ఞాపకశక్తిని కోల్పోలేదని ఎంతో సంతోషించాడు. "వారేరీ"? ఈ హఠాత్ ప్రశ్నకి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆలోచించే లోగానే, "వారు రాలేదు కదూ! నెల్లూరులోనే వున్నారా? నామీద కోపం తగ్గలేదా?" అంటూ ప్రశ్నలు వర్షం కురిపించింది. వెంటనే తేరుకుని "సాంబశివరావుగారిని ఇంకా డిస్చార్జ్ చెయ్యలేదు. నాలుగురోజుల్లో వస్తానన్నాడు మధన్. నీమీద ఏమీ కోపం లేదన్నాడు. తనొచ్చేదాకా నన్నిక్కడే ఉండమన్నాడు నీ దగ్గరే" ఆనాడు ఆమె కళ్ళని చదవడానికి ప్రయత్నిస్తూ.
"పోనీలే. నాలుగురోజుల్లో వస్తారు కద. కోపంలేదు కదా. మామగారికీ కులాసాగానే వుంది" అంటూ నవ్వింది రాధిక. ఆ చిరునవ్వులోని ప్రశాంతత. కొండంత ధైర్యాన్ని ఇచ్చింది సత్యానికి.
రోజురోజుకీ కోలుకుంటోంది రాధిక. డాక్టర్ భోజనం పెట్టమన్నారు. డాక్టర్లు చెప్పిన ప్రకారం భోజనం తెచ్చి పెడుతోంది మిసెస్ రాఘవన్. దాదాపు వారం దాటినా మధన్ రాకపోవడం, ఆందోళనగా వుంది సత్యానికి. నిజాన్ని రాధికతో చెప్పలేక, అబద్ధాన్ని కడుపులో దాచుకోలేక సతమతమయిపోతున్నాడు. అతని బాధ పంచుకోవడానికి మిసెస్ రాఘవన్ ఒక్కతే, ఈ ప్రపంచంలో తోడు.
ఆరోజు రాధికని డిస్చార్జి చేస్తున్నారు. మిసెస్ రాఘవన్ సత్యం కలిసి, ఇంటికి తీసుకొచ్చారు రాధికని. రాధికకి నయమయి ఇంటికొస్తోందన్న సంబరం ఒకవైపు వున్నా. ఆ ఇంట్లో రాధికతో తనొక్కడు ఉండడం లోకం ఎటువంటి పెడర్థాలు తీస్తుందోనని భయపడిపోయాడు. పోనీ తనే హోటల్లో వుందామన్నా వంటరిగా రాధికని విడిచి వెళ్ళడానికి మనసొప్పలేదు. మిస్టర్ రాఘవన్ కి ఒంట్లో సరిగ్గా లేకపోవడం. పిల్లలు పరీక్షలు కావడంవల్ల మిసెస్ రాఘవన్ ఉండడానికి వీల్లేదంది రాధిక పైగా "నన్నోపరాయిదానిలా చూస్తున్నావా అన్నయ్యా" అని కంటనీరు పెట్టుకుంది. కన్నీటికి కరిగిపోయే సత్యం, 'వెళ్ళనులే అమ్మా..... ఇక్కడే వుంటాను" అన్నాడు. మిసెస్ రాఘవన్ ఇద్దరికీ భోజనం పంపిస్తోంది. రాధిక నానాటికి బాగానే కోలుకుంటోంది. కానీ సత్యం మాత్రం లోలోపల కృంగిపోతున్నాడు. మరోవారం దాటినా మధన్ జాడలేదు. ఇంక ఉండబట్టలేక, ఉన్నదున్నట్టు రాధికతో చెప్పేశాడు కంటికి మింటికీ ఏకధారంగా ఏడ్చింది రాధిక, ఆత్మహత్య చేసుకుంటానంది. ఎక్కడికైనా పారిపోతానంది, అన్నింటినీ ఆపి అనుక్షణం ఆమెని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు సత్యం. అయినా రాధికలో చెలరేగిన ఈ తుఫాను, ఆమెని పిచ్చిదాన్ని చేస్తున్నాయి. నిద్రమాత్రలు మింగాలనుకుంది. నిప్పుతో కాల్చుకోవాలనుకుంది. చాకుతో కోసుకోవాలనుకుంది. బయటికి పారిపోయి చెరువులో దూకాలనుకుంది, రైలుకింద పడాలనుకుంది. అన్నింటికీ, అడ్డుపడుతూ, నీడలా వెంటాడి ఏ అఘాయిత్యమూ, తలపెట్టకుండా కాపాడుతున్నాడు సత్యం.