Previous Page Next Page 
మరీచిక పేజి 41


    "కావు! కానేరవు! నెహ్రూ విధానాల గురించి ఒకసారి హరిమన్ అనే అమెరికన్ ఏమన్నాడో తెలుసా?"

 

    "ఏమన్నాడేమిటి?"

 

    "సోషలిజం అనే పదాన్ని వారు వాడటం సరయినదికాదని నా అభిప్రాయం. పెట్టుబడిదారీ విధానానికీ వలస విధానానికీ తేడా తెలియకుండా పోయిన ఆసియా ప్రజల్లో ఆ పదానికి మంచి పలుకుబడి వుంది. భారత నాయకులు దాన్ని కమ్యూనిస్టులనుంచి లాక్కున్నారు అని అన్నాడు."

 

    రఘురాం సతీష్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.

 

    "ఇన్నేళ్ళ అనుభవంతో కాంగ్రెస్ సోషలిజం ఇంతకంటే వేరుగా లేదనికూడా తెలుసుకున్నాం! ఈ మోసాన్ని సామాన్యుడు అర్థం చేసుకోలేకపోవచ్చును. కాని మార్క్సిజాన్ని ఏ కొంచెం అర్థం చేసుకున్నవాడైనా కాంగ్రెస్ విధానాలలో సోషలిజాన్ని చూడలేడు. పెట్టుబడిదారీ ఆర్ధిక విధానం అవినీతినీ, లంచగొండితనాన్నీ పెంచుతుంది."

 

    "ఎందుకని?"

 

    "మార్క్స్ కాపిటల్ చదవండి! అర్థం అవుతుంది. అవినీతిని పెంచేవ్యవస్థలో, నీతిని స్థాపించాలని ప్రయత్నించడం అసాధ్యం అని ప్రతి మార్క్సుస్టుకూ తెలుసు! అంతేకాదు. మార్కెట్ పై పెట్టుబడిదారులు గుత్తాధిపత్యం చేస్తున్నప్పుడు సోషలిజానికి తావే వుండదు. పెట్టుబడుల మార్కెట్ ను అలాగే వుంచినప్పుడు, ప్రభుత్వరంగంలోని ఉత్పత్తులుకూడా వారి దోపిడీకే దోహదం చేస్తాయి. సామాన్యుడికి మేలు కలగదు."

 

    "అన్నయ్యా! అమ్మ పిలుస్తోంది!" రమణమూర్తి చిన్నకూతురు వచ్చి సతీష్ తో అన్నది. సతీష్ రక్తనాళాల్లో వేడిగా రక్తం పరుగులు తీస్తూంది. అక్కడనుంచి కదలాలని లేదు.

 

    "వెళ్ళు సతీష్! లోపలకు వెళ్ళు! పెద్దమ్మ పిలుస్తోందట!" అన్నాడు రమణమూర్తి.

 

    "సతీష్! నీళ్ళు తోడాను! ఆరిపోతున్నాయ్"! అంటూ లోపలనుంచి రమణమూర్తి భార్య కేకపెట్టింది. సతీష్ అయిష్టంగానే లేచి లోపలకు వెళ్ళాడు. రఘురాం ఓ క్షణం సతీష్ వెళ్లినవైపే చూస్తూ వుండిపోయాడు.

 

    "ఈ ఉద్యమం నూనూగు మీసాల కుర్రాళ్ళను బాగా ఆకర్షిస్తోంది!" అన్నాడు.

 

    రమణమూర్తి సమాధానం ఇవ్వలేదు.

 

    "మొదట మొదట కొంతకాలం నక్సలైట్లంటే ప్రజలకు ఇష్టంగానే ఉండేది. వర్తకుల, ధనవంతుల ఇళ్ళు దాడిచేసినప్పుడు దొరికిన ప్రామిసరీనోట్లన్నీ కాల్చి వేశారు. ఒక్క అగ్గిపుల్లతో అప్పులన్నీ పరిష్కరించి అనేకమందిని ఋణ విముక్తుల్ని చేశారు. కొన్నిసార్లు తాముదాడిచేసి దోచిన ధాన్యాన్నంతా గ్రామం మధ్యలో గుట్టగా పోగుచేసి గ్రామ ప్రజల్ని ఎవరికి అందినంత వాళ్ళను తీసుకెళ్ళమన్నారు.

 

    ఆనాటి "అగ్గిరాముడి"లాగ, "రాబిన్ హుడ్" లాగ వీరు ప్రజల్లో సద్భావాన్ని పెంపొందించుకున్నారు!" అన్నాడు రఘురాం.

 

    "అవును! ఆ మధ్య ఎవరో అన్నారు. వాళ్ళ నిజాయితీకి పోలీసు వారు కూడా చకితులయ్యారట! ప్రశంసించారట! ఒకతనిదగ్గర దోపిడీ తాలూకు డబ్బు పదహారు వేల నాలుగువందల అరవై రెండు రూపాయలు ఉందట! అతని నోట్ బుక్ లో లెక్కరాసి ఉంచాడట! పోలీసులకు దొరికేసరికి అందులో ముప్పయ్ పైసలు తక్కువగా వుందిట! కానీ లెక్కలో ఆ ముప్పయ్ పైసలు ఎలా ఖర్చు చెయ్యాల్సి వచ్చింది కూడా రాసి పెట్టాడట!" అన్నాడు మూర్తి.

 

    "కాని...రాను...రాను.. వెనకా ముందు చూడకుండా కనపడ్డవాళ్ళనందర్నీ చంపుతూ..."

 

    "కనపడ్డవాళ్ళను వాళ్ళు చంపడం లేదు. అది కేవలం దుష్ప్రచారం! పైగా వాళ్ళ పేరుతో కొందరు తమ తమ కక్షలు సాధించుకుంటున్నారు. కొందరు దొంగలు దోపిడీలు చేస్తున్నారు. అంతేగాని... ఒక ఆశయం కోసం ఒక లక్ష్య సాధనకోసం విప్లవకారులుగా మారినవాళ్ళు..." అంటూ ఆగిపోయాడు మూర్తి.

 

    వాకిట్లో ఆగిన పోలీసు వ్యానును చూస్తూ స్థాణువులా వుండిపోయాడు మూర్తి. రఘురాం లోపలకు వస్తున్న పోలీసులకేసి ఆశ్చర్యంగా చూశాడు.

 

    "హల్లో మూర్తిగారూ! మీ ఇల్లు సోదా చెయ్యాలి!" పోలీసు ఇన్ స్పెక్టర్ లోపలకు వస్తూ అన్నాడు.

 

    మూర్తి ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది.

 

    "కారణం?" రఘురాం అడిగాడు.

 

    "సోదా చేశాక చెప్తాం!" అంటూ కానిస్టేబుల్స్ కు కళ్ళతోనే సోదా చెయ్యమని ఆజ్ఞ జారీ చేశాడు ఇన్ స్పెక్టరు.

 

    రమణమూర్తి బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. వీళ్ళెందుకొచ్చారు? జ్యోతి ఇక్కడ వుందని అనుమానమా? లేక ఆమెకు సంబంధించిన వాళ్ళకోసం గాలింపా? ఆమె ఫోటోలన్నీ కాల్చేశాడుగా? ఇంకా భయం ఎందుకూ?

 

    "ఏమిటండీ ఇన్ స్పెక్టర్ గారూ! అసలు విషయం ఏమిటి?" రఘురాం ప్రశ్నించాడు. సమాధానం ఇవ్వకుండానే బూట్లు టకటకలాడించుకుంటూ ఇన్ స్పెక్టర్ లోపలికి వెళ్ళాడు. మూర్తి చివ్వున లేచి నిల్చున్నాడు. లోపలకు వెళ్ళబోతున్న మూర్తికి బయటకు వస్తున్న పోలీసులు కన్పించారు. వారి మధ్యగా సతీష్ వచ్చాడు. సతీష్ చేతులకు బేడీలు ఉన్నాయి. మూర్తి కాళ్ళకు నేల తగలడం లేదు. రఘురాం తెల్లబోయి చూడసాగాడు.

 

    "సారీ మూర్తిగారూ! మా డ్యూటీ మేం చేశాం!"

 

    "బాబూ! నువ్వు కూడా-" ఆ పై మాటలు మూర్తి గొంతునుంచి పెగల్లేదు. ఉంగిడిపడిన గొడ్డులా సతీష్ ముఖంలోకి బాధగా చూశాడు.

 

    సతీష్ చిరునవ్వు నవ్వాడు. రఘురాంకి మతిపోయినట్టే అయింది.

 

    "బాబాయ్! బాధపడకు! నాన్నకు ధైర్యం చెప్పు!" అన్నాడు సతీష్ మూర్తితో. మూర్తి ఏదో అనాలనుకున్నాడు. గొంతు పెగల్లేదు. పెదవులు కదల్లేదు.

 

    "వస్తాను బాబాయ్! వస్తానండీ లాయర్ గారూ!" అంటూ రెండడుగులు ముందుకు వేసి ఏదో గుర్తుకు రాగా ఆగిపోయాడు.

 

    వెనక్కు తిరిగి చూస్తూ "లాయర్ గారూ!" అన్నాడు.

 

    "ఏం బాబూ!" లాయర్ కంఠంలోని ఆర్ద్రతకు సతీష్ చిరునవ్వు నవ్వాడు.

 

    "మీ ముందే వీళ్లు నన్ను అరెస్టు చేశారు."

 

    "పద పద!" ఇన్ స్పెక్టర్ తొందరపెట్టాడు.

 

    "మీరు చూస్తుండగానే నన్ను వేన్ లోకి ఎక్కిస్తున్నారు."

 

    రఘురాం అర్థం కానట్టు చూశాడు.

 

    ఇన్ స్పెక్టరు ముఖం గంభీరంగా మారింది.

 

    "కొన్ని రోజుల తర్వాత ఏ 'రంగాపూర్' అడవుల్లోనో పోలీసులతో జరిగిన సంఘర్షణలో నేను చనిపోయానని పేపర్లలో చదవడం జరగొచ్చును."

 

    "బాబూ!"

 

    "నా ఫోటో కూడా వేసి మరీ న్యూస్ వెయ్యవచ్చు!"

 

    రఘురాం సతీష్ ముఖంలోకి చూశాడు. నీళ్లు నిండిన కళ్ళకు సతీష్ ముఖం కదిలిపోయిన ఫోటోగ్రాఫ్ లో ముఖంలా కన్పించింది.

 

    "అది చూసి మీరు ఆశ్చర్యపడనక్కరలేదు."

 

    "బాబూ!" మూర్తిగారు గాద్గదికంగా పిల్చాడు.

 

    "మీరు మేధావి వర్గానికి సంబంధించిన వారు. అటువంటి వార్త చదివినప్పుడు మీ కర్తవ్యాన్ని విస్మరించకండి! మీరు చూసిన దాన్ని చెప్పండి."

 

    "పద పద! ఆ లెక్చరేదో పోలీసుస్టేషన్ లో ఇవ్వు!" కసురుకున్నాడు ఇన్ స్పెక్టర్. నవ్వుతూ ఎర్రటోపీల మధ్యగా వెళ్లిపోతున్న సతీష్ ముఖం ఉదయిస్తున్న సూర్యబింబంలా కన్పించింది రఘురాంకు. మూర్తి వోపికలేనట్టు వాలుకుర్చీలో కూలిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళముందు జ్యోతి రూపం కదిలింది.

 

    జ్యోతి కళ్ళు ఎర్రగా వున్నాయి. ముఖం ఎర్రగా వున్నది. మధ్యాహ్నపు సూర్యుడులా కణకణ లాడుతున్నది. జ్యోతి చేతులు రక్తసిక్తంగా-

 

    "అమ్మా! జ్యోతీ!" పైకే అనేశాడు.

 

    "మూర్తీ! మూర్తీ! ఏమైంది?" భుజం తట్టి పిల్చాడు రఘురాం.

 

    మూర్తి కళ్ళు తెరిచాడు. పిచ్చి చూపులు చూశాడు.

 

    "ఏమిటి అలా చూస్తున్నావ్?"

 

    జ్యోతి తన జ్యోతి... చీమకైనా అపకారం తలపెట్టని తన బిడ్డ మనిషిని చంపడమా?

 

    "లేదు. లేదు. నా జ్యోతి అలా ఎన్నటికీ చెయ్యదు." పైకే బిగ్గరగా అరిచాడు.

 

    "మూర్తిగారూ! మీరు మరీ అంత బెంబేలు పడిపోతే ఎలాగండీ! ఇంట్లో వాళ్ళకు ధైర్యం చెప్పవలసినవారు."

 Previous Page Next Page