రాధిక స్పృహలో లేకపోవడంవల్ల ఆమె వివరాలు సరిగ్గా తెలుసుకోలేకపోయారు. పోలీసు అధికారులు. టాక్సీ అతని ద్వారా మిసెస్ రాఘవన్ అడ్రసు తెలుసుకుని జరిగిన సంగతి ఆమెతో చెప్పారు. వెంటనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. రాధికకి బ్లెడ్ ఎక్కిస్తున్నారు. అక్కడి డాక్టర్లని కలిసి ఆమె ఫలానా అని చెప్పి ఎంత ఖర్చయినా సరే ట్రీట్ మెంటు సరిగా చెయ్యమని చెప్పింది. ఆమె దగ్గర వుండడానికి రాత్రింబవళ్ళు ఒక ఆయాని ఏర్పాటు చేసింది. మధన్ ని కలుసుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా నెల్లూరు హాస్పిటల్ ఆ వూరు తెలియలేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు ఆమెకి. ఒకసారి ఈ కాగితం కోసం వెతకడం మొదలెట్టింది. ఎక్కడా కనబడలేదు. ఇంట్లో దొరుకుతుందేమోనని ఇంటివైపు వెళ్ళింది. అక్కడ ఒక పోస్టు కార్డు పడి వుంది. అది తీసి చదవడం సభ్యత కాదని తెలిసినా, ఏమైనా ముఖ్య విషయాలున్నాయేమోనని చదివింది. అది రాధిక తమ్ముడు రాసిన ఉత్తరం. పంపిన డబ్బు అందింది. తండ్రిగారు ఆ క్రితం రోజే కాలం చేశారని. గోరుచుట్టుకిది రోకటిపోటు లాంటి ఈ వార్త రాధికకి స్పృహ వచ్చాక కూడా చెప్పకూడదనుకుంది. ఆ ఉత్తరాన్ని తీసి జాగ్రత్తగా పర్సులో పెట్టుకుంది. పరిస్థితులు వివరిస్తూ రాధిక తమ్ముడికి ఆ అడ్రసు ప్రకారం తానే జవాబు రాసేసింది. మిసెస్ రాఘవన్.
రాధిక ఆక్సిడెంటు సంగతి ఊరంతా పాకిపోయింది. కొందరు అభిమానులు ఆసుపత్రికి కూడా వచ్చి చూసి వెళ్ళారు. వారంరోజులు గడిచినా రాధికకి స్పృహ రాలేదు. రోజుకొకసారి మిసెస్ రాఘవన్ రాధిక ఇంటికి వెళ్ళివొక గంటసేపు కూర్చుని వస్తోంది. మధన్ దగ్గరనుంచి ఉత్తరమయినా వస్తుందేమోనని. ఈ మధ్యలో రాధిక కారు ప్రమాదం గురించి పేపర్లలో వచ్చింది. అది చూసి అయినా మధన్ వస్తాడేమోనని ప్రతిరోజూ మిసెస్ రాఘవన్ ఇంటికి వెళ్ళి కాస్సేపు కూర్చొని వస్తోంది.
ఆ రోజు 'టెలిగ్రాం" అన్నకేక విని లేచి వెళ్ళి సంతకం చేసి టెలిగ్రాం పుచ్చుకుంది మిసెస్ రాఘవన్. విప్పి చదివింది. "అరైవ్ డ్..... ఫ్రమ్... అమెరికా,. టు....,డే.. రీచింగ్ మెడ్రాస్ టుమారో మీట్ ఏర పోర్టు సత్యం." అని వుంది. ఈ సత్యం ఎవరో ఏమిటో ఏమీ అర్థం కాలేదు. టెలిగ్రాం ఎక్కడినుంచి వచ్చిందో తిప్పి చూసింది. ఢిల్లీ నుంచి వచ్చింది. అంటే సత్యం అమెరికా నుంచి ఢిల్లీ వచ్చేశారన్నమాట. రేపు మెడ్రాస్ వస్తున్నారు. ఈ సత్యం ఎవరో ఎలా గుర్తుపట్టాలి. బహుశా సత్యంగారు మధన్ గారికి బంధువులో ముఖ్యులైన స్నేహితులో అయి వుండాలి. లేకపోతే అమెరికా నుంచి ఇండియాలో అడుగుపెట్టిన మరుక్షణమే మధన్ కి టెలిగ్రాం ఎందుకిస్తారు? ఎలాగైనా ఇతన్ని కలుసుకుంటే తన బాధ్యత కొంతవరకు తగ్గుతుందనుకుంది. కాని ఎలా? ఎవరు సత్యమో ఏర్ పోర్టులో గుర్తుపట్టడం ఎలా? ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. చివరికి, ఏర్ పోర్టుకి వెళ్ళి, సత్యం కోసం కౌంటర్ దగ్గిర అనౌన్స్ చేయించాలనుకుంది, అప్పుడు తనను తాను పరిచయము చేసుకుని విషయాలన్నీ చెప్పాలనుకుంది.
"ఏ..... పాసింజర్.... ఫ్రమ్ ఢిల్లీ..... మిస్టర్ సత్యం వాంటెడ్.... ప్లీజ్.... కమ్.... టు.... ది.... కౌంటర్....." అని అనౌన్స్ మెంటు మోగిపోతోంది.
"ఏస్.. ఐ.... యామ్.... సత్యం" అన్నాడు సత్యం కౌంటర్ దగ్గిరకొచ్చి.
"మీకోసం ఎవరో వచ్చారు" అని మిసెస్ రాఘవన్ ని చూపించాడు కౌంటర్ క్లర్క్.
"ఐ.... యామ్... మిసెస్ రాఘవన్" నమస్కారం చేసింది. పరిచయం చేసుకుంటూ.
"నమస్కారం ఎవరు మీరు? ఏం కావాలి." అన్నాడు మృదువుగా వినయం వుట్టిపడుతూ సత్యం.
"నేను మధన్ దగ్గర నుంచి వచ్చాను మీరు వారికి పంపిన టెలిగ్రాం చూసి. రండి వెళదాం" అంది.
"మధన్ రాలేదా? అయితే మీరెవరు? కనీసం రాధికయినా రాలేదా?" అన్నాడు సత్యం వారు రానందుకు విచారాన్ని తెలియబరుస్తూ. "రండి చెబుతాను" అంది. ఆమె వెనకే నడిచాడు సత్యం. లగేజ్ తీసుకుని టాక్సీలో పెట్టించింది. ఇద్దరూ టాక్సీ ఎక్కారు. అన్ని విషయాలు వివరంగా చెప్పింది మిసెస్ రాఘవన్. తనులేని ఈ ఒక్క సంవత్సరం లోపల, మధన్ ఉద్యోగం మానెయ్యడం రాధిక, మధన్ మధ్య మనస్పర్థలు, మధన్ తండ్రి జబ్బు. రాధిక తండ్రి మరణం, ఆమె కారు ప్రమాదం, ఇవన్నీ విని దేనికి సానుభూతి తెలపాలో, అసలు ఏం చెయ్యాలో అంతా అయోమయంగా అనిపించింది సత్యానికి.
"ముందు తిన్నగా ఆసుపత్రికి వెళదాం. రాధికని చూడాలి" అన్నాడు.
టాక్సీ ఆసుపత్రి ఆవరణలో ఆగింది.
తలకి గాయాలతో, మంచంమీద పడున్న రాధికని చూస్తే దుఃఖం పొంగుకొచ్చింది సత్యానికి. పసిపిల్లాడిలా ఏడుస్తున్న సత్యాన్ని ఓదార్చింది మిసెస్ రాఘవన్. డాక్టర్ల నడిగాడు రాధిక కండిషన్ ఎలా వుందని సత్యం. బి.పి. నార్మల్ గానే వుందని, హార్ట్ జనరల్ కండిషను కూడా నార్మల్ గానే వుందనీ, స్పృహ వస్తే తప్ప మిగతా విషయాలు చెప్పలేమని అన్నారు. తలకి గాయం తగిలింది. అందులోనూ పదిరోజుల నుంచి స్పృహ లేకుండా పడుండడం వల్ల మెదడు దెబ్బతింటుందేమోనన్న సందేహం! సత్యాన్ని పీడించేస్తోంది. ఆ భయంతోనే ఈ విషయం ఏ డాక్టర్ని అడిగినా "ఇప్పుడేమీ చెప్పలేము" అనే అన్నారు.
తప్పనిసరిగా మర్నాడు ఆఫీసుకి వెళ్ళాడు సత్యం. మధన్ లేని ఆఫీసు. వల్లకాడులా అనిపించింది సత్యానికి. మధన్ ని గురించి నలుగురూ నాలుగు రకాలుగా చెప్పుకోవడం, బాధ కలిగించింది. "భార్యని అదుపులో పెట్టుకోలేని అసమర్థుడనీ, ఆడదాని, కోసం పిచ్చెక్కి ఉద్యోగాన్ని కూడా వదులుకున్న పిచ్చివాడనీ అసలు అటువంటి అమ్మాయిని ఆలిగా ఎన్నుకున్న అమాయకుడనీ, మరికొందరు ఏది ఏమైనా, అందాల చిలుకకి భర్త అయిన అదృష్టవంతుడని," ఈ రకమైన విమర్శలను వినీ వినీ, ఆఫీసంటే అసహ్యం వేసింది సత్యానికి. అదే మనదేశంలో, వాళ్ళింట్లో ఏమిటి వండుకుంటారో ఏం తింటారో, అతని ఉద్యోగమూ, జీవితము, అప్పూ, ఆస్తి పూర్తీ బయోడేటా అంతా మనకి ఇష్టం వున్నా లేకపోయినా వారు చూసుకోవడం. ఇతరులు విషయాలలో జోక్యం చేసుకోకపోవడం, మన సంప్రదాయానికే విరుద్ధం. పైగా తోటిమనిషి కష్టాలలో వుంటే సానుభూతి చూపించకపోగా, హేళన చెయ్యడమో, అమెరికా అంత ఎత్తు మనం ఎదగాలంటే కొన్ని వందల సంవత్సరాలు కావాలి గాబోలు, అంటూ విసుక్కున్నాడు సత్యం. ఆఫీసు మీద విరక్తి పుట్టింది. ఆఫీసు వారందరూ వచ్చి, శుభాకాంక్షలు చెబుతున్నారు. మధన్ లేనిలోటు, లోటుగానే అనిపించింది. అందుకే నెలరోజులు సెలవుపెట్టి ఇంటికొచ్చేశాడు సత్యం.
సత్యం ఇంటి తాళం చెవులు మధన్ ఎక్కడ పెట్టాడో, యెంత వెతికినా కనిపించలేదు సత్యానికి. అందుకని మధన్ ఇంట్లోనే వుంటున్నాడు. హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకుని తింటూ వీలైనంతమట్టుకు హాస్పిటల్ లో రాధిక దగ్గరే వుంటున్నాడు సత్యం. మిసెస్ రాఘవన్ కూడా రోజుకొక్కసారైనా వచ్చి వెళుతోంది.