కలకత్తా కార్పొరేషన్ మేయర్ ను సాయుధులైన నక్సలైట్లు తరుముతున్నారు. ఆయన తన ఇంట్లోనుంచి మార్క్సిస్టులతో కలిసి బయటకు రాగానే పైనబడ్డారు. స్థానిక మార్క్సిస్టు కార్యదర్శికి కత్తిపోట్లు తగిలాయి. తరువాత పోలీసులు వచ్చి కాల్పులు జరిపితే వారిపై కొంతసేపు ఆ నక్సలైట్ల ముఠా బాంబుల వర్షం కురిపించి పారిపోయింది."
"రామ!రామ!" అంటూ రఘురాం మూర్తి కళ్ళలోకి చూశాడు. మూర్తి ఈ లోకంలో వున్నట్టు కన్పించలేదు.
రఘురాం మరో వార్త చదవసాగాడు.
"కేరళ నక్సలైట్సుచే నలుగురి దారుణహత్య."
కేరళలో ఉన్నట్టుండి మళ్ళీ నక్సలైట్ వుద్యమ కెరటాలు లేచాయి. ఒకేరోజు రాత్రి రెండు గ్రామాలపై దాడిచేసి, ఒక భూస్వామితో సహా మొత్తం నలుగుర్ని దారుణంగా హత్య చేశారు. త్రివేండ్రానికి 30 మైళ్ళ లోపునే వున్నాయి. ఈ రెండు గ్రామాలు, కడక్కర్ అనే ఊరిలో ఒక ధనిక భూస్వామి గృహంపై 30 మందితో కూడిన నక్సలైట్ ముఠా దాడిచేసి యజమాని తలను నరికి రోడ్డుమీద పారేశారు."
రఘురాం తల తిరిగిపోయింది. ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు.
"గాజుపాలెం హత్య కేసులోనూ కొందపానకుంట కేసులోనూ ప్రమేయం వున్నదని చెప్పబడుతూ ఇంతకాలం పోలీసులకు అంతు చిక్కకుండా తిరుగుతుండిన యువకుడు పుండరీకాక్షుడు మొన్న హఠాత్తుగా ఉన్నట్టుండి కోవూరు మేజిస్ట్రేటు కోర్టులో దర్శనమిచ్చాడు. సరండర్ అయ్యాడు."
"ఇవ్వాళ పేపరంతా హత్యలూ, కోర్టులూనూ" అంటూ మూర్తి ముఖంలోకి చూశాడు.
"ఆ కింది వార్త కూడా చదువు!" అన్నాడు మూర్తి.
"మద్దూరి హత్యకేసులో నిందితులైన ముగ్గురికి ఉరిశిక్ష పడింది. వారి తీర్పు విని ఏమాత్రం చలించలేదు. పైగా పోలీసుల వెంట బయటికి వెళుతూ మావో నినాదాలు ఇచ్చారు." ఈ వార్త రఘురాం పైకే చదివాడు.
మూర్తి గట్టిగా నిట్టూర్పు విడిచాడు. "ఈ తీర్పుమీద నీ అభిప్రాయం ఏమిటి?" రఘురాంను అడిగాడు మూర్తి.
"ఏముందీ? తీర్పు బాగానే వుంది. వారు చేసిన ఘాతుక కృత్యానికి సరైన శిక్షే పడింది."
మూర్తి ముఖం ఎర్రబడింది. ఏదో అనబోయి లోపలినుంచి వచ్చిన తన అన్న కుమారుడు సతీష్ ను చూసి ఆగిపోయాడు మూర్తి.
"రాబాబూ! ఇతను నా స్నేహితుడు! రఘురాం! లాయర్!" అంటూ మూర్తి సతీష్ కు పరిచయం చేశాడు.
"నమస్కారమండి. నా పేరు సతీష్!"
"మా అన్నయ్య కొడుకు కర్నూలు మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు!"
"అలాగా! సంతోషం బాబూ!"
"ఇంతకు ముందు మీరేదో అంటున్నారూ!" సతీష్ అడిగాడు.
"అదే మద్దూరి హత్య కేసులొ ఇచ్చిన తీర్పు గురించి..."
"ఎలావుంది తీర్పు?"
"అంతేలెండి మీరు ఇంతకంటె ఏమంటారు?"
రఘురాం చివ్వున తలెత్తి సతీష్ ముఖంలోకి చూశాడు.
"డబ్బు సంపాదన మినహా వేరే ఆలోచన లేని మీరు ఇంతకంటే ఏమంటారు!" తీవ్రంగా ఉంది సతీష్ కంఠం.
"అంటే?"
సతీష్ మాట్లాడలేదు.
"వాళ్ళుచేసే ఘాతుకచర్యల్ని సమర్థించమంటావా?" రఘురాం మళ్ళీ ప్రశ్నించాడు.
"ఉరిశిక్షపడిందని తెలిసీ ఏమాత్రం చలించకుండా విప్లవ నినాదాలు చేస్తూ కోర్టునుంచి బయటికి నడిచినవాళ్ళలో మీకు కన్పించింది క్రూరత్వమేనా?"
రఘురాం, మూర్తి సతీష్ ముఖంలోకి లోతుగా చూశారు.
"వాళ్ళలో మీకు ఎలాంటి త్యాగమూ కనిపించలేదూ?"
"మనుషుల్ని చంపడంలో త్యాగమా?"
"ఎందుకు కాదూ? ఒక ఆశయం కోసం, సిద్ధాంతం కోసం, ప్రాణాలకు తెగించి పోరాడేవారి వ్యక్తిత్వాల్లో మీకు ఎలాంటి త్యాగమూ కన్పించడంలేదూ? ఏ మంచితనమూ కన్పించడంలేదూ?"
రఘురాం చూస్తూ వుండిపోయాడు.
"మామూలు హత్యకేసును విచారించినట్లే ఈ కేసును విచారించడం లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్న మీకు కూడా అన్యాయంగా అనిపించడం లేదూ?"
"బాబూ!" మూర్తి కంఠం వణికింది.
"రేపు వురికంబం ఎక్కుతూకూడా వారు విప్లవ నినాదాలను వినిపిస్తారు. మనిషిని వురి తియ్యగలరేగాని వారి భావాలను వ్యాపించకుండా చెయ్యగలరా? ముగ్గురు నక్సలైట్లను వురికంబం ఎక్కించినంతమాత్రంచేత ఈ విప్లవం ఆగి పోతుందా! ఈ కుళ్లిపోయిన కేపిటలిస్టు వ్యవస్థలో వెయ్యిమండి విప్లవకారులు వుద్భవించే రోజులుముందు లేవంటారా?" సతీష్ వుద్రేకంగా అన్నాడు.
వీడు కూడా ఇలా మాట్లాడుతున్నాడేమిటి? ఈ పిల్లలందరికి ఈ జబ్బు పట్టుకుందేమిటి? వీడు కూడా జ్యోతిలా... వీడు తండ్రికి ఒకే కొడుకు. ఆ తండ్రి ఆశలన్నీ వీడిచుట్టూనే... ఆలోచిస్తూ సతీష్ కేసి చూశాడు.
"బాబూ! నువ్వు కూడా కమ్యూనిస్టులా వున్నావ్?"
"మరి మీరో!" నవ్వుతూ రఘురాంను అడిగాడు సతీష్.
"నేను ఏ ఇస్టునూ కాదు. ఎవరు డబ్బిస్తే వారి తరపునే వాదించే లాయర్ని. నీకు ఈ ఉద్యమంపట్ల వుండే ఆడ్మిరేషన్ నాకెలా వుంటుంది? పైగా నీలో వేడిరక్తం వురకలు తీస్తూవుంది. ఉరవళ్ళువరవళ్ళుతొక్కే వయసులో వున్నావ్! మీ కుర్రకారందరికీ ఇదో జబ్బు పట్టుకుంది. ఎందుకొచ్చిన త్యాగాలు! చెప్పు! మెరికల్లాంటి కుర్రాలు శలభాల్లా మాడి మాసాయిపోతున్నారు. మొన్ననో వార్త చదివాను. "నేను వెళుతున్నాను. నా గమ్యస్థానం శ్రీకాకుళం!" అనే చీటి పెట్టి ఓ విద్యార్థి విప్లవకారుల్లో కలిసి పోయాడట! మరో విద్యార్థిని చదువు వదిలేసి, ఇంజనీరింగు స్టూడెంటును చేసుకొని ఈ ఉద్యమంలో చేరిపోయిందట! ఒక శ్రీమంతుని కుమారుడు డాక్టర్ చదివి ప్రాక్టీసుచేస్తూ, వదిలేసి వెళ్ళిపోయాడట! ఇలా చెప్పుకుంటూ పోవాలంటే పెద్ద లిస్టే అవుతుంది!"
"ఇంతమంది విద్యాధికులైన నవయువకుల్ని ఆకర్షించిన ఈ ఉద్యమంపట్ల మీకు గౌరవం కలగడంలేదా?" రఘురాం ముఖంలోకి చూస్తూ అడిగాడు సతీష్.
"ఇది కేవలం దుందుడుకుతనమనీ, విప్లవానికి అనువైన పరిస్థితులు దేశంలో ఇంకా సరిగా ఏర్పడలేదనీ, లెఫ్ట్ కమ్యూనిస్టులే అంటున్నారు. ఇక త్యాగం అంటావా! దుందుడుకుతనంలో, బరితెగింపుతనంలో త్యాగానికి తావెక్కడుంది?" అన్నాడు రఘురాం.
"అలా అనకు రఘురాం! ఈ ఉద్యమంవల్ల ఇప్పుడు వర్గ విధానాలకు సంబంధించిన మన ఆలోచనల్లో కొంతవరకు మార్పు వచ్చింది. అదే పదివేలు!" అన్నాడు మధ్యలో అందుకొని రమణమూర్తి.
రఘురాం 'నీకూ ఈ పిచ్చి తలకెక్కిందా?' అన్నట్టు రమణమూర్తి కళ్ళలోకి చూశాడు.
"ఇందిరా ప్రభుత్వం తలపెట్టిన ఈ భూసంస్కరణలూ మొదలైనవి మరి సోషలిస్టు లక్ష్యాలు."