Previous Page Next Page 
పిపాసి పేజి 39


    "అవును మేడమ్, నా పెళ్ళినాటికి మా ఆయన ఒక పెద్ద డాన్సర్. డాన్సరుతో పెళ్ళికుదిరిందనగానే, నా స్నేహితులందరూ నానా రకాలుగా నన్ను హేళన చేశారు. మొగవాడు డాన్సరయితే ఆడంగిలా నడుస్తాడనీ, మగతనం పోతుందని వెక్కిరించారు. ఆ మాటలు నా మస్తిష్కంలో జీర్ణించుకుపోయాయి. ఈ పెళ్ళి ఒద్దు అని చెప్పలేక, లోపల మింగలేక నాలో నేనే సతమతమయిపోయాను. దానికి తోడు పెళ్ళిలో మర్యాదలు సక్రమంగా జరగలేదని మా అత్తగారు, నన్ను రాచిరంపాన పెట్టారు. మావారు ఇవేమీ పట్టించుకోకుండా, తన డాన్స్ గొడవల్లో వుండేవారు. తీరిక వేళల్లో నాతో సరదాగా మాట్లాడదామని దగ్గరకొస్తే, నా స్నేహితుల మాటలు చెవుల్లో గింగురుమనేవి. దాంతో అతని మీద ఒక రకమైన వెగటు పుట్టుకొచ్చేది. మా అత్తగారి అఘాయిత్యం, అతని అమాయకత్వం నాలో అశాంతిని రేకెత్తించేవి. నాకు ఎన్నో విధాల నచ్చచెప్పాలని ప్రయత్నించేవారాయన. అయినా ఫలితం వుండేది కాదు. చివరికి ఓరోజు, "మీరు డాన్సు చెయ్యడం మానెయ్యాలి" అన్నాను, "ఏం అన్నారాయన." మా స్నేహితులందరూ నవ్వుతున్నారు." అన్నాను. "నా అజ్ఞానానికి నవ్వుతూ నా నాట్యాన్ని ఎందరో మెచ్చుకుంటున్నారు. పైగా అదే మనకి ఉపాధి. అది కాస్తా మానేసి నన్నేం చెయ్యమంటావు?" అన్నారు. "బిచ్చమెత్తుకుందాం. కానీ మీరు నాట్యం చెయ్యొద్దు" అన్నాను. ఏడుస్తూ నాపై అతనికి కోపం రాలేదు? జాలేసిందేమో మాట్లాడకుండా కళ్ళు తుడిచారు. ఆ మౌనం అంగీకారం అనుకున్నాను. నాలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. తొలిసారిగా నాలో కలిగిన ఆ అనుభూతి చెప్పనలవి కానిది. దాని తరువాత తొమ్మిది నెలలకే మాకు బాబు పుట్టాడు. నాట్యం మీద మక్కువతో "నటరాజ్" అని పేరు పెట్టారు మా ఆయన. కానీ, అతను నాట్యం మానకపోవడం నన్ను హతాశురాలిని చేసింది. చెవిలో ఇల్లు కట్టుకుపోరినా అతను ఎప్పటికప్పుడు ఏవో సాకులు చెప్పి తప్పించుకునేవారేకానీ, మానలేదు. మరో సంవత్సరానికే పుట్టిన మా పాపకి, ఆ  సంగీతానికి చిహ్నంగా 'సంగీత' అని పేరు పెట్టారు. ఇద్దరు పిల్లలకి తల్లినయినా, నాలో నాటుకుపోయిన నా స్నేహితుల హేళన చెదిరిపోలేనిది. చివరకి, నా మొర భగవంతుడితో వినిపించుకోవాలనుకున్నాను. స్వామీ, నా స్నేహితుల ముందు నన్ను కించపరిచే మా వారి నాట్యం నాకసహ్యం. వారు చేయకుండా వుండేమార్గం చూడు. చివరికి వారి కాళ్ళు పోయినా సరే కాని వారు నాట్యం చేస్తే మాత్రం నేను చూడలేను." అని ప్రార్థించాను. ఏ మునులు తధాస్థూ అన్నారో, ఏ దేవతలు అనుగ్రహించారో మరో కొన్నాళ్ళకే పక్షవాతం వల్ల కాలూ, చెయ్యీ పడిపోయింది." ఆవేశంతో ఆమె మరీ మాట్లాడలేక ఏడుస్తూ కుర్చీలో వాలిపోయింది.


    ఆమె చెప్పేదంతా ఒక కథలా వింటూన్న రాధికకి మతిపోయినట్టనిపించింది.


    పిచ్చిదానిలా ఆమెకేసి చూస్తూండిపోయింది.


    కాస్సేపటికి తేరుకున్న మిసెస్ రాఘవన్ "చూడండి మేడమ్. తెలిసో తెలియకో పిచ్చిగా ప్రవర్తించాను. నా నోటి వాక్కో, అతని ప్రారబ్ధమో, ఈ రోజుకి అతను మంచం మీదే వున్నారు. అతను నాట్యం మానుకోవడంవల్ల, రాబడిలేక, మాకుటుంబం నానా కష్టాలు పడింది, ఉన్నవన్నీ అమ్ముకున్నాం. మా అత్తగారూ, మామగారూ ఆ బాధలోనే కన్నుమూశారు మరో మార్గం లేక జీవనోపాధికి, నేను సరదాగా నేర్చుకున్న సంగీతం అడ్డుపడింది. మేడమ్! మీరు చిన్నవారు. జీవితంలో ఇంకా ముద్దూ ముచ్చటా చూడనివారు. చేతులు కాలిపోకముందే ఆకులు పట్టుకోవడం మంచిది. సంసారాన్ని సరిదిద్దుకోండి."   


    "ఇంకేం చెప్పకండి మిసెస్ రాఘవన్, ఇప్పటికే నా గుండె బద్ధలయిపోతోంది. రేపే పెందలాడే బయలుదేరి వెళతాను. ఆర్గనైజర్స్ కి చెప్పండి దయచేసి. నాకు తల తిరిగిపోతోంది. పడుకుంటాను" అంటూ లేచి వెళ్ళి మంచం మీద వాలిపోయింది.  


    ఎప్పుడెప్పుడు ఇంటి కొస్తామా ఎప్పుడెప్పుడు, మధన్ ని చూసి అతని కాళ్ళమీదపడి క్షమాపణ వేడుకుందామా అని ఎదురు చూసిన రాధికకి, ఇంటికి వేసి వున్న పెద్ద తాళం వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. జబ్బుగా వున్న మామగారు కూడా ఎక్కడికి వెళ్ళుంటారు 'చెప్పా పెట్టకుండా  అనుకుంటూ, పిచ్చిదానిలా దిక్కులు చూస్తున్న రాధికకి, పక్కింటి అబ్బాయివచ్చి "మీ మామగారిని నెల్లూరు తీసికెళ్ళారు.. గుండె ఆపరేషన్ చెయ్యాలట. ఈ తాళం చెవులు మీ కిమ్మన్నారు. అంటూ ఆమె చేతిలోపెట్టి వెళ్ళిపోయాడు. యాంత్రికంగా ఆ బాబుకోసం ఏమైనా ఉత్తరం రాసి పెట్టేడేమోనని పిచ్చిదానిలా కనపడ్డ కాగితం అల్లా విప్పి చూసింది. ఆశ నిరాశయ్యేటప్పటికి, మనసు మొద్దుబారి, శరీరం చెప్పు చేతల్లోలేక, కూలిపోయింది. రెండు గ్లాసులు నీళ్ళు తాగి, నీరసంతో మంచం మీద కూలిపోయింది.


    "మేడమ్ ఇప్పుడేం చేస్తారు? ఒంటరిగా ఎలా వుంటారు? పోనీ ఈ రాత్రికి మా ఇంటికి రండి" అంది సానుభూతితో మిసెస్ రాఘవన్.    


    "ఒద్దులే నేనెక్కడికీ రాలేను. నా ముఖం ఎవరికీ చూపించలేను. నన్నిలా ఒంటరిగా పోనివ్వండి" ఆవేశంతో ఏడవడం మొదలెట్టింది.     


    మిసెస్ రాఘవన్ కి ఏం చెయ్యాలో తోచలేదు. "ఈ పూటకి నేను మీతోటే వుంటాను మేడమ్" అంటూ కొంచెం హార్లిక్స్ కలిపి ఇవ్వడానికి లోపలికెళ్ళింది.


    వేడి వేడి హార్లిక్స్ తాగాక, మళ్ళీ మనసు ఆలోచించడం మొదలెట్టింది.


    "ఈ పూటకి నిద్రపోండి మేడమ్ సంగతులన్నీ రేపు చూసుకుందాం" అని ఓదార్చింది మిసెస్ రాఘవన్.


    "నేను భోజనం చెయ్యనన్నానని, మీరూ మానేస్తున్నారు. అసలే నావల్ల మీకు ఎంతో శ్రమ కలుగుతోంది. పైగా ఈ పస్తులు కూడానా! దయచేసి వంట చేసుకోండి. లేదా, ఆ పక్కింటి బాబుచేత కారియర్ తెప్పించుకోండి..... ప్లీజ్ అంది రాధిక.  


    "వద్దు మేడమ్ ఏ మాత్రం ఆకలిగా లేదు. నేనూ హార్లిక్స్ తాగుతాను. అంటూ హార్లిక్స్ కలుపుకుంది. కన్ను పొడుచుకున్నా నిద్దరపట్టని కాలరాత్రి అది. బుర్రనిండా రకరకాల ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ వుంటే, ఆ రాత్రి శివరాత్రే అయింది. ఆ మర్నాడే నెల్లూరు వెళ్ళడానికి నిశ్చయించుకుంది రాధిక.    


    మిసెస్ రాఘవన్ కూడా ఆమె ప్రయాణాన్ని సమర్థించింది. ఇలా బయలుదేరి వస్తున్నట్టు ముందు మధన్ కి నెల్లూరు హాస్పటల్ కి ఫోన్ చేద్దామనుకుంది రాధిక. మళ్ళీ వద్దులే సడన్ సర్ ప్రైజ్ ఇద్దాం అనుకుని ఆ ప్రయత్నం మానుకుంది. ఒక వెయ్యి రూపాయలు ఖర్చులకోసం వుంచుకుంది. మద్రాసు నుంచి డైరెక్టుగా నెల్లూరికి టాక్సీ మాట్లాడుకుంది. భర్తని చేరబోతున్నానన్న తృప్తి వొకవంకా మామగారి పరిస్థితి ఎలా వుందోనన్న భయం ఒక వంకా గజిబిజిగా వుంది మనసు. మిసెస్ రాఘవన్ దగ్గర వీడ్కోలు తీసుకుని టాక్సీ ఎక్కింది రాధిక.


    అదృష్టాన్ని అడ్డగించేవాడు దురదృష్టాన్ని తొలగించేవారూ లేరంటారు. రాధిక దురదృష్టం ఆమెతోపాటు ప్రయాణం చేసింది. ఆమె ఎక్కిన టాక్సీ ఊరు దాటకుండానే బస్సుతో ఢీకొంది. కారులోంచి దభాలున కిందపడ్డ రాధిక తలకి గాయాలు తగిలి స్పృహ కోల్పోయింది. టాక్సీవాడు మెలుకువతో, అవతలకి దూకేయడం వల్ల గాయాలు తగలలేదు కానీ కాలు ప్రాక్చర్ అయింది గుంపుగూడిన జనలోంచి 'డాన్సర్ రాధిక' అంటూ ఎవరో కారులో ఎక్కించుకుని పోలీసు వాళ్ళ సహాయంతో హాస్పిటల్లో చేర్పించారు. పోలీసు వ్యానులో టాక్సీ ఆ డ్రైవరును కూడా హాస్పిటల్ కి పంపించారు. బస్సు డ్రైవరుని ఓవర్ స్పీడుకి, అరెస్టు చేసి పోలీసు స్టేషనుకి పంపించారు.

 Previous Page Next Page