Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 40


    "వద్దండీ! అమ్మాయికి మంచి కుర్రాణ్ణే చూడండి. డబ్బు లేకపోయినా ఫరవాలేదు. మనకుంది చాల్దూ? అబ్బాయి ఇక్కడికే వచ్చి ఉండేవాడిగా చూడండి" అంది పున్నమ్మ.

 

    "అంటే ఇల్లరికం వచ్చేవాణ్ణి చూడమంటావ్?" అన్నాడు మాధవయ్య సాలోచనగా తలపంకిస్తూ.

 

    చాటుగా వుండి అత్తమామల సంభాషణ వింటూన్న సుందరమ్మకు, అలా వినే అలవాటున్న చాలామందికి మల్లేనే అన్ని మాటలూ స్పష్టంగా వినిపించలేదు. మధ్య మధ్య రీల్ తెగిపోయే సినిమా చూస్తున్నట్లు చిరాకు వేసింది. కాని అసలు మాట 'ఇల్లరికం' స్పష్టంగానే వినిపించింది.

 

    సుందరమ్మకు గుండెలో రాయి పడింది. పెళ్ళయితేనన్నా ఆడబిడ్డ ఖర్చు తగ్గుతుంది అనుకుంది. జీవితమంతా ఆడబిడ్డ పోరు తప్పదన్నమాట? సుందరమ్మ ఆ వార్త తోడికోడళ్ళ చెవుల్లో ఊదటానికి చరచరా అక్కడ్నుంచి కదిలి దొడ్లోకి వెళ్ళింది.

 

    తోడికోడళ్ళు గుసగుసలాడారు. గుండెలు బాదుకున్నారు.


                                                                   6


    బాలనాగమ్మకు సంబంధాలు చాలా వచ్చాయి. కాని అవి తండ్రికి నచ్చితే తల్లికి నచ్చేవికావు. తల్లితండ్రికి నచ్చితే పెద్దన్నకు నచ్చేవి కావు. మొత్తంమీద కారణం ఏదయినా బావమరిదిని ఇల్లరికం తెచ్చుకోవడం సుబ్బారాయుడికి నచ్చలేదు. ఒకరోజు నాగభూషణం అననే అన్నాడు అన్నతో_

 

    "ఏంటన్నయ్యా, నాన్నకు మరీ మతిపోతున్నట్లుంది. నలుగురు కొడుకులున్న ఇంటికి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవడం ఏమిటి?" నాగభూషణం ఆ మాత్రం ధైర్యం చెయ్యడానికి భార్య సుందరమ్మే కారణం అని గ్రహించాడు సుబ్బారాయుడు.

 

    నాగరత్నం కూడా ఆ విషయం సుబ్బారాయుడి దగ్గిర ఎత్తింది. కాని సుబ్బారాయుడు నొసలు చిట్లించటం చూసి నోరు మూసుకొని వుండిపోయింది.

 

    "నువ్వన్నా నాన్నతో మాట్లాడకూడదూ?" మళ్ళీ నాగభూషణమే అన్నాడు.

 

    "ఏం మాట్లాడను! ఆయన పెద్దవాడు. ఆయనకు ఆ మాత్రం ఆలోచన లేకపోతే మనం ఏం చేస్తాం?" అన్నాడు సుబ్బారాయుడు విసుగ్గా.

 

    అంతకుముందే ఇంట్లో కాలుపెట్టిన మాధవయ్య కొడుకుల సంభాషణ విన్నాడు. గిర్రున తిరిగి బయటకు వచ్చాడు.

 

    తండ్రిని చూసి తమ సంభాషణ విన్నాడేమోనని గతుక్కుమన్నారు అన్నదమ్ములు.

 

    అవును నిజమే! తన కొడుకులు ప్రయోజకులయ్యారు. పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ ఇష్టాలకు కూడా గౌరవం ఇవ్వాలి.

 

    ఆ నిముషంనుంచే మాధవయ్య మనస్సు నుంచి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలనే భావం తప్పుకుంది. పున్నయ్యతో మాత్రం ఆ విషయం చెప్పలేదు.

 

    పెళ్ళి సంబంధాలు చూస్తున్నప్పటినుంచి నాగమ్మ బట్టలకూ, నగలకూ అయ్యే ఖర్చుల్ని చూసి కోడళ్ళు గుసగుసలు ప్రారంభించారు గుసగుసలు సణుగుడులోకి వచ్చాయి. కానీ పున్నమ్మ యివేవీ ఖాతరు చేసేది కాదు.

 

    కూతురు విషయంలో మాధవయ్యకు పున్నమ్మ ఎంత చెబితే అంత! మరి కాదూ? ఒక్కగానొక్క ఆడపిల్లాయె! అసలు కూతురు నడిస్తేనే కాళ్ళెక్కడ అరిగిపోతాయో నన్నట్లుండేది మాధవయ్యకు.

 

    "ఎంత ఉంటే మాత్రం ఇంత గారాబమా?" అంటూ ఇరుగు పొరుగు అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకొనేవారు.

 

    ఇంటి కోడళ్ళు యిక సరేసరి! "ఈ చోద్యం భూమ్మీద ఎక్కడా చూడలేదమ్మా!" అంటూ రోజుకోసారయినా నాగమ్మను చూసి నాగరత్నం మెటికెలు విరిచేది.

 

    రెండో వదినా, మూడో వదినా పిల్లిమీదా కుక్కమీదా పెట్టి ఎత్తిపొడుపు మాటలు పున్నమ్మ వినేలాగే మొదలుపెట్టారు. పున్నమ్మ విని బాధపడేది. కాని నోరు తెరిచేది కాదు. కొడుకులు వింటే పెళ్ళాలతోళ్ళు ఒలిచేస్తారని పున్నమ్మకు తెలుసు.

 

    తన కొడుకులు అందరిలాంటివారు కాదు. తల్లిమాటన్నా తండ్రిమాటన్నా గౌరవం కలవాళ్ళణి ఆమె నమ్మకం. అందుకే కోడళ్ళ అభిప్రాయాలను ఆమె ఖాతరు చేసేది కాదు.

 

    ఒకనాడు సాయంత్రం పున్నమ్మ వసారాలో కూర్చుని లాంతర్లు తుడుస్తోంది. నాగమ్మ చిన్నగా వెళ్ళి పక్కనే కూర్చుంది.

 

    "ఏం తల్లీ!" అంది పున్నమ్మ లాంతరుగ్లాసు ముగ్గుతో రుద్దుతూ.

 

    "అమ్మా మరేమో! నా స్నేహితురాలు శాంత లేదూ! దానికేమో సంబంధం కుదిరిందే!" అంది నాగమ్మ తల్లి కొంగును వేలికి చుట్టుకుంటూ.

 

    "పిచ్చిపిల్లా! నీకూ త్వరలోనే కుదురుతుందిలే. నాన్న ఆ ప్రయత్నంలోనే వున్నారు. నా బంగారానికి ఏం తక్కువ? సంబంధాలు కోకొల్లలుగా రావూ?" అంది పున్నమ్మ కూతురివైపు మురిపెంగా చూస్తూ.

 

    "పోవే నువ్వొకదానివి. సరిగా వినకుండానే మాట్లాడేస్తావు" గునిసింది నాగమ్మ.

 

    "నా తల్లే! చెప్పు వింటాను."

 

    "అమ్మా! మరేమో!"

 

    "చెప్పమ్మా! సందేహం దేనికి?" అంది పున్నమ్మ ఆప్యాయంగా.

 

    "శాంతను ఇవ్వబోయే అబ్బాయి స్కూల్ ఫైనల్ పాసయ్యాడంట. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడంట!" అంది నాగమ్మ.

 

    ఆమె స్వరంలో శాంత ఎంత అదృష్టవంతురాలో, నాకు కూడా అలాంటి అదృష్టం లభిస్తే బావుణ్ణు అనే భావం సూచనగా తోచింది పున్నమ్మకు.

 

    చేస్తున్న పని ఆపి పున్నమ్మ కూతురి ముఖంలో దేన్నో చదవటానికి ప్రయత్నించింది.

 

    అర్ధం అయినట్లు తనలో తనే పొంగిపోయింది.

 

    చిరునవ్వుతో అంది: "నా అమ్మే! నీ మనసులో ఏముందో పాపిష్టిదాన్ని ఇంతకాలం తెలుసుకోలేకపోయాను. నాన్నతో ఇవ్వాళే చెబుతాను. ఆస్థి ఉన్నా లేకపోయినా నీకు బాగా చదువుతున్న మొగుణ్ణి తెస్తాం." మురిపెంగా అన్నది పున్నమ్మ.

 

    "పోవే నువ్వు మరీను! నేను అలాగన్నానేం?" ఎవరో చక్కలిగింతలు పెట్టినట్లు కిలకిల నవ్వుతూ అక్కడినుంచి పారిపోయింది బాలనాగమ్మ.

 

    అలా వెళుతున్న కూతుర్ని చూస్తూ మురిసిపోయింది పున్నమ్మ.

 

    ఆరాత్రి భర్తతో పున్నమ్మ "ఇది విన్నారా?" అంది.

 

    భార్య ఏ విషయం చెబుతుందో అర్ధంకాని మాధవయ్య "ఏమిటి?" అన్నాడు.

 

    "అదేనండి! అమ్మాయి విషయం!"

 

    అమ్మాయి విషయం అనగానే సర్దుక్కూర్చుని శ్రద్ధగా వినసాగాడు మాధవయ్య.

 

    "అమ్మాయికి చదువుకున్నవాణ్ణి చేసుకోవాలని ఉందండీ!"

 

    మాధవయ్య విస్మయంగా చూశాడు.

 

    "నిజమేనండీ! నా చిట్టితల్లిని చదువుకున్న కుర్రాడికి ఇవ్వాల్సిందే! ఆఁ ఏమనుకున్నారో! సెంటు పొలం లేకపోయినాసరే!"

 

    "అలా అని అమ్మాయి నీతో చెప్పిందా!" నోరు తెరిచాడు మాధవయ్య.

 

    "నా పిచ్చి తల్లికి ఎంత సిగ్గో! అలా చెప్పిందా! నేనే నా బిడ్డ మనసు తెలుసుకున్నాను" అంది పున్నమ్మ గర్వంగా.

 

    ఆ సాయంత్రం నాగమ్మకూ, పున్నమ్మకూ మధ్య జరిగిన సంభాషణను థు.చ.తప్పకుండా భర్తకు వినిపించింది.

 

    భర్త ఆలోచనలో పడటం చూసిన పున్నమ్మ తన నిశ్చయాన్ని ఖరాఖండీగా చెప్పేసింది.

 

    "ఏది ఏమయినా, ఆరు నూరయినా నా బిడ్డను చదువుకున్నవాడి కివ్వాల్సిందే!" పున్నమ్మ స్వరం ఖంగ్ మంది.

 

    "నేను మాత్రం కాదన్నానా? కాకపోతే చదువుకున్న వాడెవడూ నీ ఇంటికొచ్చి ఇల్లరికం వుండి గోళ్ళు గిల్లుకుంటూ ఈ పాలెంలో పడి వుండడు" అన్నాడు మాధవయ్య భార్య ముఖంలోకి నిశితంగా చూస్తూ.

 

    ఈసారి ఆలోచించటం పున్నమ్మ వంతయింది. కూతురు తనకు దూరం అయిపోతుందేమోనన్న భయం, బాధా ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

 

    "పోనియ్ లెండి! దాన్ని ఒదిలి ఉండకపోతే మనమే వెళ్ళి దాని దగ్గిర పడివుందాం!"

 

    దశరథ మహారాజులా నలుగురు కొడుకుల్ని పెట్టుకుని నన్ను అల్లుడింట్లో పడివుండమంటావా?" అన్నాడు భార్యను ఎగతాళిచేస్తూ మాధవయ్య.

 

    పున్నమ్మ జవాబివ్వలేదు.

 

    "చదువుకున్నవాళ్ళు ముఖ్యంగా మనలో కట్నాలు యెక్కువ అడుగుతారు" అన్నాడు మాధవయ్య దిగాలుపడిపోయి.

 

    "అడిగితే ఇద్దాం-దానికంటే యెక్కువేమిటి? ఆఁ చూడండి మన అమ్మాయికి అత్తపోరు ఆడబిడ్డలపోరు వుండకూడదు. నేనే దాన్ని కనిపెట్టుకొని పడివుంటా. నా తల్లి కోడరికం చెయ్యలేదు."

 

    "బాగానే వున్నాయి నీ గొంతెమ్మ కోరికలు!" అన్నాడు మాధవయ్య కొంచెం విసుగ్గా.

 

    "మీ కంత విసుగ్గా వుందా నా చిట్టితల్లి జన్మ!" పున్నమ్మ కంఠంలో దుఃఖం పొంగుకొచ్చింది.

 

    "ఎంత మాటన్నావే! అమ్మాయి సుఖపడటంకంటే నాకు కావాల్సిందేమిటి? నా శాయశక్తులా మన అమ్మాయికి అన్ని విధాలా తగిన సంబంధమే తేవటానికి ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడే వున్నాడు."

 

    ఆనాటినుంచి మాధవయ్య చదువుకున్న కుర్రాడికోసం గాలించటం మొదలుపెట్టాడు.

 

    ఆ రోజు సాయంకాలం కనుచీకటి పడుతోంది.

 

    మాధవయ్య అప్పుడే ఊరునుంచి వచ్చి వసారాలో వున్న మంచం వాల్చుకొని కూచున్నాడు.

 

    మనిషి చాలా డీలా పడి వున్నాడు. భార్య పున్నమ్మ ఉత్సాహంగా వచ్చి మంచం పక్కగా కూర్చుంది. పున్నమ్మ అందించిన మంచినీళ్ళు గడగడా తాగి, దోసకాయచెంబు భార్యకు అందించాడు.

 

    పున్నమ్మ చెంబు అందుకుంటూ భర్త ముఖంలోకి చూసింది. మాధవయ్యలో ఉత్సాహం కనిపించక పున్నమ్మలో ఆదుర్దా బయలుదేరింది.

 

    "ఏమండీ!"

 

    "ఆఁ."

 

    "ఏమయిందండీ?"

 

    "ఆఁ ఏమౌతుంది?"

 

    "అంటే! ఈ సంబంధం కూడా లాభం లేనట్లేనా?"

 

    "ఆఁ లేనట్లే" అన్నాడు మాధవయ్య ఏదో ఆలోచిస్తూ.

 

    "ఏం? పిల్లవాడు బాగా లేడా?"

 

    "పిల్లవాడికేం? చాకులా వున్నాడు. చాలా చక్కనివాడు."

 

    "మరి బి.ఏ. చదువుతున్నాడన్న మాట అబద్ధమా?"

 

    "బి. ఏ. ఏం ఖర్మ. ఎం. ఏ. పరీక్షలు రాశాడు." నీరసంగా వుంది మాధవయ్య కంఠం.

 

    "మరి! వాళ్ళు మనతో సంబంధం చెయ్యరా?"

 

    "ఎందుకు చెయ్యరు?"

 

    "అమ్మయ్య! బలే భయపెట్టేశారు. అమ్మాయికి ఈ సంబంధమే చెయ్యండి." ఉత్సాహంగా అన్నది భార్య.

 

    "తలకు మించిన పని! మనం తూగలేం."

 

    "అంటే?" ఆదుర్దాగా ప్రశ్నించింది.

 

    "అంత కట్నం మనం పొయ్యలేం." దూరంగా చూస్తూ నిదానంగా అన్నాడు మాధవయ్య.

 

    "ఎంతడిగారేమిటి?" ఎంతయినా ఈ సంబంధం చేసి తీరాల్సిందే నన్నట్టుంది పున్నమ్మ స్వరం.

 

    "పన్నెండు వేలకు దమ్మిడీ తగ్గరట!"

 

    "పన్నెండు వేలే!" గుడ్లు తేలేసింది పున్నమ్మ.

 

    "సరే, నీళ్ళు తోడు" అన్నాడు మాధవయ్య చొక్కా విప్పుకుంటూ.    

 

    తలుపు చాటున నిలుచుని తల్లిదండ్రుల సంభాషణ వింటున్న బాలనాగమ్మకు ఎవరో పీక నొక్కుతున్నట్లణిపించింది.

 

    ఇంతసేపూ, తల్లి ఎంత కట్నమయినా సరే ఆ సంబంధమే చెయ్యాలని పట్టుపడుతుందని ఆశించిన బాలకు అలా పున్నమ్మ పలక్కుండా వెళ్ళిపోవటంతో ఏడుపొచ్చింది.

 

    ఏమయినాసరే ఎం. ఏ. చదివే అబ్బాయినే తను చేసుకుంటుంది. 'చాకులా వున్నాడు కుర్రాడు. అందమైనవాడు కూడా!' తండ్రి మాటలు నాగమ్మ చెవిలో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. ఏమయినాసరే తను ఆ అబ్బాయిని చేసుకుంటుంది. లేకపోతే అసలు పెళ్ళే చేసుకోదు. ఎం. ఏ. చదివే అబ్బాయిని ఊహించుకుంటూ గుంజకు చేరబడి కూచుంది నాగమ్మ.

 

    మాధవయ్య స్నానంచేసి భోజనానికి వచ్చి పీటమీద కూచున్నాడు. పున్నమ్మ అన్నం పళ్ళెం ముందు పెట్టింది- ఎదురుగా గోడ కానుకుని కూచుంది. అంతవరకూ ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు. ఇద్దరూ ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి రాలేక సతమతమవుతున్నారు.

 

    "ఏమండీ! ఆ అబ్బాయికి తల్లీదండ్రీ ఉన్నారా? జమీందారీ ఫాయటగా!" అంది పున్నమ్మ ఇంతింత కళ్ళు చేసుకొని.

 

    "అవును, జమీందారీ ఫాయేనట. తండ్రి చిన్నప్పుడే పోయాడు తల్లి కూడా నాలుగేళ్ళనాడు పోయిందట. పిల్లాడు చిన్నప్పటినుండి మేనమామ ఇంట్లోనే పెరిగాడు."

 

    "ఐదువేలు యిస్తామని అడిగి చూడకపోయారు?"

 

    "అన్నీ అడిగాను. ఆ మేనమామ పెళ్ళాం పన్నెండు వేలకు దమ్మిడీ తగ్గనంది. మొదట ఇరవై వేలు అడిగారు! పిల్లవాణ్ణి ఇంతవాణ్ణి చెయ్యటానికి ఇలాంటి ఎన్ని పన్నెండు వేలు ఖర్చు పెట్టామో మీకేం తెలుసు అంది ఆవిడ."

 

    "మన అమ్మాయికి అన్ని విధాల తగిన సంబంధమండీ!"

 

    "సెంటు పొలం లేదు. పైగా అతని పేరుమీద చదువుకోసం చేసిన కొద్దో గొప్పో అప్పుకూడా ఉందని వినికిడి" అన్నాడు మాధవయ్య ఏదో ఆలోచిస్తూ.

 

    "అంత చదువుకున్నాడుకదా! రేపు ఏ కలకటేరో అయితే ఇలాంటి అప్పులు ఒక లెక్కా జమా! ఇంకో సంగతి! అమ్మాయికి అత్తా ఆడబిడ్డల పోరుకూడా వుండదు."

 

    "అవుననుకో!" మాధవయ్యకు అంతకంటే యేమనాలో కూడా తోచలేదు.

 

    "ఇంకోటికూడా విన్నాను. వాళ్ళ బంధువర్గంలో ఒకావిడ పదెకరాలకు పైగా వున్న ఆస్తి, ఈ ఆబ్బాయికే ఇస్తుందటగా?"

 

    "ఇస్తుందటలే. కాని యిప్పుడు పన్నెండువేలు నేను యెక్కడినుంచి తేను? ఇప్పుటికే నిక్షేపంలాంటి పదెకరాల మాగాణి అమ్మేశాము. మరో అయిదు యెకరాలు అమ్మితేగాని, అల్లుడి కట్నం, పెళ్ళి ఖర్చులకు సరిపోదు. మాధవయ్య అన్నం ముగించి చెయ్యి కడుక్కోవటానికి లేచాడు."

 Previous Page Next Page