"ఏమండీ! ఏమంటారూ?" అంది పున్నమ్మ భర్తకు చెయ్యి తుడుచుకోవటానికి తువ్వాలు అందిస్తూ.
"ఏమిటి అనేది?" చెయ్యి గట్టిగా తుడుచుకున్నాడు.
"నాకు ముమ్మాటికీ యీ సంబంధం నచ్చింది."
"నచ్చడానికేం? నాకూ నచ్చింది. కాని పన్నెండువేలు ఎక్కడ నుంచి తెచ్చి......."
"ఉన్నదాంట్లోనే! తప్పుతుందా ఏమిటి? మనకు మాత్రం ఏ పదిమంది ఆడపిల్లలు వున్నారు గనుక? ఒక్కగానొక్క ఆడపిల్ల. అయినా మీదంతా చాదస్తం. రేపు ఏ కలకటేరో కాబోయే కుర్రాడు. ఆమాత్రం కట్నం తీసుకోకుండా ఎట్లా చేసుకుంటాడేం? ఏమయినా ఈ సంబంధం పోగొట్టుకోవటం నాకు సుతరాం యిష్టంలేదు" అంది పున్నమ్మ మొండిగా.
"నాకు మాత్రం యిష్టమా యేమిటి?" అనుకున్నాడు మాధవయ్య మనస్సులోనే! "సరే, నీ యిష్టం వచ్చినట్లే కానియ్యి" అన్నాడు.
"మనమ్మాయి అదృష్టవంతురాలు" అంది పున్నమ్మ ఆనందంగా.
పడమటింట్లోనుంచి తల్లిదండ్రుల సంభాషణ విన్న బాలనాగమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. ఎం. ఏ. చదివి కలెక్టరు కాబోయే మొగుడూ పన్నెండువేల కట్నం బుర్రలో గజిబిజిగా తిరిగాయి.
బాలనాగమ్మకు ఆ వార్త ఎవరికైనా చెప్పాలని వుంది. పాడాలని వుంది. ఆడాలని వుంది. మనస్సులోనే ఆనందాన్ని అణచుకోలేకుండా వుంది. గొడ్లచావిట్లోకి పరుగుతీసింది.
బాలనాగమ్మకు చిన్నప్పటినుంచి ఆవుదూడలతో ఆడుకోవటం సరదా. వాటికి సినిమాతరాల పేర్లు పెట్టుకొని ముద్దుగా పిల్చుకుంటుంది. అన్నిటికంటే చిన్నదయన పుల్లావు పెయ్యదూడ అంటే ఆమెకు మహాయిష్టం. దానికి ముద్దుగా 'జయ' అని పేరు పెట్టుకొన్నది. బాలనాగమ్మ జయ తలను తన గుండెలకు ఆనించుకుంటూ తన గడ్డాన్ని దాని తలమీద రుద్దుతూ అంది. "విన్నావా జయా? నాకు పెళ్ళి! ఎం. ఏ. చదువుకున్నాడు. ఆ అబ్బాయి కలెక్టరు కాబోతున్నాడు. నాన్న పన్నెండువేల కట్నం యిస్తున్నాడు. ఏమనుకున్నావో! మా ఆయన ఖరీదు పన్నెండువేలు."
ఆ రాత్రంతా బాలనాగమ్మ కలత నిద్రతోనే గడిపింది.
తెలిసీ తెలియని జ్ఞానంతో, దాంపత్య జీవితాన్ని వూహించుకుంటూ నిద్రలోకి, నిద్రనుంచి కలల్లోకి, కలల్లోనుంచి మెలకువలోకి జారిపోతూ ఆ రాత్రి గడిచింది.
ఆ రాత్రి పున్నమ్మ హాయిగా నిద్రపోయింది. మాధవయ్య నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతూ అర్దరాత్రిదాకా గడిపాడు.
"పన్నెండువేలు ఎక్కడనుంచి తేవటం? పెళ్ళి ఖర్చులకు చేతిలో కనీసం నాలుగు వేలన్నా వుండాలి. ఐదెకరాలు అమ్మక తప్పదు. తను కొడుకులకు అన్యాయం చెయ్యటం లేదుకదా? మరి తన చిట్టితల్లి సుఖపడాలంటే కొంత ఆస్థి అమ్మక తప్పదు. అన్నలు చెల్లెలు సుఖంకంటే వేరే ఏమీ కోరరు. వాళ్ళకు అదంటే ప్రాణం!"
పరిపరివిధాల ఆలోచిస్తూ ఆ రాత్రి ఎలాగో గడిపాడు మాధవయ్య.
ఆ రాత్రి నాగరత్నం అత్తమామల సంభాషణ విన్నది. పన్నెండువేలే? పన్నెండువేలు కట్నమా? గుండెలు బాదుకుంటూ వెళ్ళి తోడికోడళ్ళ చెవుల్లో వేసింది ఆ వార్త.
"ముసలోడికి బొత్తిగా మతిపోయింది. మన నోళ్ళల్లో మట్టికొట్టాలని చూస్తున్నాడు అంది ఆ వార్త విన్న రెండో కోడలు కమల.
"దాని పెళ్లి పెటాకులుగానూ" మెటికలు విరిచింది నాగరత్నం.
"ఇంతమందిని వుసురు పెట్టిన పాపం వూరికేపోదు" అంది చిన్నకోడలు సుందరమ్మ మూతి తిప్పుతూ.
"అసలు మనవాళ్ళు దేవయ్యలు కాబట్టే మన బతుకులు యిట్టా యేడ్చాయి. ఈ రాత్రి తాడో పేడో తేల్చుకుంటాను. పట్టించుకుంటాడా సరే, లేకపోతే పుట్టింటికి పోతాను!" చరచరలాడుతూ వెళ్ళింది కమల. కమలకు తన భర్త తనమాట వింటాడనే నమ్మకం వుంది.
కాని నాగరత్నానికీ సుందరమ్మకూ ఆ నమ్మకం లేదు.
నాగరత్నం గదిలోకి పోతూనే నిద్రలేచి కూచున్న పిల్లవాణ్ణి అనవసరంగా బాదింది. వాడు తారాస్థాయిని అందుకున్నాడు. ఏడుస్తున్న పిల్లవాణ్ణి చంకన వేసుకొని ఎన్నో తిట్టిపోసింది. ఇదంతా చూస్తూన్న సుబ్బారాయుడికి భార్య ధోరణి అర్ధం కాలేదు. ఆమె పిల్లాడిమీద పెట్టి తిడుతున్న తిట్లు వాణ్ణి కాదని అర్ధం చేసుకున్నాడు.
"ఏమిటే నీ గోల ఎందుకు వాణ్ణి అలా తిట్టిపోస్తావు?" అన్నాడు సుబ్బారాయుడు. ఆ తిట్టేది పిల్లవాడ్ని కాదని తెలిసికూడ.
"నీకు నేను యేంచేసినా గోలగానే వుంటుంది. మీ నాయన నా బిడ్డల నోట్లో మట్టికొడతాడు" అంది కసిగా నాగరత్నం.
"వాగబాక!" అన్నాడు విషయం అర్ధంగాని సుబ్బారాయుడు.
"నేను వాగకూడదు. మీ నాయన నా బిడ్డల చేతికి చిప్ప యివ్వాలని చూస్తుంటే కూడా నోరు తెరవకూడదు."
"ఏమిటే నీ యేడుపు? అదేదో సరిగా యేడువు."
"పన్నెండువేలు కట్నంపోసి మీ చెల్లెమ్మకు మొగుణ్ణి తెస్తాడంట ముసలోడు." మెటికెలు విరిచింది.
"నోరు ముయ్!" గర్జించాడు సుబ్బారాయుడు.
నాగరత్నం కుక్కిన పేనులా కిక్కుమనకుండా పిల్లాణ్ణి పక్కలో వేసుకొని పడుకుంది.
భార్యను కోప్పడ్డాడేగాని సుబ్బారాయుడికి కూడా ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు.
నిజంగానే ముసలాయనకు మతిపోలేదు గదా? అమ్మకు తెలియదు. ఆయన ఆమాత్రం ఆలోచించకపోతే తనేం చేస్తాడూ!
పక్క గదిలో "మీ అయ్య నిన్ను సన్నాసిని చేస్తాడు" అంది కమల భర్తతో.
రామదాసు బిత్తరపోయాడు. నోరు తెరిచి భార్యను చూశాడు.
"ధైర్యం వుంటే నీది నువ్వు పంచివ్వమని అడుగు!" అంది కమల రెచ్చిపోతున్న కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ.
"అడుగుతాలే! అసలు సంగతి చెప్పు" అన్నాడు రామదాసు.
"మీ చెల్లిలికి పన్నెండువేలు కట్నం పోసి పెళ్ళి వెలిగిస్తున్నారట?"
"పన్నెండువేలే!" గుడ్లు తేలేశాడు రామదాసు.
"నీలాంటి కొడుకులుంటే......." కోపంతో మాటలు పెగల్లేదు కమల కంఠం నుండి.
"మొగపిల్లల నోట్లో మట్టిగొట్టే అయ్యనూ, అమ్మనూ వీళ్ళనే చూశాను. నీది నువ్వు పంచుకుని వేరు కుండ పెట్టకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను" రామదాసు బలహీనత మీద దెబ్బకొట్టింది పెళ్ళాం కమల.
"రేపే తేల్చుకుంటాను, నువ్వేం బాధపడకు" అన్నాడు రామదాసు భార్యను దగ్గరకు తీసుకుంటూ.
ఎదురుగా వున్న గదిలో భర్తముందు మాట్లాడే ధైర్యంలేని సుందరమ్మ పెట్టె సర్దుకుంటూ కూచుంది.
"ఏమిటో విశేషం! సత్యభామాదేవిగారు పెట్టె సర్దుతున్నట్లున్నారు." నాటకంలోని సంభాషణా ధోరణిలో అన్నాడు నాగభూషణం. ఈమధ్య నాగభూషణానికి నాటకాల పిచ్చి పట్టుకుంది.
"మా అమ్మగారింటి కెళుతున్నాను." తలెత్తకుండానే అన్నది.
"కారణంబు?" నవ్వుతూనే ప్రశ్నించాడు నాగభూషణం.
"ఇక్కడ జరుగుతూన్న అన్యాయం చూస్తూ కూర్చోలేక." దూకుడుగా అన్నది సుందరమ్మ.
భర్త మెత్తగా మాట్లాడటంతో కొంత ధైర్యం కలిగింది భార్యకు.
"ఆ అన్యాయ మేమిటో సెలవివ్వుము దేవీ!" నవ్వుతూ అన్నాడు.
"మీకంతా ఎగతాళే, మీ అయ్య మీ చెల్లెలికి పన్నెండువేలు కట్నం యిచ్చి మొగుణ్ణి కొంటున్నారట" అంది కసిగా.
"ఉష్! అంతియేనా! నువ్వుకూడా నన్ను రెండువేలు యిచ్చే కొన్నావు గదటే ప్రేయసీ"
"మా పుట్టింటివాళ్ళతో మీకు పోలికా? మా నాన్న కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయటానికి అప్పు చెయ్యలేదు. మగపిల్లల నోళ్ళల్లో దుమ్ము కొట్టలేదు." దురుసుగా అంది సుందరమ్మ.
"ఊఁ యింకా?"
భర్త యింత సహనంతో వింటాడని వూహించలేని సుందరమ్మ ఆశ్చర్యపోయింది. భర్త ముఖంలోకి చూసింది. కోపచ్చాయలు ఎక్కడా కనిపించలేదు. 'ఫర్వాలేదు, బుద్ధి వచ్చినట్లుంది?' అనుకుంది. ఇంతకాలంగా భర్తముందు చూపించలేక అణచుకున్న అక్కసు, ఒక్కసారిగా నీళ్ళలో వేసిన సోడాలా బుసబుస పొంగింది.
"ఇంతకీ నాగమ్మ ఈ కొంప ఆర్పటానికే పుట్టింది" అన్నది.
మాట పూర్తికాకుండానే సుందరమ్మ చెంప చడెల్ మంది. ఉరుములు లేని పిడుగు పడింది. సుందరమ్మ కళ్ళు జిగేల్ మన్నాయి.
"నాగమ్మ నా చెల్లెలు. గుర్తుంచుకో!" అంటూ బయటకు వెళ్ళిపోయిన నాగభూషణం ఆ రాత్రంతా గొడ్లసావిట్లోనే నులకమంచం వాల్చుకుని పడుకున్నాడు.
నిద్రపట్టక కుక్కిమంచంలో రాత్రంతా కదులుతూనే వున్నాడు.
భార్యను కొట్టాడు.
కాని బుర్రలోకి ఆమె వదిలిన పురుగు ఒకవైపు తొలుస్తూనే వుంది.
7
నాగమ్మ వివాహం నిశ్చయమయింది.
మాధవయ్య కూతురికి సంబంధించిన ఆ చివరి బాధ్యత కూడా సంతృప్తికరంగా నిర్వహించుకోదలచాడు.
విశాఖపట్నంలో ఎం. ఏ. చదివిన వెంకట్రావుకు పన్నెండువేల కట్నంతో పిల్లనివ్వటానికి నిశ్చయం జరిగింది. పెళ్ళి యింకా ఎన్నో రోజులు లేదు. పెళ్ళి పనులు ప్రారంభం అయ్యాయి.
పున్నమ్మ చేసే హడావిడికి అంతేలేదు.
మాధవయ్య పదెకరాల పొలం బేరం పెట్టాడు.
ఇంట్లో కలకలం బయలుదేరింది.
కోడళ్ళలో అశాంతి తలెత్తింది.
కొడుకుల్లో అసంతృప్తి పొడచూపింది.
ఉన్నట్టుండి మబ్బులేని వర్షంలా వచ్చాడు ఎక్కడనుంచో సత్యనారాయణ. సంబంధం విషయం విని చాలా సంతోషించాడు. తన తండ్రి చదువుకున్న కుర్రాడికి తన చెల్లెలిని ఇవ్వటానికి నిశ్చయించటం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. సత్యనారాయణ ఇంట్లో రేగిన అశాంతిని గ్రహించకపోలేదు. కానీ ఏమీ తెలియనట్లే వదినల్ని నవ్విస్తూ, చెల్లెల్ని ఉడికిస్తూ సరదాగా వున్నాడు. అతను ఏం చేస్తున్నాడో, ఎక్కడ వుంటున్నాడో తెలుసుకోవాలని వేసిన ప్రశ్నలకు సమాధానాలు చిరునవ్వుల రూపంలోనే ఇచ్చాడు.
నాగమ్మ చిన్నన్నయ్య అన్నం తింటుంటే, వడ్డిస్తున్న తల్లి పక్కనే కూచుంది.
"చిన్నన్నయ్యా!" సన్నగా మెత్తగా పిలిచింది.
"ఏం చెల్లీ!" ఆదరణగా అడిగాడు సత్యం.
"నువ్వు పట్నంలో ఉంటున్నావు గదా? ఏం చేస్తున్నావు? ఉద్యోగమా?"
సత్యానికి నవ్వొచ్చింది. "లేదమ్మా! నేను రాజకీయాల్లో పని చేస్తున్నాను."
"అంటే?"
"అంటే....దేశం కోసం....అంటే దేశప్రజల సౌఖ్యం కోసం.....నీ కర్ధం కాదులే...." అమాయకురాలైన చెల్లెలికి ఎలా చెప్పాలో అర్ధంకాక సత్యం సగంలోనే ఆగిపోయాడు.
"నీకు జీతం ఎంత ఇస్తారు?"
"నా ఖర్చులకు సరిపోయేటంత."
"కలెక్టరు ఉద్యోగం చేసేవాళ్ళకు." కళ్ళు పెద్దవి చేస్తూ ప్రశ్నించింది.
"అదా సంగతి? మరి ముందుగానే చెప్పవేం? కాబోయే కలెక్టరు గారి భార్యవు కాబోలు!" ఉడికిస్తూ అన్నాడు సత్యం.
"పో అన్నయ్యా!" గొణిగింది నాగమ్మ, తల్లి పమిట చెంగులో ముఖం దాచుకుంటూ.
"నా తల్లికి కలెకటేరు పెళ్ళాం కావాలని ఎంతగా వుందో పాపం! అది అడిగినదానికి జవాబు చెప్పరా!" అంది తల్లి.
"కలెక్టరంటే మామూలు ఉద్యోగం కాదు. చాలా పెద్ద ఉద్యోగం. జిల్లా కంతటికీ అధికారి. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాకు రాజు!" అన్నాడు సత్యం చెల్లెలివైపు ఆప్యాయంగా చూస్తూ.
"నిజమేరా నువ్వు చెప్పేది?" పున్నమ్మ కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
"నిజమేనమ్మా! అయితే మన చెల్లెమ్మ మొగుడు కలెక్టరువుతాడా అనే విషయం కొంచెం ఆలోచించాల్సిందే."
"తప్పకవుతాడు. ఎందుకు కాడు? నా తల్లి అదృష్టవంతురాలు!" అంది పున్నమ్మ కూతురు తల నిమురుతూ.
తల్లి అమాయకత్వానికి నవ్వొచ్చింది.
"ఏం చెల్లీ! ఎప్పుడయినా పోలీసులు నన్ను పట్టుకుంటే మీ ఆయనతో చెప్పి విడిపిస్తావా?" నవ్వుతూ ప్రశ్నించాడు సత్యం నాగమ్మను.
"అవేం మాటలురా! నిన్ను పోలీసులెందుకు పట్టుకుంటారు? నువ్వేం దొంగవా? ఖూనీకోరువా?" మందలిపుంగా అంది పున్నమ్మ. సత్యం నవ్వుకుంటూ లేచాడు చెయ్యి కడుక్కోటానికి.
అదే సమయంలో పొలం పోతున్న పెద్ద కొడుకుని ఉద్దేశించి అన్నాడు తండ్రి_
"దస్తావేజులమీద సంతకం పెట్టాలి మధ్యాహ్నం రిజిష్టారాఫీసు దగ్గరకు రా!"
వినపడ్డా వినపడనట్లే సుబ్బారాయుడు అరక కడుతున్నాడు.
"నీ కేరా చెప్పేది?!" తండ్రి రెట్టించాడు.
"వస్తాలే." గొణిగాడు సుబ్బారాయుడు చిరాగ్గా.
అంతవరకూ వాకిట్లో నిల్చున్న సుబ్బారాయుడి పెళ్ళాం "తండ్రికి చాలని వాజమ్మ" అనుకుంటూ లోపలికి వెళ్ళింది.
అన్నకు అరక కట్టటంలో సహాయం చేస్తూ అంతవరకూ జరిగిన సంభాషణలో తనకేం సంబంధం లేనట్టే ఉండిపోయాడు రామదాసు. అక్కడనుంచి చల్లగా తప్పుకుంటున్న రామదాసుని చూసి అన్నాడు మాధవయ్య_
"నువ్వు కూడా మధ్యాహ్నం రావాలి."
"ఎక్కడకు?" నిటారుగా నిల్చున్నాడు రామదాసు.
"ఎక్కడకేమిటి? రిజిస్ట్రాఫీసుకు."
"ఎందుకూ?" దూకుడుగా వచ్చిన ప్రశ్నకు ఓ క్షణం నివ్వెరపోయాడు మాధవయ్య.


