Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 39


    పున్నమ్మ అన్నం వడ్డించింది. మాధవయ్య, సుబ్బారాయుడు భోజనం చేస్తున్నారు. పున్నమ్మ ఎదురుగా కూచుని వాళ్ళకు ఏం కావాలో చూస్తూంది.

 

    "ఏమండీ! మీరు బొత్తిగా చిన్నవాడి సంగతే పట్టించుకోవటం లేదు. వాడి వాలకం నాకేం నచ్చలేదు" అన్నది పున్నమ్మ భర్త పళ్ళెంలో పులుసు వడ్డిస్తూ, నాగభూషణాన్ని చిన్నవాడనీ, సత్యాన్ని చంటివాడని అనటం అలవాటు పున్నమ్మకు.

 

    "రెండేళ్ళుపోతే వాడికే బాధ్యతలు తెలిసొస్తాయి. వీళ్ళిద్దరికీ నేను చెప్పానా? వీళ్ళకు చిన్నప్పటినుంచే పొలం పనులంటే సరదాగా వుండేది. కాని చిన్నోడి గుణమే వేరు" అన్నాడు మాధవయ్య.

 

    "అవునే, సత్తిగాడు యింకా రాలేదేం? మధ్యాహ్నం అన్నానికి రావడం లేదా?" మాధవయ్య మళ్ళీ అడిగాడు.

 

    "ఇవ్వాళ స్కూల్లో ఏదో సంబరం ఉందట. సాయంకాలం వాడు నాటకంలో వేషం కడతాటండీ! బాలను తీసుకొని చిన్నన్నయ్యను రమ్మనమ్మా అని చెప్పిపోయాడు" అంది పున్నమ్మ.

 

    "సత్యానికి బాగా చదువు చెప్పిద్దాం నాన్నా! వాడు బాగా పైకొస్తాడని కనిపించినప్పుడల్లా రత్తయ్య పంతులు అంటుంటాడు" అన్నాడు సుబ్బారాయుడు మజ్జిగ అన్నం కలుపుకుంటూ.

 

    "వాడు చదవాలేగాని నేనెందుకు చెప్పించనురా! మీకెవరికీ చదువు అబ్బనే లేదు."

 

    "వాడికి ఎంత తెలివో! ఒక్కోసారి దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉందండీ! సత్యం చదువుకొని కలకటేరు ఉద్యోగం చేస్తాడు. మీరట్లా చూస్తూ ఉండండి" అంది పున్నమ్మ భర్త కంచంలో మజ్జిగ వడ్డిస్తూ.

 

    మాధవయ్య ముసిమిసిగా నవ్వుకున్నాడు.

 

    "నిజమే అమ్మా! మన సత్యం చాలా గొప్పోడవుతాడు" అన్నాడు సుబ్బారాయుడు.

 

    "మన నాగమ్మ అదృష్టవంతురాలు. అది కలకటేరు చెల్లెలు కాబోతుంది. వాడికి కూడా అదంటే ప్రాణం. చిన్నప్పుడు దాన్ని ఎంత కాల్చుకు తినేవాడో, ఇప్పుడంత ప్రాణంగా చూస్తాడు" అంది పున్నమ్మ ఆనంద పారవశ్యంతో.

 

    "అవును, చిన్నప్పుడు వాడు దాన్ని బతకనిచ్చేవాడు కాదు. ఇప్పుడు అదంటే పడి చచ్చిపోతాడు" అన్నాడు మాధవయ్య.

 

    "మరే మర్చిపోయా! నా మతి మండిపోను! బసవయ్యగారి సుందరమ్మ వచ్చిందండోయ్!" అంది పున్నమ్మ.

 

    "ఎందుకంట?" అన్నాడు మాధవయ్య.

 

    "సుందర్రామయ్యగారి భార్య ఆమెను మనింటి కెళ్లి, ఎరగనట్టే మన పెద్దాడి పెళ్ళి విషయం కదిలించమన్నదట."

 

    మాధవయ్య అర్ధం కానట్లు చూశాడు.

 

    "అదేనండి, సుందర్రామయ్య రెండో కూతురు కూడా పెద్దమనిషయి యింట్లో వుందిగా!"

 

    సుబ్బారాయుడు చెయ్యి కడుక్కుని లేచాడు.


    
    "అదేంటిరా సుబ్బులూ! సరిగా తినకుండానే లేచావ్?" అంది పున్నమ్మ ఆదుర్దాగా. అప్పటికే సుబ్బారాయుడు అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

 

    మాధవయ్య పున్నమ్మ ముఖంలోకి అర్ధం అయిందా అన్నట్టు చూశాడు. పున్నమ్మ తన ధోరణిలోనే వుంది.

 

    "తూర్పు పొలంలో ఆరెకరాల మాగాణి పిల్లకిస్తారట!"

 

    "చాల్లే! ఆ విషయం మళ్ళీ ఎత్తకు" అన్నాడు మాధవయ్య విసురుగా. అర్ధంకాని పున్నమ్మ తెల్లముఖం వేసింది.

 

    "అంత నల్లపిల్లను కోడలుగా తెచ్చుకుంటావా? కోడలు నలుపైతే కులమెల్లా నలుపే అవుతుంది" అన్నాడు మాధవయ్య.

 

    "అదేంటండీ మరో చోద్యం! కాస్త పిల్ల నలుపైతేనేం? ఎరుపు కొరుక్కుతింటామా ఏం?"

 

    "సుబ్బులు ఎందుకనుకున్నావు అన్నం వదిలేసి పోయాడు? వాడికి ఆ పిల్లని చేసుకోవడం ఇష్టంలేదు."

 

    "చిన్నోడు వాడికేం తెలుస్తుందండీ మంచి చెడ్డలూ! పెద్ద కుటుంబం. ఊళ్ళో సంబంధం. మనకూ అండగా వుంటారు."

 

    "ఊఁహూఁ! ఇప్పుడు ఈ ఊళ్ళో నీకు అండకు తరుగైంది కాబోలు! అయినా ఇప్పుడే వాడి పెళ్ళికొచ్చిన తొందరేమిటి? వచ్చే సంవత్సరం చూద్దాంలే. అలా చూస్తుండు, నీకు చిలకలాంటి కోడల్ని తేస్తానో లేదో!" అంటూ మాధవయ్య చెయ్యి కడుక్కుని లేచాడు.

 

    పున్నమ్మ ఆలోచిస్తూ కూర్చుండిపోయింది.    


                                        4


    బాలనాగమ్మ వయసుతో పాటు ఇంట్లో ఖర్చుకూడా పెరిగింది. ఊళ్ళోకి వచ్చిన ప్రతి మూటా దింపించి, ప్రతి మంచి గుడ్డా కొనేది పున్నమ్మ కూతురికోసం.

 

    ఇష్టం అయినప్పుడు స్కూలుకు వెళ్ళేది నాగమ్మ. వెళ్ళి ఒక్క రోజే వారంరోజులు చదువు చదువుకొనేది. నాగమ్మ చాలా చురికైందని అంటుండేవాడు, రత్తయ్య పంతులు. ఇంటికొచ్చి నాగమ్మను పొగిడినప్పుడల్లా అతన్ని పున్నమ్మ వట్టి చేతులతో పోనిచ్చేదికాదు. ఏదో తృణమో, పణమో ముట్టజెప్పి పంపించేది.

 

    ఊళ్ళోకి రామశాస్త్రి వచ్చి సంస్కృతం బడి పెడితే మాధవయ్య నాగమ్మకు సంస్కృతం చెప్పించాడు. ఆ చదువు నాగమ్మకు ఎంతవరకు వంటబట్టిందనే సంగతి వేరే.

 

    సంవత్సరం తిరక్కముందే షావుకారు వెంకయ్యగారి ఏకైక పుత్రికకు గుంటూరు నుంచి ఓ సంగీతం మాస్టారు వచ్చి వారానికి మూడు రోజులు సంగీతం చెబుతున్నారని విని పున్నమ్మ కూతురికి హార్మోనియం చెప్పించింది. సంగీతం మాష్టారు యింటికొచ్చి నాగమ్మకు సంగీతం చెప్పేది అర్ధగంట అయితే నాగమ్మ గొంతునూ, నాగమ్మ పాటనూ పున్నమ్మ దగ్గర పొగడడానికి అర్ధగంట అయేది.

 

    పున్నమ్మ బలహీనత కనిపెట్టిన సంగీతం మాష్టారి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఏనాడూ సంగీతం మాష్టారు పున్నమ్మ ఇంటినుంచి వట్టి చేతులతో పోలేదు.

 

    ఇలా నాగమ్మకు ఏ చదువూ సరిగా వంటపట్టకపోయినా పున్నమ్మకి వూళ్ళో అందరి ఆడపిల్లలకన్నా తన కూతుర్ని ముందు నిల్చోబెట్టిందనే ఘనత దక్కింది.

 

    అలాగని మాధవయ్య దంపతులు మగపిల్లలకు అన్యాయం చేశారనడానికి కూడా వీల్లేదు.

 

    మాధవయ్య పెద్ద కొడుక్కు వైభవంగా వివాహం చేశాడు. మూడువేలు కట్నం, రెండెకరాల మాగాణి యిచ్చారు అత్తవారు సుబ్బారాయుడికి. పిల్ల చక్కంది. కాని కాస్త మాటకారి అనిపించింది.

 

    రెండోవాడికి మూడోవాడికి కూడా సంబంధాలు వస్తున్నాయి. చిన్నవాడు సత్యనారాయణ గుంటూరులో ఇంటర్ ఫైనల్ లో ఉన్నాడు.

 

    నాగమ్మకు ఏడేళ్ళు వచ్చేసరికి నిలవ డబ్బుతో సగమయిపోయింది. సుబ్బారాయుడి పెళ్ళితో పూర్తిగా అయిపోయింది.

 

    నాగామ్మకు పదకొండేళ్ళు వచ్చేటప్పటికి అప్పుడప్పుడు అప్పులు కూడా చేయాల్సి వచ్చింది.

 

    ఆడబిడ్డకోసం చేసే ఖర్చు చూస్తుంటే కోడలు నాగరత్నానికి ఒళ్ళు మండిపోయేది. కాని సుబ్బారాయుడి దగ్గర చెల్లెల్ని ఏమీ అనటానికి వీల్లేదని తెలుసుకొని లోలోన కుళ్ళిపోతోంది. ఉడికిపోతోంది.


                                                                    5


    చూస్తుండగానే కాలం ఇట్టే దొర్లిపోయింది.

 

    నాగమ్మకు పధ్నాలుగో సంవత్సరం వచ్చింది. పచ్చటి శరీరచ్చాయ, కోలమొహం, వెలుగులు చిందించే అందమైన సోగకళ్ళు, తుమ్మెద బారుల్లా నల్లని జుత్తు, హాసరేఖలను పొదివి పట్టుకున్నట్లుండే పెదవులూ, యౌవనపు మిసమిసల్ని వెదజల్లుతున్నట్లుండే చెక్కిళ్ళు, ఒయ్యారపు నడకా...... ఒక్క మాటలో చెప్పాలంటే నాగమ్మ ప్రబంధనాయకి లక్షణాలన్నీ సంతరించుకుందని చెప్పాలి.

 

    మాధవయ్యకు కూతురి పెళ్ళి గురించిన చింత బుర్రలో ప్రవేశించింది. మంచి సంబంధంకోసం గాలింపులు మొదలుపెట్టాడు.

 

    మాధవయ్య రెండో కొడుక్కూ, మూడో కొడుక్కూ కూడా పెళ్ళిళ్ళు చేసేశాడు. చిన్న కోడళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళే. పెద్దగా స్థితిగల కుటుంబం కాకపోయినా కుటుంబ గౌరవం చూసే మాధవయ్య నలభై ఎకరాల మాగాణి ముప్పై అయిదుకు దిగింది.

 

    చిన్నవాడు సత్యనారాయణ బి.ఏ. పూర్తిచేయకుండా రాజకీయాల్లో ప్రవేశించాడు. ఎక్కడెక్కడ తిరుగుతాడో తెలియదు. ఉన్నట్లుండి ఉప్పెనలా వచ్చి, ఆ వచ్చిన రెండు రోజులూ హడావిడీ, అల్లరీ చేసి, వెళ్ళేప్పుడు కొంత డబ్బు పుచ్చుకుని వెళ్ళిపోతాడు.

 

    ఇంట్లో సరదాగా చెల్లెలితో పసిపిల్లవాడిలా ఆడుకుంటూ, వదినలతో పరాచకాలు ఆడి నవ్వుతూ నవ్వించే, ముక్కు పచ్చలారనివాడు రాజకీయాల్లో ఏం చేస్తాడో ఎంత ఆలోచించినా మాధవయ్యకు అర్ధం అయేదికాదు.

 

    మాధవయ్య కొడుకుని నయానా భయానా మందలించి చూశాడు. పెద్ద చదువులు చదివి ఏ కలెక్టరో అవుతాడనుకొన్న కొడుకు తాడూ బొంగరం లేనివాడులా తిరగడం బాధ అనిపించేది. కాని పున్నమ్మ మాధవయ్యను వూరడించేది. పున్నమ్మకు తన చిన్నకొడుకు ఏనాటికయినా గొప్పవాడవుతాడనే నమ్మకం ఉంది. కలకటేరు కాకపోతేనేం? మంత్రి అవుతాడు!' అనుకొనేది. ఆ మాట భర్త దగ్గరంటే నవ్వేసి ఊరుకొనేవాడు.

 

    తల్లిదండ్రుల మాటలు విన్న నాగమ్మ "చిన్నన్నయ్య మంత్రి తప్పక అవుతాడు అని మనసులోనే మురిసిపోయేది.

 

    బాలనాగమ్మ ఆ ఇంట్లో రాణివాసం వెలగబోస్తూంది.

 

    దేవతలా అపురూపంగా చూడబడుతూంది.

 

    ఆ ఇంట్లో కూర కూడా నాగమ్మకు ఇష్టం అయిందే వండాలి. నాగమ్మ అచ్చటా ముచ్చటా చూస్తుంటే కోడళ్ళకు ఒళ్ళు మండిపోతుంది. కాని నోరు తెరిచే ధైర్యం ఎవరికీ లేదు. వారిలో బయలుదేరిన కలకలం ఆ ముగ్గురి మధ్యలో గుసగుసలు రూపంలోనే వుండిపోయింది.

 

    ఒక రోజు పెద్ద వదిన నాగరత్నం "నాగమ్మా! చూడు బాబు ఏడుస్తున్నాడు. నా చెయ్యి బాగాలేదు. కాస్త ఎత్తుకో" అంటూ ఆడబిడ్డను కేక వేసింది.

 

    "అదేమిటే నాగమ్మా అని పిలుస్తావు ఆడబిడ్డను?" అంది అక్కడే వున్న పున్నమ్మ.

 

    అర్ధంగాని నాగరత్నం ముందు తెల్లబోయింది. "పేరు నాగమ్మేగా! మరింకెలా పిలవాలి?" తెప్పరించుకొన్న నాగరత్నం ఇంతకాలంనుంచి మనస్సులోనే దాచుకున్న అక్కసును వెళ్ళగక్కింది.

 

    "ఆడబిడ్డను పేరుపెట్టి పిలవడం మన వంశ సాంప్రదాయం కాదు. ఆడబిడ్డ అర్ధమొగుడు. గౌరవం యివ్వాలి."

 

    "ఇంతకాలంగా పిలవంగా లేంది ఇవ్వాళేమొచ్చిందో!" గొణిగింది నాగరత్నం.

 

    "చిన్నపిల్లగా వున్నప్పుడు ఫర్వాలేదు. అదీ పెళ్ళీడుకు వచ్చింది."

 

    "నాగమ్మగారూ అనమంటారా?" ఎద్దేవ చేసింది నాగరత్నం.

 

    ఏనాడు లేంది కోడలు తనముందు అలా నోరు చేసుకోవటం పున్నమ్మకు ఆశ్చర్యాన్నీ, బాధను కూడా కలిగించింది. నాగరత్నం నోరు కాస్త దురుసే అయినా ఎదుటపడి ఎదిరించి ఎరగదు ఇంతవరకు.

 

    "అమ్మాయీ! అని పిలు" అంది కొంచెం కరుకుగానే పున్నమ్మ."

 

    "హు" అంటూ గబగబా అక్కడనుండి వెళ్ళిపోయింది నాగరత్నం. కిటికీలోనుంచి చూస్తున్న చిన్నకోడలు సుందరమ్మ తోడికోడలి ధైర్యానికి సంతోషించింది.

 

    "ఏమిటే అమ్మా! అది అంత దూకుడుగా లోపలికి పోతుంది." ముళ్ళుకర్ర చేతిలో పట్టుకుని అప్పుడే పొలంనుంచి తిరిగివచ్చిన సుబ్బారాయుడు సాలోచనగా నిల్చునివున్న తల్లిని ప్రశ్నించాడు.

 

    "అబ్బే ఏం లేదురా! నాన్న రాలేదా?" అంది పున్నమ్మ చిరునవ్వుతో. "తన కొడుకులు అందరిలాంటివారు కారు" అనుకుంది మనస్సులో.

 

    "నాన్న వస్తున్నాడు" అంటూ ముల్లుకర్ర మూలకు ఆనించి లోపలకు వెళ్ళాడు సుబ్బారాయుడు. తన భార్య తొందరపాటు మనిషని, ఏ మాత్రం తను చనువిచ్చినా ఆ ఇంట్లో శాంతి వుండదని భార్య కాపురానికి వచ్చిన కొత్తలోనే గ్రహించాడు. అందువల్ల ఇంతవరకు భార్యను భయభక్తుల్లోనే వుంచాడు.

 

    భర్తంటే నాగరత్నానికి చచ్చేంత భయం. భర్తకు కోపంవస్తే చేతికి ముల్లుకర్ర తీసుకుంటాడని ఆమెకు తెలుసు. అలా అయితే తోడికోడళ్ళమధ్యలో తను చులకనకాక తప్పదని తెలుసు. అందువల్లనే నాగరత్నం భర్త దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటుంది.

 

    ఆ రాత్రి పున్నమ్మ భర్తతో అంది గదా "ఏమండీ! మీరు అమ్మాయి విషయం పట్టించుకోకపోతే ఎట్లా?" అని.

 

    మాధవయ్యకు భార్య మాటలు వెంటనే అర్ధం కాలేదు. తన కూతురు విషయం పట్టించుకోవడం లేదా? తను కూతురు సంగతి పట్టించుకోకపోతే ఈ ప్రపంచంలో మరి ఎవరు ఎవర్ని పట్టించుకోగలరు?

 

    "అదేనండీ, అమ్మాయికి పెళ్ళీడు వచ్చిందిగా! సంబంధాలు ఇప్పటినుంచే చూడటం మంచిది."

 

    "ఓ అదా!" మాధవయ్య మనస్సు తేలికపడింది.

 

    "అంత తేలిగ్గా కొట్టేయకండి. వచ్చే వైశాఖానికి దానికి పద్నాలుగేళ్ళు కూడా నిండిపోతాయి."

 

    వంటిల్లు సర్ది తన గదివైపుకు పోతున్న చిన్నకోడలు సుందరమ్మకు అత్తగారి మాటలు కొద్దిగా చెవిలో పడి నిలబడిపోయింది. సుందరమ్మకు ఎవరయినా ఇద్దరు మాట్లాడుకుంటుంటే చాటునుంచి వినే అలవాటుంది.

 

    "అవును నిజమే!" అన్నాడు మాధవయ్య తన కింతవరకూ ఆ ఆలోచన ఎందుకు రాలేదా అనుకుంటూ.

 

    "ఊళ్ళో సంబంధం ఏదయినా చూస్తే బాగుంటుందేమో? అమ్మాయి మన కళ్ళముందే పడివుంటుంది" అంది పున్నమ్మ.

 

    "ఉంటే బాగానే వుంటుంది. కాని మంచి సంబంధం దొరకొద్దూ?"

 

    "భద్రయ్యగారి రెండోవాడు......"

 

    "ఆ వెర్రిబాగుల వాడికా? నీకు మతేమన్నా పోయిందా ఏమిటి? అమ్మాయి మన కళ్ళముందు ఉండాలని దాని గొంతు కొయ్యాలంటావు! అంతేనా?" రెట్టించాడు మాధవయ్య.

 

    "నేను అలాగన్నానా? నా తల్లి సుఖంకంటే నాకేం కావాలి?"

 

    "సరేలే! అంతలోనే ఏడుపు రావాలా ఏంటి? ఊళ్ళో సంబంధమే చూద్దాంలే" అన్నాడు మాధవయ్య.

 Previous Page Next Page