Previous Page Next Page 
మరీచిక పేజి 39


    శబరి లిండా ముఖంలోకి చూసింది.

 

    "ఇజ్రాయిల్ వాళ్ళు అందంగా వుంటారు. కాని చౌకబారుగా ప్రవర్తిస్తారు. వల్గర్ టంగ్!"

 

    శబరి వింటూ నిల్చున్నది.

 

    "పాకిస్తాన్ వాళ్ళకు బుర్రలేదు. ఆడవాళ్ళను ఆటబొమ్మలాగా చూస్తారు. చెరుకు పిప్పిని పీల్చినట్టు పీల్చి అవతల పారేస్తారు."

 

    శబరికి ఆ సంభాషణ నచ్చలేదు.

 

    "ఇండియన్స్..." ఆగి శబరి ముఖంలోకి చూసింది.

 

    శబరి ఏమీ ప్రశ్నించలేదు.

 

    "యువకులు - ఇండియన్ యువకులు కబుర్లరాయుళ్ళు. డబ్బు ఎంతయినా ఖర్చు చేస్తారు. ప్రేమకంటే ఈర్ష్య ఎక్కువ ఇండియన్స్ లో! నలభై దాటినవాళ్ళు వండర్ ఫుల్. వాళ్ళు చాలా ఆదరిస్తారు! ప్రేమిస్తారు. బాగా డబ్బు ఖర్చుచేస్తారు కాని హిపోక్రాట్స్!" ఆగి శబరి ముఖంలోకి చూసింది. "నేపాలీస్!"

 

    "వద్దు! చెప్పొద్దు! నాకు కాఫీ కావాలి!" అన్నది శబరి.

 

    హోటల్ కేసి నడుస్తూ వుండగా లిండా అన్నది.

 

    "రాత్రి నువ్వు ఎవరెవరితో..."

 

    "నో!నో! మాట్లాడకు!" అరిచింది శబరి.

 

    "నీకు ఈ జీవితం నచ్చలేదా?" ఆశ్చర్యంగా అడిగింది లిండా.

 

    "లేదు నేను వెళ్ళిపోతాను!"

 

    "వెళ్ళిపోతావా? ఎక్కడికి!"

 

    "ఇంటికి!"

 

    "ఇంటికా? మీ ఇండియన్స్ కు పిల్లల మీదకంటే సంప్రదాయాల మీద ఎక్కువ ప్రేమ అని విన్నాను. మీ వాళ్ళు నిన్ను మళ్ళీ రానిస్తారా?"

 

    శబరి ఉలిక్కి పడింది. ఆలోచనలో పడింది. తను వెళ్తే నాన్న రానివ్వడా? అమ్మ చేతుల్లోకి తీసుకొని గుండెలు అవిసిపోయేలా ఏడవదా? ఏమో! ఇంత పనిచేశాక. తీరా వెళ్లాక తనను ఇంట్లోకి రానివ్వకపోతే?

 

    "నువ్వు తిరిగివెళ్తే మీ వాళ్లు ఆదరిస్తారా?" లిండాను శబరి అడిగింది.

 

    ఓ! మీ ఇండియన్స్ లా మా వాళ్ళు సాంప్రదాయమో అని ఏడవరు. నేను ఇంటినుంచి వచ్చేసి పదమూడు నెలలైంది. ఇప్పుడు వెళ్ళినా ఆదరిస్తారు. లూసీ ఈ మధ్య రెండేళ్ళు హిప్పీగా గడిపి వెళ్ళిపోయింది. ముందు వాళ్ల అమ్మా నాన్నకు ఉత్తరం రాసింది. వాళ్ళే తిరిగి వచ్చెయమని రాశారు!"

 

    "మరి నీకు వెళ్ళిపోవాలని లేదూ?"

 

    "లేదు. నేను నిజమైన హిప్పీని. హిప్పీగానే మరణిస్తాను. అంతేగాని మళ్ళీ వెనక్కు వెళ్ళి ఒకసారి తిరస్కరించిన సమాజంలో రొటీన్ గా బతకడం నాకు ఇష్టంలేదు."

 

    శబరి ఆలోచిస్తూ వుండిపోయింది. ఈ భయంకరమైన జీవితంలో తను బతకలేదు. తను వెళ్ళిపోవాలి. ఈ రాత్రి బండికే వెళ్ళిపోతుంది. అమ్మా నాన్నా తిరస్కరించరు! తను వచ్చి రెండురోజులేగా అయింది! ఏదో కట్టుకథ అల్లి ప్రపంచానికి చెబుతాను. తనను తప్పక ఆదరిస్తారు. ఆదిత్యకిచ్చి పెళ్ళి చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఆదిత్యకు అనుమానం వచ్చి చేసుకోనంటే? మరొకర్ని చూస్తారు. డబ్బు వుంది. హోదా వుంది. తనకేం?

 

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"

 

    "నేను ఈ రాత్రి బండికే వెళ్ళిపోతాను."

 

    లిండా శబరి ముఖంలోకి చూస్తూ వుండిపోయింది.


                                                                25


    రమణమూర్తి పేపర్ని దూరంగా విసిరివేశాడు అప్పుడే లోపలకు వస్తున్న రఘురాం కాళ్ళముందు పడింది. రఘురాం ఆశ్చర్యంగా పేపరు కేసీ మూర్తికేసీ మార్చి మార్చి చూశాడు. రమణమూర్తి చూస్తున్నాడు. కాని అతని కళ్ళకు ఏమీ కన్పించడంలేదు. ఎదురుగా పడివున్న పేపరు రక్తంతో తడిసి వున్నట్లు ఎర్రగా కన్పిస్తోంది. రఘురాం వంగి పత్రికను చేతిలోకి తీసుకున్నాడు.

 

    "దాన్ని ముట్టుకోకు!" దాదాపు వెర్రివాడిలా అరిచాడు.

 

    "ఏమిటి? ఏమైంది?" రఘురాం మూర్తికి దగ్గరగా వచ్చి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.

 

    మూర్తి చూస్తూ వుండిపోయాడు.

 

    "మూర్తీ! ఏమిటలా చూస్తున్నావ్? అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా?" భుజంమీద చెయ్యివేసి ఊపాడు.

 

    "ఆఁఆఁ! నువ్వా కూర్చో!" మరో లోకంనుంచి బయటపడి అన్నాడు మూర్తి.

 

    "ఎందుకలా వున్నావ్?"

 

    "ఇవ్వాళ పేపరు చూశావా?"

 

    "లేదు! లేచిన దగ్గర్నించీ క్లయింట్సు వస్తూనే వున్నారు. మా ఆవిడ నువ్వు రాత్రి వచ్చి వెళ్ళావని చెప్పింది. కోర్టుకు వెళ్తూ ఇలా వచ్చాను."

 

    మూర్తి కళ్ళలో నీరు తిరిగింది.

 

    "ఏమైంది? అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా?"

 

    "కాదు" అన్నట్టు తల ఊపాడు.

 

    "మరి?"

 

    "ఆ పేపరు చదువు! వార్తలన్నీ... దారుణ మారణహోమం... ఏమిటో - మనం ఎటు వెళ్తున్నామో?" పొడిపొడిగా అన్నాడు మూర్తి.

 

    రఘురాం పేపరు విప్పారు. పెద్ద పెద్ద అక్షరాల్లో వున్న హెడ్డింగ్ మీద చూపు నిలిపాడు.

 

    "శ్రీకాకుళం నక్సలైట్ల అరాచకం!"

 

    "చామంతిపాడు గ్రామం షావుకారు మల్లినాయుడి దారుణ హత్య!"

 

    ఒకసారి పేపరుమీదనుంచి తల ఎత్తి మూర్తి ముఖంలోకి చూశాడు. మళ్ళీ వార్త చదవసాగాడు రఘురాం.

 

    "నక్సలైట్ నాయకుడు సూర్యం ఆధ్వర్యంలో మొన్నరాత్రి ఒక  ముఠా శ్రీమల్లినాయుడి ఇంటిపై దాడిచేసి ఆయనను దారుణంగా వధించింది. ఆ ముఠాలో ఇద్దరు స్త్రీలు కూడా వున్నారు. అందులో ఒకామె గిరిజన యువతి. రెండో యువతి స్టూడెంటు అని తెలుస్తూ వుంది. మల్లినాయుని భార్య లబోదిబోమంటూ యువతుల్ని వేడుకున్నదట! తన పసుపు కుంకుమ నిలబెట్టమని వారి కాళ్ళమీద పడిందట!

 

    "నాగోడు ఎవరికి చెప్పుకోమంటావ్? నా భర్తను పోలీసులు కాల్చి చంపేశారు. నీ మొగుడు నా బట్టలు విప్పి నన్ను అవమానించాడు. అలాగే అర్ధనగ్నంగా వెళ్ళి మా గురువుదగ్గర మొరపెట్టుకున్నాను. ఆనాడే నేను శపథం చేశాను. నీ భర్త ప్రాణాలు తీస్తేగాని నా గుండెల్లోని అగ్ని చల్లారదు" అన్నదట ఆ గిరిజన యువతి..

 

    రెండో యువతి మల్లినాయుడి భార్య నుదుటి కుంకుమను తుడిచి వేసిందట! మల్లినాయుడి శిరస్సును ఇంటిముందుర వేలాడదీశారు. స్టూడెంటుగా భావించబడుతున్న యువతి స్రవిస్తున్న రక్తంలో చెయ్యి ముంచి "మావో ఆలోచనా విధానం వర్ధిల్లాలి" అని గోడలమీద రాసిందట!

 

    మరొక యువకుడు ఇంట్లో దొరికిన ప్రామిసరీ నోట్లను అగ్నికి ఆహుతి చేశాడు. అతి దారుణంగా జరిగిన ఈ హత్యలో దాదాపు పదిహేనుమండి పాల్గొన్నట్టు తెలుస్తూ వుంది. నాయకుడు తప్ప మిగతావారంతా ఇరవై అయిదు ఏళ్ళ వయసులోపు వాళ్ళేనని తెలుస్తూ వుంది."

 

    "అన్యాయం! ఘోరం!" రఘురాం మూర్తి ముఖంలోకి చూశాడు.

 

    మూర్తి రఘురాం ఏ భాష మాట్లాడుతున్నాడో అర్థంకానట్టు చూస్తూ వుండిపోయాడు. రఘురాం చూపులు మరో వార్త మీద వాలాయి.

 

    కలకత్తా సంఘటనలు-

 

    కలకత్తా వార్తలు చదువుతూ వుంటే వళ్లు జలదరించిపోతున్నది. అక్కడి పౌర జీవితం దుర్భరంగా మారిపోయింది.

 

    "ఈవారంలో మొన్న శనివారం నుండి బుధవారందాకా, ఈ ఐదు రోజుల వ్యవధిలో, పోలీసులు కలకత్తా నగరంలో, వివిధ చోట్ల వివిధ పర్యాయాలు జరిపిన కాల్పుల్లో పదమూడు మంది నక్సలైట్లు మరణించారు. గాయపడినవారి సంఖ్య చెప్పే పనిలేదు.

 

    ఒక పోలీసు ఇన్ స్పెక్టరు డ్యూటీనుంచి రిక్షాలో రాత్రి ఇంటికి వెళ్తూ వుంటే నక్సలైట్లు కాచుకొని వుండి, ఆయన పైనబడి కత్తిపోట్లు పొడిచారు.

 Previous Page Next Page