"నన్ను క్షమించగలరా?" ప్రాధేయపడ్డాడు అజయ్.
"ఆ!" అంది.
"ఐతే ఇంకా ఆ కన్నీళ్ళెందుకు?"
మాధవి తలెత్తి అతనికేసి చూసింది. వెంటనే కళ్ళు తుడుచుకుంటూ.
"ఏమండీ! ఒక్కమాట చెప్పనా?" అంది.
"చెప్పండి" అన్నట్లు చూశాడు అజయ్.
"నేను నిజంగానే ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నాను" అంది.
ఉలిక్కిపడ్డాడు అతను. తాను ఏం వింటున్నాడో అర్థంకాక.
"కానీ చావు కూడా మన చేతిలో లేదు అని అర్థం అయింది. మీరొచ్చి అడ్డుపడ్డారు"
"నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు అజయ్.
"అవును. లేకపోతే ఆడపిల్లని వంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పండి"
"ఏమండీ! జీవితం జీవించడానికి కానీ చావడానికి కాదు"
"కానీ నా పరిస్థితిలో మీరుంటే?" ప్రశ్నించింది మాధవి.
"ఏమిటండీ ఆ పరిస్థితి" అడిగాడు అజయ్.
"రేపు సాయంత్రం గెస్టుహౌస్ దగ్గర పార్కుకు రండి"
"అలాగే"
"థాంక్యూ౧ నా ప్రాణాలు కాపాడినందుకు" అంది మాధవి. కాదు, మీకే థాంక్స్. నా పరువు నిలబెట్టినందుకు. నా బెట్ గెలిపించారు నవ్వుతూ అన్నాడు అజయ్.
"బైబై" అంది మాధవి.
"బై" అంటూ వచ్చేశారు అజయ్.
హుషారుగా వస్తున్న అజయ్ ని చూసి ఆశ్చర్యపోయారు స్నేహితులు. "నువ్వు అసాధ్యుడివిరా" అన్నాడు వేణు.
"గ్రేట్" అంది హేమ.
"ఏంట్రా ఫ్రెండ్ షిప్ కూడా అయినట్లుంది" అన్నాడు మిశ్రా.
ఇంద డబ్బు చేతిలో పెట్టాడు వేణు.
నవ్వుతూ డబ్బు తీసుకుని జేబులో వేసుకున్నాడు అజయ్.
మరికాసేపు అటూ ఇటూ తిరిగి గెస్టుహౌస్ కు చేరుకున్నారు అందరూ.
* * *
పార్కులో ఒక పక్కగా పచ్చికమీద కూర్చుంది మాధవి. గులాబి రంగు సాదా నైలాన్ చీర, అదే రంగు బ్లౌజు, తలలో అరవిరిసిన గులాబీ, చంద్రవంకలా మెరిసిపోతుంది.
అడుగులో అడుగు వేసుకుంటూ, మెల్లగా వెళ్ళి మాధవి వెనకాలే నుంచున్నాడు అజయ్. గడ్డిపోచ కొనలు కొరుకుతూ తలవంచుకు కూచున్న మాధవి తలెత్తి చూసి సంతోషంగా "వచ్చారా! వస్తారో రారో అనుకున్నా" అంది నాజూగ్గా నవ్వుతూ.
మీరు రమ్మంటే రాకుండా ఉండగలనా? అన్నాడు నవ్వుతూ అజయ్.
"ఊ!" అంది చిలిపిగా మాధవి.
"ఊ!" అన్నాడు అజయ్.
ఇద్దరూ ఫకాలున నవ్వేశారు.
సరే... ఇప్పుడు చెప్పండి మీ కథేమిటో? అన్నాడు.
పదండి. అలా నడుస్తూ చెపుతాను అంటూ లేచి నుంచుంది.
ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు.
మాధవి మొదలుపెట్టింది. "మా ఇంటిలో నన్నొక ముసిలాడికిచ్చి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నారు. ఎంత లేనివాళ్ళమైనా, ఆ ముసలాడి ఆస్థి పాస్థులకు కక్కుర్తిపడి ఈ పెళ్ళికి సిద్ధపడటం న్యాయమంటారా?"
"ఛీ!ఛీ! పరమ అన్యాయం, అక్రమం"
"అంతేకాదు. ఇంకా..." ఏదో చెప్పబోయి ఆగిపోయింది.
"సందేహిస్తున్నారెందుకు? చెప్పండి"
"మీరు...మీరు..."
"ఊ!..."
"ఎవరికీ చెప్పరు కదూ, ముఖ్యంగా మీ స్నేహితులకి"
"చెప్పను చెప్పండి"
"ప్రామిస్!" చెయ్యి చాపింది మాధవి.
"ప్రామిస్" చేతిలో చెయ్యి వేశాడు అజయ్.
అతని చెయ్యి గట్టిగా పట్టుకుని "హెల్ప్... హెల్ప్...ప్లీజ్..." అరిచింది ఆమె.
బిలబిలమంటూ జనం పోగయ్యారు.