Previous Page Next Page 
మానిని మనసు పేజి 38


    "ఇక్కడికి పిచ్చివాళ్ళు కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా?"
    "రా బాబూ! ఆ పిచ్చివాడితో నీకెందుకు."
    రమణమూర్తి ఆశ్చర్యపోతూ "ఇతను పిచ్చివాడా?" అన్నాడు. అతను వేసుకున్న దుస్తులమీద మార్కు చూశాడు.
    "అరే ఇతను పిచ్చివాడా? బాగానే మాట్లాడుతున్నాడే?"
    "ఏయ్ ముసలోడా! నాకా పిచ్చి? నీకే పిచ్చి! ఈ అబ్బాయికి పిచ్చి. చేర్పించడానికి వచ్చావ్ కదూ. వెళ్ళు వెళ్ళు. డాక్టరమ్మ ఉన్నారు" అంటూ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
    అల్లంతదూరం కొందరు ఆడవాళ్ళు చెట్లకు నీళ్ళు పోస్తున్నారు.
    అందరూ ఒకేలాంటి చీరెలు కట్టుకొని వున్నారు.
    "వాళ్ళంతా పేషెంట్లేనా అండీ?" రమణ అడిగాడు.
    "అవును బాబూ! సీరియస్ కేసులైతే బయటకు వదలరు. మిగతావాళ్ళు స్వేచ్ఛగానే తిరుగుతుంటారు. వాళ్ళచేత పనులు చేయిస్తూంటారు" అన్నాడు రామనాధం.
    "వాళ్ళు పారిపోరాండీ?"
    "ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడి వర్కర్లు కనిపెట్టే వుంటారు."
    "నాకిక్కడ పనిచేసేవాళ్ళూ, పిచ్చివాళ్ళూ అందరూ ఒకటిగానే కన్పిస్తున్నారు" అన్నాడు రమణ.
    ముందుకు నడుస్తూ ఆగిపోయాడు రామనాధం.
    వరసగా చిన్న చిన్న గదులున్నాయ్. కటకటాల తలుపులు బోనుల్లా ఉన్నాయ్ చూడటానికి. అందులో మనుషులు బోనులోని జంతువుల్లా అశాంతిగా తిరుగుతున్నారు. కొందరు నిద్రపోతున్నారు.
    ఒక బోను దగ్గిరకు రామనాధం తీసుకెళ్ళాడు.
    లోపల మురికిప్యాంటూ, మురికి షర్టూ వేసుకొని పొడవుగా చక్కగా వున్న అతను బోనులో అశాంతిగా తిరుగుతున్నాడు. ఇద్దరూ నిల్చుని లోపలకు చూశారు. లోపల అంతా తడితడిగా ఉంది.
    "ఎవరు మీరు? యూ గెట్ అవుట్" లోపలున్నతను గట్టిగా అరిచాడు. ఇంకా ఇంగ్లీషులోనే ఏదేదో గొణుక్కుంటున్నాడు.
    "ఇతనెవరనుకున్నావ్?"
    "ఎవరు?"
    "ఒక ఐ.పి.యస్ ఆఫీసర్. ఈ ఆసుపత్రి సూపర్నెంటు నాకు దూరపు బంధువు. అతనే చెప్పాడు."
    "ఐ.పి.యస్ ఆఫీసరా? అందుకే అంత మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. ఎంతకాలంగా ఉన్నాడు."
    "దాదాపు ఇరవై ఏళ్ళనుంచి ఉన్నాడు. పేరు శ్రీనివాసన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హెల్త్ సెక్రటరిగా ఉండేవాడు, క్యాంపులో గెస్ట్ హౌస్ లో భార్యను కూరగాయలు కసే కత్తితో మెడకోసి చంపాడు."
    "ఆ తర్వాత అతనికి మతి చలించిందని తెలిసి ఆసుపత్రిలో పెట్టారు. అయినా అతని మాటల్లో దర్పం కన్పిస్తుంది ఈనాటికి. అతను ఇలా ఇందులోనే ఒకనాడు చచ్చిపోతాడు. ఇరవై ఏళ్ళుగ చాలా ఉద్రేకంగా ప్యూరియస్ గానే ఉన్నాడట."
    "భార్యను ఎందుకు చంపాడో?"
    "నాకు వివరాలు తెలియవు. కాని ఆడవాళ్ళను చూస్తే మాత్రం కేకలు పెడతాడు. అమితంగా ఉద్రేకపడతాడు."
    "ఎంత వయసు వుంటుందో?"
    "దాదాపు ఇప్పుడు డెబ్భయ్ సంవత్సరాలూ ఉంటాయట"
    "అయినా ఎంత నిటారుగా నిల్చుంటున్నాడు! ఆ కంఠం కంచులా మ్రోగుతోంది. వాళ్ళవాళ్ళెవరూ లేరా?"
    "ఎవరూ రారట. మొదట్లో ఎవరయినా వచ్చేవారేమో"
    రమణమూర్తి మనసు చెయ్యిపెట్టి కెలికినట్టయింది.
    ఆడవాళ్ళు తోటపని చేస్తున్న వైపుకు నడిచారు.
    ఒకామె పరుగులాంటి నడకతో వాళ్ళ దగ్గరకొచ్చింది.
    రమణను చూస్తూ నిల్చుండిపోయింది.
    సావిత్రి! ఆ ముఖంలో పెద్దగా మార్పులేదు.
    ఆ కళ్ళలో, ముఖంలో పిచ్చి తాలూకు ఛాయలు కన్పించడం లేదు. తనను చూసి గోల చేస్తుందేమో!
    "నాన్నా! అమ్మను తీసుకురాలేదేం? నేను ఇంటికొచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను"
    "డాక్టరుగారు రేపు పంపిస్తానన్నారు తల్లీ. మీ అమ్మా నేనూ వచ్చి తీసుకెళతాము."
    "ప్రామిస్!"
    "ప్రామిస్! ఈ పళ్ళు తీసుకోమ్మా" అంటూ మామిడిపళ్ళు అందించాడు.
    పళ్ళందుకుని దూరంగా విసిరికొట్టింది.
    రమణమూర్తి రామనాధం ముఖంలోకి చూశాడు.
    రామనాధం ఏమీ జరగనట్టే వుండిపోయాడు.
    సావిత్రి రమణని చూసింది.
    చూస్తూనే నిల్చుంది.
    రమణకి గాభరా ఎక్కువైంది.
    "ఇతను రమణమూర్తి. గుర్తుపట్టావా తల్లీ"
    "ఎందుకు గుర్తుపట్టలేదూ. నాకేమన్నా పిచ్చా ఏమిటి మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడానికి?" అన్నది సావిత్రి.
    "నిన్ను చూడటానికి వచ్చాడమ్మా"
    సావిత్రి అదోలా నవ్వింది.
    ఆ నవ్వును చూసి అతడి వెన్నెముకలోకి చలికుదుపు వచ్చినట్టు అయింది.
    పిచ్చివాళ్ళ చిరునవ్వంటే అతడికి భయం.
    ఎప్పుడొచ్చారు? అనసూయ బాగుందా?
    రమణమూర్తి ఆశ్చర్యంగా చూశాడు. అరే చాలా మామూలుగా మాట్లాడుతోందే?
    ఆ వాతావరణంలో పిచ్చివాళ్ళు పిచ్చివాళ్ళుగా ఉంటేనే సహజంగా అనిపిస్తుంది. పిచ్చివాళ్ళు అతి సాధారణంగా, నార్మల్ గా మాట్లాడుతుంటే భయమనిపించింది రమణమూర్తికి.

 Previous Page Next Page